సాక్షి, హైదరాబాద్
వివిధ ప్రాజెక్టులు, అవసరాల కోసం భూసేకరణ చేస్తున్న ప్రభుత్వాలు.. పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. బాధితులు కోర్టులను ఆశ్రయించి పొందుతున్న పరిహారం పెంపు ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాగైతే పరిహారం చెల్లించాకే భూ సేకరణ జరిపేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది. కోర్టుల ఉత్తర్వులంటే ప్రభుత్వాలకు జోక్ అయిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలంటే తొలుత పరిహారాన్ని డిపాజిట్ చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల తరహాలో... అన్ని రకాల భూ సేకరణకు కూడా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.
అయినా తీరు మార్చుకోకుంటే భూ సేకరణ ప్రక్రియనే నిలిపేసేలా ఆదేశాలిచ్చేందుకు సైతం వెనుకాడబోమని.. అలా చేస్తే తప్ప ప్రభుత్వాలు దారికి వచ్చేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. భూసేకరణ పరిహారం నిమిత్తం కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల అమలు వివరాలను అందజేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా జడ్జి లేఖతో..
భూసేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదని.. దాంతో బాధితులు ఉత్తర్వుల అమలు కోసం దాఖలు చేస్తున్న ‘ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీలు)’ ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు ఆ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణిం చింది. ఈ మేరకు మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వరరావు ధర్మాసనానికి వివరణ ఇస్తూ.. కొంత సమయమిస్తే పరిస్థితిని చక్కదిద్దుతామని విన్నవించారు. పది సంవత్సరాల నుంచి ఈపీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘‘సమయం ఇస్తే ఏం చేస్తారు? మీరు పరిహారం తాలూకు ఉత్తర్వులను అమలు చేయకపోతే ఎలా? కోర్టుల ఉత్తర్వులు అమలు చేయకపోవడం వల్ల బాధితులు ఈపీలు దాఖలు చేసుకుంటున్నారు. ఆ వ్యాజ్యలతో కోర్టులు నిండి పోతున్నాయి.
మోయలేని భారంతో సతమతమవుతున్న పరిస్థితిలో ఈ ఈపీలతో కోర్టులను నడపటం ఎలా సాధ్యమో చెప్పండి. కోర్టులిచ్చే ఉత్తర్వులంటే ప్రభుత్వాలకు లెక్క లేకుండా పోతోంది. కోర్టు ఉత్తర్వులను జోక్‌గా భావిస్తున్నాయి. పాత భూసేకరణ చట్టం ప్రకారం జారీ చేసిన పరిహార ఉత్తర్వులే ఇప్పటికీ అమలుకు నోచుకోలేదంటే... మరి 2013 కొత్త భూసేకరణ చట్టం కింద ఇచ్చే ఉత్తర్వులను అమలు చేయడానికి ఇంకెంత సమయం తీసుకుంటారు? ప్రభుత్వాల తీరు వల్లే కోర్టులు పెండింగ్ కేసులతో సతమతమవుతున్నాయి..’’అని ధర్మాసనం మండిపడింది. భూసేకరణ పరిహారం నిమిత్తం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని, వాటిలో ఎన్నింటిని అమలు చేశారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత పరిహారం చెల్లించాల్సి ఉంది, ఎప్పటిలోపు చెల్లిస్తారన్న వివరాలన్నింటినీ తమ ముందుంచాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. లే నిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని, తమ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment