వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రూ.50 కోట్లు
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట కేంద్రం విదిలింపు
ఏ రంగాలకు కేటాయించాలో స్పష్టత లేదు
2014-15 ఆర్థిక లోటు పూడ్చేందుకేనంటున్న కేంద్రం
శ్రీకాకుళం : అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట కేంద్రం బుధవారం రూ.50 కోట్లు విడుదల చేయడంపై అన్ని వర్గాల నుంచీ అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మిగతా రాష్ట్రాలు సహకరించడం లేదంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు విడుదల చేస్తున్నట్లు బుధవారం కేంద్రం ప్రకటించింది. ఇది కంటితుడుపు చర్యేనని జిల్లావాసులు మండిపడుతున్నారు. ఈ నిధులతోనే సరిపెట్టేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికలోటు పూడ్చేందుకే ఈ నిధులని చెబుతూనే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నిధులిస్తున్నామంటూ మెలిక పెట్టడంపైనా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
సమస్యల పుంత
జిల్లాలో సమస్యలకు కొదవ లేదు. వ్యవసాయాధారిత జిల్లా అయినా ఏడాదికి ఒక పంటతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. పరిశ్రమలూ నామమాత్రమే. ఉద్దానంలో కిడ్నీల సమస్యపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించాల్సి ఉన్నా ఇప్పటివరకూ ఫలితాల్లేవు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమైనా వ్యవసాయరంగానికి ప్రోత్సహకాలు లేవు. విత్తనాలు, ఎరువుల సరఫరాపైనా విమర్శలొస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఐదులక్షల మంది రైతులకు ఉపయోగపడేలా కేంద్రం చర్యలు తీసుకుంటే కనీసం వచ్చే ఖరీఫ్ నాటికైనా మంచి జరిగేదంటూ రైతు సంఘం నాయకులు వాపోతున్నారు.
రూ.50 కోట్లతో ఇవన్నీ జరిగేనా?
వేసవి వస్తోంది. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం, కాల్వల మరమ్మతుల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతి విషయానికీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం విడిపోయింది. కష్టాల్లో ఉన్నాం అంటూ వెనుకంజ వేస్తోంది. నిధుల్లేక చెల్లింపులు నిలిపివేస్తోంది. ఈ తరుణంలో కేంద్రం విదిల్చిన రూ.50 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, కాల్వల మరమ్మతులకు కనీసం రూ.10వేల కోట్లయినా మంజూరు చేయాల్సిందేనని గతంలో రైతు సంఘం నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
బీల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 3వేల ఎకరాలకు కనీసం రూ.10 కోట్లు ఖర్చుచేస్తే అక్కడివారికి తిండిగింజలు లభిస్తాయని నివేదికల్లో పేర్కొంది.
జంపర్‌కోట రిజర్వాయర్‌కు 15 ఏళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దానికి మరో రూ.26 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పినా పైసా విదల్చలేదు. ఇప్పుడు మూడింతల అంచనా వ్యయం పెరిగి రూ.100కోట్లు అయినా వెచ్చిస్తేనే పనులు జరుగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు తేల్చి చెప్పేశారు. తోటపల్లి రిజర్వాయర్ పరిస్థితీ అంతే.
చిన్ననీటి వనరుల అభివృద్ధి, ప్రతి సెంటు భూమికీ సాగునీరందిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు ఏం చేయనుందో చెప్పకుండా దోబూచులాడుకుంటూ వస్తోంది.
బూర్జ మండలం పెదపేట సమీపంలో ఉన్న విత్తన క్షేత్రాన్ని తక్షణమే అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మరోవైపు సాగునీటి అవసరాలకు గతంలో రూ.25 కోట్లు ప్రకటించినా అవి ఇప్పటికీ విడుదల కాలేదు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు వచ్చిన కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు.
ఇదేనా ప్యాకేజీ మూట!
Published Thu, Feb 5 2015 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 7:17 PM
Advertisement