
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.
పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.
ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment