విజయనగరం మున్సిపాలిటీ :పాలకపక్షాలు మారిన ప్రతిసారీ గత ఏలికల ఆదేశాలను నిలిపివేయడం లేదా వాటిని తిరగతోడడం షరామామూలే. ప్రస్తుతం చంద్రబాబు సర్కారు కూడా ఇదే తీరును అనుకరిస్తోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంజూరు చేసిన నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి పనులు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద మంజూరైన పనులపై టీడీపీ నేతల కన్నుపడింది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ పేరిట జిల్లాకు రూ.40 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు రూ.5 లక్షల వ్యయమయ్యే పనుల్ని ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబె ట్టారు.
అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలకు మెండుగా నిధులు కేటాయించిన అప్పటి సర్కారు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రంగా నామమాత్రపు నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ. 40 కోట్ల వరకు మంజూరు కాగా.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద మరో రూ.15 కోట్ల వరకు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇప్పటివరకు కేవలం 20 శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. మరో 40 శాతం పనులు వివిధ దశల్లో ఉన్నారుు. మిగిలిన 40 శాతం పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
విజయనగరం మున్సిపాలిటీలో రూ.12. 50 కోట్ల పనులకు బ్రేక్ :
టీడీపీ నేతలు అనుకున్నదే జరిగితే విజయనగరం మున్సిపాలిటీలో చేపట్టాల్సిన రూ. 12.50 కోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ఫిబ్రవరి నెలలో మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద రూ.15 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ. 2.50 కోట్ల పనులు పూర్తి కాగా, రూ 12. 50 కోట్ల పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
టీడీపీ నేతల మధ్య విబేధాలు
ఈ పనులపై స్థానిక ఎమ్మెల్యే మీసాల గీతతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పేరు వినిపిస్తున్న ప్రసాదుల రామకృష్ణల మధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ పనులను తాను చెప్పిన విధంగానే పాత కాంట్రాక్టుల ద్వారా చేపట్టాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేయగా, చైర్‌పర్సన్ రేసులో ఉన్న ప్రసాదుల రామకృష్ణ మాత్రం తాను అధ్యక్ష పీఠం ఎక్కే వరకు పనులు చేపట్టేందుకు వీల్లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు మాట వినాలో తెలియక టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సతమతమవుతుండగా...ఎమ్మెల్యే, చైర్మన్ అభ్యర్థి మధ్య ఈ విషయం పెద్ద దుమారాన్నే లేపే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రూ.55 కోట్ల పనులపై టీడీపీ నేతల కన్ను
Published Sun, Jun 22 2014 3:01 AM | Last Updated on Mon, Aug 20 2018 7:17 PM
Advertisement
Advertisement