
సాక్షి, హైదరాబాద్: కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను సవరించాలన్న విజ్ఞప్తులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. పిటిషనర్లు తిరిగి ఆయా రాష్ట్రాలకు వారం రోజుల్లోగా వినతిపత్రాలు సమర్పించాలని.. వాటిని అందుకున్న మూడు నెలల్లోగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇరు రాష్ట్రాల కార్మికశాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కనీస వేతనాలను సవరించడం లేదంటూ ఇరు రాష్ట్రాల నుంచి వేర్వేరుగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) హైకోర్టు మంగళవారం విచారించింది. ఏపీ నుంచి ఆ రాష్ట్ర మల్టిపుల్ కాంట్రాక్టర్స్ లేబర్ యూనియన్ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి పావువెల్లి జీవన్‌రావులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
కనీస వేతనాలను ప్రతి రెండేళ్లకోసారి సవరించాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1975లో, 1995లో జీవోలు జారీ చేసిందని.. కానీ ఇప్పటివరకు ఆ జీవోలు అమలు కాలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కాగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కనీస వేతన సవరణలు చేయాలని పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని వాదించారు. కానీ దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. కార్మికుల సంక్షేమం కోసం పిల్ దాఖలు చేయవచ్చని ఇంతకుముందే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది.