భూ బిల్లులో మార్పులకు సిద్ధం!
- కేంద్ర ప్రభుత్వం సంకేతాలు
- స్వపక్షమే వ్యతిరేకిస్తుండటంతో రాజీ మార్గం
- రైతులకు అన్యాయం జరగనివ్వం..విపక్షాల సూచనలను తీసుకుంటాం
- ఆర్డినెన్స్‌లపై ప్రేమేం లేదు..లోక్‌సభలో వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును విపక్షాలే కాకుండా మిత్రపక్షాలు శివసేన, స్వాభిమాన్ షేట్కారీ సంఘటన, లోక్‌జనశక్తి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. బిల్లులో మార్పుచేర్పులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం బుధవారం సంకేతాలిచ్చింది. రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకు, ప్రతిపక్షాల సూచనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే విషయంలో మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమేనంది.
పదేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధిని ప్రారంభించి, పరుగులు పెట్టించాల్సిన అత్యవసర పరిస్థితుల్లోనే ఈ ఆర్డినెన్సును జారీ చేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం లోక్‌సభకు వివరణ ఇచ్చారు. ఆర్డినెన్స్‌లపై తమకు ప్రేమేం లేదని, పార్లమెంటును సజావుగా సాగనిస్తే వాటి అవసరం ఉండేది కాదన్నారు. 62 ఏళ్ల పాలనలో 637 ఆర్డినెన్సులు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వీటికి నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, ఆప్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. విపక్షాలను అవమానిస్తున్న ప్రభుత్వానికి సరైన సమాధానమిచ్చే సమయం తమకూ వస్తుందన్నారు. అంతకుముందు వెంకయ్య మాట్లాడుతూ.. ‘బిల్లులో లోపాలేమైనా ఉంటే..వాటిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగనివ్వం’ అన్నారు. అంతకుముందు, ధన్యవాద తీర్మానంపై అధికార పక్షం నుంచి మొదట మాట్లాడిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించడం విశేషం. ‘సాగు చేసేందుకు భూమి లేకుండా చేస్తే అన్నదాతలకు జీవనోపాధి ఎలా? మన కడుపు నిండేదెలా?’ అని ప్రశ్నించారు.
‘బంజరు భూముల్లో ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టుకోండి కానీ వాటికోసం పంటభూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకోం’ అని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సర్కారుకు పారిశ్రామికవేత్తల అభివృద్ధే ముఖ్యం కానీ, పేదప్రజల సంక్షేమం ముఖ్యం కాదని విమర్శించారు. బీజేపీ ప్రధానిగా కాదు, ఈ దేశప్రధానిగా భావించి తన కుటుంబంలోని వివాహ శుభకార్యానికి మోదీని ఆహ్వానించానని వివరించారు. రాజ్యాంగం నిర్దేశించి ఉండకపోతే.. ఆర్డినెన్సుల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న రాష్ట్రపతి.. ఉభయసభలనుద్దేశించి ప్రసంగించి ఉండకపోయేవారన్నారు. ‘9 నెలల్లో ఒక శిశువు జన్మిస్తుంది. కానీ తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయింది’ అన్నారు. న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు జైట్లీ తనకెలా సాయపడ్డారో వివరిస్తూ.. అవసరమైనవారికి ఎలా సాయపడాలో బీజేపీ నేతలు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద నేర్చుకోవాలన్నారు.
ఆత్మవిమర్శ చేసుకుంటాం.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వెంకయ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రస్తావించారు. ఈ ఓటమిపై అంతర్మథనం అవసరమని, ఓటమికి కారణాలపై ఆత్మ విమర్శ చేసుకుంటామన్నారు.
స్వపక్షం నుంచే ప్రమాదం
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ.. ‘మదర్ థెరీసాను సైతం వివాదంలోకి లాగిన సంఘ్‌పరివార్ విభజనవాదులను మోదీ నియంత్రించగలరా?’ అని కాంగ్రెస్ నాయకుడు, సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా సభలో ఉండగా.. ‘ప్రధానిగారు.. మీకు ప్రమాదం మా(విపక్షం) నుంచి లేదు. మీ సొంతపక్షం నుంచే ఉంది. ఇంటిపోరును ఎదుర్కోవడం అంత సులభం కాదు. మీ కష్టం అర్థం చేసుకోగలను’ అని వ్యాఖ్యానించారు.
370 అధికరణ రద్దు ప్రతిపాదన లేదు
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370వ రాజ్యాంగ అధికరణను రద్దు చేయాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి బుధవారం రాజ్యసభకు తెలిపారు.