Special Development Fund
-
దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఎస్డీఎఫ్ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. దళితబంధుకు 17,700 కోట్లు.. తాజా బడ్జెట్లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. -
రాబందూ... చూశావా ఈ విందు
క్షమించు రాబందూ... మన్నించండి గద్దల్లారా ... అక్రమార్కులు ఎక్కడ అవినీతి చేసినా గద్దల్లా తన్నుకుపోయారు... గద్దల్లా పొడుచుకుతిన్నారు ... రాబందుల్లా మెక్కేశారని ఏ పాపం ఎరుగని మీతో ఈ అవినీతి నేతలను సరిపోల్చుతున్నాం. పొట్ట నింపుకోడానికి చేస్తున్న మీ పనిని కూడా మేం తప్పుపడుతున్నాం. మీ ఆకలి తీరాక ఆ జోలికే పోరు...రేపటి కోసం సంపాదించుకోవాలనే ఆత్రమే మీకు ఉండదు. కానీ గతంలో దండిగా సంపాదించినా... ఇంకా...ఇంకా అంటూ జిల్లాలోని టీడీపీ నేతలు ఆత్యాశతో అభివృద్ధి పనుల పేరిట అక్రమాలకు పాల్ప డ్డారు. తినడంలో మీతో పోటీ పడుతున్నారు. సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి) : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరుతో జిల్లాకు మంజూరైన నిధులతో టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. రూ.229 కోట్ల నిధుల్లో రూ.111 కోట్ల మేరకు ఖర్చు చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేశారు. ఇంకో ఏడాది ఎన్నికలు రాకుండా ఉండి ఉంటే ఆ నిధులను కూడా గుటకాయ స్వాహా చేసేసేవారే. ఈ తంతును పసిగట్టిన సీఎం జగన్మోహన్రెడ్డి ‘చెక్’ పెట్టడంతో కోట్ల రూపాయలకుపైగా నిధులు దుర్వినియోగం కాకుండా ఆగిపోయాయి. ఎక్కడ ఆ అవినీతి బయటపడుతుందోనని ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నార’ంటూ తెలుగు తమ్ముళ్లు కొంగొత్త గోల చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయన అనుచరులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్ద మొత్తాలను టెండర్లుగా పిలిస్తే పోటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో నామినేటెడ్ పద్ధతిలో పనులను దక్కించుకొని భారీగా నిధులు దోచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న పనులనే ముక్కలు ముక్కలుగా చేసి, విలువను తగ్గించి అప్పనంగా కట్టబెట్టేయడంతో పనులు చేయకుండానే నిధులు కొట్టేసే వ్యూహ రచన చేసి కొంతమేర సఫలీకృతులయ్యారు. ఇంతలో ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ దోపిడీకి బ్రేక్ పడింది. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన టీడీపీ నేతల పేరున కూడా నిధులు విడుదల చేశారు. నిధులు మంజూరు చేయించుకోండి...నచ్చినంత దోచుకోండి అన్నట్టుగా ప్రజాధనాన్ని గంపగుత్తగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేశారు. ఇలా గత ఐదేళ్లలో తన పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 242.60 కోట్ల మేర కేటాయించారు. అంతటితో ఆగకుండా తమ ఎమ్మెల్యేలు సూచనల మేరకు పనులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇంకేముంది టీడీపీ నేతలు చెలరేగిపోయి నచ్చినట్టుగా పనుల ప్రతిపాదనలు తయారు చేయించి, వాటికి మంజూరు చేయించుకుని, నిధులు ఇష్టారీతిన వాడుకున్నారు. నిబంధనల మేరకైతే రూ.5 లక్షల విలువ దాటితే సంబంధిత పనులకు విధిగా టెండర్లు పిలవాలి. ఓపెన్ టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి కాంట్రాక్ట్ అప్పగించాలి. ఇలా చేస్తే అన్ని పార్టీలకు చెందిన వారు టెండర్లలో పోటీ పడతారని, ఏకపక్షంగా తమ వారికి పనులు దక్కవనే ఉద్దేశంతో వర్క్ విలువను రూ.5 లక్షలు దాటకుండా ఇంజినీరింగ్ అధికారుల ద్వారా డిజైన్ చేయించారు. సంవత్సరాల వారీగా ఎస్డీఎఫ్ వినియోగ అధికారిక వివరాలివి ( సంవత్సరం మంజూరైననిధులు (కోట్లలో) పూర్తయిన పనులు ఖర్చు చేసిననిధులు (కోట్లలో) 2015–16 28.00 641 25.30 2016–17 43.29 729 27.93 2017–18 88.94 1594 46.16 2018–19 69.18 343 11.99 229.41 3307 111.38 వాస్తవానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువున్న పనులు అనేకం ఉన్నాయి. అయితే, వాటికి టెండరు పిలవాల్సి వస్తుందని ఒకే వర్క్‌ను ఆరేడు భాగాలు (ముక్కలు ముక్కలు)గా చేసి పనుల ప్రతిపదనలు తయారు చేయించి, వాటిని మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఎక్కడే వర్క్ జరిగిందో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఒకే వర్క్‌ను చూపించి రెండు మూడు బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక వర్క్‌ను తూర్పు నుంచి పడమరకు వైపునకు, అదే వర్క్‌ను పడమర వైపు నుంచి తూర్పునకు చూపించి రెండేసి బిల్లులు చేసుకున్నారన్న వాదనలున్నాయి. ఇలా పంచి పెట్టిన పనులను నామేకే వాస్తేగా చేసి, కొన్ని పనులకు పైపై మెరుగులు దిద్ది పెద్ద ఎత్తున నిధులు దోచేశారు. ఎన్నికలకు ముందు హడావుడి ఎన్నికల ముందు నాయకులకు తాయిలాలుగా మరింత ఎరవేసే యత్నం ఎమ్మెల్యేలు చేశారు. అంతకుముందు సంవత్సరాల్లో బేరం కుదరక ఆగిన పనులను, మరికొన్ని ఎన్నికలకు ముందు సీఎం చేత మంజూరు చేయించుకున్న పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు హడావుడి చేశారు. అయితే, ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో కొందరు సానుకూలంగా వ్యవహరించగా, మరికొందరు ఎన్నికలప్పుడు ఎందుకింత హడావుడి అని సహకరించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1935 పనులు ప్రారంభ దశలో ఉండగా, రూ.52.02 కోట్ల విలువైన పనులు ప్రారంభం కాకుండా ఉండిపోయాయి. ప్రారంభ దశలో ఉన్న పనులకు దాదాపు రూ.60 కోట్ల వరకు చెల్లింపులు జరిగిపోవడం గమనార్హం. కొత్త ప్రభుత్వ ఆదేశాలతోవందల కోట్ల దోపిడీకి బ్రేక్ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఇంజినీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, టెండర్లు పిలవకుండా నామినేటేడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల పనులను ఏకపక్షంగా కట్టబెట్టి దోచిపెట్టారని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే గుర్తించారు. అధికారుల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా చేసుకుని ఇంజినీరింగ్ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో 25 శాతంలోపు జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు చేయకుండా ఆపాలని, ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో ప్రారంభ దశలో ఉన్న 1935 పనులు దోపిడీకి గురికాకుండా ఆగాయి. అలాగే, ప్రారంభం కాని 1268 పనులకు సంబంధించిన రూ.52.02 కోట్ల నిధులు మంజూరు కాకుండా నిలిపివేశారు. ప్రభుత్వం అప్రమత్తం కాకపోయి ఉంటే సందట్లో సడేమియాలా వీటిని కూడా ఊదేసేవారు. -
ఐదంచెల పర్యవేక్షణలో ‘ఎస్డీఎఫ్’
ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎస్టీ, ఎస్టీ అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌ల) మార్గదర్శకాలు విడుదల య్యాయి. దాదాపు ఆర్నెళ్ల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కంటే కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... పక్కా పర్యవేక్షణకు మార్గదర్శకాలిచ్చింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కొత్తగా ఐదంచెల విధానాన్ని తీసుకొచ్చింది. నిధుల వినియోగంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి చేరే క్రమంలో పర్యవేక్షణ, నిర్వహణ, నిఘాకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. ఎస్సీ/ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల అమలులో ప్రధానంగా రాష్ట్ర కౌన్సిల్ కీలకపాత్ర పోషించనుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరి స్తారు. ఇందులో కేబినెట్ మంత్రులు, ఎంపిక చేసిన ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి/ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మెంబర్ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీలు...: ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల అమలులో రాష్ట్ర స్థాయిలో రెండు నోడల్ ఏజెన్సీలతో కమిటీలుంటాయి. ఆయా శాఖల మంత్రులు ఈ నోడల్ కమిటీలకు చైర్మన్లుగా.., మెంబర్ కన్వీనర్లుగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వ్యవహరిస్తారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన 14 మంది ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల కమిషనర్లు, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సంబంధిత కార్యదర్శులు సభ్యులుగా, ఉంటారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలుంటాయి. వీటికి ప్రభుత్వం నియమించే ఎస్సీ/ఎస్టీ నామినేటెడ్ వ్యక్తులు చైర్మన్లుగా, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి, మరో నామినేటెడ్ పర్సన్, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో...: ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణ కమిటీలకు కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్సీ,/ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పరిధిలో ప్రాజెక్టు అధికారులు, నాన్ ఐటీడీఏ పరిధిలో జేసీ, డీటీడబ్ల్యూఓ, డీఎస్డీవోలు మెంబర్ కన్వీనర్లుగా, మరో 15శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో నిఘా కమిటీలకు ఎస్సీ/ఎస్టీ వ్యక్తులను చైర్మన్లుగా ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీటికి జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, గిరిజన సంక్షేమాధికారి, సంబంధిత అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ఏటా కనీసం రెండు సార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా చేపట్టే కార్యక్రమాలు, నిధుల వినియోగం, పనుల నాణ్యత తదితర అంశాలపై పరిశీలించాలి. కమిటీల నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. -
ప్రత్యేక అభివృద్ధి నిధులేవీ?
- అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అయోమయం - రూ.2 కోట్ల స్పెషల్ ఫండ్ కోసం ఎదురు చూపులు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు. నిధులు అందుతాయన్న ఆశాభావంతో ఎక్కడికక్కడ పనుల కోసం పచ్చ జెండా ఊపడం వీరికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఏసీడీఎఫ్ (అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి) ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీడీఎఫ్ కోసం ఏటా రూ.3 కోట్ల నిధులిస్తున్నారు. కాగా, నియో జకవర్గాల్లో మరిన్ని అభివృద్ధి పనుల కోస మంటూ గతేడాది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని ప్రకటించారు. ఏసీడీఎఫ్‌తో సంబంధం లేకుండా ఏటా మరో రూ.2కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిధి అతీగతీ లేకపో వడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. రూ.4వేల కోట్ల ప్రత్యేక నిధి ముఖ్యమంత్రి ఆధీనంలో రూ.4వేల కోట్ల నిధులు ఉంటాయని గత ఏడాది ప్రకటించారు. గత వార్షిక బడ్జెట్లోనే ఈ మేరకు కేటాయింపులు కూడా జరిగాయి. నియోజకవర్గాల పరిస్థితి, అక్కడి సమస్యలు, తక్షణం దృష్టిసారించాల్సిన అంశాలు, శాశ్వత నిర్మాణాల కోసం వెచ్చించాల్సిన అవసరం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నేరుగా సీఎం నిధులు కేటాయించే వెసులుబాటును ఎస్డీఎఫ్ కల్పించింది. గత ఏడాది రెండు మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా ఎమ్మెల్యేలకు ఈ నిధులు అందాయి. వాటితో పనులు కూడా జరిగాయి. తొలి ఏడాది నిధులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి, రెండో ఏటా ఆశ పెట్టుకున్నారు. ఎలాగూ వచ్చే నిధులే కదా అన్న అతి విశ్వాసంతో కొందరు ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారికి పనులు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. వీరిలో కొందరు పనులు కూడా పూర్తి చేశారు. అయితే, ఎస్డీఎఫ్ కింద బడ్జెట్ అందక బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. అభ్యంతరాలే అసలు సమస్య బడ్జెట్లో అనామతు పద్దుకింద ఏకంగా రూ.4వేల కోట్లు కేటాయించడం కుదరదని, కాగ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సారి వార్షిక బడ్జెట్లో ఎస్డీఎఫ్ ఎత్తేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రాంభమైన ఏప్రిల్ నుంచి జూన్ నాటికి అంటే తొలి క్వార్టర్ వరకు రూ.36 కోట్లు వివిధ పథకాల్లో భాగంగా మంజూరు చేశారు. ఆయా ప్రభుత్వ పథకాల్లో ఈ నిధులను విలీనం చేసి పాత జిల్లాల వారీగానే నిధులు కేటాయించారని, ఇవికూడా పూర్తిస్థాయిలో అందలేదని తెలుస్తోంది. ఇక వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు నేరుగా రూ.2కోట్ల చొప్పున ఇవ్వడం కుదరకనే దానిని ఎత్తివేశారని సమాచారం. -
రెండు రోజులు.. రూ.9కోట్లు
పోతూపోతూ.. మా పనులు చేయండి! – కలెక్టర్‌కు అధికారపార్టీ నేతల ప్రతిపాదనలు – ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంజూరు ఇవ్వాలని వినతులు – సంతకం చేస్తారా.. చేయరా అని అధికారుల్లో చర్చ – బదిలీ ఉత్తర్వుల తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం తప్పంటున్న అధికారులు – పనుల కోసం పర్సెంటేజీలు వసూలు చేస్తున్న అధికార పార్టీ నేతలు అవును.. కలెక్టర్ బదిలీ చుట్టూ వ్యాపారం జరుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9కోట్ల వ్యవహారం ఇది. ఆయనకు బదిలీ తప్పదనే చర్చ నేపథ్యంలో గత రెండు రోజుల్లో అధికార పార్టీ నేతలు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ప్రతిపాదనలు.. వినతులతో ఒత్తిళ్లకు తెగబడ్డారు. మరి.. అందుకు ఆయన తలొగ్గుతారా? నైతికతకు కట్టుబడతారా? వేచి చూడాల్సిందే. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పోతూ పోతూ తమ పనులు చేసి పోవాలంటూ జిల్లా కలెక్టర్‌గా ఉన్న విజయమోహన్పై అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీపీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా మంజూరు చేసే రూ.50 కోట్ల నిధుల్లో నుంచి తమకు పనులు ఇవ్వాలని భారీగా ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. వాస్తవానికి గత వారం రోజుల నుంచి జిల్లా కలెక్టర్‌గా ఉన్న విజయమోహన్ బదిలీ అవుతారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం గత రెండు రోజుల్లోనే భారీగా ప్రతిపాదనలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. బదిలీ ఉత్తర్వులు 17వ తేదీ అర్ధరాత్రి విడుదలయ్యాయి. అంటే 18వ తేదీ నుంచి నిబంధనల మేరకు కొత్తగా ఎలాంటి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం నైతికంగా సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు భిన్నంగా కలెక్టర్ చేత ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీపీ) కింద భారీగా పనులకు ఆమోదం తీసుకోవడం కోసం అధికార పార్టీ నేతలు ఎగబడ్డారు. కేవలం 17, 18 తేదీల్లో మాత్రమే రూ.9 కోట్లకు పైగా పనులకు ప్రతిపాదనలు సమర్పించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వచ్చిన ప్రతిపాదనలను ఆగమేఘాల మీద కన్వర్జెన్సీ కమిటీలో ఉన్న జెడ్పీ సీఈఓ, పీఆర్ ఎస్ఈ, డీపీఓలు ఆమోదం తెలపాలంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా ఈ ప్రతిపాదనలను సీపీఓ ద్వారా కలెక్టర్‌కు పంపించేందుకు రంగం సిద్ధమయింది. ఈ నేపథ్యంలో బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి.. కలెక్టర్ సంతకం చేస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. భారీగా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడేళ్ల నుంచి రూ.150 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల ఖర్చుపై పూర్తిగా కలెక్టర్‌కే అధికారాలు అప్పగించారు. వాస్తవానికి కలెక్టర్ బదిలీ అవుతారనే ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు ఎస్డీపీ కింద పనులు మంజూరు చేయాలంటూ రూ.16.59 కోట్ల మేర విలువైన 142 పనుల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, కేవలం ఈ రెండు రోజుల్లోనే అంటే 17, 18 తేదీల్లోనే ఏకంగా రూ.9 కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం గమనార్హం. 17వ తేదీన రూ.5.69 కోట్ల విలువైన 43 పనులు, 18వ తేదీన 3.43 కోట్ల విలువైన 22 పనుల కోసం ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీకి ప్రతిపాదనలు చేరాయి. ఈ పనులను ఓకే చేస్తూ తాజాగా సీపీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. పర్సెంటేజీల పర్వానికి తెర కలెక్టర్ బదిలీ నేపథ్యంలో వస్తున్న ఈ ఎస్డీపీ నిధుల పనుల ప్రతిపాదనల వెనుక పర్సెంటేజీల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులను మంజూరు చేయిస్తామని అధికార పార్టీ నేతలు వసూళ్లకు తెగబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనుల మంజూరు కోసం 6 నుంచి 10 శాతం వరకూ కమీషన్ వసూలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇది కేవలం పనుల మంజూరు కోసం మాత్రమేనని పేర్కొంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అనుమతిస్తారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. -
ప్యాకేజీకి కేబినెట్ నోట్ తయారుకాలేదు
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం హైదరాబాద్: ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అభి వృద్ధి సహాయం (ఆర్థిక ప్యాకేజీ)కు సంబంధించిన కేబినెట్ నోట్‌ను ఇంకా రూపొందించే స్థాయిలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలి పారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్యాకేజీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందా? ఆమోదంలో జాప్యానికి కారణాలున్నాయా? విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం పనులు కూడా ఈ ప్యాకేజీలోకి వస్తాయా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపర్చి ఉన్నాయి కనుక అవి ప్రత్యేక ప్యాకేజీలో అంతర్భాగం కావని మంత్రి మేఘ్వాల్ స్పష్టం చేశారు. -
తమ్ముళ్లకు ‘ప్రత్యేక’ పందేరం
♦ రూ.5లక్షల చొప్పున నామినేషన్‌పై ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం ♦ పాత మున్సిపాలిటీలో ప్రతిపాదించకపోవడంపై ఓ నేత అభ్యంతరం పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. అధికారులను ఏమార్చి.. నిబంధనల రూటుమార్చి దోచుకోండంటూ ‘ప్రత్యేక’నిధులను కేటాయిస్తోంది. ఇంకేముంది అధికారం అండతో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను ‘మీకింత మాకింత’ అంటూ అందినకాడికి దోచుకుతింటున్నారు. కడప కార్పొరేషన్ : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు అధికార పార్టీ నాయకులకు వరంగా మారాయి. రూ.5లక్షల చొప్పున నామినేషన్‌పై పనులు తీసుకొని పంచుకుతినేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెలితే.. నగరపాలక సంస్థ అధికారులు 20 డివిజన్లలో 48 పనులకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నిధులను కేటాయిస్తుంది. కానీ గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనికి కొత్త భాష్యం నేర్పారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేతలకు ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి, అధికార పార్టీ నేతలకు పందేరం నిర్వహించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత తెలుగు దేశం ప్రభుత్వంలో కూడా అదే అనవాయితీ కొనసాగుతోంది. ఎస్డీఎఫ్ నిధులను స్థానిక ఎమ్మెల్యేను కాదని అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడికి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లంతా ఆ నిధులను విని యోగించుకునేందుకు తహతహలాడుతున్నారు. ప్రతిపాదనలు మళ్లీ తయారుచేయండి... పాత మున్సిపాలిటీలో ఒక్క పనిని కూడా ప్రతిపాదించకపోవడంపై ఇటీవల పార్టీ మారిన నగరపాలక సంస్థలోని కీలక నేత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా మళ్లీ ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిసింది. అలాగే అధికారులు ఒకరికి కేటాయించిన పనులను పైరవీలతో మరొకరు ఎగరేసుకు పోతుండటంపై ఒకరదిద్దరు తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అలాగే ఈ పనులను ఏ శాఖ ద్వారా చేయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నగరపాలక సంస్థ ద్వారానే చేయిస్తే మాత్రం మిగతావారు కూడా అదే విధానంలో పనులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంతో నగరపాలక అధికారులు ఇరుకున పడుతున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ నిధులతో జల్సా.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక ం నిధులను దారి మళ్లించి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరిట పట్టణాల్లో ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరికి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలూ చెలరేగుతున్నాయి. నిధుల పంపకం ఇలా... 44వ డివిజన్లోని సత్తార్ కాలనీలో డోర్ నంబర్ 46/87 నుంచి 106-1వరకూ సిమెంటు రోడ్డు, డ్రైనేజీ కాలువ నిర్మాణానికి రూ.10లక్షలు ప్రతిపాదించారు. ఈ పనిని ఆ డివిజన్ కార్పొరేటర్ భర్తకు కేటాయించినట్లు సమాచారం. అలాగే 45వ డివిజన్ బాలాజీనగర్ ఎస్సీకాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి రూ.4.97లక్షలు అంచనాలు రూపొందించి ఆ డివిజన్ కార్పొరేటర్ తనయునికి అప్పగించినట్లు తెలుస్తోంది. 37వ డివిజన్లో రూ.4.95లక్షలతో సిమెంటు రోడ్డు, రూ.4.90లక్షలతో సీసీడ్రైన్ నిర్మాణానికి అంచనాలు తయారుచేసి స్థానిక టీడీపీ కార్పొరేటర్‌కు అప్పగించినట్లు తెలిసింది. 41వ డివిజన్లో సీసీరోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను స్థానిక టీడీపీ నాయకుడికి అప్పగించారు. ఎస్డీఎఫ్ పనుల అంచనా విలువలన్నీ ఖచ్చితంగా రూ.5లక్షలుగానీ, లేకపోతే రూ.4.95లక్షలు, రూ.4.90లక్షలు ఇలా నాలుగైదు వేల తేడాతో అంచనాలు రూపొందించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌కు విన్నవించి.. అంచనాలు రూపొందించి.. ఈ మేరకు నగరంలో ఫలానా చోట సమస్యలున్నాయని కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చారు. పనుల వారీగా వాటికి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ కమిషనర్‌ను ఆదేశించారు. ఏ ప్రభుత్వ నిధులనైనా టెండర్ విధానంలో ఖర్చుచేస్తే సంబంధిత శాఖకు ఆదాయం కూడా సమకూరుతుంది. పనుల నాణ్యత కూడా బాగుంటుంది. అలా కాకుండా ఈ నిధులను నామినేషన్‌పై అప్పగించడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లే. ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నాయకులను ఆర్థికంగా బలోపేతం చే చేయడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇన్చార్జి మంత్రులకు ప్రత్యేక నిధి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధి తరహాలోనే జిల్లా ఇన్చార్జి మంత్రులకూ ప్రత్యేక నిధి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున దీని కింద విడుదల చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ లెక్కన మొత్తం రూ.238 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి విడుదల చేసేందుకు సన్నద్ధమైంది. ఈ నిధులపై పెత్తనం మంత్రులకే ఉంటుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలు, సిఫారసులను పరిగణనలోకి తీసుకొని వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్‌గా కేటాయించాలా.. లేదా నియోజకవర్గం ప్రాతిపదికగా ఇవ్వాలా... అనే అంశంపైనే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండ్రోజుల కిందట ఈ ఫైలును సీఎం కేసీఆర్‌కు పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ రెండు ప్రతిపాదనలతో ప్రణాళిక విభాగం ఫైలు సిద్ధం చేసింది. నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇవ్వటం లేదా జిల్లాకు రూ.25 కోట్ల చొప్పున కేటాయించాలని అందులో ప్రస్తావించినట్లు తెలిసింది. నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుంటే మొత్తం రూ.238 కోట్లు, జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే రూ.250 కోట్లు అవసరమవుతాయని సీఎంకు నివేదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి పథకం (సీడీపీ) నిధులను ప్రభుత్వం ఇటీవలే రూ.3 కోట్లకు పెంచింది. వీటిపై ఇన్చార్జి మంత్రుల పెత్తనం తొలిగించిన ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులకు ఈ నిధిని విడుదల చేయనుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రులెవరూ లేరు. కలెక్టర్లకు రూ.25 కోట్లు... ప్రతి జిల్లా కలెక్టర్‌కు క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సీడీఎఫ్)లో కేటాయించే నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.10 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ఏడాది ఒకే విడతలో ఈ మొత్తం నిధులను విడుదల చేసింది. చాలా జిల్లాల్లో అవి ఖర్చు కానందున.. ఈ ఏడాది నాలుగు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ప్రతి జిల్లాకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.25 కోట్లు నిధులను మంజూరు చేస్తూ ప్రణాళిక విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రత్యేక నిధులు తమ్ముళ్ల జేబుల్లోకి!!
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్... ఇదో రాజకీయ ఎత్తుగడ. అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు రూపొందించిన ప్రతిపాదన. నియోజకవర్గ అభివృద్ధి నిధులైతే అందరు ఎమ్మెల్యేలకు అందివ్వాలని... పక్కన పెట్టి... ప్రత్యేక అభివృద్ధి పేరుతో స్వపక్షీయుల నిధుల దోపిడీకి పచ్చజెండా ఊపే యత్నం. సర్కారు నిధులతో జనానికి ఉపయోగం ఉన్నా... లేకున్నా... తమ్ముళ్ల జేబు నింపేందుకు నిర్మొహమాటంగా సాగుతున్న బహిరంగ దందా. సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధులు తమ్ముళ్లకు ఉపాధి మార్గాలుగా మారుతున్నాయి. ఈ నిధులతో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపట్టాల్సి ఉన్నా... అధికార పార్టీ నేతలు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. టెండర్ల వరకు వెళ్లకుండా తమ అనుయాయులకు లబ్ధి చేకూరేలా బిట్లుగా విడగొట్టి నామినేషన్ పద్ధతిలోనే పనులు చేపడుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)వచ్చేవి. అందరికీ నిధులు ఇవ్వడం ఇష్టం లేని సీఎం చంద్రబాబునాయుడు సీడీపీకి మంగళం పాడేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఈ క్రమంలో గజపతినగరం, శృంగవరపుకోట, పార్వతీపురానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలకు చెరో రూ. 2కోట్లు చొప్పున సీఎం విడుదల చేశారు. పనుల ప్రతిపాదనలు దగ్గరి నుంచి అంచనాలు రూపొందించేవరకు ఆ ఎమ్మెల్యేల సూచనల మేరకే జరిగాయి. వారిచ్చిన జాబితాలకే అధికారులు పచ్చజెండా ఊపారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా... : నేతల ఆలోచన సరళి పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే లాభముంటుందనే దృష్టితో వ్యవహరిస్తున్నారు. లాభం లేనిదే ఏ పనుల్నీ చేపట్టకూడదని భావిస్తున్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల విషయంలోనూ అదే తీరు కనబరుస్తున్నారు. ఒక్క గజపతినగరం నియోజకవర్గ పరిధిలో టెండర్ల దశకు వెళ్లే పనులు కొంతమేరకు ప్రతిపాదించారు. శృంగవరపుకోట, పార్వతీపురం నియోజకవర్గ పనులు దాదాపు సీసీ రోడ్లు, డ్రైనేజీలకే పరిమితమయ్యాయి. పనుల విలువ సరాసరి రూ. 10లక్షలకు లోబడే ఉన్నాయి. నిబంధనల మేరకైతే రూ. 10లక్షలు పైబడితే టెండర్లు పిలవాలి. వాటి ద్వారా పారదర్శకత పెరుగుతుంది. రూ. 10లక్షల లోబడి పనులైతే నామినేటేడ్ పద్ధతిలో కట్టబెట్టొచ్చు. ఇప్పుడదే ఎక్కువగా జరిగింది. ఎమ్మెల్యేలు తమ అనుచరులకు లబ్ధి చేకూరేలా చిన్న చిన్న పనుల్ని ప్రతిపాదించారు. అంటే నామినేటేడ్ పద్దతిలో తెలుగు తమ్ముళ్లకు దాదాపు దక్కాయి. సీసీ రోడ్లకే పెద్దపీట గమ్మత్తేమిటోగానీ... ప్రతిపాదించిన పనుల్లో దాదాపు సీసీ రోడ్లే ఉన్నాయి. ఇటీవల ఉపాధి మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ. వందల కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు వేశారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జెడ్పీ జనరల్ ఫండ్స్, మండల పరిషత్ జనరల్ ఫండ్స్ కింద మరికొన్ని రోడ్లు వేశారు. ఈ ఏడాది కూడా సీసీ రోడ్లు వేసుకోవడానికి ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద విడుదలైన నిధులను వేరే పనులకు వినియోగిస్తే బాగుండేది. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు లబ్ధి చేకూరేలా, టెండర్లు లేకుండా పనులు దక్కేలా చిన్నచిన్నవే ప్రతిపాదించారు. దీన్ని బట్టి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. -
అభివృద్ధి సరే... అసలు ‘నాకేంటి?
► రూ. 100కోట్ల కేంద్ర నిధులపై తమ్ముళ్ల గురి ► పంపకాల కోసం అధికారులపై ఒత్తిళ్లు ► తేల్చుకోలేకపోతున్న అధికారులు ► ఏళ్ల తరబడి ఖర్చు కాని ప్రత్యేక అభివృద్ధి నిధులు ► వ్యక్తిగత అభివృద్ధే ధ్యేయం అభివృద్ధి సరే... అసలు ‘నాకేంటి?’ అన్నదే ప్రస్తుత పాలకపక్ష నేతల ధోరణి. జిల్లా పురోగతికి మోకాళ్లడ్డుతున్నారు. కాసుల కోసం గెద్దల్లా వాలిపోతున్నారు. మార్గదర్శకాలతో పనిలేకుండా పర్సంటేజీల కోసం పోటీపడుతున్నారు. పంపకాలేసి ఇచ్చేయండని అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. వీరి వ్యవహారంతో అధికారులు నలిగిపోతున్నారు. మనకెందుకులే అని వాటిజోలికి పోకపోవడంతో ఆ నిధులన్నీ మురిగిపోతున్నాయి. నేతల పుణ్యమాని వెనుకబడిన జిల్లా అలా తిరోగమనంలో పయనిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏటా చెరో రూ. 500కోట్లు వస్తాయని అంతా ఆశించారు. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ. 50కోట్లు మాత్రమే ఇస్తోంది. ఇలా ఇప్పటివరకూ రెండు దఫాలుగా రూ. 100కోట్లు మంజూరు చేసింది. కోట్లల్లో నిధులొచ్చేసరికి పచ్చకళ్లు వాటిపై పడ్డాయి. పనుల్ని దక్కించుకుంటే పర్సంటేజీల ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో నేతలంతా పోటీ పడ్డారు. తమకే ఇచ్చేయాలని ఒత్తిడి చేశారు. జిల్లా కేంద్రానికి పక్కనున్న నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఏకంగా తాను చెప్పినట్టు చేయాలని పనుల జాబితా కూడా ఇచ్చేశారు. ఆయనతో పాటు సిండికేట్‌గా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేతకూడా గట్టిగా అడిగించారు. ఈ క్రమంలో అంతకుముందు ప్రతిపాదించిన వాటిలో రూ. 5కోట్ల వరకు ఖర్చు పెట్టి, మిగతా మొత్తాన్ని దేనికి ఖర్చు పెట్టాలో, ఏ నియోజకవర్గానికి కేటాయించాలో తేల్చుకోలేక అధికారులు పక్కన పెట్టేశారు. ఏడాదిగా ఆ నిధులు ఎందుకూ కొరగాకుండానే ఉండిపోయాయి. ఇవీ మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో చేపట్టబోయే పనులు ఎలా ఉండాలో నిర్దేశించింది. స్థూల జాతీయోత్పత్తి పెరగడానికి, కరువును తగ్గించడానికి, సామాజిక అభివృద్ధి సాధించడానికి, రెండు అంకెల వృద్ధి రేటు సాధించేందుకు దోహదపడే పనులు మాత్రమే చేపట్టాలి సూచించింది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ శాఖ, ఇరిగేషన్, సంక్షేమ శాఖలకు సంబంధించిన పనులు చేపట్టాలని పేర్కొంది. కానీ ఆ దిశగా అధికారులు పనులు ప్రతిపాదించలేకపోయారు. ఆ నిధుల్ని తమకే అప్పగించాలని, తమ నియోజకవర్గాల్లోనే ఖర్చు పెట్టాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిళ్లు చేస్తూనే ఉన్నారు. పనుల వినియోగానికి తాజా ఆదేశాలు నిరుపయోగంగా ఉన్న నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. ఇప్పటికే విడుదలైన రూ. 100కోట్లతో పాటు భవిష్యత్‌లో విడుదలయ్యే మరో రూ. 100కోట్లకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. వాటి ఆధారంగా చేస్తారో? లేదంటే ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి పంపకాల ప్రకారం ప్రతిపాదిస్తారో చూడాలి. -
సీఎం చేతిలో రూ.5,500 కోట్లు!?
- వచ్చే బడ్జెట్లో భారీగా స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్ - కలెక్టర్లకు, మంత్రులకు సైతం ప్రత్యేక నిధి - ఇప్పటికే అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది తెలంగాణ బడ్జెట్లో రూ.5500 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధికి(ఎస్డీఎఫ్) కేటాయించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారం మేరకు వీటిని ఖర్చు చేసే వీలుంటుంది. ఇంత భారీ మొత్తంలో ఎస్డీఎఫ్కు నిధులు కేటాయించనుండటం మొదటిసారి కావటం ప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఇదే నిధి నుంచి జిల్లా కలెక్టర్లకు రూ.10 కోట్లు, మంత్రులకు రూ.25 కోట్ల చొప్పున విడుదల చేస్తారు. వీటిని ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, ఆపన్నులకు చేయాతను అందించేందుకు వినియోగిస్తారు. గత ఏడాది అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక నిధి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దళితులకు వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడి విడుదల చేయటంతో పాటు, వివిధ సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి నిధి అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. వెంటనే ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేశారు. ఈసారి బడ్జెట్లోనూ ఈ పంథాను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. కలెక్టర్లతో పాటు మంత్రులకు సైతం ప్రత్యేక నిధి కేటాయించే ప్రతిపాదనలున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లినప్పుడు తమకు వచ్చే విజ్ఞప్తులు, చిన్న చిన్న పనులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా ఈ నిధి ఉపయోగిపడుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ పద్దును భారీ మొత్తంలో కేటాయించాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్లు, మంత్రులకు కేటాయించేందుకు రూ.500 కోట్లు వెచ్చించటంతో పాటు మిగతా రూ.5000 కోట్లను ముఖ్యమంత్రి తన వద్ద ఉంచుకొని, వివిధ నియోజకవర్గాల్లో తను ఇచ్చిన హామీలు, విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలతో చేపట్టే పనులకు ఖర్చు చేస్తారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, అదనపు ఇళ్ల మంజూరు తదితర అంశాలకు సీఎం ప్రత్యేక నిధి నుంచి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. -
ఖర్చుకూ కాలయాపనే
వినియోగించని తొలివిడత నిధులు మళ్లీ జిల్లాకు రూ.50 కోట్లు విడుదల {పతిపాదనల దశ దాటని పనులు ఇదీ ‘ప్రత్యేక’ ప్యాకేజి నిధుల సంగతి సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఇచ్చింది కొసరంతా..ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసేందు కు జిల్లా యంత్రాంగం ఆర్నెల్లుగా కాల యాపన చేసింది. ఇప్పుడు మరో విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ ని దుల వినియోగంపై దృష్టి పెట్టాల్సిన అ వసరం ఉంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసమంటూ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు రూ.50కోట్ల చొప్పున 2014-15 ఆర్ధిక సంవత్సరానికి రూ.350కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.50కోట్లు విడుదల య్యాయి. ఆలస్యంగా కమిటీ సమావేశం మరుసటి నెలలోనే ఈ నిధుల వినియోగంపై ప్ర త్యేక మార్గదర్శకాలు జారీఅ య్యాయి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రతీ నెలా సమావేశమవుతూ నిధుల విని యోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కానీ పట్టించుకున్న పాపానపోలేదు. సాక్షిలో ఇటీవల ప్రచురితమై న కధనంపై స్పందించిన కలెక్టర్ యువరాజ్ రెండ్రోజుల క్రితం తొలి మోనటరింగ్ కమిటీ సమావేశం ఏ ర్పాటు చేశారు. ఇప్పటి వరకు శా ఖల అందిన ప్రతిపాదనలను పరిశీలించి న కలెక్టర్ యువరాజ్ కొన్నింటికి పరిపాలనా మోదమిచ్చారు. ఇవీ ప్రతిపాదనలు ప్రతిపాదనల్లో ఫిషరీస్ నుంచి రూ. 3.75 కోట్లు, పశు సంవర్ధక శాఖ నుంచి రూ.21.12 కోట్లు, డ్వామా నుంచి రూ.7.25 కోట్లు, వ్యవసాయ శాఖ నుం చి రూ.10.50కోట్లు, విద్యా శాఖ నుంచి రూ.1.93 కోట్ల పనులకు పాలనామోదం ఇచ్చారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 100 సోలార్ పంపుసెట్లు, బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదిస్తానని కలెక్టర్ ప్రకటించారు. దీంతో పాడేరు ఐటీడీఎ నుంచి వచ్చిన రూ.11కోట్ల ప్రతిపాదనలతో పాటు అటవీశాఖ-రూ.2.10 కోట్లు, డీఐసీ-రూ.25లక్షలు, ఏపీ టీడీసీ-రూ.3.10 కోట్లు, సీపీఒ-రూ.50లక్షలు, బీసీ కార్పొ రేషన్ రూ.1.83కోట్లకు ఇంకాఅనుమతులివ్వాల్సి ఉంది. మళ్లీ వచ్చిపడ్డాయి: ఈ నిధులు వినియోగం ఇంకా పూర్తిగాగాడిలో పడకముందే 2015-16 ఆర్ధిక సం వత్సరానికి సంబంధించి మరో రూ.50కోట్లు జిల్లాకు విడుదలయ్యాయి. ఈ నిధు లు ప్రస్తుతం సీపీఒ వ్యక్తిగత ఖాతా (పీడీ)లో ఉన్నాయి. వీటిని పూర్తిగా కరువు నివారణా చర్యలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంది. పనులు నిర్వహించే ఏజెన్సీకి జిల్లాకలెక్టర్ అనుమతితోనే చెల్లింపులు చేయాలి. ఖర్చుచేసిన ప్రతీరూపాయికి ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ నెలకు కనీసం ఒకసారైనా విధిగా సమావేశమై సమీక్షించుకోవాల్సి ఉంది.గత ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నిధులు వినియోగంపై ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టిన యంత్రాంగం ప్రస్తుతం మంజూరైన నిధులను ఖర్చుచేసేందుకు ఇంకెంత సమయం తీసుకుంటుందోననే సందే హాలు వ్యక్తమవుతున్నాయి. -
జేబులు ఖాళీ ఆయెనే..
ఎమ్మెల్యేలకు నిధులు నిల్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను రద్దుచేసిన సీఎం కార్పొరేషన్‌కు నిధుల కొరత ఆగిపోయిన అభివృద్ధి పనులు టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఫలితంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక సంస్థల వద్ద నిధులు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు కదలట్లేదు. చిన్నచిన్న పనులు కూడా చేయించలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. విజయవాడ : ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్ (ఏసీడీఎఫ్) విడుదల చేసేవారు. ప్రజలు తమ ఇబ్బందులను ఎమ్మెల్యేకు చెబితే.. ఆయన తన నిధులు వెచ్చించి ఆ సమస్యను పరిష్కరించేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.2కోట్లు కూడా మంజూరుచేశారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 2015-16 బడ్జెట్లో ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.3 కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అప్పటివరకు ప్రజలు ఏ సమస్య చెప్పినా వాటిని పరిష్కరించే అవకాశం ఎమ్మెల్యేలకు ఉండదు. నగరపాలకసంస్థ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్పొరేషన్ నిధులు కూడా లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌కూ బ్రేక్ గత ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గానికి రూ.3కోట్లు, తూర్పు, పశ్చిమలోని అభివృద్ధి పనులకు రెండేసి కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ నిధులు వినియోగించే లోగానే ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఈ నిధుల్ని వినియోగించుకుందామంటే ముఖ్యమంత్రి బ్రేక్ వేసినట్లు తెలిసింది. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనులు చేయవచ్చని, గత ప్రభుత్వం ఇచ్చిన పనులకు నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజాప్రతినిధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
చంద్రబాబుతో నారాయణ, గంటా భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఉదయం మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇదేనా ప్యాకేజీ మూట!
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రూ.50 కోట్లు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట కేంద్రం విదిలింపు ఏ రంగాలకు కేటాయించాలో స్పష్టత లేదు 2014-15 ఆర్థిక లోటు పూడ్చేందుకేనంటున్న కేంద్రం శ్రీకాకుళం : అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట కేంద్రం బుధవారం రూ.50 కోట్లు విడుదల చేయడంపై అన్ని వర్గాల నుంచీ అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మిగతా రాష్ట్రాలు సహకరించడం లేదంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు విడుదల చేస్తున్నట్లు బుధవారం కేంద్రం ప్రకటించింది. ఇది కంటితుడుపు చర్యేనని జిల్లావాసులు మండిపడుతున్నారు. ఈ నిధులతోనే సరిపెట్టేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికలోటు పూడ్చేందుకే ఈ నిధులని చెబుతూనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నిధులిస్తున్నామంటూ మెలిక పెట్టడంపైనా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. సమస్యల పుంత జిల్లాలో సమస్యలకు కొదవ లేదు. వ్యవసాయాధారిత జిల్లా అయినా ఏడాదికి ఒక పంటతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. పరిశ్రమలూ నామమాత్రమే. ఉద్దానంలో కిడ్నీల సమస్యపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించాల్సి ఉన్నా ఇప్పటివరకూ ఫలితాల్లేవు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమైనా వ్యవసాయరంగానికి ప్రోత్సహకాలు లేవు. విత్తనాలు, ఎరువుల సరఫరాపైనా విమర్శలొస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఐదులక్షల మంది రైతులకు ఉపయోగపడేలా కేంద్రం చర్యలు తీసుకుంటే కనీసం వచ్చే ఖరీఫ్ నాటికైనా మంచి జరిగేదంటూ రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. రూ.50 కోట్లతో ఇవన్నీ జరిగేనా? వేసవి వస్తోంది. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం, కాల్వల మరమ్మతుల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతి విషయానికీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం విడిపోయింది. కష్టాల్లో ఉన్నాం అంటూ వెనుకంజ వేస్తోంది. నిధుల్లేక చెల్లింపులు నిలిపివేస్తోంది. ఈ తరుణంలో కేంద్రం విదిల్చిన రూ.50 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, కాల్వల మరమ్మతులకు కనీసం రూ.10వేల కోట్లయినా మంజూరు చేయాల్సిందేనని గతంలో రైతు సంఘం నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బీల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 3వేల ఎకరాలకు కనీసం రూ.10 కోట్లు ఖర్చుచేస్తే అక్కడివారికి తిండిగింజలు లభిస్తాయని నివేదికల్లో పేర్కొంది. జంపర్కోట రిజర్వాయర్‌కు 15 ఏళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దానికి మరో రూ.26 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పినా పైసా విదల్చలేదు. ఇప్పుడు మూడింతల అంచనా వ్యయం పెరిగి రూ.100కోట్లు అయినా వెచ్చిస్తేనే పనులు జరుగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు తేల్చి చెప్పేశారు. తోటపల్లి రిజర్వాయర్ పరిస్థితీ అంతే. చిన్ననీటి వనరుల అభివృద్ధి, ప్రతి సెంటు భూమికీ సాగునీరందిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు ఏం చేయనుందో చెప్పకుండా దోబూచులాడుకుంటూ వస్తోంది. బూర్జ మండలం పెదపేట సమీపంలో ఉన్న విత్తన క్షేత్రాన్ని తక్షణమే అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మరోవైపు సాగునీటి అవసరాలకు గతంలో రూ.25 కోట్లు ప్రకటించినా అవి ఇప్పటికీ విడుదల కాలేదు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు వచ్చిన కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. -
బాగా వెనుకబడిన జిల్లాలు ఆరు
వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కోసం టీసర్కారు కసరత్తు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్‌ల అభివృద్ధికి అంచనాలు సీఎం ఆమోదం తర్వాత కేంద్రానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాగా వెనుకబడిన జిల్లాలుగా ఆరింటిని ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరాలని, ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈ వారంతంలోగా ప్రతి పాదనలు సిద్ధం చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుని అధికారులు కేంద్రానికి పంపనున్నారు. ఆరు జిల్లాల్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను చేర్చారు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు పైవాటితో పోలిస్తే అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తుందని పేర్కొన్న నేపథ్యంలో అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయల మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోసం బడ్జెట్లో పొందుపరిచిన సంగతి విదితమే. అందులో భాగంగా విద్య, వైద్య, రహదారులు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని కోరింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, ప్రతీ గ్రామానికి తాగునీటి సౌకర్యం, పం చాయతీ, ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధితోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కోరాలని నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని చట్టంలో పేర్కొన్నందున, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను ఇందులో పొందుపర్చాలని మొదట్లో భావించినా.. ‘సెస్’ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఆశించిన మేరకు నిధులను కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
వెనుకబాటుతనాన్ని పారదోలుదాం
- అందుకోసం సీఎం నడుంకట్టారు - ఏడాదిలో జిల్లాలోని 6 లక్షల - ఎకరాలకు సాగునీరు - సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి - ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ ఖిల్లాఘనపురం: సీమాంధ్రుల పాలనలో 50ఏళ్ల వెనుకబాటుతనాన్ని ఐదేళ్లలో రూపుమాపేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం కట్టారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం ఖిల్లాఘనపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నాయకుల పరిపాలనలో రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే ముఖ్యమైన పథకాలను అమలుచేసేందుకు చర్య లు తీసుకున్నామన్నారు.తెలంగాణలోని ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిం చేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, బడుగు,బలహీనవర్గాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కుటుంబాల సమగ్రసర్వే చేపట్టామని వివరించారు. ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయాలను నేరవేర్చే దిశగా ప్రభుత్వం సాగుతుందన్నారు. ప్రతిపక్షాల నాయకులు సర్వే పట్ల ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాల మూరు జిల్లా వలసలకు పెట్టింది పేరన్నా రు. అలాంటి జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. జిల్లా నుండి వలసలను నివారించాలంటే ముఖ్యంగా సాగునీరు అవసరమన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఏడాదిలో జిల్లాలోని 6లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి మండలానికి సాగు,తాగునీరందించేందుకు కృషి చేస్తామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఖిల్లాఘనపురం మండలంలోని 25వేల ఎకరాలకు సాగునీరందించేందకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అంతకు ముందు ఆయన ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో *80 లక్షలతో నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రార భించారు. అదేపాఠశాలలో విద్యార్థులకు తాగునీరందించేందుకు *15.20 లక్షలతో నిర్మించే వాటర్‌ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. బస్టాండులో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రావ్ఆర్య, ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు లక్ష్మారెడ్డి, బాలకృష్ణారెడ్డి, శేషాచార్యులు, రంగారెడ్డి, ఉత్తరయ్య,రవీందర్‌రెడ్డి, రాళ్ళకృష్ణ, విక్రం, ఆంజనేయులు, రాఘవేందర్‌రెడ్డి, సౌమ్యానాయక్, పీనానాయక్, పీల్యానాయక్, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం జడ్చర్ల: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీకి గురువారం జడ్చర్లలో ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన హైదరాబాద్ నుండి నేరుగా జడ్చర్ల ప్రభుత్వ ఆతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద తదితరులు డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో భూ పంపిణీ, కుటుంబ సర్వేపై చర్చిం చారు. ఈ ఏడాది మొక్కజొన్న పంటకు వా తావరణ బీమా మల్లెబోయిన్పల్లి సింగిల్‌విండో చైర్మన్ దశరథరెడ్డి వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన వారిలో డీఎస్పీ మల్లిఖార్జున, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి,తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, సీఐ జంగయ్య తదితరులున్నారు. -
ప్రత్యేక నిధికి చెక్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రత్యేక అభివృద్ధి పనులకు సర్కారు చెక్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట మంజూరైన పనులను నిలిపివేయాలని ప్రణాళిక విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమకున్న పరపతితో తమ సొంత నియోజకవర్గాలకు ఈ నిధులు మంజూరు చేయించుకున్నారు. స్వయానా ముఖ్యమంత్రి సిఫారసుతో స్పెషల్ కోటాలో వీటిని తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తమ అనుచరులు, అనుయాయులు, పార్టీ కార్యకర్తలకు ఎర వేసేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ఈ నిధిని ప్రయోగించారు. ఎమ్మెల్యేలకు ఏటేటా కోటి రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)కి అదనంగా ఈ నిధులు విడుదలయ్యాయి. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో విడుదలైన ఎస్డీసీ నిధులపై పోస్ట్‌మార్టం ప్రారంభించింది. సొంత రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఈ పనుల గుర్తింపు.. నిధుల కేటాయింపు జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వీటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. గడిచిన మూడేళ్లలో ఎస్డీసీ కింద మంజూరైన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి..? ఇప్పటికీ ప్రారంభం కాని పనులెన్ని..? అనే వివరాలను ఆరా తీసింది. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్నవాటిని యథాతథంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు రూ.15 కోట్ల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గడిచిన మూడేళ్లలో జిల్లాకు రూ.31.32 కోట్లు స్పెషల్ కోటాలో విడుదలయ్యాయి. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 860 పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటివరకు సగానికి సగం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నామినేటేడ్ పద్ధతిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే వీటిని దక్కించుకోవటంతో పనుల పురోగతి పక్కదారి పట్టింది. తమ పార్టీ అధికారంలో ఉండటంతో అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, అప్పటి ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి తమ నియోజకవర్గాలకు స్పెషల్ ఫండ్ మంజూరు చేయించుకునేందుకు పోటీ పడ్డారు. నామినేటేడ్ పద్ధతిపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పనులు పంచి పెట్టారు. పార్టీ శ్రేణులకు లాభసాటిగా ఉంటుందని లింక్ రోడ్లు, సిమెంటు రోడ్లు, కాంపౌండ్ వాల్లకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి పనులెలా ఉన్నా.. పార్టీ శ్రేణుల పంట పండింది. 2011-12లో జిల్లాకు ఎస్డీసీ కింద రూ.14.47 కోట్లు విడుదలయ్యాయి. మంథని, హుస్నాబాద్, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో 384 పనులకు వీటిని కేటాయించారు. వీటిలో 302 పనులు పూర్తయ్యాయి. 2012-13లో హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 214 పనుల పేరిట రూ.9.57 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో 109 పనులు పూర్తవగా.. మిగతా 105 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గత ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు మంథని, మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 262 పనులకు రూ.7.28 కోట్లు కేటాయించారు. అందులో కేవలం 20 పనులు పూర్తయ్యాయి. 242 పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇప్పుడీ నిధులు ఆపేయటంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిత్తరపోతున్నారు. -
గతం గతః
ఎద్దు పుండు..కాకికి ఏం నొప్పి..అన్నట్లు కనిపిస్తోంది సర్కారు పరిస్థితి. ప్రజలు ఇబ్బందులు పడితే మనకేంటి? మనవాళ్లు అభివృద్ధి చెందితే చాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించేసే తరహాలోనే గతంలో మంజూరైన అభివృద్ధి పనులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఆ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలెట్టేసింది. అదే క్రమంలో గతంలో మంజూరైన అభివృద్ధి పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశిస్తోంది. కొన్నింటికి నేరుగా ఉత్తర్వులివ్వగా, మరికొన్నింటికి మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో పనులు సాధించుకున్న వారు మింగలేక కక్కలేక ఉంటే.. ఇప్పుడు పనులు సాధించుకోబోతున్న వారు చంకలు గుద్దుకుంటూ..భుజాలెగరేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలకని కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కేటాయించి సుమారు రూ.44 కోట్లు జిల్లాకు విడుదల చేసింది. ఆమేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రతిపాదించడమే కాకుండా వాటిని మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ కూడా జిల్లా అధికారులిచ్చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేస్తే ఇబ్బందులొస్తాయని పనులను కూడా వెంటనే ప్రారంభించేశారు. కాకపోతే, పనులప్రగతి అదే వేగంలో ముందుకెళ్లలేదు. ఇంతలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కన్ను ఆ పనులపై పడింది. వాటిని యుద్ధ ప్రాతిపదికన నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అవే పనులను తమ పార్టీ నేతలకు కట్టబెట్టొచ్చన్న యోచనకు వచ్చింది. నిర్ణయం తీసుకోవడమే తరువాయి తక్షణమే ఎస్డీఎఫ్ పనులను నిలిపేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.44కోట్ల పనులు ఎక్కడివి అక్కడ ఆపేశారు. ఆ పనులు మళ్లీ ప్రారంభమవుతాయా? లేదంటే రద్దవుతాయా? అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆప్పట్లో పనులు దక్కించుకున్న వారంతా సందిగ్ధంలో పడ్డారు. ముందుకెళ్లొద్దు తాజాగా ఆర్డబ్ల్యూఎస్ శాఖపై కూడా సర్కార్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ హయాంలో మంజూరై, వాటిలో ప్రారంభం కాని మంచినీటి పథకాల విషయంలో ముందు కెళ్లొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. టెండర్లు పిలవొద్దని, తదుపరి నిర్ణయం తీసుకునే వరకు వాటి ఊసుపట్టొద్దంటూ స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెనక్కి తగ్గారు. ఈ విధంగా జిల్లాలో సుమారు రూ.4కోట్ల విలువైన 39 మంచినీటి పథకాలకు బ్రేక్ పడింది. వాటిని తమకు అనుకూలంగా కేటాయింపులు చేసుకుని, పనులు దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇదే తరహాలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనుల్ని కూడా నిలిపేయాలని పరోక్షంగా సంకేతాలిచ్చింది. దీంతో అధికారులు ముందుకెళ్లలేక పోతున్నారు. ఆర్థికాభివృద్ధి పథకాలదీ అదే పరిస్థితి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థికాభివృద్ధి పథకాల(రుణ యూనిట్లు) పైనా టీడీపీ నేతల దృష్టి పడింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోయినా స్థానిక నాయకులు మాత్రం వాటి విషయంలో ముందడుగు వేయొద్దంటూ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1695 మందికి 1210 యూనిట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా మార్జిన్ మనీస్కీమ్ కింద 3532మందికి, రాజీవ్ అభ్యుదయ యోజన కింద 540మందికి, ఐటీడీఎ ద్వారా 2838మందికి, వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా మండలానికొకరికి, మున్సిపాల్టీల్లో ముగ్గురేసి చొప్పున యూనిట్లు మంజూ రు చేశారు. బ్యాంకుల ఆమోదంతో ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చేశారు. 101 నంబర్ జీవో ముసుగులో కాంగ్రెస్ నేతలే ఇందులో కీలక పాత్ర పోషించా రు. ఇంతలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో మంజూరు చేసిన వాటిైపై ముందుకెళ్లొద్దన్న ప్రభుత్వ సంకేతాల మేరకు అధికారులు చొరవ తీసుకోలేదు. దీంతో లబ్ధిదారులకు రుణ యూనిట్లు అందలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని గతంలో మంజూరైన వాటిని ఆపేయాలని, తాము చెప్పినట్లు మళ్లీ లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రుణ యూనిట్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. టీడీపీ శ్రేణులకు లబ్ధి చేకూర్చే దృష్టితో అప్పట్లో చేసిన మంజూరు ప్రక్రియను పూర్తిగా రద్దు చేసే అవకాశం కన్పిస్తోంది. ఇవన్నీ చూస్తుం టే టీడీపీ నేతల పంట పండించేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడగా స్పష్టమవుతోంది. -
రూ.55 కోట్ల పనులపై టీడీపీ నేతల కన్ను
విజయనగరం మున్సిపాలిటీ :పాలకపక్షాలు మారిన ప్రతిసారీ గత ఏలికల ఆదేశాలను నిలిపివేయడం లేదా వాటిని తిరగతోడడం షరామామూలే. ప్రస్తుతం చంద్రబాబు సర్కారు కూడా ఇదే తీరును అనుకరిస్తోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంజూరు చేసిన నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి పనులు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద మంజూరైన పనులపై టీడీపీ నేతల కన్నుపడింది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ పేరిట జిల్లాకు రూ.40 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు రూ.5 లక్షల వ్యయమయ్యే పనుల్ని ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబె ట్టారు. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలకు మెండుగా నిధులు కేటాయించిన అప్పటి సర్కారు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రంగా నామమాత్రపు నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ. 40 కోట్ల వరకు మంజూరు కాగా.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద మరో రూ.15 కోట్ల వరకు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇప్పటివరకు కేవలం 20 శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. మరో 40 శాతం పనులు వివిధ దశల్లో ఉన్నారుు. మిగిలిన 40 శాతం పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. విజయనగరం మున్సిపాలిటీలో రూ.12. 50 కోట్ల పనులకు బ్రేక్ : టీడీపీ నేతలు అనుకున్నదే జరిగితే విజయనగరం మున్సిపాలిటీలో చేపట్టాల్సిన రూ. 12.50 కోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ఫిబ్రవరి నెలలో మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రూ.15 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ. 2.50 కోట్ల పనులు పూర్తి కాగా, రూ 12. 50 కోట్ల పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. టీడీపీ నేతల మధ్య విబేధాలు ఈ పనులపై స్థానిక ఎమ్మెల్యే మీసాల గీతతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పేరు వినిపిస్తున్న ప్రసాదుల రామకృష్ణల మధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ పనులను తాను చెప్పిన విధంగానే పాత కాంట్రాక్టుల ద్వారా చేపట్టాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేయగా, చైర్పర్సన్ రేసులో ఉన్న ప్రసాదుల రామకృష్ణ మాత్రం తాను అధ్యక్ష పీఠం ఎక్కే వరకు పనులు చేపట్టేందుకు వీల్లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు మాట వినాలో తెలియక టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సతమతమవుతుండగా...ఎమ్మెల్యే, చైర్మన్ అభ్యర్థి మధ్య ఈ విషయం పెద్ద దుమారాన్నే లేపే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.