కశ్మీర్ పతాకం ఎగురవేతపై స్టే
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆ రాష్ట్ర పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక వాహనాలపై ఎగురవేయడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, వాహనాలపైన రాష్ట్ర పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టుకు చెందిన ఏకసభ్య ధర్మాసనం ఇటీవల సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ జాతీయ కార్యదర్శి ఫరూక్ ఖాన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ జస్టిస్ తషి రబ్‌స్తాన్, జస్టిస్ బన్సి మసూదీల డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలిచ్చింది. దీనిపై పిటిషనర్‌న్యాయవాది సునీల్ సేథి మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సాగిన వాదనలను విన్న అనంతరం డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిందని చెప్పారు.
దేశంలో ఒక్క జమ్మూకశ్మీర్‌లో మాత్రమే జాతీయ పతాకంతోపాటు ఆ రాష్ట్ర పతాకాన్ని ఎగురవేసే హక్కుంది. ఆర్టికల్ 370 ప్రకారం ఆ రాష్ట్ర పతాకానికి ఈ గౌరవం లభించడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా వ్యవహారం రాజకీయ దుమారాన్ని సృష్టించింది. దీనిపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. సీఎం ముఫ్తి మహ్మద్ సయీద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీ కుట్రల నుంచి రాష్ట్ర గౌరవాన్ని, పతాకాన్ని కాపాడాలని, లేనిపక్షంలో పదవి నుంచి వైదొలగాలని ముఫ్తీని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగంగా ఉన్నంతవరకు రాష్ట్ర పతాకం ఎగురుతుందని ట్విటర్‌లో స్పష్టం చేశారు.