land pooling act
-
ఇక పరిహారం ఇచ్చాకే భూసేకరణ
-
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ వివిధ ప్రాజెక్టులు, అవసరాల కోసం భూసేకరణ చేస్తున్న ప్రభుత్వాలు.. పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. బాధితులు కోర్టులను ఆశ్రయించి పొందుతున్న పరిహారం పెంపు ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాగైతే పరిహారం చెల్లించాకే భూ సేకరణ జరిపేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది. కోర్టుల ఉత్తర్వులంటే ప్రభుత్వాలకు జోక్ అయిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలంటే తొలుత పరిహారాన్ని డిపాజిట్ చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల తరహాలో... అన్ని రకాల భూ సేకరణకు కూడా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. అయినా తీరు మార్చుకోకుంటే భూ సేకరణ ప్రక్రియనే నిలిపేసేలా ఆదేశాలిచ్చేందుకు సైతం వెనుకాడబోమని.. అలా చేస్తే తప్ప ప్రభుత్వాలు దారికి వచ్చేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. భూసేకరణ పరిహారం నిమిత్తం కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల అమలు వివరాలను అందజేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జడ్జి లేఖతో.. భూసేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదని.. దాంతో బాధితులు ఉత్తర్వుల అమలు కోసం దాఖలు చేస్తున్న ‘ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీలు)’ ఏళ్ల తరబడి పేరుకుపోతున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు ఆ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణిం చింది. ఈ మేరకు మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వరరావు ధర్మాసనానికి వివరణ ఇస్తూ.. కొంత సమయమిస్తే పరిస్థితిని చక్కదిద్దుతామని విన్నవించారు. పది సంవత్సరాల నుంచి ఈపీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘‘సమయం ఇస్తే ఏం చేస్తారు? మీరు పరిహారం తాలూకు ఉత్తర్వులను అమలు చేయకపోతే ఎలా? కోర్టుల ఉత్తర్వులు అమలు చేయకపోవడం వల్ల బాధితులు ఈపీలు దాఖలు చేసుకుంటున్నారు. ఆ వ్యాజ్యలతో కోర్టులు నిండి పోతున్నాయి. మోయలేని భారంతో సతమతమవుతున్న పరిస్థితిలో ఈ ఈపీలతో కోర్టులను నడపటం ఎలా సాధ్యమో చెప్పండి. కోర్టులిచ్చే ఉత్తర్వులంటే ప్రభుత్వాలకు లెక్క లేకుండా పోతోంది. కోర్టు ఉత్తర్వులను జోక్‌గా భావిస్తున్నాయి. పాత భూసేకరణ చట్టం ప్రకారం జారీ చేసిన పరిహార ఉత్తర్వులే ఇప్పటికీ అమలుకు నోచుకోలేదంటే... మరి 2013 కొత్త భూసేకరణ చట్టం కింద ఇచ్చే ఉత్తర్వులను అమలు చేయడానికి ఇంకెంత సమయం తీసుకుంటారు? ప్రభుత్వాల తీరు వల్లే కోర్టులు పెండింగ్ కేసులతో సతమతమవుతున్నాయి..’’అని ధర్మాసనం మండిపడింది. భూసేకరణ పరిహారం నిమిత్తం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని, వాటిలో ఎన్నింటిని అమలు చేశారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత పరిహారం చెల్లించాల్సి ఉంది, ఎప్పటిలోపు చెల్లిస్తారన్న వివరాలన్నింటినీ తమ ముందుంచాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. లే నిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని, తమ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
వెనక్కి తగ్గేది లేదు: సోనియా
నీముచ్(మధ్యప్రదేశ్): మోదీ సర్కారు తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో మద్దతిచ్చేది లేదని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు రైతు వ్యతిరేకమైనదని.. దీన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో గురువారం ఆమె అన్నారు. అకాల వర్షాలకు కుంగిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన సోనియా, రైతుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2013లో తాము భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు బీజేపీ మద్దతునిచ్చిందని, ఇప్పుడు ఆ పార్టీకి ఆ చట్టంలో లోపాలు కనిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. 2013నాటి చట్టంలో రైతు వ్యతిరేక అంశాలు ఏమున్నాయో తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం బడా వ్యాపారవేత్తలకు మేలు చేయటం కోసమే చట్టంలో ప్రభుత్వం సవరణలు తేవాలని చూస్తోందని సోనియా అన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులతో సోనియా మాట్లాడారు. నష్టపోయిన రైతులను కేంద్రం కానీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆదుకోలేకపోయాయని సోనియా గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలో లేకపోయినా రైతులకు అండగా నిలబడి పోరాడతామని హామీ ఇచ్చారు. -
భూ బిల్లులో మార్పులకు సిద్ధం!
- కేంద్ర ప్రభుత్వం సంకేతాలు - స్వపక్షమే వ్యతిరేకిస్తుండటంతో రాజీ మార్గం - రైతులకు అన్యాయం జరగనివ్వం..విపక్షాల సూచనలను తీసుకుంటాం - ఆర్డినెన్స్‌లపై ప్రేమేం లేదు..లోక్‌సభలో వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును విపక్షాలే కాకుండా మిత్రపక్షాలు శివసేన, స్వాభిమాన్ షేట్కారీ సంఘటన, లోక్‌జనశక్తి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. బిల్లులో మార్పుచేర్పులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం బుధవారం సంకేతాలిచ్చింది. రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకు, ప్రతిపక్షాల సూచనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే విషయంలో మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమేనంది. పదేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధిని ప్రారంభించి, పరుగులు పెట్టించాల్సిన అత్యవసర పరిస్థితుల్లోనే ఈ ఆర్డినెన్సును జారీ చేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం లోక్‌సభకు వివరణ ఇచ్చారు. ఆర్డినెన్స్‌లపై తమకు ప్రేమేం లేదని, పార్లమెంటును సజావుగా సాగనిస్తే వాటి అవసరం ఉండేది కాదన్నారు. 62 ఏళ్ల పాలనలో 637 ఆర్డినెన్సులు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వీటికి నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, ఆప్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. విపక్షాలను అవమానిస్తున్న ప్రభుత్వానికి సరైన సమాధానమిచ్చే సమయం తమకూ వస్తుందన్నారు. అంతకుముందు వెంకయ్య మాట్లాడుతూ.. ‘బిల్లులో లోపాలేమైనా ఉంటే..వాటిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగనివ్వం’ అన్నారు. అంతకుముందు, ధన్యవాద తీర్మానంపై అధికార పక్షం నుంచి మొదట మాట్లాడిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించడం విశేషం. ‘సాగు చేసేందుకు భూమి లేకుండా చేస్తే అన్నదాతలకు జీవనోపాధి ఎలా? మన కడుపు నిండేదెలా?’ అని ప్రశ్నించారు. ‘బంజరు భూముల్లో ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టుకోండి కానీ వాటికోసం పంటభూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకోం’ అని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సర్కారుకు పారిశ్రామికవేత్తల అభివృద్ధే ముఖ్యం కానీ, పేదప్రజల సంక్షేమం ముఖ్యం కాదని విమర్శించారు. బీజేపీ ప్రధానిగా కాదు, ఈ దేశప్రధానిగా భావించి తన కుటుంబంలోని వివాహ శుభకార్యానికి మోదీని ఆహ్వానించానని వివరించారు. రాజ్యాంగం నిర్దేశించి ఉండకపోతే.. ఆర్డినెన్సుల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న రాష్ట్రపతి.. ఉభయసభలనుద్దేశించి ప్రసంగించి ఉండకపోయేవారన్నారు. ‘9 నెలల్లో ఒక శిశువు జన్మిస్తుంది. కానీ తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయింది’ అన్నారు. న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు జైట్లీ తనకెలా సాయపడ్డారో వివరిస్తూ.. అవసరమైనవారికి ఎలా సాయపడాలో బీజేపీ నేతలు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద నేర్చుకోవాలన్నారు. ఆత్మవిమర్శ చేసుకుంటాం.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వెంకయ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రస్తావించారు. ఈ ఓటమిపై అంతర్మథనం అవసరమని, ఓటమికి కారణాలపై ఆత్మ విమర్శ చేసుకుంటామన్నారు. స్వపక్షం నుంచే ప్రమాదం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ.. ‘మదర్ థెరీసాను సైతం వివాదంలోకి లాగిన సంఘ్‌పరివార్ విభజనవాదులను మోదీ నియంత్రించగలరా?’ అని కాంగ్రెస్ నాయకుడు, సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా సభలో ఉండగా.. ‘ప్రధానిగారు.. మీకు ప్రమాదం మా(విపక్షం) నుంచి లేదు. మీ సొంతపక్షం నుంచే ఉంది. ఇంటిపోరును ఎదుర్కోవడం అంత సులభం కాదు. మీ కష్టం అర్థం చేసుకోగలను’ అని వ్యాఖ్యానించారు. 370 అధికరణ రద్దు ప్రతిపాదన లేదు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370వ రాజ్యాంగ అధికరణను రద్దు చేయాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి బుధవారం రాజ్యసభకు తెలిపారు. -
ఇది ‘జమీన్ వాపసీ ఆందోళన్’!
- భూ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, రైతుల మద్దతుతో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చి భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. రైతుల పొట్టకొట్టే ఆ ఆర్డినెన్సు పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకే లబ్ధి చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తింది. పార్టీ సీనియర్ నేతలు హాజరైన ఈ నిరసన కార్యక్రమం ‘జమీన్ వాపసీ ఆందోళన్’కు పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ రాలేదు. సోనియా నగరంలోనే ఉండగా, రాహుల్ రెండువారాల సెలవులో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్, జైరాం రమేశ్, సోనియా సలహాదారు అహ్మద్ పటేల్, రాజ్‌బబ్బర్, జ్యోతిరాదిత్య తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.‘ఘర్ వాపసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన జమీన్ వాపసీ ఇది’ అని జైరాం రమేశ్ అన్నారు.