300 కోట్లు ఎక్కువే ఇచ్చాం..
రాష్ట్రానికి హోదాకాదు.. ఆదా ఇచ్చాం: వెంకయ్య
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎంత వస్తుందో పరిశీలించి, దానికంటే 300 కోట్లు ఎక్కువ వచ్చే ప్యాకేజీనే కేంద్రం ఇచ్చిందని, దానికి చట్టబద్ధత కల్పించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్రానికి ‘హోదా కాదు.. ఆదా ఇచ్చాం’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై విజయవాడలో ఆదివారం పార్టీ విజయోత్సవసభ నిర్వహించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం 2017 నుంచి అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తుందని, అలాంటప్పుడు హోదా కంటే ప్యాకేజీ ద్వారానే రాష్ట్రానికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఏడాదికి రూ.45,364 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.2,06,819 కోట్లు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం లెక్కించిన ఐదేళ్ల రెవెన్యూ లోటు 22,113 కోట్లను అదనంగా కేంద్రం ఇస్తుందన్నారు.