
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, వ్యవస్థల్లో కీలక మార్పులు తీసుకురావడం కోసం అవసరమైతే తమ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి వెనుకాడబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం తేల్చి చెప్పారు. దేశంలో పారదర్శకత, అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎవరూ నిరోధించలేరని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం అస్తవ్యస్తంగా ఉన్నాయనీ, తాము పగ్గాలు చేపట్టాక పరిస్థితిని పూర్తిగా మార్చివేసి తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించామని మోదీ అన్నారు.
హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఢిల్లీలో నిర్వహించిన నాయకత్వ సదస్సు ప్రారంభ ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి, బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, పౌరుల జీవన విధానం, పరిపాలనా వ్యవస్థలను మెరుగుపరచడం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ‘నేను తీసుకున్న చర్యలకు, ఎంచుకున్న మార్గానికి రాజకీయంగా నష్టపోవాల్సి ఉంటుందని నాకు తెలుసు. కానీ నేను అందుకు సిద్ధంగా ఉన్నాను’ అని మోదీ స్పష్టం చేశారు. వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం నుంచి తనను ఎవరూ ఆపలేరన్నారు. మీడియా సంస్థలు ఎప్పుడూ వ్యతిరేక వార్తలు, చెడును చూపించేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ...ఆ పద్ధతి మారాలని మోదీ సూచించారు.
నోట్లరద్దుతో ప్రజల ఆలోచనల్లో మార్పు
పెద్దనోట్ల ఉపసంహరణ నిర్ణయం ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చిందని మోదీ అన్నారు. నోట్లరద్దు తర్వాత 2.25 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామనీ, తప్పుడు పనులు చేసిన ఆయా కంపెనీల డైరెక్టర్లు మరే కంపెనీలకూ సారథ్యం వహించకుండా చర్యలు తీసుకున్నామని మోదీ వివరించారు. నోట్లరద్దు అనంతరం నల్లధనం బ్యాంకుల్లోకి చేరిందనీ, దాంతోపాటు తమకు అవినీతిపరులపై చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఎంతో సమాచారం కూడా లభించిందని మోదీ అన్నారు.
‘ఆధార్’ ఆయుధం
బినామీ ఆస్తుల గుర్తింపునకు ఆధార్ నంబర్‌ను ఆయుధంగా వాడనున్నట్లు మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం వల్ల ప్రభుత్వానికి రూ.వేల కోట్లు మిగిలాయనీ, బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపేందుకూ ఆధార్‌నే ఉపయోగించుకుంటామన్నారు. గతంలో అభివృద్ధికి ప్రభుత్వ వ్యవస్థే ప్రతిబంధకంగా ఉండేదనీ, ప్రజలు వ్యవస్థతో పోరాడటం ఆపి, సౌకర్యవంతంగా జీవించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా గత యూపీఏ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపనప్పటికీ వారేమీ చేయలేదన్నారు.