Union Minister Venkaiah Naidu
-
300 కోట్లు ఎక్కువే ఇచ్చాం..
రాష్ట్రానికి హోదాకాదు.. ఆదా ఇచ్చాం: వెంకయ్య సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎంత వస్తుందో పరిశీలించి, దానికంటే 300 కోట్లు ఎక్కువ వచ్చే ప్యాకేజీనే కేంద్రం ఇచ్చిందని, దానికి చట్టబద్ధత కల్పించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్రానికి ‘హోదా కాదు.. ఆదా ఇచ్చాం’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై విజయవాడలో ఆదివారం పార్టీ విజయోత్సవసభ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం 2017 నుంచి అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తుందని, అలాంటప్పుడు హోదా కంటే ప్యాకేజీ ద్వారానే రాష్ట్రానికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఏడాదికి రూ.45,364 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.2,06,819 కోట్లు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం లెక్కించిన ఐదేళ్ల రెవెన్యూ లోటు 22,113 కోట్లను అదనంగా కేంద్రం ఇస్తుందన్నారు. -
15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్య సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విభిన్న కేంద్ర ప్రాజెక్టులు, పథకాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం 15 మంది కేంద్ర మంత్రులతో సమీక్ష జరిపారు. రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పరికర్, సురేష్ ప్రభు, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, నరేందర్‌సింగ్ తోమర్, రాధామోహన్ సింగ్, తావర్‌చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా, మహేష్‌శర్మ, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి తదితర కేంద్ర మంత్రులు ఈ చర్చలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవసరమైన చట్ట సవరణను సత్వరం తీసుకురావాలని హోంమంత్రి రాజ్‌నాథ్, న్యాయ మంత్రి రవిశంకర్‌ను వెంకయ్య కోరారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని, తర్వాత కేబినెట్‌కు పంపుతామని వారు తెలిపారు. అలాగే ఐఎన్ఎస్ విరాట్‌ను పర్యాటక స్థలిగా మార్చేందుకు ఏపీకి సాయం చేయాలని, నాగాయలంకలో డీఆర్డీవో మిస్సైల్ టెస్ట్ కేంద్రాన్ని, బొబ్బిలిలో నావల్ ఎయిర్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని రక్షణమంత్రి పరికర్ను కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరగా.. ఈ అంశంలో పురోగతి ఉందని సురేష్ ప్రభు తెలిపినట్టు సమాచారం. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధమని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ చర్చల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పలువురు టీడీపీ ఎంపీలూ పాల్గొన్నారు. -
కేసీఆర్, వెంకయ్య దుర్బుద్ధి వల్లే..
అఖిలపక్షం వాయిదా పడిందన్న సంపత్ సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల దుర్బుద్ధివల్లనే ప్రధాన మంత్రి మోదీతో అఖిలపక్ష సమావేశం వాయిదా పడిందని ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ ఆరోపించారు. దళితుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు, తీసుకున్న చర్యలు, జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంతోకాలంగా కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. -
సుస్థిర పాలన వాజ్‌పేయి ఘనత
92వ జన్మదినం కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, అమరావతి: దేశంలో అనేక మార్పులకు ఆద్యుడు మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. వాజ్‌పేయి జన్మదినం రోజు డిసెంబర్ 25ను కేంద్రం సుపరిపాలనదినంగా ప్రకటించిన నేథ్యంలో ఆదివారం విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం ఏలూరు రోడ్డులో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ ఐదేళ్ల పాటు సుస్థిరంగా పరిపాలించలేరని ఒక రకమైన వాదన ఉన్న రోజులలో 23 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంతో సుస్థిర పాలన అందించిన ఘనత వాజ్‌పేయిదేనని చెప్పారు. పీవీ నరసింహారావు ప్రధానిగా అర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటిని అమలులోకి తీసుకొచ్చింది మాత్రమే వాజ్‌పేయేనన్నారు.రేపు పోలవరంపై మంచివార్త వింటారు: రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు విషయంలో రేపు మంచివార్త వింటారని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వేదిక నుంచి ఆ వివరాలు చెప్పడం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయని తెలిపారు. -
'బంగారం, ఉప్పులపై అసత్య ప్రచారం'
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో కశ్మీర్లో అల్లర్లు ఆగిపోయాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పారు. వాజపేయి జన్మదినం సందర్భంగా విజయవాడ కొత్తపేటలో పేదలకు దుస్తులు, దుప్పట్లు వెంకయ్యనాయుడు పంచారు. ఈ సందర్భంగా నగంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో గుడ్ గవర్నస్ డే సదస్సులో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడారు. బంగారం, ఉప్పులపై విపక్షాలది అసత్య ప్రచారం అని చెప్పారు. పెద్ద నోట్ల రద్ద వల్ల వచ్చే ఆదాయాన్ని హౌసింగ్, హెల్త్ విభాగాలకు ఖర్చు చేస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. -
పెరిగిన తెలుగు పత్రికల సర్క్యులేషన్
వివరాలు వెల్లడించిన ఆర్ఎన్ఐ ప్రెస్ ఇన్ ఇండియా 2015–16 పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు పత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్ స్వల్పంగా పెరిగింది. గురువారం ఇక్కడ రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) రూపొం దించిన ప్రెస్ ఇన్ ఇండియా 2015–16 పుస్తకాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రచురణలో ఉన్న పత్రికలు, మ్యాగజీన్ల వివరాలు, వాటి సర్క్యులేషన్ వివరాలను క్రోడీకరించి ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకంలోని వివరాల ప్రకారం 2015–16 ఆర్థిక సంవత్సరంలో తెలుగులో 856 దినపత్రికలు, 125 వారపత్రికలు, 130 పక్షపత్రికలు, 475 మాసపత్రికలు, 7 త్రైమాసిక పత్రికలు, ఒక వార్షిక పత్రిక, 5 పీరియాడికల్స్ ప్రచురితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,212, తెలంగాణ నుంచి 369, ఢిల్లీ, తమిళనాడులో 4 చొప్పున, కర్ణాటకలో 3 తెలుగు పత్రికలు ప్రచురితమయ్యాయి. తెలుగు పత్రికల సర్క్యులేషన్ 2014–15లో 2,72,01,064 ఉండగా.. 2015–16లో 2,76,45,134కు పెరిగింది. ఇందులో దినపత్రికలు, వార, పక్షపత్రికల సర్క్యులేషన్ 1,97,59,795గా ఉంది. మొత్తం 1,596 ప్రచురణ పత్రికల్లో 32 పెద్దవి, 364 మధ్యస్థ, 1,200 చిన్న విభాగం ప్రచురణలని ఆర్ఎన్ఐ తెలిపింది. 13 దినపత్రికలు, 3 పీరియాడికల్స్ లక్ష కాపీలకంటే ఎక్కువ సర్క్యులేషన్ కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా.. ఏపీ నుంచి వివిధ భాషల్లో 2,52,72,232 కాపీల సర్క్యులేషన్ ఉండగా.. ఇందులో తెలుగులో అత్యధికంగా 1,98,29,095 కాపీ లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దినపత్రికల విభాగంలో 235 ఆంగ్ల పత్రికలు, 26 హిందీ పత్రికలు, ఒక కన్నడ పత్రిక, ఒక ఒడియా పత్రిక, రెండు తమిళ పత్రికలు, 1,241 తెలుగు పత్రికలు, 182 ఉర్దూ పత్రికలు, 15 ద్విభాషా, 7 బహుళ భాషా పత్రికలు వెలువడుతున్నాయి. తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ 1,42,37,512గా ఉండగా ఆంగ్ల దినపత్రికల సర్క్యులేషన్ 32,42,118గా ఉంది. ఉర్దూ దినపత్రికల సర్క్యులేషన్ 7,02,711గా ఉంది. తెలంగాణ నుంచి ఇలా.. తెలంగాణ నుంచి వివిధ భాషల్లో 288 ప్రచురణలు వెలువడుతుండగా ఇందులో 105 దినపత్రికలు, 41 వారపత్రికలు, 24 పక్ష పత్రికలు, 111 మాసపత్రికలు, 3 త్రైమాసిక పత్రికలు ఉన్నాయి. వీటన్నింటి సర్క్యులేషన్ 1,15,24,357గా ఉంది. తెలుగు ప్రచురణల సర్క్యులేషన్ 76,42,177గా ఉండగా ఉర్దూ ప్రచురణల సర్క్యులేషన్ 16,14,125 కాపీలుగా ఉంది. ఆంగ్ల ప్రచురణల సర్క్యులేషన్ 15,88,561గా ఉంది. తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ 53,63,545, ఆంగ్ల దినపత్రికల సర్క్యులేషన్ 11,30,537గా, ఉర్దూ దినపత్రికల సర్క్యులేషన్ 9,73,610 గా ఉంది. హిందీ దినపత్రికల సర్క్యులేషన్ 5,61,944గా ఉంది. -
నోట్ దిస్ పాయింట్!
-
‘చంద్రబాబు పీఆర్వోగా వెంకయ్య’
అమరావతి : వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి స్థాయి నుంచి దిగజారి ముఖ్యమంత్రి చంద్రబాబుకి పీఆర్వోగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు రామకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకయ్యనాయుడు ఏం సాధించారని ప్రత్యేక విమానాల్లో వచ్చి మరీ సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో పదేళ్లు హోదా ఇప్పిస్తానని సన్మానాలు చేయించుకున్న వెంకయ్య ప్రస్తుతం ప్యాకేజీ పేరుతో రెండో కృష్ణుడి అవతారం ఎత్తి సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. విభజన బిల్లులో న్యాయం జరగలేదని, మేము న్యాయం చేస్తామని చెబుతూ సన్మానాలు చేయించుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పది శాతం మంది కూడా ప్యాకేజీకి ఆమోదం తెలపడం లేదని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి 2020 వరకు మాత్రమే పన్ను రాయితీలు ప్రకటించడంతో పెద్దగా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్యాకేజీపై రిఫరెండంగా మళ్లీ పోటీ చేయాలని రామకృష్ణ సవాల్ చేశారు. -
జయ పోరాట యోధురాలు
తమిళ ప్రజలకు సేవలు కొనసాగిస్తారు: కేంద్ర మంత్రి వెంకయ్య గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ జయకు ప్రముఖుల పరామర్శ.. అమ్మకు కొనసాగుతున్న చికిత్స సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పోరాట యోధురాలు అని, తమిళనాడు ప్రజలకు ఆమె సేవలు కొనసాగిస్తారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స వివరాలు తెలుసుకున్న వెంకయ్యనాయుడు, సోమవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యతలేదని, మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. జయకు జరుగుతున్న చికిత్స గురించి అపోలో డాక్టర్లు తనకు వివరించారని చెప్పారు. జయ ఆరోగ్యంగా తిరిగి వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు మంత్రి వర్గం ప్రభుత్వాన్ని నడుపుతుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విషయంలో జయ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రముఖుల పరామర్శ చికిత్స పొందుతున్న సీఎం జయలలితను పరామర్శించడానికి సోమవారం అపోలో ఆస్పత్రికి పలువురు ప్రముఖులు వచ్చారు. కేరళ గవర్నర్ పి. సదాశివం, ముఖ్యమంత్రి పి. విజయన్ ఆస్పత్రిలో సీఎండీ ప్రతాప్ రెడ్డిని చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయకు చికిత్సకు స్పందిస్తున్నారని డాక్టర్లు చెప్పారని మీడియాకు వారు వెల్లడించారు. త్వరలోనే ఆమె డిశ్చార్జి అవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కొనసాగుతున్న చికిత్స.. గత నెల 22న ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స కొనసాగుతోంది. ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ ఖిలానీ రెండు రోజుల నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేశారని అపోలో ఆస్పత్రి సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్ తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే వైద్యం కొనసాగించాలన్నారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస, యాంటీబయోటిక్స్‌తో పాటు పాసివ్ ఫిజియోథెరపీ చికిత్స చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, జయ త్వరగా కోలుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ధర్మపురి జిల్లాలో యాగం నిర్వహిస్తున్న మంత్రి అన్బళగన్ అకస్మాత్తుగా స్పృహకోల్పోయారు. కొద్దిసేపటికి తేరుకున్నారు. వదంతులపై ఇద్దరి అరెస్ట్ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఫేస్బుక్లో వదంతులు ప్రచారం చేయడంతో నామక్కల్‌కు చెందిన సతీష్‌కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను, మదురైకి చెందిన మాడస్వామి అనే వ్యక్తిని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరో 43 మందిపై కేసులు నమోదు చేశారు. -
ఏపీకి ఇస్తే మరో 9 రాష్ట్రాలు అడుగుతాయి
- ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు తిరుపతి అలిపిరి/గాంధీరోడ్డు : భౌగోళిక అంశాలను పక్కనబెట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరో 9 రాష్ట్రాలు హోదా ఇవ్వాలంటూ ముందుకు వస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై శనివారం తిరుపతిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. సరిహద్దు రాష్ట్రాలు, కొండప్రాంత్రాలు, అధిక శాతం గిరిజనులు, అన్ని విధాల వెనుకబడ్డ.. ఇలా నాలుగు అంశాను ప్రతిపాదికగా తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనకబడ్డ ప్రాంతంకాదని అందు వల్లే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించందన్నారు. తాను ఏపీ నుంచి ఎంపిక కాకపోయినా ప్రాంతీయ అభిమానంతోనే పట్టుబట్టి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చానన్నారు. తాను పట్టుబట్టకపోతే ఇది కూడా వచ్చేది కాదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజ సహేతుకంగా జరగలేదని, కాంగ్రెస్ అడ్డగోలు విభజన వల్లే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చడానికి కేంద్రం సిద్ధంగా వుందని వెంకయ్యనాయుడు చెప్పారు. హోదావల్ల వచ్చేది విదేశీ రుణ ప్రాజెక్టుల కేటాయింపుతో భర్తీ చేస్తున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్ వల్లే దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. పోలవరం పూర్తి చేయడంలో బీజేపీ విఫలం చెందిందని కాంగ్రెస్ విమర్శిస్తోందని, బిజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందన్నారు. 50 సంవత్సరాల పాటు అధికారంలో వున్న కాంగ్రెస్ పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుందని మరో మారు వెంకయ్య స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రస్థావించని సంస్థలను కూడా ఏపిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొందరు ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం దారుణమని, డబ్బును ఎవరైన పాచిన లడ్డూలతో పోలుస్తారా అంటూ వెంకయ్య మండి పడ్డారు. భారత సైన్యం విజయం గురించి ప్రస్తావిస్తూ సరిహద్దులను దాటి మూడు కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టిన వైనం సాహసోపేతమైనదని వర్ణించారు. సైనిక చర్యలను యావత్తు దేశం గర్విస్తోందన్నారు. ఈ సందర్భంగా భారతీయజనతాపార్టీ..టీడీపీ కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించాయి. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీ వాహన ర్యాలీ వెంకయ్యనాయుడు వెంట తిరుపతి వేదిక వరకూ అనుసరించాయి. రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు,ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ,ఎంపీ శివప్రసాద్,శాసనసభ్యులు,బీజేపీ, టీడీపీకి చెందిన పార్టీ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు రూ.1189కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ: వరదల బారిన పడిన తెలంగాణను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భారీగా వరదలు వచ్చి తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు ముఖ్యంగా హైదరాబాద్ ను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వరద తాలూకు నష్టాన్ని తెలంగాణ అంచనా వేసింది. ఈ వివరాలను మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి అందించారు. హైదరాబాద్ లో జరిగిన నష్టానికి రూ.1189 కోట్ల సాయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. మరోపక్క, అక్రమంగా నాలాలను సైతం ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీ కాంగ్రెస్‌కు మెహర్బానీలు
అదానీ, అంబానీలు కాంగ్రెస్‌కు మెహర్బానీలని, వారు కాంగ్రెస్ పాలనలోనే ఉద్భవించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయాలని రాజవంశానికి సంబంధించినవి అంటారు కానీ అవి దుష్ట పాలిటిక్స్ అని విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలసీ విధానం ప్రకారం ప్రధాని ఎలా పరిపాలించాలో మేడమే నిర్ణయిస్తారని, కానీ బీజేపీ పాలనలో ప్రధాని అధ్యక్షతన టీమ్ నిర్ణయిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అడుగు ముందుకు వేస్తే, మూడు అడుగులు వెనక్కి వేయాల్సిన భయానక పరిస్థితి నెలకొందన్నారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం జాతికి మొదటిస్థానం, తర్వాతనే పార్టీ అని పునరుద్ఘాటించారు. కేరళలోని కాలికట్‌లోని పబ్లిక్ ర్యాలీలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఉడి ఘటన అనంతరం మొదటిసారి కేరళలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ ఈ మీటింగ్ నిర్వహిస్తోంది. తీవ్రవాదానికి ఎలాంటి మతం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాని కొంతమంది ప్రజలు టెర్రరిజానికి మతం రంగు పూయాలని ప్రయత్నిస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతోనే ఈ ఘటనలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశాన్ని సమైక్యంగా, సమగ్రతగా ఉంచడంలో కేవలం బీజేపీనే సైద్ధాంతిక రాజకీయ పార్టీగా ఉందన్నారు. -
హోదాపై నేను అలా అనలేదు..
వేడిగా ఉన్నప్పుడే చట్టంలో చేర్చాలన్నాను: వెంకయ్యనాయుడు వివరణ సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదా విషయంలో తాను మాట్లాడిన మాటకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. ఈనెల 17న విజయవాడలో ప్రత్యేక ప్యాకేజీ అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ‘ఆ వేడిలో హోదా అన్నా..’ అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలను ‘సాక్షి’ అదే శీర్షికన ప్రచురించింది. అయితే విశాఖలో సీ ఫుడ్ ఇండియా ఇంటర్నేషనల్ షో సందర్భంగా శుక్రవారం వెంకయ్య మాట్లాడారు. ఆంగ్లంలో ప్రసంగిస్తున్న మంత్రి మధ్యలో తెలుగులోకి వచ్చారు. ‘వేడిలో హోదా అన్నానంటూ.. ఓ పత్రికలో రాశారు. వేడిలో నేనెందుకంటాను. వేడిగా ఉన్నప్పుడే దానిని (హోదాను) చట్టంలో చేర్చి ఉంటే సరిపోయేదన్నాను. ఆ రోజు పార్లమెంటులో తలుపులు మూశారు. దూరదర్శన్ ప్రసారాలు నిలిపేశారు. మైకులు ఆపేశారు. అన్నీ బంద్ చేశారు. ఆ సమయంలో నా వాయిస్ వినిపించాను. ఏపీ ప్రజల తరఫున ఆ రోజు నేను పార్లమెంటులో లేవనెత్తకపోతే ఎవరూ మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు. ఏపీ భవిష్యత్ అంధకార బంధురం అయి ఉండేది. ప్రజలు నేతలకంటే తెలివైనవారు. అన్నీ తెలుసుకుంటారు. నేనేమీ ఆందోళన చెందను..’ అంటూ ఆ అంశాన్ని ముగించారు. -
ప్రత్యేక హోదా లేదు.. అర్థం చేసుకోండి
-
ప్రత్యేక హోదా లేదు.. అర్థం చేసుకోండి: వెంకయ్య
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమపై కాంగ్రెస్ పార్టీకి విమర్శలు చేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండానే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. మొదటి కేబినెట్ భేటీలోనే తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టుకోసం ఏపీలో కలిపామని చెప్పారు. ఐదేళ్లలో రెవన్యూలోటు భర్తీ చేస్తామని తెలిపారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సు ప్రకారం 42శాతం రాష్ట్రాలకు బదలాయించాలని, ఈ సంఘం సిఫార్సు వల్లే ప్రత్యేక హోదా అనేది లేకుండా పోయిందని వివరించారు. విస్తృత చర్చల తర్వాతే ప్రత్యేక హోదాపై ఓ నిర్ణయానికి వచ్చామని, దీనిపై తాను వ్యక్తిగత అభిప్రాయం చెప్పకూడదని తెలిపారు. తెలుగు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. తెలుగు ప్రజలకు పోలవరం జీవనధార అని, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా చెప్పకపోవడంతో తాను స్వయంగా కొత్త ప్రభుత్వం రాగానే బిల్లులో చేర్చి ప్రత్యేకంగా ఆమోదింపజేయించానని అన్నారు. నిధుల విషయంలో రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండవని తెలిపారు. 34 ఏళ్లలో పూర్తికానీ ప్రాజెక్టు ఏడాదిన్నరలో ఎలా పూర్తవుతుందని, పోలవరానికయ్యే పూర్తి వ్యయం కేంద్రమే బరిస్తుందని, ఈ హామీకి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. తమ చిత్తశుద్ధికి పోలవరం తార్కాణమని అన్నారు. జోన్ అంశాన్ని రైల్వే శాఖ అధ్యయనం చేస్తోందని తెలిపారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నందుకే ఈ వివరణ ఇస్తున్నానని చెప్పారు. -
వెంకయ్యనాయుడు దళిత ద్రోహి : రామ్మూర్తి
తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు రామ్మూర్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దళిత ద్రోహి అని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని వెంకయ్య చెప్పడం సరికాదన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ సాధ్యం కాదని రెండు నెలల క్రితం కేంద్ర న్యాయ శాఖ మంత్రి తేల్చిన విషయం వెంకయ్యకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వెంకయ్యను మంత్రి పదవినుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మోదీ అంటే ఏంటి?
న్యూఢిల్లీ: What is Narendra Modi?(నరేంద్ర మోదీ అంటే ఏమిటి?) అని ఎవరిని అడిగినా.. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రివర్యుని నామధేయమని, పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని, ఊరు గుజరాత్ మెహసానా జిల్లాలోని వాద్ నగర్ అని.. మోద్ ఘన్చి తేలి(చమురు అద్దకం) వృత్తిదారులు కావడంతో 'మోదీ' వారి ఇంటిపేరుగా స్థిరపడిందని.. దామోదర్‌దాస్ ముల్చంద్, హీరాబెన్ మోదీల ఆరుగురు పిల్లల్లో మూడో సంతానమైన నరేంద్ర మోదీ చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసేవారని... ఇలా ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పగలరు. కానీ వీటన్నింటికంటే మిన్నగా మోదీని విశ్లేషించగల సామర్థ్యం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక్కరికే సొంతం. ఎలాగంటారా?.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ పథకం గురించి మనందరికి తెలిసిందే. దేశంలోని 500 నగరాల్లో ఆ పథకం తీసుకొచ్చిన మార్పులు, భవిష్యత్ కార్యాచరణ తదితర వివరాలను పొందుపరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సర్వే నిర్వహించింది. 'స్వచ్ఛ సర్వేక్షణ్' పేరుతో నిర్వహించిన ఆ సర్వే ప్రతులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఢిల్లీలో విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిననాడే మోదీ గారు చెప్పారు.. ఇది కచ్చితంగా ప్రజాఉద్యమంగా మారుతుందని. అవును. ఆయన ఊహించినట్లే ఇవ్వాళ స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. అదేదో ప్రభుత్వ కార్యక్రమంలా భావించకుండా ప్రజలంతా స్వచ్ఛ భారత్ ను తమదిగా స్వీకరించించారు. అందుకే నేనంటాను.. మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా (MODI means Making Of Developed India) అని! వాజపేయి హయాంలో భారత్ వెలిగిపోతోంది (షైనింగ్ ఇండియా) నినాదం తరహాలో వెలుగులోకి వచ్చిన మోదీ (మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా) నినాదం వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందోమరి! -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన
-
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన
న్యూఢిల్లీ: తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బరెడ్డిలు వెంకయ్యతో మాట్లాడిన విషయాన్ని మీడియాకు తెలిపారు. జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఎంపీలు 20న పార్లమెంట్ ముందుకు రానున్న ప్రైవేట్ బిల్లుకు కూడా బేషరతుగా మద్దతు పలకుతామన్నారు. తాము కూడా పలు మార్లు హోదా అంశాన్ని లేవనెత్తామని, 20న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇస్తామని, బిల్లు ఎవరు పెట్టారనేదానికంటే హోదా రావడమే తమకు ముఖ్యమని ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు. -
అమ్మకు సహకారం
* దేశాభివృద్ధిలో సమష్టిగా ముందుకు * తమిళనాట బీజేపీ భవిష్యత్ ఆశాజనకం * కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నైః తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి, ఇక పరస్పర సహకారమే తరువాయి అని కేంద్ర పట్టణ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అ న్నారు. చెన్నైలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ రాలేకపోయినందున ఆయన ప్రతినిధిగా తాను వచ్చానని తెలిపారు. అత్యద్భుత విజయాన్ని సాధించిన ఆమెను అభినందించానని తెలిపారు. గణనీయమైన ఓట్లను సాధించినా అసెంబ్లీలో బీజేపీ తన ఖాతాను తెరవలేక పోయిందని అన్నారు. ద్రవిడ పార్టీలు వేర్వేరుగా రంగంలో దిగడం వల్ల ఆశించిన ఫలితాలను తమ పార్టీ అందుకోలేక పోయిందని వివరించారు. అయినా బీజేపీకి రాష్ట్రం ఆశాజనకంగా మారిందని తెలిపారు. ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుందని టాస్మాక్ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ సీఎం జయలలిత తొలి సంతకం చేయడంపై వెంకయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగిసిపోయినందున రాజకీయాలకు ఇక తెరదించి, దేశాన్ని అభివృద్ది పథంవైపు నడిచేలా కలిసి సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. -
ప్రజలను మాయచేస్తున్న చంద్రబాబు
► ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీ లేదు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం : కేంద్ర ప్రభుత్వం నిధులను చంద్రన్న కానుకల పేరుతో ఖర్చు పెడుతూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు మాయ చేస్తూ మాయలపకీర్గా మారాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బాబు మోసం చేయడంలో ఆరితేరిన వ్యక్తి అన్నారు. స్థానిక ఇరిగేషన్ బంగ్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలకు పొంతన కుదర డం లేదన్నారు. రాష్ట్రానికి రూ.1.43 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు అడిగితే రూ.1,850 కోట్లు ఇచ్చినట్లు పత్రికల్లో తెలియజేశారన్నారు. అయితే సీఎం, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారన్నారు. అయితే కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులిచ్చామని చెబుతోందన్నారు. సీఎం వారిచ్చిన నిధుల వివరాలు చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నాడని, నిధులను పక్కదారి పట్టించాడా? అని ప్రశ్నించారు. కేంద్ర నిధులను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సొమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబుదా? కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రన్న కానుక, భువనేశ్వరి కానుక, లోకేష్ కానుకంటూ ప్రకటించుకోవడం చూస్తే సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ఉందని ప్రసన్న ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 13,14వ ఆర్థికసంఘం నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. అయితే వాటిని రాష్ట్ర నిధులతో చేసినట్లుగా సీఎం చెప్పుకోవడం , చంద్రన్న కానుకలుగా వివరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు, పథకాలకు ఎంతమేర నిధులు రాష్ట్రం తరఫున విడుదల చేశారో పత్రికల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాడని, ప్రస్తుతం ప్రజలు అంతా గమనించారని బాబు మాయమాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, 14వ ఆర్థిక కమిషన్ అడ్డుకుంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జి సిద్దార్థనాథ్‌సింగ్ ప్రకటించారని, అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమేనని ప్రసన్న అన్నారు. కమిషన్ ప్రత్యేక హోదా వద్దని ఎక్కడ చెప్పిందని ప్రశ్నించారు. ఒకవేళ వద్దని చెప్పినా కేంద్ర మంత్రి వర్గం సమావేశం పెట్టి హోదా ఇస్తున్నామని ఒకే ఒక వాక్యంతో తీర్మానం చేసే హక్కు కేంద్ర మంత్రిమండలికి ఉందన్నారు. మాట నిలబెట్టుకుంటారని మోదీ, వెంకయ్యనాయుడ్ని నమ్మితే వారు కూడా హోదాను పక్కదారి పట్టించి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లకు నమస్కారం చేయడం మినహా ప్రత్యేక హోదాపై సాధించేది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా వాసి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కలువ బాలశంకర్‌రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చీమల రమేష్‌బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధికార ప్రతినిధి షేక్ కరీముల్లా (బాబు), జిల్లా కార్యదర్శి షేక్ అల్లాబక్షు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పగుంట విజయభాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యుడు మేకల మాల్యాద్రి యాదవ్ పాల్గొన్నారు. -
మళ్లీ వెంకయ్యకే అవకాశం
రాజ్యసభ స్థానానికి సిఫార్సు చేసిన కర్ణాటక బీజేపీ సాక్షి, బెంగళూరు: రాష్ట్ర శాసనసభల నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరును కర్ణాటక బీజేపీ నాయకులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పెద్దలకు తెలపనున్నారు. శాసనసభ నుంచి శాసనమండలిలోని ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకోనుంది. ఆ స్థానం కోసం మాజీ మంత్రి సోమణ్ణతోపాటు బీజేపీ బెంగళూరు నగర అధ్యక్షుడు సుబ్బనరసింహ పేర్లను కోర్‌కమిటీ సిఫార్సు చేసింది. ఇద్దరిలో ఒకరి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయనున్నారు. జేడీఎస్ సహాయంతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని కోర్ కమిటీలో తీర్మానించారు. ఈ రెండో స్థానం కోసం మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు పేరును సూచించే అవకాశం ఉందని సమాచారం. -
ఆ నిధులపై శ్వేతపత్రం ప్రకటించండి
ఏపీ, తెలంగాణకు నిధుల మంజూరుపై కేంద్రాన్ని కోరిన సురవరం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ,ఏపీలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులపై కేంద్రం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్‌చేశారు. ప్రత్యేకహోదా కాకుండా ఏపీకి పెద్ద ఎత్తున సాయమందించినట్లు బీజేపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. కేం ద్రం నుంచి వచ్చే నిధులు, పన్నుల్లో రాష్ట్ర వాటాలు రావాల్సిందేనని, ఇదేదో వాళ్ల జేబుల్లోంచి ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో చేర్చడం లేదా సవరణలు చేయడంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిలతో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నియంతృత్వ పోకడల తో ఉందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తీవ్రప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దుచేసేలా కేం ద్రానికి అసాధారణమైన అధికారాలు కల్పించకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అత్యవసరంగా ఉపయోగిం చాల్సిన 356 ఆర్టికల్‌ను రాజకీయాల కోసం అమలుచేయ డం సరికాదన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి గుణపాఠం కావాలన్నారు. చర్చలతో కాలయాపన చేయకుండా వెంటనే కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయమాల్యాను గతంలో బీజేపీ ఏ ప్రాతిపదికన తమ ఓట్లతో రాజ్యసభకు పంపించిందో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సామాజిక, రాజకీయ కాలుష్యాన్ని విపరీతంగా వెదజల్లిందని విమర్శించారు. కేరళలో వామపక్షాల గెలుపునకు అనుకూల పరిస్థితులున్నాయన్నారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటనపై కొనసాగుతున్న ఉద్యమాన్ని పక్కదోవపట్టించేందుకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని హెచ్‌సీయూ జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేత వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిన్నటి వరకు ఉద్యమంలో ఉన్న రాజ్‌కుమార్ సాహుని బెదిరించి తమకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఈ ఘటనతో వీసీ వెనుక వెంకయ్యనాయుడు ఉన్నాడన్నది స్పష్టమైందన్నారు. ఏప్రిల్ 6న కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన సాహు అదేరోజు వీసీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఏప్రిల్ 12న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కరు మినహా 948 మంది విద్యార్థులు వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మరో నేత అర్పిత అన్నారు. సంజయ్ మాట్లాడుతూ ఉద్యమ అవసరాలకోసం పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పౌరసమాజం నుంచి ఆర్థిక సహాయం పొందారని, ప్రతిపైసా ఉద్యమానికే వినియోగించామన్నారు. ఆధారరహిత ఆరోపణలను పట్టుకొని మంత్రి వెంకయ్య నాయుడు హెచ్‌సీయూ విద్యార్థులను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వీసీ అప్పారావుకు పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయనను కాపడుతున్న వెంకయ్యనాయుడు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ఆమ్ఆద్మీ స్పాన్సర్డ్ ఉద్యమంగా ముద్రవేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావని, పాస్ చేయమని అధ్యాపకులు,వీసీ చేస్తున్న బెదిరింపులకు లొంగవద్దన్నారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
► ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని చంద్రబాబు ► వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి, భూమన ధ్వజం తిరుపతి మంగళం: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ నాడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సోనియాగాంధీకి పూర్తి సహకారం అందించిన ద్రోహి చంద్రబాబు అన్నారు. సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన హామీలు మరిచారా? అని ప్రశ్నించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడంతో రైతులు ప్రజలు సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొంత భాగం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఉంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాలు లాగా రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం జగనన్న చేపట్టే ప్రతి ఉద్యమంలో భాగస్వాములవుదామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ప్రాజెక్టులు పూర్తికావని, పరిశ్రమలు రాక యువతకు ఉద్యోగావకాశాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్రబాబు తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. తిరుపతి విమానాశ్రయంలో పెట్టిన కేసులు నిలవలేదని, రాజంపేటలో మళ్లీ అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు నీతిమాలిన రాకీయాలకు నిదర్శనమన్నారు. 10వతేదీ ధర్నాను విజయవంతం చేయండి ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 10వతేదీన చిత్తూరు కలెక్టరేట్ వద్ద, తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే ధర్నాతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టాలన్నారు. జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అనుబంధ సంస్థలు, అభిమానులతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు బీరేంద్రవర్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దుద్దేల బాబు, టి. రాజేంద్ర, పుల్లయ్య, సయ్యద్షఫీఖాదరీ, హరిప్రసాద్‌రెడ్డి, ఎస్కె. ఇమామ్, హనుమంత్‌నాయక్, కట్టా గోపీయాదవ్, ముద్రనారాయణ, చెలికం కుసుమ తదితరులు పాల్గొన్నారు. -
ఒట్టి మాటలే
► ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసిన కేంద్రం ► జిల్లా ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం ► మోదీ, చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టిన జనం ► జిల్లా ప్ర‘గతి’ ఇంతేనని ఆవేదన ఎట్టకేలకు బీజేపీ బండారం బయటపడింది. చంద్రబాబు చెప్పేవి ఒట్టి మాటలేనని తేలింది. ఆయన చేతలు ఓటి కుండలేనని రుజువైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో జిల్లా ప్రజానీకం భగ్గుమంటోంది. అనుభవజ్ఞుడని నమ్మి ఓటేస్తే.. చేతకాని తనంతో నిండా ముంచాడని వాపోతోంది. ఆయనొస్తే బాగుం టుందని భావిస్తే రాష్ట్రాన్ని అథోగతి పాల్జేస్తున్నారని యువత మండిపడుతోంది. ఆయనొస్తే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తే.. స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఆశలు అడియాశలయ్యాయని ఆందోళన చెందుతోంది. - సాక్షి నెట్వర్క్ అనుకున్నదే అయ్యింది.. భయపడిందే నిజమైంది. అవును.. నమ్మించి ముంచడంలో చంద్రబాబునాయుడుని మించిన వారు లేదని మరోసారి నిజమైంది. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రం ముందు తలొంచిన ఏపీ సీఎం అలసత్వాన్ని మోదీ ప్రభుత్వం అక్షరాల క్యాష్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా.. తేల్చేసింది. ఎంత మంది ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినా తాము తొలగ్గబోమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్లో కుండబద్దలు కొట్టారు. దీంతో హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లావాసులు భగ్గుమన్నారు. త మ ప్ర‘గతి’ ఇంతేనని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ దుస్థితి కారణమైన చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. ఇకపై కొత్త పరిశ్రమలు, పెట్టుబడిదారులు జిల్లాకు వచ్చే అవకాశం లేదని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతామని హెచ్చరించారు. బాబు అసమర్థతే.. ఎన్నికల సమయంలో శ్రీవారి సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుప్పిచ్చిన హామీలు ఏమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పిడంలో చంద్రబాబు అసమర్థత బట్టబయలైంది. ఓటుకు-నోటు కేసులో జైలుకు పంపుతారన్న భయంతో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్బాగ్యమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. -భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగు పడుతుంది. ఈ విషయం తెలిసినా సీఎం చంద్ర బాబు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు నోటుతోపాటు పలు అవినీతి కుంబకోణాల్లో చంద్రబాబు చిక్కుకు పోవడం వల్ల కేంద్రంపై ఒత్తిడి తేలేకున్నారు. స్వార్థ కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి సీఎం ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. రాష్ట్ర విభజన ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అడగలేక విభజించు పాలించు అన్నధోరణిలో బాబు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. టీడీపీ, బీజేపీ దొందూ దొందే. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయి. --డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్యే మదనపల్లె. హోదా కోసం ఆందోళన ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినందున టీడీపీ, బీజేపీతో పొత్తును విరమించుకోవాలి. రాష్ట్రానికి హోదా లేకుంటే ఆశించినంత అభివృద్ధి ఉండదు. చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రతి పక్షమైన వైఎస్సార్ సీపీ ప్రజలతో కలసి ఆందోళనకు దిగుతుంది.-చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, పీలేరు -
రేపు తళి నియోజక వర్గంలో వెంకయ్యనాయుడు ప్రచారం
డెంకణీకోట : తళి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బి.రామచంద్రన్‌ను బలపరుస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డెంకణీకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తళి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన హెలిక్యాప్టర్‌లో వచ్చి డెంకణీకోటలో దిగి 30వ తేదీ ఉదయం డెంకణీకోటలో జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారని తెలిపారు. తళి నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉన్నందు వల్ల వారి ఓటర్లను ఆకట్టుకోవటానికి బీజేపీ చేపట్టిన ప్రయత్నంలో భాగంగా వెంకయ్యనాయుడు ప్రచారం ఉంటుందన్నారు. -
వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ♦ చెరువులు, కుంటల కబ్జాతో వర్షపు నీరు ♦ వృథా అవుతోందన్న కేంద్ర మంత్రి ♦ ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు నిర్మించాలి ♦ హడ్కో నుంచి రాష్ట్రానికి మూడు అవార్డులు ♦ మెరుగైన మంచినీటి సరఫరాకు అవార్డు స్వీకరించిన కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో నీటి అవసరాలకోసం వర్షపు నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఇక్కడి ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో హడ్కో 46వ వ్యవస్థాపకదిన వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హడ్కో రుణ సాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో మంచినీటి సమస్యలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములను తప్పనిసరిగా నిర్మించాలని, ఈ విషయంలో చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, వాటిల్లో ఆక్రమణలను తొలగించకపోవడంతో వర్షం నీరు వృథాగా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి కోసం ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే వృథాగా పోతున్న ఆ నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని, నీటిని పొదుపుగా వాడేలా ప్రోత్సహించాలని, ఖాళీస్థలాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని పిలుపునిచ్చారు. అవార్డు స్వీకరించిన కేటీఆర్ ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు సంస్థ ద్వారా మెరుగైన రీతిలో మంచినీటిని సరఫరా చేయడమే కాకుండా, క్రమబద్ధీకరించిన పద్ధతిలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తూ, నీటి ఎద్దడి రాకుండా తీసుకున్న చర్యలకు గుర్తింపుగా హడ్కో ఇచ్చిన అవార్డును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు స్వీకరిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా ఫేజ్-3, గోదావరి ఫేజ్-1 ద్వారా హైదరాబాద్ అవసరాలకు సరిపోయేలా మంచి నీటిని సరఫరా చేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని ఇళ్లలోనూ ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా ఇంకు డు గుంతలు నిర్మించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కొత్తగా గుర్తించిన శివారు మున్సిపాలిటీల్లో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపారు. హడ్కో ద్వారా తీసుకున్న రూ. 3,500 కోట్ల రుణాన్ని ఈ పథకం కోసం పారదర్శకంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో హైదరాబాద్ పరిధిలో రోజుకు 150 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేసేవారమని, ప్రస్తుతం 350 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అవార్డు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు హడ్కో అందించిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అందుకున్నారు. అలాగే బలహీన వర్గాల వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలుగా వేగంగా రుణ పంపిణీ చేసినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ బి.ఆర్.జి. ఉపాధ్యాయ మరో అవార్డు అందుకున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ డెరైక్టర్ దాన కిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ను కాంగ్రెస్ రెండు సార్లు ఓడించింది
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శ్రీకాళహస్తి: పార్లమెంటుకు అంబేడ్కర్ రెండుసార్లు పోటీచేస్తే కాంగ్రెస్ ఆయన్ను ఓడించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయున చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియూతో వూట్లాడుతూ.. అంబేడ్కర్ కాంగ్రెస్ వ్యక్తి కాదని, వారే ఆయన్ను రెండుసార్లు ఓడించారన్నా రు.అంబేడ్కర్ జాతీయ సంపదని అభివర్ణించారు. ఆయన ఒక వర్గానికి చెందినవారు కాదన్నారు. టీ కొట్టు నడిపే వ్యక్తి నేడు ప్రధానిగా ఉన్నారంటే.. అంబేడ్కర్ మార్గమే కారణవుని చెప్పారు. -
కేంద్రీయ విద్యాలయ భవనానికి మోక్షం
► రేపు కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం ► శనివారం నుంచి నూతన భవనంలోనే తరగతులు ► విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు ► రవాణా సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు నెల్లూరు (టౌన్) : కేంద్రీయ విద్యాలయ భవనానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని కేంద్ర మంత్రి వెంక య్యనాయుడి చేతుల మీదుగా శనివారం ప్రారంభించనున్నారు. భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయిన విద్యుత్, రహదారి, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. కలెక్టర్ జానకి ప్రత్యేక చొరవ తీసుకుని సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయం ఉండగా, నెల్లూరులో రెండో విద్యాలయం ఏర్పాటు చేయడంలో కేంద్ర మంతి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి ఉంది. అయితే నెల్లూరులో ఆరేళ్లుగా ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. రూ.8.79 కోట్లతో భవన నిర్మాణం నెల్లూరులో కేంద్రీయ విద్యాలయం 2010లో మంజూరు కాగా, తొలుత 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహించారు. అనంతరం ఏటా ఒక్కో క్లాసును పెంచుతూ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉండగా, 480మందికిపైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో తాత్కాలికంగా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శాశ్వత భవనాన్ని రూ.8.79 కోట్ల వ్యయంతో పొదలకూరు రోడ్డులో జర్నలిస్టు కాలనీ వెనుక వైపునున్న 7.43 ఎకరాల్లో రెండు ఫ్లోర్లతో నిర్మించారు. భవనంలో మొత్తం 51 గదులను నిర్మించారు. ఇందులో 40 తరగతి గదులకు కేటాయించగా, మిగిలినవి ఆఫీసు, ఉపాధ్యాయులు, టాయ్‌లెట్స్, తదితర వాటికి వినియోగించనున్నారు. భవనం మధ్య భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వేదికను ఏర్పాటు చేశారు. క్రీడల కోసం బాస్కెట్‌బాల్, వాలీబాల్, కోకో, తదితర కోర్టులను నిర్మించారు. పొదలకూరు రోడ్డు నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లేందుకు జర్నలిస్టులకు కేటాయించిన 40అడుగుల రోడ్డును అనుమతించారు. శనివారం నుంచి నూతన భవనంలోనే తరగతులు కేంద్రీయ విద్యాలయం తరగతులను శనివారం నుంచి నూతన భవనంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఉన్న ఫర్నిచర్‌ను అక్కడకి తరలించనున్నారు. నూతన భవనంలో మార్చిన తరువాత ఒక్కో తరగతిని రెండు సెక్షన్లుగా విభజించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం 1నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్లను ఏర్పాటు చేయునున్నట్లు తెలిసింది. మిగిలిన తరగతులను రెండు సెక్షన్లుగా ఏర్పాటు చేస్తే మరికొంత మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు తప్పని రవాణా కష్టాలు నూతన భవనంలోకి కేంద్రీయ విద్యాలయాన్ని మార్చడం వల్ల విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం విద్యాలయం తరఫున ఎలాంటి వాహనాలు లేవు. విద్యార్థులు సొంత వాహనాల్లో స్కూలుకు వెళ్తున్నారు. నగరం నుంచి నూతన భవనం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగర శివారులో నిర్మించిన భవనం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి వాహన సౌకర్యం లేదు. సిటీ బస్సులు కొత్తూరు వరకు మాత్రమే ఉన్నాయి. సిటీ బస్సులను కేంద్రీయ విద్యాలయం వరకు పొడిగించాలని విద్యార్థుల తల్లి, దండ్రులు కోరుతున్నారు. వీటితో పాటు పొదలకూరు వైపు వెళ్లే తెలుగు- వెలుగు బస్సులకు కేంద్రీయ విద్యాలయం రహదారి వద్ద స్టాఫింగ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
కలసి పనిచేస్తేనే అభివృద్ధి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్(ఎలిప్) సంస్థ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీం కింద మహిళలకు నైపుణ్యం పెంపుదలపై శిక్షణ ఇచ్చింది. ఆదివారం విజయవాడ ఎన్ఏసీ కల్యాణమండపంలో ఎలిప్ వందేమాతరం-జెండర్ సమానత్వం కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని, అందుకోసమే పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు మహిళల పేరుతోనే టైటిల్ డీడ్ ఇస్తున్నామన్నారు. -
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే
ఆకివీడు/తాడేపల్లిగూడెం : తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపుపై చర్చలు జరుగుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. పెంపు ఎలా జరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి వంటి విషయాలపై చర్చసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగైదు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించింది. దీంతో జనాభా ప్రాతిపదికన విభజన జరుగుతుందా? లేక భౌగోళిక పరిస్థితులను బట్టి చేస్తారా? అనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే జిల్లాకు ఐదు కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు మండలాలు కుకునూరు, వేలేరుపాడు జిల్లాలో కలిశాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 48కి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం రెండుగా చీలే అవకాశం ఉందనే వాదన వినబడుతోంది. గత విభజన లోపభూయిష్టం గతంలో 2009కి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి. భౌగోళికంగా పెద్ద మండలాలను, దూరంగా ఉన్న మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేశారనే వాదనలు వినిపించాయి. ఉండి, భీమవరం నియోజకవర్గాల కూర్పు ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఉండి నియోజకవర్గంలో భాగమైన పాలకోడేరు మండలం భౌగోళికంగా ఓ మూలన దూరంగా ఉంటుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో చేర్చిన వీరవాసరం మండలం, భీమవరం పట్టణానికి మధ్య మరో మండలం ఉంది. దానిని వేరే నియోజకవర్గంలో చేర్చడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలోనే మిగిలిన నియోజకవర్గాలూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ప్రజలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పునర్విభజన సమయంలో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా, ఆ సంఖ్యను 15కి కుందించారు. అప్పట్లో అత్తిలి, పెనుగొండ నియోజకవర్గాలు అంతర్ధానమయ్యాయి. ఈ నియోజకవర్గాల్లోని మండలాలను తణుకు, ఉంగుటూరు, ఆచంట నియోజకవర్గాల్లో కలిపారు. దీంతో సామాజిక బలాబలాల్లోనూ తేడాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా.. శాస్త్రీయంగా పునర్విభజన చేపట్టాలని రాజకీయవర్గాలతోపాటు ప్రజలు కోరుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. నియోజకవర్గాలు చిక్కే అవకాశం ! పునర్విభజన జరిగితే పాత నియోజకవర్గాలు చిక్కిపోతాయనే భావన వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం పరిధి తగ్గిపోతుందని, ఆ మండలంలోని డెల్టా ప్రాంత గ్రామాలు, పెంటపాడు మండలంలోని 13 గ్రామాలు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో కలిసి నియోజకవర్గంగా ఏర్పడవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను విడదీసి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలతోపాటు, తాడేపల్లిగూడెం మండలంలోని అడ్డరోడ్డుగా పేరున్న గ్రామాలను కలిపి ద్వారకాతిరుమల నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. గాలిపటం తోకల్లా నియోజకవర్గాల విభజన గాలి పటం తోకల్లా ఉండకూడదు. ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విభజన ప్రక్రియ చేయవద్దు. నియోజకవర్గానికి దగ్గరలోని గ్రామాలన్నింటినీ కలుపుకోవాలి. భౌగోళిక పరిస్థితులు ముఖ్యం. -మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి సాధ్యమే నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయవచ్చు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం 20 ఏళ్లకొకసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నియోజకవర్గాలను పెంచాలని కోరాయి. దీనికి కేంద్రం స్పందించి వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో ఎన్నికల కమిషన్ దానిని అమలు జరుపుతుంది. -యర్రా నారాయణస్వామి, రాజ్యసభ మాజీ సభ్యులు -
ఈనెల 25 నుంచే పార్లమెంట్
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ఈనెల 25 నుంచే ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం తెలిపారు. వాస్తవానికి ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మలి విడత సమావేశాలు ఈనెల 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయి. అయితే ఉత్తరాఖండ్ బడ్జెట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీలుగా పార్లమెంట్ ఉభయసభలను గత వారంలో ప్రొరోగ్ చేశారు. దాంతో బడ్జెట్ మలి విడత తేదీలపై సందిగ్ధత ఏర్పడింది. అయితే ఐడబ్ల్యూపీసీ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య పార్లమెంట్ సమావేశాల తేదీలపై స్పష్టత ఇచ్చారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయన్నారు. చట్టాలు రూపొందించే అత్యున్నత సంస్థ పార్లమెంట్ అని చెబుతూ, 2014 నుంచి పార్లమెంట్ పనితీరులో మిశ్రమ అనుభవాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటూ పార్లమెంటరీ కమిటీ సిఫారసులపై ఆలోచన చేస్తున్నామన్నారు. ‘అది మంచి ఆలోచనే కానీ ఆచరణ సాధ్యం కాద’ంటూ పార్టీలు ఆ సిఫారసులపై స్పందించాయన్నారు. -
అసెంబ్లీ సీట్ల పెంపునకు చర్యలు
♦ త్వరలో ప్రక్రియను ప్రారంభించనున్న కేంద్రం ♦ కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే ప్రక్రియను కేంద్రహోంశాఖ త్వరలో చేపట్టనుంది. అసెంబ్లీ స్థానాల పెంపు విషయంపై కూలంకషంగా చర్చించడానికి ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారమిక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎం.వెంకయ్యనాయుడుతోపాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు, కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశానంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. న్యాయమంత్రిత్వశాఖ నుంచి రాతపూర్వక అభిప్రాయాన్ని సేకరించి అసెంబ్లీ స్థానాలసంఖ్యను పెంచడానికి వీలుగా ఏపీ విభజన చట్టంలో మార్పులు తెచ్చేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. న్యాయశాఖ అభిప్రాయం కోరుతూ హోంశాఖ ఒకటి, రెండు రోజుల్లో లేఖ రాస్తుందన్నారు. దీనిపై న్యాయశాఖ.. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నాక మద్దతు తెలుపుతూ హోంశాఖకు పంపిస్తుందని, అప్పుడు ఏపీ విభజన చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును హోంశాఖ రూపొందిస్తుందని వివరించారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. విభజన చట్టంలో ప్రత్యేకించి సెక్షన్ 26 ప్రకారం ఏపీ అసెంబ్లీలో స్థానాలసంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారని, కానీ అదేచట్టంలో రాజ్యాంగంలోని 175వ అధికరణం ప్రకారం.. అని ఒకమాట చెప్పడంతో దీనిపై రెండురకాల వాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. దీంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే కూలంకషంగా చర్చించి, ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అసెంబ్లీ స్థానాలసంఖ్య పెంపుపై రెండు రాష్ట్రాల్లోనూ భిన్నాభిప్రాయం లేదని, చట్టంలో పేర్కొన్న మేరకు సవరించాలని కేంద్రానికి లేఖలు రాశాయని చెప్పారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖ పరిశీలన హైకోర్టు విభజనను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని తెలంగాణకు చెందినవారు ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడతారు, దేశంలో స్వేచ్ఛ ఉంది.. ఎమర్జెన్సీ లేదని ఆయన బదులిచ్చారు. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం స్థూలంగా అనుకూలంగా ఉందని న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. పాలనాపరంగా ఉన్న విషయాలను న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. -
వెంకయ్యకు నారాయణ కౌంటర్
హైదరాబాద్: చైనా, పాకిస్తాన్, రష్యా దేశాల సిద్ధాంతాలను భారత్ లో అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలను ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు సీసీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ధీటుగా బదులిచ్చారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ బీజేపీకో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికో పరిమితం కాదని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల ప్రాంగణాలను రాజకీయం వద్దని చెబుతున్న వెంకయ్య నాయుడు తన గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో నారాయణ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భావప్రకటన అంటే 'అదేదో వారి గుత్తసొత్తు' గా ఉన్నట్టు అర్థమవుతుందని విమర్శించారు. భావప్రకటనను ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ ఎటువంటి త్యాగాలు చేయని ఆర్ఎస్ఎస్ వారు దేశభక్తులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పినంత మాత్రాన నిజమై పోతుందనుకుంటే పొరబాటవుతుందని, అఫ్జల్‌గురు అంశానికీ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు సంబంధం లేదని పదేపదే చెప్పినా వెంకయ్య నాయుడు పాతపాటే పాడుతున్నారని నారాయణ విమర్శిచారు. కన్హయ్య ఏనాడూ దేశ వ్యతిరేక శక్తులను సమర్థించలేదని, అయినా బీజేపీ నేతలు పదేపదే అదే ఆరోపణ చేస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తే ప్రజలే తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
విద్రోహశక్తులతో దేశ సమగ్రతకు ముుప్పు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ(గుణదల) : విదేశీ సిద్ధాంతాలను భారతదేశంపై ప్రయోగిస్తున్నారని, అందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వంత పాడుతున్నాయని, దేశ సమగ్రతను బలహీనపరచటానికి కొన్ని జాతి విద్రోహ శక్తులు కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రయత్నిస్తున్నాయని వాటిని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం ఎన్టీయార్ యూనివర్సిటీ సమీపంలోని వెన్యూ ఫంక్షన్హాల్లో ‘అమరవీరులకు అవమానం-దేశం సహించదు’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచటానికి కేంద్రం కృషి చేస్తుంటే కాంగ్రెస్, వామపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఆయా పార్టీలు చైనా, పాకిస్తాన్, రష్యా దేశాల సిద్ధాంతాలను మన దేశంలో అమలు చేసేందుకు దళితులను, మతం పేరుతో మైనార్టీలను విభజిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లాంటి నేతలతో ఉగ్రవాదంతో మిళితమైన నాయకులను పోల్చటం అవమానకరమన్నారు. దేశ సమగ్రతను బలహీన పరచటానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరంతరం శ్రమిస్తున్నారని విమర్శించారు. మోడీ అభివృద్దిని భరించలేక ఆయా పార్టీలు విద్యార్థులను వినియోంచుకుని లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో 740 యూనివర్సిటీలకుగాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ జేఎన్‌యూలో మాత్రమే ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేశారని, ఇలాంటి తప్పుడు సంకేతాలిస్తున్న పార్టీలను ప్రజలు తిరస్కరించారని కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో గత 10 ఏళ్లుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే మోడీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ క్రమ శిక్షణ కలిగిన సంస్థలని, తాను విద్యార్థి నాయకునిగా ఏబీవీపీలో పని చేసి కేంద్ర స్థాయికి ఎదిగానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అంటే రెడీ టూ సోషల్ సర్వీస్ అన్ని అర్థాన్ని ఇచ్చారు. భారతమాతాకీ జై అంటే భారత ప్రజలు వర్థిల్లాలనే నినాదమని వివరించారు. కమ్యునిజంలో నిజం లేదని, కమ్యూనిస్టు నాయకులు నిరంతరం సినీతారలు, వస్త్రధారణ గురించే చర్చిస్తుంటారని, కన్హయ్య భావ దరిద్రుడని విమర్శించారు. దేశ రక్షణ కోసం ప్రతి కుటుంబం నుంచి ఓ యువకుడ్ని జాతికి అంతితమివ్వాలని కోరారు. సభ జరుగుతున్నంత సేపూ భారతమాతాకీ జై అనే నినాదాలతో హాలు దద్దరిల్లింది. కార్యక్రమంలో మాజీ మంత్రి భాజపా నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా ఎస్సీ మెర్చ రాష్ర్ట అధ్యక్షులు దారా సాంబయ్య, మైనార్టీ విభాగం నాయకులు షేక్ భాష, పార్టీ నగర ఉపాధ్యక్షులు దాసం ఉమామహేశ్వరరాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
జేపీ నిర్ణయం అభినందనీయం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీః ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ నిర్ణయించడాన్ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ప్రారంభ సందర్భంలో ఇష్టాగోష్టిగా చర్చించినప్పుడు కొత్త పార్టీ స్థాపించి దానిని విజయపథంలోకి తీసుకెళ్లడం అంత సులభం కాదనీ, ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ముందుకెళితే మరింత ప్రభావం ఉంటుందని తాను సూచించినట్టు వివరించారు. రాజకీయం ద్వారానే మార్పు వస్తుందని ఆనాడు భావించారని, ఇప్పుడు ఆ అభిప్రాయం వేరుగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా చైతన్యం కలిగించి సంబంధిత వ్యవస్థలపై మార్పు కోసం ఒత్తిడి తేవడం ఆహ్వానించదగిన పరిణామమని, జేపీ నిర్ణయం ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగపడగలదని భావిస్తున్నానని చెప్పారు. -
ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంగోపాల్‌పేట్: గొంతుమీద కత్తిపెట్టినా భరతమాతకు జై అనబోమని కొంత మంది అంటున్నారని భరతమాతకు జై అంటే అమ్మకు జై అన్నట్లేనని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ విదేశాలకు ఊడిగం చేసే వారికి అలా అనే హక్కు ఎవరిచ్చారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ‘అయామ్ డోనర్’ పేరుతో రూపొందించిన రక్తదాన యాప్‌ను, ట్రస్టు వెబ్‌సైట్‌ను, లోగోను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..స్వాతంత్య్ర ఉద్యమంలో జాతి నేతలు వందేమాతరం అన్నారని అంటే మాతా నీకు వందనం అని అర్థమని అన్నారు. ఆనాడు ఖాసీం రజ్వీ తెలంగాణలో ఎన్నో అరాచకాలు చేశాడని ఆయన కూడా భారతమాతకు జై అనలేక పాకిస్తాన్ వెళ్లిపోయాడని గుర్తు చేశారు. అలాంటి వారసత్వంలో వచ్చిన మత ఛాందసవాద సంస్థలు మతం పేరుతో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్న వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే వర్సిటీని కొంత మంది రాజకీయ తీర్థయాత్రలా మార్చివేశారన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలేంటి, కారకులు ఎవరు అనేదానిని విశ్లేషించాల్సింది పోయి కేవలం తమను నిందించేందుకు వాడుకున్నారని అన్నారు. అప్జల్‌గురు, యాకుబ్ మెమెన్‌లకు కీర్తించ డం జాతి వ్యతిరేక చర్య అని ఆయన ఖండించారు. దేశంలో 740 యూనివర్శిటీలు ఉండగా, అందులో 3, 4 యూనివర్శిటీల్లో మాత్రమే ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటుండటం దురదృష్టకరమని అన్నారు. త్వరలో ఉజ్వల పథకం కింద దేశంలో 5కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందించనున్నామన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు లక్ష్మణ్ పార్టీకి, సమాజానికి అందించిన సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ టీవీ నారాయణ, కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ శోభానాయుడులను ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ జడ్జి సీవీ రాములు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో ముఖ్యమంత్రి విఫలం
రాయలసీమ సమగ్రాభివృద్ధి బస్సుయాత్రలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దికెర: కేంద్ర నుంచి వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలయమ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబుల కొండారెడ్డి విమర్శించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఉభయ కమ్యూనిస్టులు చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మద్దికెరకు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయాంచాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మేల్యేలు టీఆర్ఎస్లో చేరుతుంటే కేసీఆర్ సంతలో పశువులను కొన్నట్లు మా ఎమ్మెల్యేలను కొంటున్నాడని ఆరోపించిన చంద్రబాబు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మాని ఏపీని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు రామచంద్రయ్య, భీమలింగప్ప, నబిరసూల్, షడ్రక్, ప్రభాకర్‌రెడ్డి,రామాంజనేయులు, సీపీఐ మండల కార్యదర్శి హనుమప్ప తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కేంద్రంగా సింహపురి
♦ కేంద్రం సహకారంతో విద్యుత్ కొరతను అధిగమించాం ♦ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి ♦ నెల్లూరు జిల్లాలో ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(టౌన్) /ముత్తుకూరు: భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ‘పవర్’ బ్యాంక్ అయితే.. రాష్ట్రానికి నెల్లూరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్కో రూ.12,300 కోట్లతో 1,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రాన్ని ఆయన శనివారం కేంద్ర మంత్రులతో కలసి జాతికి అంకితం చేశారు. రెండోదశలో రూ.4,276 కోట్ల అంచనాతో నిర్మించనున్న 800 మెగావాట్ల మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ జెన్కో పరిపాలనా భవానాన్ని ప్రారంభించారు. నేలటూరులో బహిరంగ సభ, గాయత్రి పవర్ ప్లాంట్‌లో పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర విభజన తరువాత కేంద్రం సహకారంతో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను అధిగమించామని చెప్పారు. ప్రతి ఇంటికీ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సౌర, పవన విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒక్కపైసా కూడా అవినీతి జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. ‘పవర్’ ఫుల్‌గా ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ‘పవర్’ ఫుల్‌గా అవతరించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏర్పడనుందన్నారు. 2022 నాటికి దేశంలో ఇళ్లులేని వారు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు 1.93 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు నెలలో అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులశాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ , ప్రకాశ్ జవదేకర్, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు. సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ ప్రారంభం పరిశ్రమల ఏర్పాటు ద్వారా సింగపూర్‌కు చెందిన ‘సెంబ్‌కార్ప్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో విస్తరించిందని ఆ సంస్థ చైర్మన్ ఆంగ్ కాంగ్ హువా తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో 2,640 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ‘సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ కాంప్లెక్స్’ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. సెంబ్‌కార్ప్ సీఈఓ టాంగ్ కిన్ఫె మాట్లాడుతూ... భారత్‌లోని ఏడు రాష్ట్రాల్లో తమ సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. గాయత్రి సంస్థ ఎండీ సందీప్‌రెడ్డి మాట్లాడుతూ... సెంబ్‌కార్ప్ సంస్థతో తాము సంయుక్తంగా రూ.20,000 కోట్లతో నేలటూరులో 2,640 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు నిర్మించామన్నారు. -
'అవును ఆరెస్సెస్ వల్లే రాజకీయాల్లోకి..'
న్యూఢిల్లీ: తమపై ఆరెస్సెస్ ప్రభావం ఉందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారు. తమపై ఆరెస్సెస్ ప్రభావం ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నామని, అందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని సమర్థించుకున్నారు. ఈ విషయం చెప్పడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో ప్రతిపక్షాలు ఆరెస్సెస్ చేసిన దాడిని ఆయన ఈ విధంగా తిప్పికొట్టారు. ఎప్పుడు ఆరెస్సెస్‌తో లింక్ పెట్టి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన వాటిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఆయన నేరుగా ప్రతిపక్షాల విసుర్లకు సమాధానం చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తారు. -
అన్నీ ఆవిష్కరణలే
హ చిలకలూరిపేటలో రూ.517.51 కోట్ల పనులకు పునాది హ హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చిలకలూరిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పర్యటన గురువారం ‘అన్నీ ఆవిష్కరణలే’ అన్నట్టుగా సాగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం రూ. 517.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పైలాన్లు ఆవిష్కరించారు. తొలుత హెలికాప్టర్ దిగిన సీఎం, కేంద్రమంత్రి పురుషోత్తమపట్నం వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్డిని పరిశీలించారు. రూ.23.08 కోట్లతో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్ పథకం’కు సంబంధించిన పైలాన్‌ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతంగా ప్రకటించారు. శారద హైస్కూల్ రోడ్డులో రూ.1.40 కోట్లతో ఆధునికీకరించిన శ్మశానవాటిక శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ నూతన భవన సముదాయాన్నీప్రారంభించారు. పట్టణ మౌలిక వసతులు, మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ.143 కోట్లతో చేపట్టనున్న పనుల కోసం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలి... ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద రూ.248.16 కోట్లతో 52.66 ఎకరాల్లో 4,512 జీప్లస్ -3 గృహ నిర్మాణ పనులకు సంబంధించి నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దీని పక్కనే రూ. 15 కోట్లతో చేపట్టే కల్చరల్ అకాడమీ హాలు, రూ.2.16 కోట్లతో శ్మశానాల అభివృద్ధి పనులు, 13వ ఆర్థిక సంఘం, ప్రణాళిక, ప్రణాళికేతర, ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్, మున్సిపల్ నిధులతో రూ.20.16 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకు లింకేజీ రుణాలు రూ.65.95 కోట్లకు సంబంధించిన చెక్కును మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. రూ. 45 కోట్లు కేటాయించాలి : మంత్రి ప్రత్తిపాటి సీఎం కాన్వాయ్ కళామందిర్ సెంటర్‌కు చేరుకోగానే మక్కామసీదు వద్ద వేచి ఉన్న అంజుమన్ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిని వెండి కిరీటాలతో సత్కరించారు. అండర్ డ్రైనేజీ విధానానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో 33 గ్రామాలకు మంచినీటి కొరత లేకుండా చే సేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా కోరారు. -
ఎన్డీఏతోనే గ్రేటర్ అభివృద్ధి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అల్వాల్ : బీజేపి, టీడీపీతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని వెంకటాపురం డివిజన్లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్డీఏ హయాంలోనే నగర అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ది కన్నా ప్రచారంపైనే అధికంగా దృష్టి సారించిందన్నారు. ప్రతిపక్షాలు మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. నగరంలో ఐఎస్ఐఎస్ కదలికలు అధికమయ్యాయన్నారు. సెంట్రల్ యూనివర్సిటిలో జరిగిన సంఘటనను ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రేటర్ మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఉందన్నారు. ఇందుకు గ్రేటర్లో బీజేపీ మిత్రపక్షాల కూటమి విజయం సాధించాల్సిన అవసరముందన్నారు. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ధూంధాం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మచ్చబొల్లారం అభ్యర్ధి చిట్టిబాబు, వెంకటాపురం అభ్యర్ధి జగదీష్, అల్వాల్ అభ్యర్ధి తాళ్ల సౌజన్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
-
అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏజీకి నివేదిస్తాం
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి * రాజ్యసభ ఎంపీల లాటరీపై ఓ అవగాహనకు.. * ఆ గ్రామాలను తెలంగాణలో ఉంచాలనడం సబబే * పలు సమస్యలపై వెంకయ్యతో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపుపై అటార్నీ జనరల్‌కు నివేదించనున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని న్యాయ శాఖకు తెలియజేస్తారని, దాని ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై తదుపరి నిర్ణయముంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, వినోద్ గురువారమిక్కడ వెంకయ్యతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచుకోడానికి విభజన చట్టంలో వీలున్నప్పటికీ స్పష్టత లేదు. పాత జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై ఎంత వరకు చట్టబద్ధత ఉంటుందనే దానిపై చర్చించాం. అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రానికి అభ్యంతరం లేదు. ఇతర రాష్ట్రాలు ప్రశ్నించకుండా చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం’ అని వెంకయ్య చెప్పారు. విభజన సమయంలో జరిగిన పొరపాటు వల్ల తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులను ఏపీకి, ఏపీకి చెందిన వారిని తెలంగాణకు లాటరీ పద్ధతిలో కేటాయించడం వల్ల వచ్చిన సమస్యపై ఓ అవగాహనకు వచ్చినట్లు వెంకయ్య తెలిపారు. రెండు రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్‌తో పాటు ఏపీ, తెలంగాణ సీఎంలతో మాట్లాడి పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అవకాశాలను వివరిస్తానన్నారు. అలాగే పోలవరం ముంపు దృష్ట్యా ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరడం సహేతుకంగానే అనిపిస్తోందని వెంకయ్య చెప్పారు. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారానికి వస్తే న్యాయ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. తెలుగుభాషను పరిరక్షించుకోవాలి మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఆంధ్రా అసోసియేషన్ రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌ను గురువారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగు భాష తెరమరుగవడానికి చేస్తున్న చర్యలు సరికాదన్నారు. 17న సంక్రాంతి సంబరాల విందు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, లహరి, నజీర్‌జాన్, రామ్ గణేష్, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అసమానతలు మంచిది కాదు
నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్య నరసరావుపేట వెస్ట్: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చేందుకు యత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల రెండోరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కొన్ని పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడుతూ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారు మైనార్టీల కోసం నిజంగా శ్రమించి ఉంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మైనార్టీలు ఇంకా పేదవారిగానే ఎందుకున్నారని ప్రశ్నించారు. పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి జాతీయ రహదారుల కింద రూ.65 వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల, మంత్రి కామినేని , ఎంపీ రాయపాటి ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వెంకయ్య నాయుడుతో బిల్ గేట్స్ భేటీ
న్యూఢిల్లీ: పరిశుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి అవసరమైన సాయాన్ని అందిస్తానని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ స్పష్టంచేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయడుతో బిల్‌గేట్స్ భేటీ అయ్యారు. తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలలో 'స్వచ్ఛ భారత్'లో భాగస్వాములవ్వడం ఓ ఉత్తమ పని అంటూ వ్యాఖ్యానించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సమావేశంలో భారత్‌లో పట్టణాలలో పరిశుభ్రత కోసం చేపట్టిన కార్యక్రమాలను, వాటి పనితీరును కేంద్ర మంత్రి వెంకయ్య వివరించారు. ఈ ఫౌండేషన్ వారు స్వచ్ఛ భారత్ మిషన్‌కు చేయూత అందించేందుకు ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్న విషయం విదితమే. ఆఫ్రికాలో భారీ ఎత్తున వ్యక్తిగత టాయిలెట్లు నిర్మించినప్పటికీ వాటి వాడకం మాత్రం మామూలుగానే ఉందని బిల్ గేట్స్ గుర్తుచేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచుతామని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. -
‘అసహనం’ శతాబ్దపు జోక్
కాంగ్రెస్‌పై వెంకయ్య విమర్శలు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సహనశీలత తగ్గిందని ఆరోపిస్తూ కాంగ్రెస్.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాననడం శతాబ్దపు జోక్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. సహనశీలతపై బీజేపీకి కాంగ్రెస్ బోధించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని సోమవారమిక్కడ అన్నారు. కులమతాలను ఉపయోగించి దేశంలో విభజన రాజకీయాలకు కాంగ్రెస్ బీజం వేసిందని, మతోన్మాదశక్తులను పోషించిన కాంగ్రెస్ సహనశీలతను ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఎమర్జెన్సీ విధించి, ప్రతిపక్షాన్ని జైల్లో నిర్భంధించి, సిక్కుల ఊచకోతకు పాల్పడిందెవరో చెప్పాక సహనశీలతపై ప్రవచనాలు చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. సమగ్ర అభివృద్ధి అజెండాతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. -
హోదాతోనే అన్నీ పరిష్కారం కావు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందనీ ఇందులో సందేహపడాల్సింది ఏమీ లేదని అయితే ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారం కావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో వ్యర్థాల నిర్వహణపై సీఐఐ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక హోదాపై అధ్యయనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌ను ఆదేశించారన్నారు. ప్రతిపక్షాలు ప్రత్యేక హోదాపై ఆరోపణలు చేయడం అర్థరహితమని దుయ్యబట్టారు. వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తికి మరింత సాంకేతికత అవసరమని చెప్పారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని అప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు స్వచ్ఛ భారత్‌ను మెరుగ్గా నిర్వహిస్తున్నాయని ప్రశంసించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా 16 విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అందులో భాగంగా నల్లగొండ, హైదరాబాద్‌లో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ పట్టణాల కింద తెలంగాణలో సిద్దిపేట, ఆంధ్రప్రదేశ్‌లో కావలి, శ్రీకాళహస్తిని ఎంపిక చేసినట్లు చెప్పారు. అమరావతిని ప్రత్యేక కేటగిరి కింద స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వాలకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. -
నెల్లూరు త్యాగయ్య.. సాంబమూర్తి
♦ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ♦ నెల్లూరులో ఎస్పీ బాలు తండ్రి సాంబమూర్తి విగ్రహావిష్కరణ ♦ హాజరైన కమల్‌హాసన్, కె.విశ్వనాథ్ నెల్లూరు (బాలాజీనగర్): భిక్షాటనతో త్యాగరాజ సంకీర్తనలను పరిచయం చేసేందుకు జీవితాన్ని అంకితం చేసిన సాంబమూర్తి నెల్లూరు త్యాగయ్యగా చరిత్రలో నిలిచారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నెల్లూరులోని శ్రీవేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్ర ప్రాంగణంలో శనివారం సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి విగ్రహాన్ని ఆయన సతీమణి శకుంతలమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాబోయే సంగీత తరాలకు సాంబమూర్తి స్ఫూర్తి, ప్రేరణగా నిలిచారని చెప్పారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, తెలుగు సినిమా ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ‘శంకరాభరణం’ చిత్రం కథ విని పచ్చజెండా ఊపింది బాబాయి సాంబమూర్తేనని తెలిపారు. సినీనటుడు కమల్‌హాసన్ మాట్లాడుతూ తన ప్రతి విజయం వెనుక బాలసుబ్రహ్మణ్యం ఉన్నారని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడు తూ తన గాత్ర, సంగీత, సాహిత్య కళలకు తల్లిదండ్రు ల ప్రతిభే కారణమని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోపాటు ఆయన కుటుంబసభ్యులు శైలజ, వసంత, శుభలేఖ సుధాకర్, చరణ్ తదితరులు సాం బమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరె డ్డి, ఎస్పీ గజరావు భూపాల్, పారిశ్రామికవేత్త జె.ఎస్.రెడ్డి, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకహోదాను మించి నిధులు తెస్తాం వెంకటాచలం(మనుబోలు): ప్రత్యేక హోదాతో దక్కే నిధులకు మించిన స్థాయి నిధులతో ఏపీని అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రీమియం చెక్కులను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతున్నారన్నారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. దీనిని సరిదిద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ప్రాజెక్ట్‌లను, నిధులను ఏపీకి కేటాయిస్తుందన్నారు. విభజన సమయంలో ఏపీ విషయంలో ఆ రోజు తాను ఏమి కోరానో, కేంద్రం ఏమి ఇచ్చిందో అన్నీ తనకు గుర్తున్నాయన్నారు. ఎవరి సర్టిఫికెట్లూ తనకు అవసరం లేదన్నారు. చదువులేని వారి పట్ల చులకన భావం తగదు: కమల్ హాసన్ ఉన్నత చదువులు చదవని వారిపట్ల చులకన భావన వద్దని సినీనటుడు కమల్‌హాసన్ అన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్నారు. మధ్యలో చదువాపేసిన వారు కూడా భవిష్యత్తులో సైంటిస్టులో, తనలాగే పెద్ద యాక్టర్లో కావచ్చన్నారు. -
విపక్షాలు సహకరించాలి
కేంద్ర మంత్రి వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘చైనా ఆర్థికవృద్ధి మందగించింది. ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని దేశాలకు భారత్ ఒక్కటే ఆశాకిరణంగా నిలిచింది. ఇలాంటి కీలక సమయంలో అధికార, ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పని చేయాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక అభివృద్ధి వేగంగా పెరగడానికి అవసరమైన చట్టాల ఆమోదంలో ప్రతిపక్ష పార్టీలు క్రియాశీలక పాత్ర పోషించాలి. జీఎస్టీ, భూ సేకరణ (సవరణ) వంటి కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. అందరికీ అవకాశాలు కల్పిస్తే తప్పెలా అర్హత కలిగినప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకు విద్యావ్యవస్థలో కీలక స్థానాలను అప్పజెప్పడం తప్పెలా అవుతుందని వెంకయ్య ప్రశ్నించారు.ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షపై వెంకయ్య స్పందిస్తూ రాజకీయ పార్టీలు తమకు నచ్చిన కార్యక్రమాలను చేసుకోవడంలో తప్పు ఏముంటుందన్నారు.హోదా కోసం ఇటీవలే కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు తనకు ఒక్క ఎస్ఎంఎస్ కూడా రాలేదని చెప్పారు. -
లక్షల ఎకరాలు లాక్కున్నారు
* ఏపీలో 3,77,691, తెలంగాణలో 1,29,456 ఎకరాలు * యూపీఏ హయాంలో భూసేకరణపై వెంకయ్య న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నాలుగు రెట్ల నష్టపరిహారం, సామాజిక ప్రభావ అంచనా లేకుండానే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలు రైతుల నుంచి లాగేసుకున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశా రు. భూ సేకరణ చట్టంపై, ప్రధాని మోదీపై రోజూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు రాహుల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 3,77,691 ఎకరాలు, తెలంగాణలో 1,29,456 ఎకరాలను లాక్కుందని జిల్లాల వారీగా గణాంకాలను వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో హరియాణాలో 80,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కుందన్నారు.1894 నాటి బ్రిటిష్ చట్టాన్ని ఎందుకు వాడుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, చౌదరి బీరేందర్ సింగ్‌లతో కలసి వెంకయ్య మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఒక్క అంగుళం కూడా భూసేకరణ జరగనివ్వబోమని చెప్పిన రాహుల్ భాషలో ‘అంగుళం’ అంటే ఎంత అని వ్యాఖ్యానించారు. కాగా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, డెవలప్మెంట్ బిల్లులను ప్రవేశపెడతామని వెంకయ్య అన్నారు. -
వార్తల్లో నిలిచేందుకే మోదీ ప్రస్తావన: వెంకయ్య
బెంగళూరు/సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకే ప్రధాని మోదీ పేరును రాహుల్ ప్రస్తావిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాహుల్ మానసిక పరిపక్వత లేకుండా, చిన్నపిల్లాడిగా వ్యవహరిస్తున్నారని బెంగళూరులో అన్నారు. రాహుల్ తాత జవహర్లాల్ నెహ్రూ, తండ్రి రాజీవ్ గాంధీలు సైతం సూటు బూటు వేషధారణలోనే పాలించారనే విషయం గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పరిపాలనలో ‘టేక్ ఇన్ ఇండియా’ జరిగిందని బీజేపీ విమర్శించింది. 2జీ స్పెక్ట్రం, బొగ్గు గనుల కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల్లో (టేక్) తీసుకోకుండా నిర్ణయాలేవీ జరగలేదని బీజేపీ అధికార ప్రతినిధి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు సంధించారు. కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీలో సోనియా, రాహుల్ చేసిన విమర్శలపై ఢిల్లీలో ఆయన స్పందించారు. రైతులను ఎప్పుడూ పేదరికంలోనే ఉంచాలని కాంగ్రెస్ చూసిందన్నారు. సోనియా అల్లుడు వాద్రా భూ అభివృద్ధి పేరిట రైతులు భూములు లాక్కున్నప్పడు వారికి రైతుల ఆత్మగౌరవం గుర్తుకురాలేదా? అని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో నిజాయితీగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. -
‘అమరావతి’లో భాగస్వాములు కండి
టాటా గ్రూప్ చైర్మన్‌కు వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వెంకయ్యతో సైరస్ మిస్త్రీ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్, అందరికీ ఇల్లు తదితర అంశాలపై వీరిరువురూ చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మిస్త్రీని వెంకయ్య కోరారు. నిర్మాణ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధిలో నూతన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సహకారం అందించాలని కోరారు. మిస్త్రీ స్పం దిస్తూ, ఇప్పటికే స్వచ్ఛభారత్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. -
'వెంకయ్య, బాబు, మోదీ మోసం చేశారు'
విజయవాడ: ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఆరోపణలు చేసింది. ఈ విషయంలో సదరు నేతలపై సోమవారం ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే కార్యక్రమంలో భాగంగా పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, అవినాష్, కడియాల బుచ్చిబాబు మాచవరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇక నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ పేటలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు -
రామాయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగేనా?
పోర్టు కోసం ఐదు వేల ఎకరాలను గుర్తించిన అధికారులు కావలి : బ్రిటీషుకాలంలో వెలుగు వెలిగిన ప్రకాశం జిల్లా రామాయపట్నం తీరంలో పోర్టు నిర్మాణం జరుగుతుందా అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేపడితే ప్రకాశం జిల్లాకన్నా ఎక్కువ భాగం లబ్ధి నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకు కలుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.7500 కోట్లతో పోర్టు నిర్మిస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. పది వేల ఎకరాలు అవసరం అవుతుందని కేంద్రం ప్రకటించగా రామాయపట్నం సముద్రతీరానికి పరిసర ప్రాంతాల్లోని సుమారు 5వేల ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్‌భూములను ప్రకాశం జిల్లా అధికారులు గుర్తించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కావలికి వచ్చిన ప్రతిసారీ రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు జిల్లాలోని దుగ్గరాజుపట్నంలో పోర్టు నిర్మాణం పూర్తయితే రామాయపట్నం పోర్టును మంజూరు చేస్తామని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేశారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతో దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తేలకుండా ఉంది. దీంతో రామాయపట్నం పోర్టు మంజూరుపై నీలి నీడలు అలముకున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీకి వినతి పత్రాలు అందించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేంద్రమంత్రులకు రామిరెడ్డి వివరించారు. కావలి నుంచి 15 కిలో మీటర్లు... నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉన్న రామాయపట్నం కావలి పట్టణం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. కందుకూరు నుంచి 34 కిలో మీటర్లు వరకు ఉంటుంది. రామాయపట్నం సమీపంలో ఉన్న ఉలవపాడు మండలం, గుడ్లూరుతోపాటు పలు మండలాలకు చెందిన వారు నిత్యం కావలికి వస్తుంటారు. పోర్టు నిర్మాణంతో ఉపాధి... రామాయపట్నంలో నిర్మించే పోర్టులో ఓడల మరమ్మతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని యూపీఏ ప్రభుత్వం తెలిపింది. రామాయపట్నంపోర్టు నిర్మాణం జరిగితే కొన్ని సంవత్సరాలుగా నిస్తేజంగా ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారానికి కూడా ఊపు వస్తుందని స్థానికులు అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కృషి రాజకీయాలకు అతీతంగా రామయపట్నంలో పోర్టు నిర్మాణంకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. పోర్టు నిర్మిస్తే కావలి ప్రాంతం అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కలుగుతుంది. పోర్టు మంజూరు చేసే విషయంపై కేంద్రమంత్రులను కలిసి పలుమార్లు విన్నవించాం. - రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే షిప్‌యార్డు మంజూరు చేయాలి రామాయపట్నంలో పోర్టుతోపాటు షిప్‌యార్డు కేంద్రం మంజూరు చేయాలి. ఈ విషయంపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. రామయపట్నంలో పోర్టు నిర్మాణం జరిగితే కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. - కందుకూరి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
వైభవోత్సవాలకు ఢిల్లీ వేదిక కావాలి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నెల్లూరు(బృందావనం) : సంస్కృతి,సంప్రదాయాలతోపాటు, ధార్మిక,ఆధ్యాత్మిక చింతన కలిగించే శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు రాజధాని ఢిల్లీలో జరిపించాలని, ఇందుకు మహానగరం వేదిక కావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన పుష్పయాగంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేషంగా హాజరైన శ్రీవారి భక్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పవిత్రమైన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నెల్లూరులో జరగడం, తాను నెల్లూరుకు తొలిసారిగా రావడం, స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందం కలిగిస్తోందన్నారు. దేశరాజధానిలో ైవె భవోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ, హిందూధర్మప్రచారపరిషత్ సహకారం అందించాలని స్మృతి కోరారు. హిందూ సంస్కృతి ఉన్నతమైంది: కేంద్ర మంత్రి వెంకయ్య శతాబ్దాలపాటు విదేశీమూకల దండయాత్రలను ఎదుర్కొని నేడు ప్రపంచవ్యాప్తంగా విశేషమన్ననలు పొందుతున్న హిందూ సంస్కృతి ఎంతో ఉన్నతమైందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వైభవోత్సవాల ముగింపులో పాల్గొన్న ఆయన భారతదేశ కీర్తిని మరింత ఇనుమడించేసేందుకు ప్రతి ఒక్కరూ దైవచింతన, భక్తి,సన్మార్గం కలిగిన జీవనసరళితో ముందుకుసాగాలన్నారు. వీరి వెంట రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి , టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ జేఈఓ పోలభాస్కర్, ఉభయదాత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు, స్వర్ణభారత్‌ట్రస్ట్ మేనేజింగ్ట్రస్టీ దీపావెంకట్ తదితరులు ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఘన స్వాగతం నెల్లూరు(బృందావనం): జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కలెక్టర్ జానకి , సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరులోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్న కేంద్రమంత్రి ఇరానీని ఎంపీ, కలెక్టర్లు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి స్వగృహానికి చేరుకున్నారు. నెల్లూరు (టౌన్): బీజేపీ రాష్ట్రపార్టీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షులు మండల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం
అనంతపురం అర్బన్ : ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐఎంల్(న్యూడెమోక్రసీ) బంద్‌లో కలిసి వచ్చాయి. న్యాయవాదుల సంఘం, జర్నలిస్టుల సంఘం, ఎస్సీ, ఎస్టీ సేన, విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య, ఏపీ రైతు సంఘాలు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి. బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబుళు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ద్రోహులంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్క్‌లు వేసుకుని సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో కార్యకర్తలు సప్తగిరి సర్కిల్లో అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలియజేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టవర్ క్లాక్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ ) జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, నాయకులు బంద్‌కి మద్దతు ఇచ్చి విధులు బహిష్కరించారు. అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేయు జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో విలేకరులు ర్యాలీ నిర్వహించారు. ఐఎంఎం అధ్యక్షుడు మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో కార్యకర్తలు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బంద్‌కి మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు హుసేన్ పీరా, రాజారెడ్డి, పెన్నోబుళేసు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ సేన రాష్ట అధ్యక్షులు బీకేఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నగరంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చెదురుమదురు సంఘటనలు చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లా అంతటా ప్రశాంతంగా జరిగింది. తిలక్ రోడ్డులో దివాకర్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు అద్దాన్ని ఆందోళనకారులు పగలగొట్టారు. టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు, ప్రాంతాల్లో ఆటోలను నిలువరించారు. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూత బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తపోవనం వద్ద హైవే దిగ్బంధం నిర్వహించారు. అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయాలను మూయించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయిన కార్యకర్తలు చైర్మన్ చమన్‌ను చాంబర్ నుంచి బయటికి పంపించివేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ వద్దకు చేరుకుని అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. వివధ ప్రాంతాల్లో... ఉరవకొండలో కవితా హోటల్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. బస్సులు నిలిపివేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం కేంద్రంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. నేసేపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో నిరసనలు తెలియజేశారు. గుంతకల్లు పట్టణంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. శ్రీరాములు సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందూపురంలో అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. కదిరిలో బంద్ సందర్భంగా అంద్కేర్ సర్కిల్లో అఖిలపక్ష పార్టీ నాయకులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిష్టి బొమ్మని దహనం చేశారు. కళ్యాణదుర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, శింగనమల నియోజకవర్గ కేంద్రాల్లోనూ బంద్ ప్రశాంతంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టిన నేతలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని పార్టీల నేతల ఎండగట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించుకునే వరకు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ ముందుకు మోకరిల్లిందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని దుమ్మెత్తి పోశారు. -
ప్రతిదానికి బ్లాక్ మెయిల్ వద్దు
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. 130 ఏళ్ల చరిత్ర తనకు ఉందని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని, లోక్ సభ స్పీకర్‌ను బెదిరించడం ఏ విలువలకు నిదర్శనం అని ఆయన ప్రశ్నించారు. ప్రతి పక్షమంటే ప్రభుత్వానికి సరైన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. అయినదానికి, కాని దానికి బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని అన్నారు. పార్లమెంటు విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ప్రజల సమస్యలను చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. -
భారత్ వృద్ధి రేటు 8% పైనే: వెంకయ్య నాయుడు
వాషింగ్టన్లో జరిగిన అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రతినిధులతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వాషింగ్టన్ : భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ అధిక వృద్ధి బాట పట్టిందని, రాబోయే రోజుల్లో వృద్ధి రేటు 8% దాటగలదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని, పెట్టుబడులు పెట్టాలని అమెరికా ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. అమెరికాలో అయిదు రోజుల అనధికారిక పర్యటనలో ఉన్న వెంకయ్య నాయుడు.. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. తమ సర్కారు మానవీయ కోణంలో సంస్కరణలు అమలు చేస్తోందని, పలు సామాజిక భద్రత పథకాలు కూడా ప్రవేశపెడుతోందన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవాలని అమెరికా ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు. మరోవైపు, పన్నులు, భూసేకరణ మొదలైన అంశాల్లో సంస్కరణల అమలే... పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలకం అవుతాయని యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి పేర్కొన్నారు. -
18 నెలలు జైల్లో గడిపాను!
ఎమర్జెన్సీ అనుభవాలను గుర్తు చేసుకున్న వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి రోజని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి అదొక మాయని మచ్చ అని, ఒక వ్యక్తి తన పదవిని కాపాడుకోవడానికి రాజకీయాల్లో ఏస్థాయికి దిగజారుతారనేదానికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. అత్యవసర స్థితి రోజులను బుధవారం ఆయన గుర్తు చేసుకుంటూ.. నియంతృత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని చరిత్ర రుజువు చేసిందన్నారు. ‘40 ఏళ్ల కిందట పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు. జయప్రకాశ్ నారాయణ్‌ను విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇప్పించడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. పదిహేడున్నర నెలల పాటు విశాఖ, హైదరాబాద్, ముషీరాబాద్, నెల్లూరు జైళ్లల్లో ఉన్నాను’ అని గుర్తు చేసుకున్నారు. ‘నాడు దేశంలో ప్రజాస్వామ్య భావనలు గట్టిగా ఉన్నాయి. జేపీ లాంటి అనేక మంది నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నడిపించారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సంస్థలు చురుకైన పాత్ర పోషించాయి. సోషలిస్టు పార్టీలూ ఉద్యమించాయి. వాజ్‌పేయి, జార్జఫెర్నాండెజ్ లాంటి నేతలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. మొరార్జీదేశాయ్, అద్వానీ లాంటి నేతలను అరెస్టు చేసి హింసించారు’ అని వెంకయ్యనాయుడు వివరించారు. ఎమర్జెన్సీ తర్వాత తనతో సహా అనేక మంది యువనేతలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ‘మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయారు. నేను లా చదివి, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనేది మా అమ్మ కోరిక అని అమ్మమ్మ చెబుతుండేది’ అని గుర్తు చేసుకున్నారు. -
మోదీ గ్రేట్
భారత్‌ను ఆధ్యాత్మిక రాజధానిని చేశారు: వెంకయ్య న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం దేశంలో ముందుండి ఘనంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. ‘మోదీ గొప్పవ్యక్తి. భారత్‌ను ఆధ్యాత్మిక రాజధానిని చేశారు. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు యోగా డే జరుపుకున్నాయి. ఇది నిజంగా ప్రపంచ ఏకీకరణే’ అని సోమవారం ట్విటర్లో కొనియాడారు. మోదీ భారత్‌ను ప్రతి అంశంలో మార్చేస్తున్నారంటూ స్వచ్ఛభారత్, బేటీ పడావో బేటీ బచావో తదితరాలను ప్రస్తావించారు. రాష్ట్రపతి భవన్లో యోగా డేను నిర్వహించి దేశానికి మార్గదర్శకత్వం వహించారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపైనా ప్రశంసల వర్షం కురిపించారు. -
కౌశల్ భారత్ నిర్మాణమే మోదీ ధ్యేయం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంకటాచలం : యువతలో దాగి ఉన్న తెలివి తేటలను వెలికితీసి కౌశల్ భారతంగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్రమోదీ ధ్యేయమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో శనివారం జరిగిన ప్రతిభ పుర స్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో లేని సంపద మన దేశంలో ఉందని, అది మరుగునపడిన నేపథ్యంలో మేల్కొల్పేందుకు వృత్తి నైపుణ్య శాఖను ఏర్పాటు చేశారని, దీనికి మంత్రిగా రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యవహరిస్తున్నారని చెప్పారు. భారతదేశ వారసత్వ సంపద యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా ఐక్యరాజసమితిలో 174 దేశాలు ఏకతాటిపైన మోదీకి మద్దతు పలికాయని, ఇందులో ముస్లిం దేశాలూ ఉన్నాయని చెప్పారు. దేశంలో 25 నుంచి 45 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారని, వీరిని ఒక శక్తిగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలివి కలిగి ఉంటే ప్రశంసలు అందుతాయని స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ నిరూపించాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనుబర్చిన 87 మంది విద్యార్థులకు రూ.2500, మెమెంటో, జ్ఞాపికలను స్వర్ణభారత్ ట్రస్ట్ అందజేయడం అభినందనీయమని కొనియాడారు. బీవీ రాజు, స్వర్ణభారత్ ట్రస్ట్ సంయుక్తంగా వృతి ్త నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాంత యువతకు ఉపయోగకరమన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ గుర్తింపుతో ఇకపై సర్టిఫికెట్లను అందజేస్తారని, వీటికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ జానకీ, స్వర్ణభారత్ ట్రస్టీ హరికుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దేశప్రగతికి బాటలు వెంకటాచలం: దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బాటలు వేస్తున్నారని కేంద్ర నైపుణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు. వెంకటాచలం మండల పరిధిలోని సరస్వతీనగర్‌లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి శనివారం భూమి పూజ చేసిన అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ప్రతిభ పురస్కారాల్లో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మూడు శాతం మాత్రమే స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోనూ వృత్తి విద్యా కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వృత్తి విద్యను ప్రోత్సహిస్తూ, రాబోయే ఐదేళ్లలో దేశంలో 30 కోట్ల మందికి ఈ విద్యను అందించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. దీనికి కోసం రూ.లక్షల కోట్లను ఖర్చు చేయనుందని వెల్లడించారు. అనంతరం పురపాలక మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యను అందించేందుకు ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పురస్కారం అందుకున్న 87 మంది విద్యార్థులకు తమ నారాయణ సంస్థల ద్వారా ఇంటర్మీడియట్ చదువును ఉచితంగా అందజేస్తానని ప్రకటించారు. మంత్రి నారాయణను వెంకయ్యనాయుడు అభినందించారు. -
అంతర్జాతీయ నగరంగా విశాఖ
స్మార్ట్ సిటీ రూపకల్పనకు ప్రజలు సహకరించాలి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విశాఖపట్నం సిటీ : అంతర్జాతీయ నౌకాయాన ముఖద్వారంగా వెలుగొందుతున్న విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, స్మార్ట్ విశాఖ ఫోరం సంయుక్తంగా ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన సిటిజన్ కనెక్ట్ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే స్మార్ట్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందే అవకాశం లేదని చెప్పారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా క్షణాల్లో స్మార్ట సిటీ రూపుదాల్చుకోదని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. విశాఖను సుందర నగరంగా తీర్చి దిద్దడానికి ఎంతో మంచి ఆలోచన, ఉద్దేశం, కోరిక ఉన్నప్పటికీ కొంత సమయం పడుతుందన్నారు. త్వరలో మెట్రో పరుగులు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో త్వరలోనే మెట్రో రైలు పరుగులు తీయనుందని చెప్పారు. నిన్ననే మెట్రో అధినేత శ్రీధరన్ కలిసి విజయవాడ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇచ్చారని చెప్పారు. విశాఖ డీపీఆర్ కూడా త్వరలోనే ఇస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందన్నారు. సామాన్యులు కూడా మెట్రోలో హాయి గా ప్రయాణించే వీలుంటుందని చెప్పారు. హౌసింగ్‌లో పేదలకు స్థానం హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు సముచిత స్థానం కల్పించాలని అధికారులకు సూచించారు. పేదలు లేకుండా హౌసింగ్ ప్రాజెక్టులు ఉండకూడదన్నారు. ఈ ఊరిపై మొదటి హక్కు పేదలదేనని స్పష్టం చేశారు. పేదలు లేకుండా ధనికులుండగలరా అని ప్రశ్నించారు. పురాతన నాగరికతను మర్చిపోకూడదన్నారు. క్రీస్తుపూర్వం నాటి హరప్పా, మొహంజదారో నగరాల అభివృద్ధితో పోల్చుకుని పయనించాలని సూచించారు. రాష్ట్రంలో 12 ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ నెల 11న హిందూపురంలో కస్టమ్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపూర్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విశాఖలోని ఐఐఎంకు, తిరుపతిలోని ఐఐటీ, ఐఈఎస్ఆర్లకు రూ.2300 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బాబూరావు నాయుడు, విశాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.రామబ్రహ్మం, స్మార్ట్ విశాఖ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల కోసం స్థలమివ్వండి
♦ కేంద్ర మంత్రి వెంకయ్యను కోరిన ఢిల్లీ సర్కార్ ♦ ప్రైవేటుకు కేటాయించిన భూముల్ని రద్దు చేయాలి ♦ ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదని ఆవేదన న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఆస్పత్రుల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును ఢిల్లీ సర్కార్ కోరింది. గత 40 ఏళ్ల కాలంలో ఆస్పత్రులు నిర్మించడం కోసం వివిధ ప్రైవేటు కంపెనీలకు 18 ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇటీవల వెంకయ్యనాయుడుకు రెండు లేఖలు రాశారు. ఢిల్లీ ప్రభుత్వమే ఆస్పత్రులు నిర్మించాలని యోచిస్తోందని లేఖలో వివరించారు. అందుకోసం స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)కి రెండు లేఖలు వచ్చిన మాట వాస్తవమే. విలువైన భూముల్ని ఆసక్తి లేని వ్యక్తులకు కట్టబెట్టారని లేఖలో వివరించారు. భూములు దక్కించుకున్న వారు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు’ అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ‘ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ గత 40 ఏళ్ల కాలంలో ఆస్పత్రులు నిర్మించడానికి పలు ప్రైవేటు కంపెనీలకు 18 ప్లాట్లు కేటాయింది. ఆస్పత్రుల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. అయినా ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయలేదు. నిర్దేశిత సమయంలో కట్టడాలు పూర్తి చేయకపోతే లీజు రద్దు చేస్తామని డీడీఏ హెచ్చరించిది’ అని ఒక అధికారి తెలిపారు. -
ఇదేనా ప్యాకేజీ మూట!
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రూ.50 కోట్లు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట కేంద్రం విదిలింపు ఏ రంగాలకు కేటాయించాలో స్పష్టత లేదు 2014-15 ఆర్థిక లోటు పూడ్చేందుకేనంటున్న కేంద్రం శ్రీకాకుళం : అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట కేంద్రం బుధవారం రూ.50 కోట్లు విడుదల చేయడంపై అన్ని వర్గాల నుంచీ అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మిగతా రాష్ట్రాలు సహకరించడం లేదంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరిట రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు విడుదల చేస్తున్నట్లు బుధవారం కేంద్రం ప్రకటించింది. ఇది కంటితుడుపు చర్యేనని జిల్లావాసులు మండిపడుతున్నారు. ఈ నిధులతోనే సరిపెట్టేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికలోటు పూడ్చేందుకే ఈ నిధులని చెబుతూనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నిధులిస్తున్నామంటూ మెలిక పెట్టడంపైనా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. సమస్యల పుంత జిల్లాలో సమస్యలకు కొదవ లేదు. వ్యవసాయాధారిత జిల్లా అయినా ఏడాదికి ఒక పంటతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. పరిశ్రమలూ నామమాత్రమే. ఉద్దానంలో కిడ్నీల సమస్యపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించాల్సి ఉన్నా ఇప్పటివరకూ ఫలితాల్లేవు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమైనా వ్యవసాయరంగానికి ప్రోత్సహకాలు లేవు. విత్తనాలు, ఎరువుల సరఫరాపైనా విమర్శలొస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఐదులక్షల మంది రైతులకు ఉపయోగపడేలా కేంద్రం చర్యలు తీసుకుంటే కనీసం వచ్చే ఖరీఫ్ నాటికైనా మంచి జరిగేదంటూ రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. రూ.50 కోట్లతో ఇవన్నీ జరిగేనా? వేసవి వస్తోంది. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం, కాల్వల మరమ్మతుల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతి విషయానికీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం విడిపోయింది. కష్టాల్లో ఉన్నాం అంటూ వెనుకంజ వేస్తోంది. నిధుల్లేక చెల్లింపులు నిలిపివేస్తోంది. ఈ తరుణంలో కేంద్రం విదిల్చిన రూ.50 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, కాల్వల మరమ్మతులకు కనీసం రూ.10వేల కోట్లయినా మంజూరు చేయాల్సిందేనని గతంలో రైతు సంఘం నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బీల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 3వేల ఎకరాలకు కనీసం రూ.10 కోట్లు ఖర్చుచేస్తే అక్కడివారికి తిండిగింజలు లభిస్తాయని నివేదికల్లో పేర్కొంది. జంపర్కోట రిజర్వాయర్‌కు 15 ఏళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దానికి మరో రూ.26 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పినా పైసా విదల్చలేదు. ఇప్పుడు మూడింతల అంచనా వ్యయం పెరిగి రూ.100కోట్లు అయినా వెచ్చిస్తేనే పనులు జరుగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు తేల్చి చెప్పేశారు. తోటపల్లి రిజర్వాయర్ పరిస్థితీ అంతే. చిన్ననీటి వనరుల అభివృద్ధి, ప్రతి సెంటు భూమికీ సాగునీరందిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు ఏం చేయనుందో చెప్పకుండా దోబూచులాడుకుంటూ వస్తోంది. బూర్జ మండలం పెదపేట సమీపంలో ఉన్న విత్తన క్షేత్రాన్ని తక్షణమే అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మరోవైపు సాగునీటి అవసరాలకు గతంలో రూ.25 కోట్లు ప్రకటించినా అవి ఇప్పటికీ విడుదల కాలేదు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు వచ్చిన కరువు కాటకాలు, ప్రకృతి విపత్తులకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. -
బలానికి కమలదళం కసరత్తు
⇒13 జిల్లాల్లో బీజేపీలో కొత్తగా చేరిన వారికి శిక్షణ ⇒ ప్రారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ⇒ వేదిక సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల జగ్గంపేట / గండేపల్లి : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి రాగా కాంగ్రెస్ చావుదెబ్బ తింది. దీంతో గట్టి పునాదిని నిర్మించుకోవడానికి ఇదే తగిన సమయమని బీజేపీ భావిస్తోంది. 13 జిల్లాల పరిధిలో కొత్తవారిని చేర్చుకుంటూ వారికి బీజేపీ విధి విధానాలు, సిద్ధాంతాల గురించి తెలియజేసేందుకు శిక్షణ తరగతులకు తెరతీసింది. దీనిలో భాగంగా జిల్లాలోని గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సీమాంధ్ర పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మూడురోజుల రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించింది. మీడియాను అనుమతించకుండా గోప్యత పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం శిక్షణ తరగతులను ప్రారంభిర చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రారంభోపన్యాసం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. శిక్షణ తరగతులు జరిగే సెమినార్ హాల్లోకి మీడియాను అనుమతించకుండా గోప్యత ప్రదర్శించారు. కాగా.. అందిన సమాచారం ప్రకారం.. శిక్షణ తరగతుల్లో వెంకయ్యనాయుడు పార్టీలోకి కొత్తగా చేరిన వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, పనితీరుపై అవగాహన కల్పించేందుకు, బీజేపీని సంస్థాగతంగా సీమాంధ్రలో బలపర్చేందుకు పలు సూచనలు చేశారు. అలాగే బీజేపీని బలపర్చేందుకుగల అనేక మార్గాలు, ఆలోచనలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న దుష్ర్పచారం పైన అవగాహన కల్పించారు. తొలిరోజు శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీలు కన్నా లక్ష్మీనారాయణ, ఎర్నేని సీతాదేవి, మాజీ మంత్రులు పురందేశ్వరి, మారెప్ప, జిల్లా పార్టీ అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, పైడా సత్యమోహన్, మాలకొండయ్య, వత్సవాయి వరహాల బాబు, జిల్లా ఇన్చార్జి తిరుపతిరావు, ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, శ్రీకాకుళం, రాయలసీమ, గుంటూరు జిల్లాల మాజీ జెడ్పీ చైర్మన్లు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్తిరాజు, జగ్గంపేట, గండేపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా శిక్షణను ప్రారంభించేందుకు ఆదిత్య కళాశాలకు వచ్చిన కేంద్రమంత్రి వెంక య్యనాయుడికి విద్యాసంస్థల చైర్మన్, వైస్చైర్మన్లు ఎన్. శేషారెడ్డి, సతీష్‌రెడ్డి స్వాగతం పలికారు. -
రైల్వే జోన్‌కు శాపం
సంగడిగుంట (గుంటూరు): నవ్యాంధ్ర నేపథ్యంలో రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటు కోసం గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్లు పోటీలో ఉన్నాయి. గుంటూరు రైల్వే డివిజన్‌కు నల్లపాడులో 100 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఎప్పటి నుంచో రైల్వే జంక్షన్‌గా సేవలు అందిస్తూ హుబ్లీ, సికింద్రాబాద్, తెనాలి, విజయవాడ నాలుగు ప్రధాన మార్గాలకు కేంద్రంగా ఈ రైల్వే స్టేషన్ ద్వారానే పలు రైళ్లు ప్రయాణిస్తున్నాయి. హుబ్లీ ద్వారా రాయలసీమ, సికింద్రాబాద్ ద్వారా తెలంగాణ, తెనాలి, విజయవాడ మార్గాల ద్వారా కోస్తాను కలుపుతూ గుంటూరు మీదుగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుకు గుంటూరుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పలువులు మేధావులు అభిప్రాయపడుతున్నారు.కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన జిల్లాకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు కృషి చేశానని, చేస్తున్నానని చెబుతున్నా ప్రత్యేక జోన్ కోసం పట్టుపట్టకపోవడం వల్లనే గుంటూరుకు జోన్ రాకుండా పోతోందని సాక్షాత్తూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలావుంటే, విజయవాడ వ్యాగన్ వర్క్ షాప్‌నకు రాయనపాడు సమీపంలో 100 ఎకరాల భూమి, రైల్వే కాలేజీలో 5 ఎకరాలు, సత్యనారాయణపురంలో 25 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెపుతూ, తమకే జోన్ కేంద్రం కావాలంటూ విజయవాడ నేతలు పట్టుపడుతున్నారు. అదే విధంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్లో భాగంగా ఉన్న విశాఖపట్నంను ప్రత్యేక జోన్ కేంద్రంగా ఎంపిక చేయాలంటూ అక్కడా పోటీ పడుతున్నారు. అయితే విశాఖపట్నాన్ని వదులుకునేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ సిద్ధంగా లేదు. విశాఖపట్నం ప్రత్యేక జోన్ కేంద్రంగా ఏర్పడితే ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ ఆదాయం పడిపోతోంది.ఇక నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మితమవుతున్న గుంటూరుకు రైల్వే జోన్ ఇవ్వాలని ఉద్యోగులు, మేధావులు, ప్రజలు కోరుతున్నారు. అయితే కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడంతో అసలు జోన్ ఏర్పాటవుతుందా లేదా అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది. రైల్వే జోన్ ఏర్పాటైతే... * నిత్యం గుంటూరు నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య పెరుగుతుంది. అలానే ప్లాట్‌ఫాంల సంఖ్య పెరుగుతుంది. ప్రత్యేక రైళ్లు, కొత్త లైన్లు వస్తాయి. అన్ని మార్గాల్లో హాల్ట్‌ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది. ఉద్యోగుల సంఖ్య పెరగడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపడతాయి. * కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు నిధుల రూపంలో అందుతాయి. జోన్‌కు సంబంధించి రైల్వే బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు ఉం టాయి. సర్వేలకే పరిమితమైన నడికుడి- శ్రీకాళహస్తి వంటి లైన్లకు మోక్షం కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. * లైన్లు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చురుగ్గా జరుగుతాయి. అవసరమైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తారు. * ఇలాంటి సౌకర్యాలు ఎన్నో వున్న రైల్వే జోన్ సాధనకు ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. * ప్రయత్న లోపం వల్లే జోన్ దూరం. * రాజకీయ నేతలు రైల్వే ప్రయాణికుల సౌకర్యాలపై అంతగా శ్రద్ధ చూపడం లేదు, గుంటూరు-విజయవాడ 26, గుంటూరు-తెనాలి 29 కిలోమీటర్ల దూరం డబ్లింగ్ పనులను పూర్తి చేసుకోవడానికి తంటాలు పడవలసి వస్తోంది. నల్లపాడులో ఉన్న 100 ఎకరాల రైల్వే భూమి, దొనకొండలో 120 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో రైల్వే జోన్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా కేవలం ప్రజాప్రతినిధుల ప్రయత్న లోపం వల్లే జోన్ దూరం అవుతోంది.