వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కోసం టీసర్కారు కసరత్తు
ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్‌ల అభివృద్ధికి అంచనాలు
సీఎం ఆమోదం తర్వాత కేంద్రానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాగా వెనుకబడిన జిల్లాలుగా ఆరింటిని ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరాలని, ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈ వారంతంలోగా ప్రతి పాదనలు సిద్ధం చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుని అధికారులు కేంద్రానికి పంపనున్నారు. ఆరు జిల్లాల్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను చేర్చారు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు పైవాటితో పోలిస్తే అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తుందని పేర్కొన్న నేపథ్యంలో అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయల మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోసం బడ్జెట్‌లో పొందుపరిచిన సంగతి విదితమే. అందులో భాగంగా విద్య, వైద్య, రహదారులు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని కోరింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, ప్రతీ గ్రామానికి తాగునీటి సౌకర్యం, పం చాయతీ, ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధితోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కోరాలని నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని చట్టంలో పేర్కొన్నందున, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను ఇందులో పొందుపర్చాలని మొదట్లో భావించినా.. ‘సెస్’ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఆశించిన మేరకు నిధులను కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.
బాగా వెనుకబడిన జిల్లాలు ఆరు
Published Fri, Dec 12 2014 2:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement