వెనక్కి తగ్గేది లేదు: సోనియా
నీముచ్(మధ్యప్రదేశ్): మోదీ సర్కారు తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో మద్దతిచ్చేది లేదని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు రైతు వ్యతిరేకమైనదని.. దీన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో గురువారం ఆమె అన్నారు. అకాల వర్షాలకు కుంగిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన సోనియా, రైతుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
2013లో తాము భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు బీజేపీ మద్దతునిచ్చిందని, ఇప్పుడు ఆ పార్టీకి ఆ చట్టంలో లోపాలు కనిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. 2013నాటి చట్టంలో రైతు వ్యతిరేక అంశాలు ఏమున్నాయో తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం బడా వ్యాపారవేత్తలకు మేలు చేయటం కోసమే చట్టంలో ప్రభుత్వం సవరణలు తేవాలని చూస్తోందని సోనియా అన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులతో సోనియా మాట్లాడారు. నష్టపోయిన రైతులను కేంద్రం కానీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆదుకోలేకపోయాయని సోనియా గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలో లేకపోయినా రైతులకు అండగా నిలబడి పోరాడతామని హామీ ఇచ్చారు.