హైదరాబాద్‌లోనే ఏపీ హైకోర్టు? | Andhra Pradesh High Court Will Be In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోనే ఏపీ హైకోర్టు?

Published Tue, Aug 28 2018 1:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Andhra Pradesh High Court Will Be In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు ఓవైపు ఏపీ సర్కార్‌ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. ఉమ్మడి హైకో ర్టును రెండుగా విభజించి, తెలంగాణ భూ భాగం పైనే ఏపీ హైకోర్టు ను కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారం భించింది. తెలంగాణ భూ భాగంపై 2 హైకోర్టులు ఉండరాదంటూ 2015, మే 1న హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు గత వారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ ఖన్వీల్కర్, జస్టిస్‌ ధనుంజయ్‌ చంద్ర చూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందిం చిన ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం రోస్టర్‌ ప్రకారం సంబంధిత ధర్మాసనం ముందు ఉంచాలని తమ రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు ఈ వారంలో విచా రణ జరిపే అవకాశం ఉంది. ఈ లోపు ఈ వ్యాజ్యం దాఖలులో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించు కోవాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కేంద్ర తాత్సారంపై పిల్‌...
హైకోర్టు విభజన విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన ధన్‌గోపాల్‌ రావు 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీనిపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణ్‌ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ సమయంలో ఏపీ హైకోర్టుకు తెలంగాణ భూ భాగంపై స్థలం కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన వివరాలను కూడా ధర్మాసనం ముందుంచింది. 
తెలంగాణలో ఏపీ హైకోర్టు 

చట్ట విరుద్ధం...
అందరి వాదనలు విన్న అనంతరం 2015, మే 1న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేసేం దుకు స్థలాన్ని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఒకే ప్రాంగణంలో 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, అలా చేయడం ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. తెలంగాణ హైకోర్టును హైదరాబాద్‌లోని మరో చోటుకు తరలించడం కూడా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర హైకోర్టును తెలంగాణలో ఎక్కడా ఏర్పాటు చేయడానికి వీల్లేదని, అలా చేయడం చట్ట విరుద్ధమంది. తెలంగాణ హైకోర్టును ప్రస్తుతం ఉన్న చోటు నుంచి మరో చోటుకి (గచ్చిబౌలి) తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిని కేంద్ర న్యాయ మంత్రి ఎలా పరిగణనలోకి తీసుకున్నారో అర్థం కావడం లేదని, పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారం ఇది అసాధ్యమని ధర్మాసనం తన తీర్పులో తెలిపింది.

హైకోర్టు విభజనపై కమిటీ...
ఇదిలా ఉండగా అమరావతి పరిసర ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటునకు ఏపీ ఇటీవల చర్యలు చేప ట్టింది. శాశ్వత భవనం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభ మయ్యేలా చూడాలని ఏపీ సర్కార్‌ చర్యలు తీసు కుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌కు ఓ లేఖ రాసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో న్యాయమూర్తులు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ వి.రామ సుబ్రమణి యన్, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ పి.నవీన్‌ రావులు ఉన్నారు. ఈ కమిటీ త్వరలోనే హైకోర్టు భవ నం నిర్మితమవుతున్న నేలపాడు, తుళ్లూరు గ్రామా లకు వెళ్లి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనుంది. అనంతరం ప్రధాన న్యాయ మూర్తికి ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. 

తెలంగాణలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పావులు...
ఇదిలా ఉండగానే 2015, మే1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుండ టం, ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు ఏపీలో హైకోర్టు ఏర్పాటును హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు వ్యతిరేకిస్తుండటంతో కేంద్రం మరో రకమైన ఆలోచన చేయడం ప్రారంభించింది. ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా హైకోర్టు విభజనకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే తెలంగాణ భూ భాగంపై ఏపీ హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదంటూ 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారడంతో దీన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ను ఆమోదించి హైకోర్టు 2015లో ఇచ్చిన తీర్పును సవరిస్తే, తెలంగాణ భూ భాగంపై ఏపీ హైకోర్టు ఏర్పాటునకు రంగం సిద్ధమవుతున్నట్లే లెక్క. కేంద్రం పిటిషన్‌ను ఏపీ సర్కార్‌ తీవ్రస్థాయిలో వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement