ఆ నిధులపై శ్వేతపత్రం ప్రకటించండి
ఏపీ, తెలంగాణకు నిధుల మంజూరుపై కేంద్రాన్ని కోరిన సురవరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ,ఏపీలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులపై కేంద్రం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్‌చేశారు. ప్రత్యేకహోదా కాకుండా ఏపీకి పెద్ద ఎత్తున సాయమందించినట్లు బీజేపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. కేం ద్రం నుంచి వచ్చే నిధులు, పన్నుల్లో రాష్ట్ర వాటాలు రావాల్సిందేనని, ఇదేదో వాళ్ల జేబుల్లోంచి ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో చేర్చడం లేదా సవరణలు చేయడంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిలతో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు.
కేంద్రం నియంతృత్వ పోకడల తో ఉందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తీవ్రప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దుచేసేలా కేం ద్రానికి అసాధారణమైన అధికారాలు కల్పించకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అత్యవసరంగా ఉపయోగిం చాల్సిన 356 ఆర్టికల్‌ను రాజకీయాల కోసం అమలుచేయ డం సరికాదన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి గుణపాఠం కావాలన్నారు. చర్చలతో కాలయాపన చేయకుండా వెంటనే కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.
వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయమాల్యాను గతంలో బీజేపీ ఏ ప్రాతిపదికన తమ ఓట్లతో రాజ్యసభకు పంపించిందో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సామాజిక, రాజకీయ కాలుష్యాన్ని విపరీతంగా వెదజల్లిందని విమర్శించారు. కేరళలో వామపక్షాల గెలుపునకు అనుకూల పరిస్థితులున్నాయన్నారు.