కరెంటివ్వకుండా అడ్డుపడ్డది నీవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ ధ్వజం
జూన్ నుంచి అక్టోబర్ వరకు గణాంకాల వెల్లడి
రాష్ట్రానికి వాటా మేరకు కరెంట్ ఇవ్వలేదని వివరణ
సాక్షి. హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. అందుకు సంబంధించిన గణాంకాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ వివరాల్లో ఏమాత్రం తప్పునా.. ముక్కు నేలకు రాయడానికి సిద్ధమన్నారు. థర్మల్ విద్యుత్ పంపిణీలో ఏపీ ప్రతి నెలా ఎంత కోత పెట్టిందో వివరిస్తూనే.. జల విద్యుత్, అలాగే కృష్ణపట్నం విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత జూన్ నుంచి అక్టోబర్ వరకు 82 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి రాకుండా చేశారని ఆరోపించారు.
ఈ కాలంలో ఏపీలోని విద్యుత్ సంస్థల నుంచి మొత్తం 5,882.82 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి కాగా, రాష్ర్ట విభజన చట్టం ప్రకారం అందులో తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ దక్కాల్సి ఉందన్నారు. ఈ ప్రకారం తెలంగాణకు 3,170.26 మిలియన్ యూనిట్ల విద్యుత్ రావాల్సి ఉండగా.. కేవలం 3,087 మిలియన్ యూనిట్లను మాత్రమే ఏపీ సరఫరా చేసిందని గణాంకాలతో వివరించారు. రాష్ర్టంలో పంటలు ఎండిపోవడానికి కారణం చంద్రబాబేనని తీవ్ర పదజాలంతో దూషించారు. అలాగే కృష్ణపట్నంలో ఇప్పటివరకు 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినా.. ఒక్క యూనిట్‌ను కూడా తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు.
కృష్ణపట్నం విద్యుత్‌లో తెలంగాణకు 1432 మెగావాట్లు రావాల్సి ఉందన్నారు. ఆ ప్రాజెక్టులో రాష్ర్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థలు రూ. 1050 కోట్ల పెట్టుబడులు పెట్టాయని సీఎం తెలిపారు. హిందూజా విద్యుత్ ప్లాంట్ నుంచి కూడా తెలంగాణకు కరెంట్ ఇవ్వకుండా ఆ సంస్థ వారిని చంద్రబాబు బెదిరించారని సీఎం వెల్లడించారు. సీఎం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఏపీలోని థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్, తెలంగాణకు దక్కాల్సిన వాటా, ఇప్పటివరకు రాష్ట్రానికి జరిగిన సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి.