మమ్మల్నీ పట్టించుకోండి!
విభజన హామీలను వెంటనే అమలు చేయండి
ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయనున్న సీఎం కేసీఆర్
నేడు ఢిల్లీలో నరేంద్రమోడీతో భేటీ
పలువురు కేంద్ర మంత్రులనూ కలవనున్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా తమను కూడా పట్టించుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. సీఎం అయ్యాక కే సీఆర్ హస్తిన వెళ్లడం ఇది రెండోసారి. గత పర్యటన సమయంలో ఇచ్చిన విజ్ఞాపనల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదని, వాటిపై తక్షణమే స్పందించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీని కోరనున్నారు.
ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, ఇంధన,పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, సలహాదారు పాపారావు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమవుతారు. అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో తెలంగాణకు ప్రయోజనం కలిగే ఏ హామీ కూడా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదని ఈ సందర్భంగా ప్రధానికి, మంత్రులకు కేసీఆర్ వివరించనున్నారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరనున్నారు.
ఇదీ సీఎం ఢిల్లీ షెడ్యూల్..
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలువనున్నారు. రెండు గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్, వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మానవనరుల మంత్రి స్మృతి ఇరానీలతో సమావేశమవుతారు. రైల్వే మంత్రి సదానంద గౌడ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిలతో శని లేదా ఆదివారం భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఇదీ కోర్కెల చిట్టా....
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టుగానే ఐదు జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చే ప్రాణహిత -చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి కూడా జాతీయ హోదా కల్పించాలి. ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలి.
అభివృద్ధిలో రాష్ట్రాల నడుమ పోటీ నెలకొన్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలి.
తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని.. ఎవరికీ కేటాయించని విద్యుత్ కోటా నుంచి 500 మెగావాట్లు కేటాయించాలి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్న నాలుగువేల మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి.
సీలేరు బేసిన్ విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఇవ్వాలి. జజ్జర్ ప్లాంటు నుంచి తెలంగాణకు అదనంగా వంద మెగావాట్ల విద్యుత్ కేటాయించాలి.
హైకోర్టును తక్షణమే విభజించాలి.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
కేంద్రం ప్రారంభించనున్న స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా రెండు మెగాసిటీలు, ఏడు స్మార్ట్‌సిటీలు తెలంగాణకు ఇవ్వాలి.
గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి. తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను మంజూరు చేయాలి.
13వ ఆర్థిక సంఘం కింద స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలి.
ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి.
ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పష్టతనివ్వాలి. సెయి ల్ ఇప్పటికే సానుకూల నివేదిక ఇచ్చినందున ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టాలి.
మెట్రోపోలీస్ సదస్సుకు ప్రణబ్, మోడీ!
స్వయంగా ఆహ్వానించనున్న కేసీఆర్
అక్టోబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న మెట్రోపోలీస్ సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, ప్రధాని మోడీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి వివిధ నగరాల మేయర్లు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సును ఉపయోగించుకుని రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా సదస్సు ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేతుల మీదుగా చేయించాలని, ముగింపు సమావేశానికి రాష్ట్రపతిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హస్తిన పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. శనివారం వారిద్దరినీ ఈ సదస్సుకు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించనున్నారు.