స్పందించకుంటే నమ్మకం కోల్పోతారు!
సాక్షి, హైదరాబాద్: కక్షిదారుల స్వల్ప ఇబ్బందులకు కూడా న్యాయస్థానాలు స్పందించకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తద్వారా సమాజంలో అస్థిరత రాజ్యమేలుతుందని, ఈ విషయంలో న్యాయస్థానాలు ముఖ్యంగా కింది కోర్టులు జాగరూకతతో వ్యవహరించాలని సూచించింది. తక్షణమే స్పందించాల్సిన చిన్న చిన్న విషయాల్లో కూడా కింది కోర్టులు జాప్యం చేస్తూ కక్షిదారులను ఇబ్బందులకు గురి చేస్తుండటం సర్వసాధారణమైపోయిందంటూ వ్యాఖ్యలు చేసింది. ఓ కక్షిదారుడు దాఖలు చేసిన పిటిషన్‌కు రెండు నెలలుగా నంబర్ కేటాయించని రంగారెడ్డి జిల్లా 8వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి తీరును హైకోర్టు తప్పుపట్టింది. వెంటనే ఆ పిటిషన్‌కు నంబర్ కేటాయించి మూడు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గత వారం తీర్పు వెలువరించారు.
ఓ అప్పు వివాదానికి సంబంధించి కోర్టులో దాఖలు చేసిన ఒరిజినల్ ప్రామిసరీ నోట్‌ను వెనక్కి తీసుకుని, దాని స్థానంలో నకలు(జిరాక్స్) దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన సీహెచ్.శంకర్‌రెడ్డి జిల్లా 8వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ ఏడాది జూలై 15న పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు నెలలు కావస్తున్నా తన పిటిషన్‌కు కోర్టు నంబర్ కేటాయించడం లేదంటూ శంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నాగార్జునరెడ్డి ఇటీవల విచారించారు. కోర్టులో దాఖలు చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్‌ను తిరిగి తీసుకునే హక్కు కక్షిదారునిగా శంకరరెడ్డికి ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ‘రెండు నెలలకు పైగా నంబర్ కేటాయించకుండా పిటిషన్‌ను అట్టిపెట్టుకోవడం సమర్థనీయం కాదు. ప్రస్తుత కేసు వంటి చిన్న చిన్న కేసులను సైతం పరిష్కరించడంలో అకారణ జాప్యం చేస్తూ కక్షిదారులను ఇబ్బందిపెట్టడం సర్వసాధారణమైపోయింది. ఈ కేసులో కింది కోర్టు తీరును ఎవరూ హర్షించరు’ అని వాదనల అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు.