ఇది ‘జమీన్ వాపసీ ఆందోళన్’!
- భూ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, రైతుల మద్దతుతో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చి భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. రైతుల పొట్టకొట్టే ఆ ఆర్డినెన్సు పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకే లబ్ధి చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తింది.
పార్టీ సీనియర్ నేతలు హాజరైన ఈ నిరసన కార్యక్రమం ‘జమీన్ వాపసీ ఆందోళన్’కు పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ రాలేదు. సోనియా నగరంలోనే ఉండగా, రాహుల్ రెండువారాల సెలవులో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్, జైరాం రమేశ్, సోనియా సలహాదారు అహ్మద్ పటేల్, రాజ్‌బబ్బర్, జ్యోతిరాదిత్య తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.‘ఘర్ వాపసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన జమీన్ వాపసీ ఇది’ అని జైరాం రమేశ్ అన్నారు.