notes ban
-
ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు ఎంతంటే..
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 98.04 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.6,970 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 అక్టోబర్ 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.6,970 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలంటే..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఇంకా మూలుగుతున్న రూ.రెండువేల నోట్లు
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.7,261 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 ఆగస్టు 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.7,261 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది.గతేడాది మే 19న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది.ఆర్బీఐ గతేడాది మే 19న రూ.2వేలనోట్ల రద్దు ప్రకటించింనా, సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆ తర్వాత నుంచి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు వీలుంది. -
నోట్లరద్దుపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గతేడాది మే 19న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది. ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ ఆర్బీఐ గతేడాది మే 19న రూ.2వేలనోట్ల రద్దు ప్రకటించింనా, సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆ తర్వాత నుంచి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు వీలుంది. -
రూ.2000 నోట్లపై మళ్లీ ఆర్బీఐ కీలక నిర్ణయం..
గతేడాది మేలో రద్దు చేసిన రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విలువైన రూ.2000 నోట్ల మార్పిడి కోసం పౌరులకు మరో అవకాశం కల్పించింది. దేశంలోని ఆర్బీఐ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పెద్దనోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకు గడువును మాత్రం నిర్ణయించలేదని తెలిసింది. అయితే రూ.2000 నోట్లు మార్చుకునే పౌరులు ప్రస్తుతం ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి పంపవచ్చని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా గతేడాది మే నెలలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: నిండుతున్న కేంద్ర ఖజానా.. కానీ ఇకపై.. పోస్టాఫీసు ద్వారా ఎలా మార్చుకోవాలి? ముందుగా ప్రజలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిచేయాలి. ఆ తర్వాత దగ్గర్లోని ఏదైనా స్థానిక పోస్టాఫీసు నుంచి రూ.2000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపాలి. ఎఫ్ఏక్యూలో సమాచారం ప్రకారం ఒక వ్యక్తి పోస్టాఫీసు బేస్డ్ ఫెసిలిటీలతో పాటు 19 ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు నోట్లను మార్చుకోవచ్చు. -
రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!
భారతీయ రిజర్వ్‌బ్యాంక్ రూ.2000 నోట్లను తిరిగి బ్యాంకులు సేకరించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చలామణీలో ఉన్న 97.26 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చేశాయని ఆర్బీఐ వెల్లడించింది. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుని ఆరు నెలలు దాటినప్పటికీ.. రూ.9,760 కోట్లు విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. రూ.2వేల విలువైన నోటును ఆర్బీఐ ఈ ఏడాది మే 19న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి/ డిపాజిట్‌కు ప్రజలకు తొలుత సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికీ రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందని, ఆర్ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను ఎక్స్ఛేంజీ/ డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకోలేనివారు రూ.2 వేలు నోట్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపించొచ్చని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గువాహటి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. -
రూ. 2వేల నోట్లు తీసుకోవద్దు
తమిళనాడు: ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లు తీసుకోవద్దని రాష్ట్ర రవాణా సంస్థ అదేశించింది. నవంబర్ 8, 2016సంవత్సరంలో ప్రధాని మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేరోజు కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. తర్వాత 2019లో రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ పరిస్థితులో రాష్ట్ర రవాణా సంస్థ గురువారం నుంచి ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లను తీసుకోవద్దని ఆ శాఖ మేనేజర్లు, కండక్టర్లకు బుధవారం సమాచారం అందించింది. -
93 శాతం 2,000 నోట్లు వెనక్కు వచ్చేశాయ్: ఆర్బీఐ
ముంబై: ఉపసంహరణ నిర్ణయం వెలువడిన మే 19వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన ఒకటి పేర్కొంది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం, ఆగస్టు 31వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.0.24 లక్షల కోట్లకు పడిపోయింది. బ్యాంకులకు తిరిగి వచి్చన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో జరగ్గా, 13 శాతం బ్యాంకుల్లో ఇతర కరెన్సీలోకి మారి్పడి ద్వారా వెనక్కువచ్చాయి. అధిక విలువ నోట్లు కలిగి ఉన్న ప్రజలు 2023 సెప్టెంబరు 30 నాటికి ఆ నోట్లను డిపాజిట్ చేయాలని లేదా నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, మే 19వ తేదీన ఒక కీలక ప్రకటన చేస్తూ, రూ.2,000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8% మాత్రమే. వ్యవ స్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
నోట్ల మార్పిడికి నయా మార్గాలు
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్లాక్‌ను వైట్ చేసుకొనేందుకు బడాబాబులు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. బంగారు, భూముల కొనుగోళ్లపై భారీగా నగదును వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. సగటున ఉమ్మడి జిల్లాలో సాగే బంగారు వ్యాపారాలకంటే ప్రస్తుతం 20 శాతం అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. సరైన ప్రూఫ్స్ ఉంటే అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈదిశగా కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పుడు ఎటూ చూసినా రెండువేల నోట్లపై చర్చ జరుగుతోంది. పలమనేరు: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా రెండువేల నోట్లను సెప్ట్టెంబర్ 30లోపు మార్చుకోవాలనే నిబంధనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బడాబాబులు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. డీమోనటరైజేషన్ తర్వాత రెండువేల నోట్లు కనిపించకుండా పోయాయి. సాధారణ లావాదేవీల్లో, బ్యాంకు ఏటీఎంలలోనూ వీటీ ఊసేలేకుండా పోయింది. దీంతో సామాన్యులకు ఈ నోటుతో పనిలేకుండా పోయింది. ప్రస్తుతం రెండువేల నోట్ల మార్చుకునే విషయంపై సామాన్యజనం అసలు పట్టించుకోవడం లేదు. రెండువేల నోట్లను రోజుకు రూ.20 వేల వరకు బ్యాంకులో మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. మే 23 నుంచి సెప్టంబరు 30 దాకా సాధారణ సెలవులు, బ్యాంకు సెలవులు పోగా కేవలం వందరోజుల మాత్రమే పనిచేస్తాయి. రోజుకు రూ.20 వేలు మార్చుకుంటే వందరోజులకు రూ.20 లక్షలను మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. దీంతో బడా బాబులు భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఎకరా సెటిల్మెంట్ పొలం వ్యాల్యుయేషన్ రూ.20 లక్షలుగా ఉండగా దానికి ప్రభుత్వ విలువ రూ.3 లక్షల వరకు ఉంటుంది. ఈ భూములను కొన్న వారు ప్రభుత్వ మార్కెట్ విలువ మేరకు స్టాంపు డ్యూటీ చెల్లించి ఆ మొత్తాన్ని మాత్రం వైట్ కరెన్సీ ఇచ్చి మిగిలిన పైకాన్ని బ్లాక్‌లో ఇవ్వడం ఇప్పుడు రెండువేల నోట్ల మార్పిడిలో సాగతున్న మరో తంతు. ఇవికాక పెట్రోలు బంకులు, మద్యం దుకాణాలు, అమెజాన్‌లాంటి ఆన్లైన్ వ్యాపారాల్లో పేఆన్ డెలవరీలాంటి ద్వారా నోట్ల మార్పిడి సాగుతోంది. 20శాతం పెరిగిన బంగారు అమ్మకాలు బడాబాబులు బంగారాన్ని కొనుగోలు చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఆభరణాలను కొంటే మేకింగ్ చార్జీ, తరుగు, జీఎస్టీ మూడుశాతం లాంటివి ఉంటుండడంతో కేవలం బిస్కెట్లు, కాయిన్స్‌గా కొంటున్నట్టు తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన కొందరు దుకాణ నిర్వాహకులు గ్రాముపై అధిక ధర ఇస్తేనే రెండు వేలనోట్లను తీసుకుంటామంటూ షరతులు పెడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో సాధారణంగా సాగే వ్యాపారాలకంటే ప్రస్తుతం 20 శాతం అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. భారీగా బ్యాంకు డిపాజిట్లు రోజుకి రూ.20వేలు మాత్రమే రెండువేల నోట్లను మార్చుకోవాల్సి ఉంది. కానీ డిపాజిట్లకు మాత్రం నిబంధనలు లేవు. దీంతో పలు బ్యాంకులు ఇలాంటి వారి ద్వారా భారీగా డిపాజిట్లను సేకరిస్తున్నాయి. మరికొందరు తమ బంధువులు బ్యాంకులో పెట్టిన బంగారాన్ని రూ.2వేల నోట్లతో విడిపించి, మళ్లీ మరో బ్యాంకులో వాటిని తనఖా పెట్టి వైట్ కరెన్సీని అధికారికంగా పొందుతున్నారు. నోట్లను మార్చేందుకు కమీషన్ ఏజెంట్లు రోజూ బ్యాంకుల్లో డబ్బులు మార్చేందుకు కమీషన్ ఏజెంట్లు అందుబాటులో ఉంటున్నారు. వీరు డబ్బున్న ఆసాముల నుంచి రెండువేల కరెన్సీ పొంది తమ మనుషుల ద్వారా బ్యాంకులోవారి ఖాతోల్లోకి జమచేస్తున్నారు. తద్వారా వీరికి రూ.20 వేలకు రూ.500 కమీషన్‌గా పొందుతున్నారు. -
ఎక్కువగా బంగారం కొనుగోళ్లు
బనశంకరి: ఆసరాగా ఉంటాయనుకున్న పెద్ద నోట్లు ఇప్పుడు పెనుభారమయ్యాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లో ఆ నోట్ల చెలామణి పెరిగింది. నగల షాపులు, పెట్రోల్ బంకులు, హోటల్, షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కడచూసినా 2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఆ నోట్లను స్వీకరిస్తుండగా, మరికొందరు తిరస్కరిస్తుండడం గమనార్హం. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను ఖాతాదారులు తమ అకౌంట్లలోకి రోజుకు రూ.20 వేల వరకు జమ చేయవచ్చు. నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ ప్రజల్లో అనేక అపోహలు ఏర్పడడంతో త్వరగా ఆ నోట్లను వదిలించుకోవడానికి ఆత్రుత పడుతున్నారు. పలు రకాలుగా మార్పిడి ధనవంతులు, వ్యాపారస్తులు తమ వద్ద పోగుపడిన 2 వేల నోట్ల మార్పిడికి రకరకాల ఉపాయాలు అనుసరిస్తున్నారు. తమ సిబ్బంది, ఇతరుల చేత మార్పిడి చేయడం, బ్యాంకుల్లో డిపాజిట్లు చేయిస్తున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యులు, ఉద్యోగులు, స్నేహితులు ద్వారా రహస్యంగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఆదాయపన్ను శాఖ భయం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులకు సమాధానం ఇవ్వాలనే కారణంతో కొన్ని చోట్ల రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు తటపటాయిస్తున్నారు. మొబైల్స్, కిరాణా, దినసరి వస్తువుల చిల్లర షాపుల్లో వ్యాపారులు రూ.2 వేల నోట్లను తీసుకోవడం లేదు. అప్పు కావాలంటే ఇస్తాం, ఈ నోట్లు వద్దు అంటున్నారు. ఖరీదైన వస్తువుల కొనుగోలు అవసరం లేకపోయినా వివాహాది శుభకార్యాల పేరుతో పెద్ద మొత్తాల్లో బంగారం కొనుగోలు చేసి 2 వేల నోట్లు ఇచ్చేస్తున్నారు. బంగారు దుకాణాల్లో పెద్ద నోట్ల ఎక్కువగా చెలామణి చేస్తున్నారు. పెట్రోల్‌బంక్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, విలువైన వస్తువులను కూడా 2 వేల నోట్ల కట్టలతో కొనేస్తున్నారు. కొన్ని చోట్ల బంగారు షాపుల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవాలంటే తులం బంగారంపై రూ.5 వేలు, 10 వేలు రేటు పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నోట్లు మేం మార్చుకోవాలంటే చాలా కష్టం, కాబట్టి ఇంతేనని షాపుల సిబ్బంది చెప్పడంతో గత్యంతరం లేక సరే అంటున్నారు. -
పెట్రోల్ బంకులకు తాకిడి
హైదరాబాద్: పెట్రోల్ బంకులకు రూ.2 వేల నోట్ల తాకిడి పెరిగింది. బంకుల్లో నోట్లు వినియోగానికి వెసులుబాటు ఉండటంతో వాహనదారులు ఇంధనం పేరిట నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. బంకుకు వచ్చే వాహనదారుల్లో సగానికి పైగా రూ. 2 వేల నోటు ఇస్తుండటంతో పెట్రోల్ బంకుల డీలర్లకు చిల్లర సమస్యగా తయారైంది. దీంతో కనీసం రూ.1000 ఇంధనం వాహనంలో పోయించుకుంటే తప్ప రూ. 2వేల నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొన్ని బంకుల్లో మాత్రం నోటుకు చిల్లర యూపీఐ, బీమ్, పేటీఎం ద్వారా చెల్లిస్తున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకులు మాత్రం రూ.2వేల పైనే విలువగల ఇంధనం పోయిస్తేనే రూ, 2 వేల నోట్టు తీసుకుంటామని ఏకంగా బోర్డులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు పూర్తిగా రద్దు చేయడంతో వాటిని మార్చుకోవడానికి నగరవాసులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో సెప్టెంబర్ 30 వరకు మార్చు కోవడానికి అవకాశం ఉండటంతో అక్కడ రద్దీ పెరిగింది. దీంతో పెట్రోల్ బంకులు, జ్యువెలరీ షాపుల్లో మార్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన అమ్మకాలు.. మహానగర పరిధిలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా ప్రతిరోజు సగటున 50 లక్షల లీటర్ల పైబడి డీజిల్, పెట్రోల్ డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతి రోజు పెట్రోల్ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్లో సగటున 12 నుంచి 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. గత మూడు రోజులుగా సుమారు 20 నుంచి 30 శాతం అమ్మకాలు ఎగబాగడంతో సరఫరాకు మరింత డిమాండ్ పెరిగింది. జ్యువెలరీ షాపులకు పరుగులు.. జ్యువెలరీ షాపులకు రూ. 2వేల నగదు తాకిడి అధికమైంది. గతంలో బంగారం ఇతరత్రా ఆభరణాల కొనుగోళ్లలో రూ.2వేల నోటు వాడకం 2 శాతమే ఉండేది. ప్రస్తుతం 60 నుంచి 80 శాతం పెరిగినట్లు ఓ జ్యువెలరీ షాపు యజమాని తెలిపారు. -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
పెద్ద నోటు రద్దు... ఏ కట్టడికి?! అసలు కారణం ఇదేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఇంతకీ 2 వేల నోటు ఉపసంహరణ లేదా రద్దు ఎవరి కోసం? నల్లధనం కట్టడికా! రాజకీయ ప్రత్యర్థుల కట్టడికా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేసినట్టుంది. డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ నోటు రద్దును ఎందుకు భావించకూడదు? ఎన్నికల్లో ధనప్రవాహం అభిలషణీయం కాదు కానీ, దాన్ని ఆపడం ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. ఇకపై కాదు కూడా! మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ సోదాల్లో 375 కోట్లకు పైగా (డబ్బు, మందు, కానుకలు) దొరికింది. దొరకనిది ఇంకెన్ని రెట్లుంటుందో! ఓటర్లకు ఎర వేయడం తప్పనప్పుడు, ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం యుద్ధనీతిలో భాగమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 2016లో నోట్ల రద్దును గొప్ప ప్రయోగంగా, ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మలుపుగా ప్రధానమంత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ చర్య బడా బాబులతో పాటు సగటు జీవులకూ కొన్ని నెలల పాటు కునుకు లేకుండా చేసింది. చివరికి దానివల్ల ఏం ఒరిగింది? నల్లధనంగా భావించిన మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా మళ్లీ బ్యాంకుల్లోకి చేరిపోయింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ (ఆపరేషన్ విజయవంతం, కానీ రోగి దక్కలేదు)’ చందంగా తయారైంది. నోట్ల రద్దును అప్పుడు మోదీ ప్రకటిస్తే, శుక్రవారం నాడు మాత్రం 2 వేల నోటు రద్దును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుశా నోటు రద్దుకు రాజకీయ రంగు అంటకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్త ఇది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నదో పెద్దదో ఏదో ఒక కుదుపుకు లోను చేసే ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించడంలోనే అసలు అంతరార్థం అవగతమవుతుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ (యుద్ధంలోనూ ప్రేమలోనూ సర్వం సబబే)’ అన్న నానుడి తెలుసు కదా! ఇదే సూత్రాన్ని రాజకీయాలకు అన్వయిస్తే సరిపోతుందేమో! బీజం పడిందక్కడే...! రాజకీయ అవసరాలను పక్కన పెడితే ఈ పెద్ద నోటు రద్దు ఎవరికి నష్టం? రెండు వేల నోటు ముద్రణ నిలిపివేసి చాలా ఏళ్లవుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వాటిని జారీ చేయడం నిలిపివేసి కూడా చాలా రోజులవుతోంది. చలామణిలో లేకపోవడంతో సగటు జీవులు ఈ నోటును కళ్లజూసి కొన్ని నెలలవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా రంగంలో చలామణిలో ఉన్న మాట వాస్తవం. ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం బడా బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు 2 వేల రూపాయల నోట్లే పంచారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ నోటుపై వేటు వేస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీయొచ్చనేది అసలు వ్యూహం. ప్రతిపక్షాల కూటమికి తనను సారథిని చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ఓ నేత అన్నట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ చానల్లో ఆ చానల్ తాలూకు ప్రముఖ జర్నలిస్టు బాహాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా రెండు వేల నోటుపై వేటుకు అక్కడే బీజం పడి ఉంటుంది. కాదంటారా!? -
నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుందో?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులపై సంబంధిత రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించి డిసెంబర్ 7న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం నాటి సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారం నోట్ల రద్దు అంశంపై రెండు వేర్వేరు తీర్పులుంటాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ఇచ్చే ఈ తీర్పులు ఏకీభవిస్తాయా, భిన్నంగా ఉంటాయా అనేది స్పష్టంగా తెలియలేదు. ధర్మాసనంలో వీరితోపాటు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ఉన్నారు. -
త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. 2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు. భారత్‌లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత -
Demonetisation: తిరగదోడకండి.. నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు. మార్చుకునే చాన్సే ఇవ్వలేదు! పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్‌కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్‌లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే. -
నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? మళ్లీ తెరపైకి
న్యూఢిల్లీ: దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ వివాదాస్పద అంశం వార్తల్లో నిలిచింది. నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రేపు (బుధవారం) సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. దీనికి ఏకంగా నాలుగు రాజ్యాంగ ధర్మాసనాలు అధ్యక్షత వహించనున్నాయి. వివరణాత్మక విచారణ తేదీని బెంచ్ నిర్ణయించే అవకాశం ఉంది. డిసెంబరు 16, 2016న ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినప్పటికీ ఇంకా బెంచ్‌ను ఏర్పాటు చేయలేదు. కాగా నవంబర్ 8, 2016న ఆకస్మికంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అనూహ్యంగాఅదే రోజు అర్ధరాత్రినుండి, అప్పటికి చెలామణిలోఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తీసుకున్న బాధ్యతా రాహిత్యమైన ఈ చర్య దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అంతేకాదు ఉన్న నోట్లను మార్చకునేందుకు క్యూలైన్లలో సామాన్య ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగదు కొరత కారణంగా బ్యాంకుల వద్ద పొడవైన లైన్లు వేచి ఉండలేక కొంతమంది క్యూ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. -
చిన్న పరిశ్రమలపై కుట్ర: రాహుల్ గాంధీ
కొచ్చి: తమకు ఆప్తులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు మేలు చేసేందుకే మోదీ సర్కార్ నోట్ల రద్దు, జీఎస్టీలను అమలుచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలో బుధవారం భారత్ జోడో యాత్ర సందర్భంగా కొచ్చిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘చిరు వ్యాపారుల పొట్ట కొట్టడమే మోదీ సర్కార్ పని. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చిధ్రం చేసి కేవలం తమకు అత్యంత దగ్గరివారైన అతి కొద్దిమంది భారీ పారిశ్రామిక వేత్తలకు లాభం వచ్చేలా ప్రభుత్వం పథకరచన చేసింది. ఈ కుట్రలో భాగంగానే మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తెచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ ధాటికి అసంఘటిత రంగం అతలాకుతలమైంది. మోదీ మిత్రులకు కావాల్సింది ఇదే’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చిన్న సంస్థలకు అనుమతుల మంజూరులో జాప్యం చేస్తూ పెద్ద తలకాయలకు లబ్ధిచేకూరుస్తున్నారని ఆరోపించారు. కేరళలో సుగంధ ద్రవ్యాలు, రబ్బర్ తోటల రైతుల సమస్యలు, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర సర్కార్ విస్మరించడం వంటి సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ బృందం రాహుల్‌ను వివరించింది. ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతానని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రాహుల్.. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురుకు నివాళులర్పించి కొచ్చి సమీపంలోని మాదవనలో బుధవారం భారత్ జోడో యాత్రను కొనసాగించారు. రాహుల్‌తోపాటు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పాల్గొన్నారు. -
హౌసింగ్ మార్కెట్లో తగ్గిన నల్లధనం ప్రాబల్యం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత గడచిన ఐదేళ్లలో హౌసింగ్ మార్కెట్లో నల్లధనం (లేదా నగదు లావాదేవీలు) ప్రాబల్యం 75 నుంచి 80 శాతం తగ్గిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ– అనరాక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఏడు నగరాల్లోని డెవలపర్ల అభిప్రాయాల సేకరణ, బ్యాంకుల గృహ రుణ పంపిణీ గణాంకాలు, రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల సమీక్ష , 1,500కుపైగా సేల్స్ ఏజెంట్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు అనరాక్ పేర్కొంది. గృహ రుణ సగటు పరిమాణం మాత్రం గణనీయంగా పెరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు అనరాక్ చైర్మన్ అనూజ్ పురి పేర్కొన్నారు. కాగా, చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆస్తి లావాదేవీల్లో నల్లధనం ఉందని గుర్తించినట్లు అనరాక్ చైర్మన్ వివరించారు. కారణాలు ఇవీ... పెద్ద నగరాల తొలి గృహ కొనుగోళ్లలో నల్లధనం హవా తగ్గడానికి కారణాలను అనూజ్ పురి వివరిస్తూ, బ్రాండెడ్, లిస్టెడ్ సంస్థలు ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయని, పూర్తి పారదర్శకతతో కూడిన అకౌంట్ల ద్వారానే మెజారిటీ గృహ కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు తర్వాత గృహ కొనుగోలుదారుల డిమాండ్ కూడా పారదర్శకతలో కూడిన బ్రాండెడ్ ప్రాజెక్టులకే ఉంటోందని తెలిపారు. ఇక ప్రధాన డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపైనే కేంద్రీకరించే తమ గత ధోరణిని మార్చుకుని, చౌక, మధ్య తరగతికి అనుగుణమైన హౌసింగ్ విభాగంపై దృష్టి సారించాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తంగా హౌసింగ్ రంగంలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడినట్లు వివరించారు. ‘దేశంలో గృహాల కొనుగోలు, విక్రయం అనే ప్రాథమిక అంశాలు, ధోరణుల్లో పెద్ద నోట్ల రద్దు గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. నేడు గృహ విక్రయాలు అధికభాగం వాస్తవ డిమాండ్ ప్రాతిపదికగానే జరుగుతున్నాయి. నల్లధనాన్ని చెలామణీలోకి తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నంగా ప్రస్తుతం రియల్టీ లేదు’’ అని పురి పేర్కొన్నారు. -
నోట్ల రద్దు ‘అసంఘటితం’పై శరాఘాతం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారత అసంఘటిత రంగంపై దాడి అని, దీనిపై సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని పేద ప్రజలు, రైతాంగం, అసంఘటిత రంగకార్మికులపై, చిన్నాచితకా దుకాణదారులపై తీవ్రమైన దాడి అని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో రాహుల్ వెలువరిస్తోన్న వీడియో సిరీస్ ద్వితీయ భాగంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావిస్తున్నారని, కానీ పేదలు, రైతులు, కార్మికులు చిన్న వ్యాపారులు, అసంఘటితరంగ కార్మికులంతా నగదుపైనే ఆధారపడి ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ చెప్పినట్టు నోట్ల రద్దు కారణంగా నల్లధనం బయటకు రాలేదనీ, పేదప్రజలు లబ్ధిపొందిందీ లేదని, దీనివల్ల సంపన్నులకే మేలు జరిగిందని రాహుల్ అన్నారు. -
ఉద్యోగాలేవీ?: రాహుల్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్ విధించడం... ఈ మూడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఉపాధి కల్పించండి’అనే నినాదంతో కాంగ్రెస్ యువజన విభాగం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాహుల్... మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘మోదీ ప్రధాని పదవి చేపట్టినపుడు ప్రతియేటా రెండో కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. స్వప్నాన్ని చూపించారు. కానీ వాస్తవం ఏమిటంటే మోదీ ప్రభుత్వ విధానాల వల్ల 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఎందుకిలా జరిగింది? తప్పుడు విధానాలే కారణం. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, లాక్డౌన్... ఈ మూడు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వాస్తవమేమిటంటే ఇప్పుడు భారత్ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోంది’అని రాహుల్ ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో ధ్వజమెత్తారు. అందుకే యూత్ కాంగ్రెస్ వీధులకు ఎక్కిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరుద్యోగ సమస్యను యూత్ కాంగ్రెస్ లేవనెత్తడం సంతోషకరమన్నారు. యూత్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోజ్‌గార్ దో ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువశక్తే మన బలమన్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలి: శశిథరూర్ పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు కాంగ్రెస్ వేగవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని, సరైనా దిశానిర్దేశం కొరవడిందని వ్యతిరేక మీడియా కారణంగా ప్రజల్లో నెలకొంటున్న అభిప్రాయాన్ని అడ్డుకోవాలంటే.. వెంటనే అధ్యక్ష నియామకం జరగాలన్నారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఒకవేళ రాహుల్ బాధ్యతలు స్వీకరించడానికి విముఖంగా ఉంటే... కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియను వెంటనే చేపట్టాలని శశిథరూర్ ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. తాత్కాలిక సారథిగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఈనెల పదో తేదీతో ఏడాది అవుతుంది. సోనియా నిరవధికంగా ఈ బాధ్యతలు మోయాలనుకోవడం న్యాయం కాదని శశిథరూర్ అన్నారు. గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోతోందని, సవాళ్లను స్వీకరించడం లేదనే ప్రచారానికి తెరపడాలన్నారు. రాహుల్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొంత కాలం సోనియా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం సోమవారంతో ముగిసినా మరికొంతకాలం ఆమె పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తెలిపారు. సమీప భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. -
ఇది రెండో నోట్ల రద్దు..!
న్యూఢిల్లీ/గువాహటి/లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), ఎన్నార్సీలు రెండో విడత నోట్లరద్దు వంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి అమలైతే నోట్లరద్దును మించిన దారుణ పరిస్థితులను దేశం మరోసారి ఎదుర్కోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన పార్టీ ర్యాలీలో, అంతకుముందు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన హింసాత్మక ఘటనలు మునుపటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయంటూ రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే యావత్ దేశం మరోసారి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, మోతీలాల్ ఓరా, ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు సాగిస్తున్న పార్టీ, వ్యవస్థాపక దినం సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి(సేవ్ కాన్స్టిట్యూషన్– సేవ్ ఇండియా) అంటూ రాష్ట్ర రాజధానుల్లో ప్రదర్శనలు చేపట్టింది. భారత్‌కే తమ మొదటి ప్రాధాన్యమని 135వ వ్యవస్థాపక దినం సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది. ‘స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా అవతరించిన పార్టీ, దేశమే ప్రథమమనే ఆశయానికి కట్టుబడింది. 135 ఏళ్ల ఐక్యత, 135 ఏళ్ల న్యాయం, 135 ఏళ్ల సమానత్వం, 135 ఏళ్ల అహింస, 135 ఏళ్ల స్వాతంత్య్రం. నేడు మనం 135 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం’ అని శనివారం ట్విట్టర్లో పేర్కొంది. అస్సాం సంస్కృతిని నాశనం చేయనివ్వం అస్సాం సంస్కృతి, గుర్తింపులను నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను కొనసాగనివ్వబోమని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో మరోసారి హింసాత్మక వాతావరణ నెలకొనే అవకాశం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గుర్తింపును, భాషలను అణచివేయడం అంటే వారిని బీజేపీ ఇంకా గుర్తించలేదని అర్థమన్నారు. తీవ్ర పోరాటాలతో ఇక్కడి ప్రజలు సాధించుకున్న అస్సాం ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేసి, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బీజేపీ ఉన్న ప్రతిచోటా ప్రజల మధ్య కలహాలు, హింస, విద్వేషం ఉంటాయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో మోదీ ప్రభుత్వం భరతమాతపై దాడి చేసిందని విమర్శించారు. ‘ప్రతి పేద వ్యక్తీ భారతీయ పౌరుడా కాదా అని నిరూపించుకోవడమే ఎన్నార్సీ, ఎన్పీఆర్ల ఉద్దేశం. ఈ తమాషా అంతా నోట్ల రద్దు రెండో విడత మాదిరిగా మారనుంది. నోట్ల రద్దు కంటే మించి దారుణ పరిస్థితులను ప్రజలు ఎదుర్కోనున్నారు’ అని రాహుల్ అన్నారు. అబద్ధాల కోరు అంటూ బీజేపీ తనపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘దేశంలో డిటెన్షన్ సెంటర్లు(నిర్బంధ కేంద్రాలు) లేవంటూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగం, దానికి జతచేసిన డిటెన్షన్ సెంటర్ ఫొటోతో నేను చేసిన ట్వీట్‌ను మీరు చూసే ఉంటారు. అబద్ధం చెప్పేది ఎవరో మీరే తేల్చండి’ అని ఆయన పేర్కొన్నారు. -
రూ. 237 కోట్ల రధ్దైన నోట్లను మార్చిన శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి చెల్లనినోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది. ప్రభుత్వ పౌష్టికాహార కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 237 కోట్ల రద్దైన నోట్లకు వడ్డీ సహా కొత్తనోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకున్న సంగతిని కోర్టుకు సమర్పించిన పత్రం ద్వారా ఐటీశాఖ బయటపెట్టింది. నోట్ల రద్దప్పుడు శశికళ ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి రద్దైన నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొన్నట్లు పేర్కొంది. ‘రుణం కింద రూ.240 కోట్ల పాత నోట్లిస్తాం. బదులుగా ఏడాది తర్వాత 6 శాతం వడ్డీ సహా కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుమారస్వామి అనే వ్యాపారితో శశికళ ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఐటీశాఖ పేర్కొంది. -
ఢిల్లీ అమ్మాయిగా సవాల్ చేస్తున్నా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుని చివరి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలంటూ ప్రధాని మోదీ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజీవ్ కూతురు ప్రియాంక ప్రతిసవాల్ విసిరారు. ‘ఢిల్లీ అమ్మాయిగా సవాల్ చేస్తున్నా. జీఎస్టీ, నోట్లరద్దు, మహిళా భద్రత, యువతకిచ్చిన హామీలపై ప్రచారం చేస్తూ ఓట్లు అడగండి’ అని అన్నారు. ఢిల్లీలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు షీలా దీక్షిత్, బాక్సర్ విజేందర్ సింగ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాను చిన్నప్పటి నుంచి ఢిల్లీలో పుట్టిపెరిగిన దాన్ననీ, ఇక్కడి ప్రతి వీధీ తనకు తెలుసని, మోదీ కేవలం గత ఐదేళ్లుగా మాత్రమే ఢిల్లీలో ఉంటున్నారని ప్రియాంక అన్నారు. ‘నేను ఇదే నగరంలో పుట్టిపెరిగాను. మోదీ తన అధికారిక నివాసం దాటి ఢిల్లీలో ఇంకెక్కడా తిరగరు. నేను ప్రజలను అగౌరవించలేను. మేం బీజేపీలా పొగరుబోతులం కాదు. ఈ ప్రజల వల్లే మేం ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాం’ అని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ నంబర్ 1 అవినీతిపరుడిగా మిగిలిపోయారనీ, ఆయన ప్రధానిగా ఉండగానే పలు కుంభకోణాలు జరిగాయంటూ మోదీ ఇటీవల ప్రచారంలో ప్రస్తావించడం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, అవినీతిపరుడిని అలా అంటే తప్పేంటనీ, దమ్ముంటే ఆయన పేరు చెప్పుకుని కాంగ్రెస్ ఓట్లు అడగాలని మోదీ సవాల్ విసరడం తెలిసిందే. మతంతో వ్యవస్థల నాశనం.. ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ మోదీ అన్ని ప్రభుత్వ వ్యవస్థలను, సంస్థలను నాశనం చేస్తున్నారనీ, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ హోంవర్క్ చేయడంలో విఫలమైన విద్యార్థి లాంటివారని చురకలంటించారు. పైగా పండిట్ నెహ్రూ జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరాగాంధీ కాగితపు పడవ చేశారు లాంటి సాకులు చెబుతారని అన్నారు. ‘జాతీయవాదం గురించి బీజేపీ, మోదీ మాట్లాడతారు. ఈ దేశ యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వడం జాతీయవాదం కాదా?’ అని ప్రశ్నించారు. ప్రచారం సందర్భంగా మాట్లాడుతున్న ప్రియాంక -
నల్లధనం కోసం నోట్ల రద్దు
బాజీపుర(గుజరాత్): పాత రూ. 500, రూ. 1,000 నోట్లతో ఎక్కువ మొత్తం నల్లధనం సృష్టించేందుకు సాధ్యపడటం లేదు కాబట్టే ప్రధాని మోదీ అకస్మాత్తుగా నోట్ల రద్దు చేసి ఏకంగా రూ. 2,000 నోటును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. రూ. 2 వేల నోటైతే భారీస్థాయిలో బ్లాక్‌మనీని ఎక్కువగా దాచేయొచ్చని మోదీ ఇలా చేశారని రాహుల్ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీని సక్రమంగా అమలు చేయకపోవడం వంటి మోదీ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనీ, తాము తేనున్న కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్)తో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని రాహుల్ చెప్పారు. గుజరాత్‌లోని బర్దోలీ జిల్లా బాజీపురలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యాయ్ పథకం కింద తాము పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చేస్తామనీ, దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని దేశ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించకపోయినా వారు జైలుకు వెళ్లకుండా ఉండేలా తాము కొత్త చట్టం తెస్తామని రాహుల్ హామీనిచ్చారు. పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో తమ ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశాయని ఆయన చెప్పారు. గురు, శుక్రవారాల్లో రాహుల్ గుజరాత్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని రాయచూరులోనూ రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీని పదవి నుంచి దింపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారనీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేది తమ పార్టీయేనని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పటిష్టం చేయడం గురించి మోదీ మాట్లాడతారు. కానీ యువతకు ఉద్యోగాలు లేకపోతే దేశం పటిష్టం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా గెలుస్తారు. ఢిల్లీ నుంచి మోదీని ప్రజలు పంపిస్తారు’ అని అన్నారు. ఆచూకీ చెబితే లక్ష ఇస్తాం: సిబల్ అహ్మదాబాద్‌లో పాతనోట్లను అక్రమంగా మారుస్తున్నట్లుగా వచ్చిన వీడియోలో ఉన్న వ్యక్తి గుర్తింపు వివరాలు చెప్పినవారికి కాంగ్రెస్ లక్ష రూపాయల బహుమానం ఇస్తుందని ఆ పార్టీ నేత కపిల్ సిబల్ శుక్రవారం ప్రకటించారు. పాతనోట్ల మార్పిడికి గడువ ముగిశాక రూ. 5 కోట్ల పాత నోట్లను అహ్మదాబాద్‌లో మార్చి ఇస్తున్నట్లుగా గతంలో ఓ వీడియో బయటకు రావడం తెలిసిందే. -
నరేంద్రజాలం
నాది 56 అంగుళాల ఛాతీ. నాకున్న దమ్ముతో దేశాన్ని నిలబెడతా అంటూ ప్రచారం చేసుకోవడమా?.. చాయ్‌వాలా కూడా ప్రధాని కాగల దేశం మనదేనంటూ విదేశీ వేదికలపై కూడా భారత్ ఔన్నత్యాన్ని చాటి చెప్పడమా?.. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ వంశ పారంపర్య పాలనపై నిప్పులు చెరగడమా?.. ప్రజాస్వామిక స్వేచ్ఛ గురించి పదేపదే తన ప్రసంగాల్లో చెప్పడమా?.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక యూత్ ఐకాన్‌గా ఎలా ఉన్నారు? గత ఐదేళ్లలో ప్రధానిగా ఎన్నో రంగాల్లో విఫలమైనా ఆయన ఇమేజ్ చెక్కు చెదరకుండా ఎలా ఉంది?.. ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక కైలీ జెన్నర్లా యూత్‌లో మోదీకి ఫాలోయింగ్ ఎలా పెరిగిపోతోంది? మోదీ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, మరెన్నో వైఫల్యాలు. కానీ ఆ వైఫల్యాలను ప్రజలు మరచిపోయేలా ఆయన ఒక మాయాజాలాన్నే సృష్టించారు. ఉద్యోగాల్లేవు. నిరుద్యోగం రేటు తారాజువ్వలా దూసుకుపోతూ రికార్డు సృష్టించింది. ఉగ్రవాదాన్ని అరికడతానని, బ్లాక్ మనీని బయటకు తీస్తానని పెద్ద నోట్లు రద్దు చేశారు. జనం పడరాని పాట్లు పడ్డారు. గ్రామీణ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకల పీచమణచారు. కానీ బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందన్నట్టుగా కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రమూకలు పంజా విసిరాయి.. కశ్మీర్ లోయలో బీభత్సం సృష్టించారు. కానీ మోదీ మాత్రం ఎప్పుడూ అదరలేదు. బెదరలేదు. పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆయన స్వరంలో ధ్వనించే ఆగ్రహావేశాలు, భారత్ ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడినప్పడు మోదీ మాటల్లో తొణకిసలాడే ఆత్మవిశ్వాసం, సోషల్ మీడియాలో తన గురించి తాను చేసుకునే ప్రచారం ఇవన్నీ ఆయన వైఫల్యాలను పక్కనే పెట్టేలా చేశాయనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో యువతరం గుజరాత్ అభివృద్ధి నమూనాయే ఆదర్శంగా నమో మంత్రాన్ని జపించారు. ఈసారి కూడా ఆయనకున్న చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆయన సృష్టించిన మాయాజాలంలో పడి యువత కొట్టుకుపోతోంది. వాస్తవ ప్రపంచంలో ఆయన ఏం చేశారన్నది కాదు, సోషల్ మీడియాలో ఓ వర్చువల్ రియాల్టీని మోదీ సృష్టించి యువతరం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. దటీజ్ మోదీ!. ట్రంప్, కైలీ, మోదీ.. అందరిదీ ఒకే బాట యువభారతం మోదీ వెంట ఉన్నదంటే ఇదేదో ఎన్నికలో, రాజకీయాలో అని భావించనక్కర్లేదు. వీటన్నింటికి మించి ఆయన యువతరంతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారని అంటారే, అచ్చంగా అలాగే భారత్ బంగారు భవిష్యత్ గురించి తాను కంటున్న కలలు ఈస్ట్‌మన్ కలర్లో అందరికీ చూపించడమే ఆయన నేర్పరితనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్ని విమర్శలున్నాయో, ఆయనను సెభాష్ అని మెచ్చుకునే వారూ అంతేమంది ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ట్వీట్లు ఎంత వివాదాస్పదం అవుతాయో, అంతే వైరల్ అవుతాయి కూడా. అమెరికా మీడియా పర్సనాలిటీ, మోడల్ కైలీ జెన్నర్ వయసు 20 ఏళ్లయినప్పటికీ ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేస్తే అదే ఫ్యాషన్. యువతరం గుడ్డిగా అదే ఫాలో అవుతుంది. జనంలో ఉన్న ఆ క్రేజ్‌నే పెట్టుబడిగా పెట్టి ఆమె మొదలు పెట్టిన కైలీ కాస్మోటిక్స్‌తో ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా సంపాదిస్తున్నారంటే ఎవరైనా అవాక్కవాల్సిందే. మోదీది కూడా వారి బాటే. ఆకర్షించే ట్వీట్లు.. యూ ట్యూబ్‌లో పంచ్‌లు.. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారని ఒక అంచనా. అప్పటికీ ఇప్పటికీ దాని విస్తృతి బాగా పెరిగిపోయింది. రిలయన్స్ జియో వంటి సంస్థలు వచ్చాక ఇంటర్నెట్ డేటా ప్లాన్స్ బాగా చౌకగా వస్తున్నాయి. దీంతో నిరుపేదలు కూడా భారత్‌లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో ఫేస్బుక్, వాట్సాప్ యాప్‌లకి ఆదరణ పెరిగింది. కానీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వచ్చే సమాచారానికి విశ్వసనీయతపై ఎన్ని సందేహాలున్నా జనం వాటినే నమ్ముతూ ఆ లోకంలోనే బతికేస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా దానిని తనకు కావల్సినట్టు వినియోగించుకోవడంలో ఆరితేరిపోయారు. నెటిజన్లను ఆకర్షించేలా ట్వీట్లు పెట్టడం, తన ఉపన్యాసాల్లో పంచ్ డైలాగ్‌లను యూ ట్యూబ్‌లో పెట్టడం, తన డ్రెస్సింగ్ ఫ్యాషనబుల్‌గా ఉండటం.. ఇలా ఏది చూసినా యువతరాన్ని ఆకర్షించేలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఇందిరమ్మదీ ఇదే స్టైల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీటికిమాటికి ఇందిరాగాంధీని, కాంగ్రెస్ వంశానుగత రాజకీయాలను దూషిస్తూ ఉంటారు కానీ ఇద్దరిదీ ఒకటే స్వభావం. అంతా నేనే అన్నట్టుగా అందరినీ తన చుట్టూ తిప్పుకోవడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినప్పటికీ ఇందిరాగాంధీ తనకున్న అధికార దర్పంతో అందరినీ తన కనుసన్నల్లోనే ఉంచుకున్నారు. ఇందిర కంటే మోదీ రెండాకులు ఎక్కువే చదివారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ తరహా రాజకీయ నాయకుల్ని ప్రజాస్వామిక నియంతలని పిలుస్తారు. అయితే అలాంటి వ్యక్తిత్వాన్నే నేటి తరం ఇష్టపడుతోంది. మోదీ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు, స్వయంకృషితో పైకి ఎదిగిన తీరు, తన వ్యక్తిత్వాన్ని తానే ప్రచారం చేసుకునే నైజం.. ఇవన్నీ యువతరాన్ని ఆకర్షించే అంశాలేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందిరాగాంధీకి మోదీ కొడుకుగా పుట్టాల్సిన వారని గతంలోనే ఆయనపై కామెంట్లు కూడా వినిపించాయి. డిజిటల్ సైకో పాలిటిక్స్‌లో మాస్టర్ సెంటిమెంట్‌ను రగిలించడం మోదీకి తెలిసినంతగా మరో రాజకీయ నాయకుడికి తెలీదేమో. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌తో యువతలో దేశభక్తిని రగిలించి డిజిటల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం ద్వారా దానినే ఎన్నికల అస్త్రంగా మార్చేశారు మోదీ. సర్జికల్ స్ట్రయిక్స్‌పై బాలీవుడ్ స్టైల్లో ఒక మ్యూజిక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రాజకీయ శాస్త్రాన్ని, చరిత్రని, సోషియాలజీని ఔపోసన పట్టి సెఫాలజీపై పట్టు సాధించడమే కాదు.. ఈ డిజిటల్ యుగంలో మానవ సమాజాన్ని, వారి సాంస్కృతిక భావజాలాన్ని, మనస్తత్వాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆంత్రోపాలజీని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మోదీ పేరే మొదట చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రజాస్వామిక నియంతలుగా భావిస్తున్న వారి కంటే తన గురించి తాను ప్రచారం చేసుకోవడంలో, స్వీయ గౌరవాన్ని పెంచుకోవడంలో మోదీ ఒక అడుగు ముందే ఉంటారని రచయిత, రాజకీయ విశ్లేషకుడు పంకజ్ మిశ్రా అభిప్రాయంగా ఉంది. -
ఆర్థిక వ్యవస్థను బాగుచేస్తాం
న్యూఢిల్లీ: నోట్లరద్దు, అస్తవ్యస్తంగా జీఎస్టీని అమలు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు బీజేపీ ప్రభుత్వం కలిగించిన నష్టాన్ని తాము న్యాయ్ (కనీస ఆదాయ భద్రత పథకం) ద్వారా పూడుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న తరుణంలో పీటీఐకి రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము ప్రకటించిన న్యాయ్ పథకానికి రెండు లక్ష్యాలు ఉన్నాయనీ, వాటిలో ఒకటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందివ్వడం కాగా, రెండోది ప్రధాని మోదీ ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను బాగుచేయడమని రాహుల్ చెప్పారు. కనీస ఆదాయ భద్రత పథకానికి తాము న్యాయ్ (న్యూన్‌తమ్ ఆయ్ యోజన) అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందనీ, గత ఐదేళ్లలో మోదీ ప్రజలకు అన్యాయం చేయగా, మేం న్యాయం చేస్తామని చెప్పడానికే ఆ పేరు పెట్టామని తెలిపారు. ప్రజాకర్షక పథకం కాదిది న్యాయ్ పథకం ప్రజలను కాంగ్రెస్ వైపునకు ఆకర్షించేందుకు తీసుకొచ్చింది కాదనీ, పేదరికంపై చివరి అస్త్రమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ అమలు విధానం నిర్ణయాల్లా ఇది అస్తవ్యస్తంగా ఉండదనీ, ఒక పద్ధతి ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, అప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించిన అనంతరం దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. మూడేళ్లదాకా అనుమతులు అక్కర్లేదు కొత్తగా ప్రారంభమైన వ్యాపార సంస్థలు తొలి మూడేళ్ల కాలంలో ఏ రకమైన అనుమతినీ ప్రభుత్వం నుంచి పొందాల్సిన అవసరం లేకుండా చేస్తామని రాహుల్ హామీనిచ్చారు. స్టార్టప్ కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులపై విధిస్తున్న ఏంజెల్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాయనేదాని ఆధారంగా వారికి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఉంటాయని రాహుల్ తెలిపారు. వచ్చే వారంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. -
మేమొస్తే నోట్లరద్దుపై దర్యాప్తు
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ హయాంలో చేపట్టిన నోట్లరద్దుపై విచారణ చేయిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడ ఆమె పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఉపాధి హామీ పథకం అమలును ఏడాదిలో 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచుతామనీ, అలాగే కూలీని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) విధానం ప్రజలకు వాస్తవంగా ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై నిపుణులతో సమీక్ష చేపడతామన్నారు. పెద్ద నోట్లరద్దుతోపాటు, జీఎస్టీ అమలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఉద్యోగావకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. అడ్వాణీజీతో మాట్లాడా ‘ఈరోజు బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అడ్వాణీజీతో మాట్లాడా. ఆయన ఆరోగ్యం గురించి వాకబుచేశా. నేను ఫోన్ చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వ్యవస్థాపక సభ్యులు, పార్టీకి మూలస్తంభాల్లాంటి వారైన అడ్వాణీ, మనోహర్ జోషిలను బీజేపీ అలా ఎందుకు వ్యవహరిస్తోంది. ఇప్పుడు వారిని ఎందుకు వదిలివేసింది? గురువులకు గురుదక్షిణ ఇలా కూడా చెల్లిస్తారా అని ఆశ్చర్యం వేస్తోంది. అయినా, ఆ పార్టీ అంతరంగిక విషయాలపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు’ అని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
40 శాతం కమీషన్‌కు పాత నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: నోట్లరద్దు అనంతరం ఓ బీజేపీ నేత 40 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను పలు ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అహ్మదాబాద్‌లో చిత్రీకరించినదనీ, కొందరు జర్నలిస్టులు ఈ వీడియో తీశారని పేర్కొంది. టీడీపీ, ఎన్సీ, ఆర్జేడీ, లోక్తాంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో నిజమైనదే అనడానికి, అందులోని వ్యక్తి బీజేపీ మనిషేననడానికి కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. మరోవైపు ఆ వీడియో నకిలీదనీ, పార్టీ పరిస్థితి దిగజారి నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఇలా రోజుకో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించాలని చూస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ నకిలీ పనులు మరీ విపరీతంగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయని అన్నారు. -
అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..
న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. నవభారత నిర్మాణంపై... 2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును తీసుకొచ్చింది. రైతు సమస్యలపై.. పవిత్ర పార్లమెంట్ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పౌరసత్వ బిల్లుపై.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో వేధింపులకు గురై భారత్‌కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది. ఆర్థిక వ్యవస్థపై.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నోట్లరద్దుపై.. అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. సంక్షేమ పథకాలపై.. పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. -
ముస్లిం బ్రదర్హుడ్, ఆరెస్సెస్ ఒక్కటే
లండన్/బెర్లిన్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అరబ్ దేశాల్లోని రాడికల్ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను పోల్చారు. లండన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ఆరెస్సెస్ భారత స్వాభావికతను మార్చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలను తన చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. ‘భారత స్వాభావికతను మార్చాలని ఆరెస్సెస్ చూస్తోంది. ఏ ఇతర పార్టీలు భారత చట్టబద్ధ సంస్థలను తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోలేదు. అరబ్ ప్రపంచంలోని ముస్లిం బ్రదర్హుడ్ ఆలోచన లాగే ఆరెస్సెస్ ఉద్దేశ్యాలున్నాయి’ అని అన్నారు. మోదీ సర్కారు నిర్ణయాలనూ విమర్శించారు. సంఘ్ నిర్ణయాన్ని మోదీ అమలుచేశారు ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపైనా రాహుల్ విమర్శలు చేశారు. ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆరెస్సెస్ వ్యూహమే. ప్రధాని ఆలోచనల్లో రద్దు నిర్ణయాన్ని చొప్పించారు. ఆర్థిక మంత్రి, ఆర్బీఐ ద్వారా అమల్లో పెట్టారు. నోట్లరద్దు ద్వారా చిన్న, మధ్యతరగతి వ్యాపారసంస్థలు భారీగా నష్టపోయాయి’ అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే చైనాతో డోక్లాం వివాదం తలెత్తి ఉండేదే కాదన్నారు. ‘డోక్లాం ఓ ప్రత్యేక వివాదం కాదు. కొన్ని వరుసఘటనల పరిణామం’ అని అన్నారు. పాకిస్తాన్ విషయంలో మోదీకి ఓ స్పష్టమైన విధానమంటూ ఏదీ లేదన్నారు. పాక్‌తో చర్చలు అంత సులభం కాదన్నారు. అంతకుముందు యూకే విపక్షమైన లేబర్ పార్టీ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. బ్రిటన్ వీసా విధానంలో మార్పుల కారణంగా యూకేలో భారతీయ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. విద్వేషాన్ని చిమ్ముతున్నాయి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కలిపేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ, ఆరెస్సెస్‌లు విద్వేషాన్ని చిమ్ముతూ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని బెర్లిన్‌లో (భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి) భారత సంతతి ప్రజలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో రాహుల్ విమర్శించారు. గురునానక్ బోధనల సారమైన భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని కాంగ్రెస్ తూచ తప్పకుండా పాటిస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగడం, యువతకు సరైన ఉపాధికల్పన లేకపోవడం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అందరిది. ప్రతి ఒక్కరికోసం పనిచేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని విస్తృతం చేస్తుంది. కానీ నేటి కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది’ అని రాహుల్ విమర్శించారు. కాగా, గురునానక్ బోధనలే తనకు స్ఫూర్తి అన్న రాహుల్ వెంటనే 1984 సిక్కు అల్లర్లకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2004 నుంచి పదేళ్లపాటు అధికారంలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీలో కాస్త అహంకారం వచ్చిందని రాహుల్ అంగీకరించారు. దీని ఫలితంగానే 2014లో పార్టీ ఓడిందన్నారు. 2019లో బీజేపీ వ్యతిరేక కూటమి విజయం సాధిస్తుందన్నారు. ముస్లిం బ్రదర్హుడ్ నేపథ్యమిదీ.. అరబ్ దేశాల్లో అస్తిత్వంలో ఉన్న ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ వివిధ దేశాల్లో సున్నీ ముస్లింలతో ఏర్పాటైన బృందం. 1928లో ఈజిప్టులో ఉపాధ్యాయుడైన హసన్ అల్ బన్నా ఈ సంస్థను ప్రారంభించారు. అరబ్ దేశాల్లో ఈ సంస్థకు ఎక్కువ మద్దతుదారులున్నారు. హమాస్ వంటి ఇస్లామిస్ట్ గ్రూపులకూ ముస్లిం బ్రదర్హుడ్ అండదండలున్నాయి. ఇస్లామిక్ సేవాకార్యక్రమాలతోపాటు రాజకీయాల్లో కీలకంగా ఉండడం ఈ సంస్థ లక్ష్యం. ‘ప్రపంచానికి ఇస్లామే పరిష్కారం’ వీరి నినాదం. జోర్డాన్, హమాస్, గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ పేరుతో రాజకీయ పార్టీని పెట్టింది. ఈజిప్టులో ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. సౌదీ అరేబియా ఆరంభంలో ఈ సంస్థకు అండగా నిలిచింది. ప్రస్తుతం కఠినంగా వ్యవహరిస్తోంది. 2011లో హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా ఈజిప్టులో విప్లవం (జాస్మిన్ విప్లవం అని పేరు) ముస్లిం బ్రదర్హుడ్ నేతృత్వంలో జరిగింది. 2012లో ఈజిప్టులో మహ్మద్ మోర్సీ నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆరంభంలో ఈ సంస్థకు అనుకూలంగా ఉన్నా .. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం కారణంగా తర్వాత ఆంక్షలు విధించింది. 2015లో బహ్రెయిన్, ఈజిప్టు, రష్యా, సిరియా, సౌదీ, యూఏఈలు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతానికి ఖతార్, టర్కీలు ఈ సంస్థకు అండగా ఉన్నాయి. ‘ఇస్లామిక్ సంస్కరణలు తీసుకుకొచ్చేందుకు రాజకీయ సంస్కరణలు ముఖ్యమని మేం భావిస్తాం. రాజకీయ బహుళత్వం, ప్రజాస్వామ్యం, అధికార మార్పిడిపై విశ్వాసముంది. ఇస్లామిక్ సంస్కరణలంటే ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం, రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసుకునే హక్కునివ్వడం మొదలైనవి’ అని ఈ సంస్థ తన వెబ్సైట్ పేర్కొంది. -
డీకే ఆప్తుల ఇళ్లపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై గురువారం సీబీఐ దాడులు చేపట్టింది. బెంగళూరు, రామనగర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమంగా నోట్లను మార్చినట్లు డీకేపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. 2016 నవంబర్ 14న కొందరు రూ.10 లక్షల పాత నోట్లను అక్రమంగా రామనగరలోని కార్పొరేషన్ బ్యాంకులో మార్చారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపించకుండా కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లను డీకే సోదరుల ఆప్తులు మార్చుకున్నట్లు 2017లో కేసు దాఖలైంది. దీనిపై కోర్టు వారెంటుతో వచ్చిన సీబీఐ అధికారులు డీకే సోదరుల సన్నిహితులైన శివానంద, నంజప్ప, పద్మనాభయ్యల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సీబీఐ సోదాలపై ఎమ్మెల్యే డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడనన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి లొంగదీసుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎవరూ ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరని చెప్పారు. -
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ‘జన్ ఆక్రోశ్’ర్యాలీకి రాష్ట్ర నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీ కలగానే మారిందన్నారు. హామీల అమలులో విఫలమైన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. అలాగే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని, టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక మొదటిసారి చేపట్టిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాపోలు ఆనందభాస్కర్, మర్రి శశిధర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారాలపై రాజకీయాలు చేయడం తగదు
-
రూ. 2 వేల నోట్లు మాయమవుతున్నాయ్..
షాజాపూర్: దేశవ్యాప్తంగా మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లు మాయమైపోతున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. ఇందులో కుట్రకోణం దాగుందని ఆరోపించారు. సోమవారం నాడిక్కడ జరిగిన ఓ రైతు సదస్సులో చౌహాన్ మాట్లాడుతూ.. ‘పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ.15 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండేది. నోట్ల రద్దు తర్వాత చలామణి రూ.16.50 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ రూ.2 వేల నోట్లు మాత్రం మార్కెట్ నుంచి మాయమైపోతున్నాయి’ అని వెల్లడించారు. మార్కెట్లో నగదు కొరతతో సమస్యల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని చౌహాన్ ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
గ్రహాంతరవాసులకూ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1న ఫూల్స్డే సందర్భంగా ప్రధాని మోదీ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. బ్రేకింగ్ న్యూస్ పేరిట 70 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ‘నోట్ల రద్దుతో దేశంలో అవినీతి అంతమైంది. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ఊడ్చేశారు. మోదీ 200 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు. దీంతో ప్రస్తుతం అరుణగ్రహంపై ఉన్న గ్రహాంతరవాసులూ భారత్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కేంద్రం కట్టిన స్మార్ట్ నగరాలను శుభ్రం చేయడానికి ఇప్పుడు రోబోలనే ఉపయోగిస్తున్నారు. గంగా నదీ ఎంత స్వచ్ఛంగా మారిందంటే అందులోకి తొంగిచూస్తే మీకు మోదీ ముఖం కన్పిస్తుంది’ అని వెటకారమాడింది. ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ అయినా.. నగదు మాత్రం సున్నాగా కన్పిస్తోందని ఎద్దేవా చేసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని తిప్పికొట్టిన బీజేపీ ఫూల్స్ డేను పప్పూ దివస్‌గా అభివర్ణించింది. -
నోట్ల రద్దుతో పన్ను ఉగ్రవాదం: యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఉగ్రవాదానికి దారి తీసిందని బీజేపీ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్‌గా పేరుమోసిన 16వ శతాబ్దపు ఢిల్లీ రాజు మహ్మద్ బిన్ తుగ్లక్తో పోల్చారు. ఆర్థిక వేత్త అరుణ్ కుమార్ రాసిన ‘డీమానెటైజేషన్ అండ్ ద బ్లాక్ ఎకానమీ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. పెద్దనోట్లను ఉపసంహరించడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయని మోదీ చెప్పారో వాటిలో ఏ ఒక్కటీ జరగలేదన్నారు. -
ఇటుకలుగా రద్దయిన నోట్లు
న్యూఢిల్లీ: రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను ముక్కలు చేసి ఇటుకలు (బ్రిక్స్)గా మారుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ కరెస్పాండెంట్ అడిగిన సమాచారాన్ని ఈ మేరకు వెల్లడించింది. ‘రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను లెక్కించి, అధునాతన కరెన్సీ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. పలు ఆర్బీఐ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ష్రెడ్డింగ్, బ్రిక్వెట్టింగ్ యంత్రాల ద్వారా ముక్కలు చేసి బ్రిక్స్‌గా మారుస్తున్నాం’ అని వివరించింది. బ్రిక్స్ తయారు చేసిన వెంటనే టెండర్లు పిలిచి విక్రయిస్తున్నామని తెలిపింది. -
మాది ధర్మ పోరాటం
న్యూఢిల్లీ: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి అడుగు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రత్యర్థి పార్టీ బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆరెస్సెస్, ప్రధాన ప్రత్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో జరిగిన ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆదివారం పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు. మహాభారతాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికార దాహంతో ఉన్న కౌరవులుగా, కాంగ్రెస్ పార్టీ వారు సత్యం కోసం ధర్మపోరాటం చేస్తున్న పాండవులుగా అభివర్ణించారు. బీజేపీ ఆరెస్సెస్ గొంతుక అయితే.. తమది ప్రజావాణి అని చురకలంటించారు. ఎన్డీయే ప్రభుత్వ పలు నిర్ణయాలనూ రాహుల్ తప్పుబట్టారు. దాదాపు గంటపాటు ఆయన ప్రసంగించారు. అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ.. తీర్మానాన్ని ఆమోదించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. మోదీ.. నిలువెల్లా అవినీతి! ‘ప్రధాని వాస్తవ సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టిస్తూ.. సన్నిహితులైన పెట్టుబడిదారులకు లాభం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ మోదీ పేరుతోనే ఇద్దరు (నీరవ్, లలిత్) తీవ్రమైన అవినీతి కేసుల్లో దోషులుగా ఉన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేశారు. కాంగ్రెస్ 126 రాఫెల్ యుద్ధ విమానాలకోసం చర్చలు జరిపితే.. బీజేపీ అదే మొత్తంతో కేవలం 36 యుద్ధ విమానాలను మాత్రమే కొనుగోలు చేస్తోంది. మేం ఒక్కో విమానానికి రూ. 570 కోట్లు పెడితే.. మోదీ అదే విమానానికి రూ.1670 కోట్లు పెడుతున్నారు. మోదీ అవినీతిపై పోరాడటం లేదు. అవినీతికి పాల్పడుతున్నారు’ కురుక్షేత్రను తలపించేలా..: ‘శతాబ్దాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు బలవంతులు, అహంకారులు. పాండవులు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లాగే ఆరెస్సెస్, బీజేపీలది అధికార దాహం. పాండవుల్లాగా కాంగ్రెస్ పార్టీది సత్యం కోసం చేస్తున్న ధర్మపోరాటం’ ‘సుప్రీం’ తిరుగుబాటుపై..: ‘బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోంది. మీడియా కూడా భయపడిపోతోంది. తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య చాలా తేడా ఉంది’ ఆ మోదీ, ఈ మోదీ కలిసి..: ‘నిజాయితీగా ఉన్న వ్యాపారుల నోళ్లను మూయించి.. వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని అధికారులతో లూటీ చేయిస్తున్నారు. వీరు బ్యాంకుల నుంచి రూ.33వేల కోట్లు దోపిడీ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. భారత్‌లోని బడా వ్యాపారవేత్తలు, ప్రధాన మంత్రి పదవికి మధ్య లోపాయకారి ఒప్పందానికి మోదీ అనే పేరు ఓ గుర్తుగా మారిపోయింది. ఈ మోదీ.. మరో మోదీకి 30వేల కోట్ల ప్రజాధనాన్ని ఇస్తారు. ప్రతిగా ఆ మోదీ.. ఈ మోదీకి ఎన్నికల మార్కెటింగ్‌కు అవసరమైంది ఇస్తాడు’ రైతులు, మైనార్టీలు, గౌరీ లంకేశ్‌పై..: ‘గౌరీలంకేశ్, కల్బుర్గీలు ప్రశ్నించినందుకే చనిపోవాల్సి వచ్చింది. ఒకవైపు రైతులు సరైన గిట్టుబాటులేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పదండి యోగా చేద్దామని మోదీ పిలుపునివ్వటం సిగ్గుచేటు కాదా? పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడక ఇక్కడే ఉండిపోయిన వారిని వెళ్లిపోండని బెదిరిస్తున్నారు. తమిళులను వారి భాషను మార్చుకోవాలని బెదిరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారం తమకు నచ్చదంటున్నారు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలో వీళ్లే నిర్ణయిస్తున్నారు’ యువత గురించి: ‘భారత్‌లోని ప్రతి యువతకూ మేం ఓ ఆయుధం. కాంగ్రెస్ పార్టీ మీది. మీ మేధస్సు, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు మేం ద్వారాలు తెరుస్తాం. దేశానికి మీ (యువత) అవసరం చాలా ఉంది. ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అచ్ఛేదిన్, మీ అకౌంట్లలోకి రూ.15లక్షలు ఇవన్నీ బూటకమే’ యూపీఏ పాలనపై..: ‘ యూపీఏ–2 చివరి రోజుల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం కూడా మనుషులమే. పొరపాట్లు చేస్తాం. బీజేపీతో పోలిస్తే మేం విభిన్నం. దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మాకే ఉంది. మోదీ తను దేవుని ప్రతిరూపం అని భావిస్తున్నారు’ కాంగ్రెస్ పునరుత్తేజంపై..: ‘మనం కాంగ్రెస్‌లో మార్పు తీసుకురావాలి. నాయకులు, కార్యకర్తల మధ్యనున్న అడ్డుగోడలను తొలగిస్తాను. ఇందుకోసం సీనియర్ల సలహాలతో ముందుకెళ్దాం. మన మధ్యనున్న విభేదాలు, గ్రూపు తగాదాలను పక్కనపెడదాం. 2019లో కాంగ్రెస్ ఆలోచనవిధానానిదే విజయం. అవసరమైతే రైతు రుణమాఫీ చేస్తాం’ నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, అసమర్థ ఆర్థిక నిర్వాహకుల చేతి నుంచి దేశాన్ని కాపాడినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత చిదంబరం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే మార్గమని ఇందులో పేర్కొన్నారు. ఆర్థికం.. సర్వనాశనం: మన్మోహన్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లీనరీలో తీవ్రంగా విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంటూ.. భ్రమలు కల్పించి మోసం చేసిందన్నారు. ‘ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేకపోయింది. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి తప్పుడు నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి మందగించింది. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఆరేళ్లలో రైతు రాబడి రెండింతలు కావాలంటే ఏడాదికి వృద్ధి రేటు కనీసం 12 శాతం ఉండాలి. ఇది ప్రస్తుతం అసాధ్యం’ అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యకు మోదీ ప్రభుత్వం అతితక్కువ ప్రాధాన్యం ఇస్తోందనీ, దాంతో ఈ అంశం ఎన్నడూ లేనంత జటిలంగా తయారైందని మండిపడ్డారు. సరిహద్దులు సురక్షితంగా లేవనీ, సీమాంతర, అంతర్గత ఉగ్రవాదం, కల్లోల పరిస్థితులపై ప్రతిపౌరుడూ ఆందోళన చెందుతున్నాడని అన్నారు. -
‘పాత’ నోట్ల లెక్కింపు సాగుతోంది: ఆర్బీఐ
న్యూఢిల్లీ: రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్ల లెక్కింపు ఇంకా సాగుతోందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. నోట్ల రద్దు జరిగిన 15 నెలలు గడిచిన తర్వాత ఈ ఆశ్చర్యకర ప్రకటన చేసింది. రద్దైన నోట్ల వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి కోరడంతో ఈ మేరకు ఆర్బీఐ స్పందించింది. 2017 జూన్ 30 నాటికి రూ.15.28 లక్షల కోట్ల నోట్లు (99 శాతం) వచ్చాయని వెల్లడించిన ఆర్బీఐ.. లెక్కింపు ఎప్పుడు పూర్తవుతుందో తెలపాలని కోరగా ప్రస్తుతం ప్రక్రియ వేగంగా జరుగుతోందంటూ సమాధానం దాటవేసింది. నోట్ల ‘కచ్చితత్వం, వాస్తవికత’ తెలుసుకునే ప్రక్రియ కొనసాగుతోందని.. ఇందుకు 59 అత్యాధునిక కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ మెషీన్లు వినియోగిస్తున్నామని తెలిపింది. -
ఏప్రిల్ 1న సీపీఐ 2వ రాష్ట్ర మహాసభలు-చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ 2వ మహాసభలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో నిర్వహించను న్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మహాసభలను నిర్వహిస్తున్నామని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేయా లని ఆయన పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో సంఘ్ పరివార్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని విమ ర్శించారు. 56 రోజులపాటు పోరుబాట చేపట్టామని, ఈ కార్యక్రమంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా సాగుదామని చాడ పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ హత్యలే!: డీవైఎఫ్ఐ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఓయూలో మురళి, నిర్మల్ పట్టణంలో భూమేశ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.విప్లవ్‌కుమార్, ఎ.విజయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓయూ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. -
ఓట్లడిగే పద్ధతి ఇది కాదు
సూరత్: ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవటంలో విఫలమైన మోదీ ప్రజల్లోకి ఎలా వెళతారన్నారు. ఓట్లడిగేటప్పుడు గౌరవప్రదమైన విధానాన్ని ఎంచుకోవాలన్నారు. నోట్ల రద్దును అకస్మాత్తుగా, సన్నద్ధం కాకుండానే చేసిన యుద్ధంగా అభివర్ణించారు. ఈ కారణంగానే సొంత రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమకు నిలయమైన సూరత్‌లో నేతన్నలు 89 వేల మరమగ్గాలను తెగనమ్ముకున్నారని, 31వేల మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. నల్లధనం వెలికితీసేందుకు చేపట్టిన నోట్లరద్దుతో ప్రభుత్వం సామాన్యుడిని కూడా దొంగలా చూస్తోందన్నారు. జీఎస్టీ భయంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవర్గాలు జంకుతున్నాయన్నారు. తనను కలిసిన కొందరు వ్యాపారవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు షాక్ నుంచి ప్రజలు తేరుకోకమునుపే ప్రధానమంత్రి జీఎస్టీని తీసుకువచ్చారని అన్నారు. దీనికోసం ఎవరినైనా సంప్రదించటం కానీ, సమస్యను అర్థం చేసుకోవటంగానీ లేకుండా మోదీ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. -
రాజకీయంగా నష్టమైనా పర్లేదు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, వ్యవస్థల్లో కీలక మార్పులు తీసుకురావడం కోసం అవసరమైతే తమ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి వెనుకాడబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం తేల్చి చెప్పారు. దేశంలో పారదర్శకత, అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎవరూ నిరోధించలేరని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం అస్తవ్యస్తంగా ఉన్నాయనీ, తాము పగ్గాలు చేపట్టాక పరిస్థితిని పూర్తిగా మార్చివేసి తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించామని మోదీ అన్నారు. హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఢిల్లీలో నిర్వహించిన నాయకత్వ సదస్సు ప్రారంభ ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి, బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, పౌరుల జీవన విధానం, పరిపాలనా వ్యవస్థలను మెరుగుపరచడం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ‘నేను తీసుకున్న చర్యలకు, ఎంచుకున్న మార్గానికి రాజకీయంగా నష్టపోవాల్సి ఉంటుందని నాకు తెలుసు. కానీ నేను అందుకు సిద్ధంగా ఉన్నాను’ అని మోదీ స్పష్టం చేశారు. వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం నుంచి తనను ఎవరూ ఆపలేరన్నారు. మీడియా సంస్థలు ఎప్పుడూ వ్యతిరేక వార్తలు, చెడును చూపించేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ...ఆ పద్ధతి మారాలని మోదీ సూచించారు. నోట్లరద్దుతో ప్రజల ఆలోచనల్లో మార్పు పెద్దనోట్ల ఉపసంహరణ నిర్ణయం ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చిందని మోదీ అన్నారు. నోట్లరద్దు తర్వాత 2.25 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామనీ, తప్పుడు పనులు చేసిన ఆయా కంపెనీల డైరెక్టర్లు మరే కంపెనీలకూ సారథ్యం వహించకుండా చర్యలు తీసుకున్నామని మోదీ వివరించారు. నోట్లరద్దు అనంతరం నల్లధనం బ్యాంకుల్లోకి చేరిందనీ, దాంతోపాటు తమకు అవినీతిపరులపై చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఎంతో సమాచారం కూడా లభించిందని మోదీ అన్నారు. ‘ఆధార్’ ఆయుధం బినామీ ఆస్తుల గుర్తింపునకు ఆధార్ నంబర్‌ను ఆయుధంగా వాడనున్నట్లు మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం వల్ల ప్రభుత్వానికి రూ.వేల కోట్లు మిగిలాయనీ, బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపేందుకూ ఆధార్‌నే ఉపయోగించుకుంటామన్నారు. గతంలో అభివృద్ధికి ప్రభుత్వ వ్యవస్థే ప్రతిబంధకంగా ఉండేదనీ, ప్రజలు వ్యవస్థతో పోరాడటం ఆపి, సౌకర్యవంతంగా జీవించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా గత యూపీఏ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపనప్పటికీ వారేమీ చేయలేదన్నారు. -
‘నోట్లరద్దు’కు ఫ్రీడ్మన్ సూత్రం..!
నేషనల్ డెస్క్ ఎన్డీయే ప్రభుత్వం పాత రూ.500, రూ.1,000 నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించి నవంబరు 8కి ఏడాది పూర్తయ్యింది. దీనివల్ల మంచే జరిగిందని, అవినీతి, నల్లధనంపై పోరులో విజయం సాధించామని ప్రధాని మోదీ గట్టిగా చెబుతున్నారు. మరోవైపు, ఈ అనాలోచిత నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా నాశనమైందనీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో లక్షల మంది నిరుద్యోగులయ్యారని కాంగ్రెస్ సహా విపక్షాలు, పలువురు ఆర్థికవేత్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ రెండు వాదనల్లో నిజమెంత? నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుడికి జరిగింది మంచా? చెడా?.. ప్రఖ్యాత ఆర్థిక వేత్త, 1976లో నోబెల్ అందుకున్న మిల్టన్ ఫ్రీడ్మన్ రూపొందించిన ‘క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ’ సూత్రం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయేమో చూద్దాం! వేరే దేశాలూ పెద్ద నోట్లను రద్దు చేసిన దాఖలాలున్నాయి. 2014లో సింగపూర్, 2011లో కెనడా వెయ్యి డాలర్ల నోట్లను రద్దు చేశాయి. 2013లో స్వీడన్ వెయ్యి క్రోనార్ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించింది. పన్ను ఎగవేతలను అరికట్టడానికి, ఆర్థిక నేరాలను నియంత్రించడానికి ఈ చర్యలు ఆయా దేశాల్లో ఉపయోగపడ్డాయి. అయితే, భారత్‌లో మాత్రం ఈ నిర్ణయం నల్లధనాన్ని అరికట్టడానికి ఎంతమేరకు ఉపయోగపడిందనే విషయంలో భిన్న వాదనలున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా భారత్‌లో నగదు ఆధారిత లావాదేవీలే ఎక్కువ. అందుకే నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపే సామాన్యులపై భారీగానే పడింది. సత్ఫలితాలొచ్చాయి నోట్ల రద్దు విజయవంతమైందనడానికి ప్రభుత్వం పలు ఉదాహరణలు చూపుతోంది. ఈ నిర్ణయానికి ఒక కారణం ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 2014–15లో కేవలం 4 శాతం భారతీయులే ఆదాయపు పన్ను చెల్లించారు. అంటే పన్ను ఎగవేతల కారణంగా 6 లక్షల కోట్ల నుంచి రూ. 9 లక్షల కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. నోట్ల రద్దు తరువాత ఈ సంవత్సరం ఆగస్ట్ 5 నాటికి పన్ను రిటర్నుల్లో గత సంవత్సరం కన్నా 24.7% వృద్ధి నమోదైంది. నోట్ల రద్దుకు చెబుతున్న మరో కారణం దొంగనోట్లను అరికట్టడం. కోల్‌కతాలోని భారత గణాంక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం భారత్‌లో రూ.400 కోట్ల దొంగనోట్లు చెలామణీలో ఉండగా అందులో నాలుగింట మూడొంతులు పాత రూ.500, 1,000 నోట్ల రూపంలోనే ఉండేది. నోట్ల రద్దు తరువాత మే 2017లోపు రూ. 17,526 కోట్ల లెక్కచూపని ఆదాయాన్ని గుర్తించామని, వెయ్యి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, ఐటీ రిటర్నులు భారీగా పెరిగాయని, నల్లధనం చెలామణికి, హవాలా లావాదేవీలకు సహకరిస్తున్న 37 వేల నకిలీ కంపెనీలను గుర్తించామని ప్రభుత్వం చెబుతోంది. విఫలమైంది నోట్ల రద్దును విమర్శిస్తున్న వారి వాదన మరోలా ఉంది. ఈ నిర్ణయం వల్ల నల్లధనం బయటకు రాకపోగా దాన్ని వైట్‌మనీగా మార్చుకునేందుకు అవకాశం లభించిందని, అసలు నల్లధనంలో సింహభాగం బంగారం, భూములు తదితరాల రూపంలో ఉందేకానీ కరెన్సీ నోట్ల రూపంలో కాదనేది వారి వాదన. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం రద్దు చేసిన నోట్లలో 98.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏం చెబుతోంది? ఈ వాదనలన్నింటిలోనూ ఎంతోకొంత నిజముంది. అయితే, నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసింది? భవిష్యత్తులో ఏ విధమైన ప్రభావం చూపబోతోందనే విషయాన్ని ఫ్రీడ్మన్ సిద్ధాంతం ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రీడ్మన్ సిద్ధాంతం ‘క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ’ ప్రకారం.. ఎంవీ = పీవై ఇందులో ఎం అంటే వ్యవస్థలో ఉన్న నగదు; వీ అంటే నగదు చెలామణీ వేగం; పీ అంటే ధరల స్థాయి; వై అంటే ఉత్పత్తుల నిజవిలువ. ఈ సిద్ధాంతాన్ని సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రజల దగ్గర నగదు(పీ) తగ్గినప్పుడు, డబ్బు చేతులు మారే వేగం(వీ) కూడా తగ్గుతుంది. పీ, వీ తగ్గినప్పుడు ఆటోమాటిక్‌గా వస్తువుల ధరలు(పీ) కూడా తగ్గుతాయి. అందుకు అనుగుణంగానే నోట్లరద్దు తర్వాత కూరగాయలు, గుడ్లు, ఆహార పదార్థాల ధరలు కొంతవరకు తగ్గాయి. ఫ్రీడ్మన్ చెప్పినదాని ప్రకారం ధరలు తగ్గితే ఆదాయం కూడా తగ్గుతుంది. నోట్లరద్దు జరిగినప్పుడు మొదటగా ప్రజల వద్ద నగదు లభ్యత తగ్గింది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం కూడా తగ్గింది. అదే సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. వీటన్నింటి ఫలితంగా జీడీపీ వృద్ధిరేటు తగ్గింది. ఈ వివరాలన్నింటినీ, నోట్ల రద్దు నేపథ్యంలో, ఫ్రీడ్మన్ సిద్ధాంతం ఆధారంగా అధ్యయనం చేస్తే.. నోట్లరద్దు వల్ల ద్రవ్యోల్బణం లేదా ప్రతిద్రవ్యోల్బణం పెరగడం తాత్కాలికమేనని, భవిష్యత్తులో వాటిపై నోట్లరద్దు ప్రభావం ఉండబోదన్న విషయం తేలుతుంది. ఇదే విషయాన్ని నోట్లరద్దు సమర్థకులు ప్రస్తావిస్తున్నారు. నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగమనంలోనో లేక ప్రతికూల గమనంలోనో సాగినా.. దీర్ఘకాలంలో మాత్రం నోట్ల రద్దు ప్రభావం ఎంతమాత్రం ఆర్థికవ్యవస్థపై, జీడీపీ వృద్ధి రేటుపై ఉండబోదని వారు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్‌లో నగదు లభ్యత, జీడీపీ మధ్య నిష్పత్తి ఎక్కువగా ఉంటుందన్నది గమనించాల్సిన విషయం. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఆగస్టుకు ఏకంగా 5.7 శాతానికి చేరడం తెలిసిందే. నోట్లరద్దు జరగకపోయుంటే వృద్ధి రేటు 8% కంటే ఎక్కువగా ఉండేదని కొందరు ఆర్థిక వేత్తలు అంటున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించేవారు జీడీపీ వృద్ధిరేటులో చోటు చేసుకున్న భారీ తగ్గుదలను ఉదాహరణగా చూపుతుండగా.. రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తున్నవారు ‘నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం లేదా ప్రతిద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలంలో జీడీపీ సాధారణ వృద్ధి స్థాయికి వస్తుంది’ అన్న ఫ్రీడ్మన్ సిద్ధాంత ఫలితాలను ఉటంకిస్తూ.. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా వర్తిస్తుందని వాదిస్తున్నారు. అయితే, దీర్ఘకాలంలో ఒనగూడే ప్రయోజనాలను పక్కనపెడితే, తాత్కాలికంగానైనా.. జీడీపీ వృద్ధిరేటుపై నోట్ల రద్దు చూపిన ప్రతికూల ప్రభావాన్ని విస్మరించలేం. -
కాంగ్రెస్‌కే బ్లాక్‌డే: కిషన్‌రెడ్డి
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తుంటే, కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ మాత్రమే ఆందోళన చెందుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా కాంగ్రెస్ పార్టీ కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తమ కడుపుమంటను బయట పెట్టుకున్నారని అన్నారు. అవినీతిపరులకు కొమ్ముకాస్తూ పెద్దనోట్ల రద్దును బ్లాక్ డే గా ప్రకటించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నో కుంభ కోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌పార్టీకే తప్ప దేశప్రజలకు బ్లాక్‌డే కాదని అన్నారు. -
‘నోట్ల రద్దు’ నిరసనపై వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట జరిగిన పెద్ద నోట్లరద్దు అంశం శాసనసభలో కాసేపు వేడి పుట్టించింది. నోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య జనం, వ్యాపారులు, రైతులపై పడిన ప్రభావంపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచా రి తిరస్కరించారు. దీనిపై నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేయడం, అందుకు బీజేపీ అభ్యంతరం తెలపడం, మధ్యలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవడం.. సభలో కొద్దిసేపు దుమారం రేపింది. ప్రశ్నోత్తరాలు, విద్యుత్‌పై సీఎం చేసిన ప్రకటన అనంతరం కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ, వాయిదా తీర్మానం తిరస్కరించినందున నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి హరీ శ్ రావు జోక్యం చేసుకొని, తిరస్కరణ తర్వాత అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రరారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు నిరసనకు అవకాశం ఇవ్వవద్దం టూ స్పీకర్‌ను కోరారు. గందరగోళం మధ్యే కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. ‘నోట్ల రద్దుతో సామాన్య ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక దీనిపై సభలో చర్చించాలి’ అని అనడంతో మళ్లీ బీజేపీ సభ్యులు అభ్యంతరం పెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితిపై చర్చిద్దాం: కేసీఆర్ సీఎం మాట్లాడుతూ, ‘ఈ విషయంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలు, ప్రజలపై నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభా వం ఒక్కో రీతిగా ఉంది. దీనిపై బీఏసీలో చర్చించాలని జానారెడ్డి కోరారు. చర్చ పెట్టా లని మేము కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నోట్లరద్దు, జీఎస్టీ ప్రభావంపై చర్చిద్దాం. దీనిపై జానారెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించినందున నిరసన తెలుపుతా మంటున్నారు, తెలపనివ్వండి’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఉత్తమ్‌కు అవకాశం ఇచ్చారు. ‘ప్రధాని నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, తీవ్ర నష్టం జరిగింది. నోట్ల రద్దు ప్రభావం, తుగ్లక్ నిర్ణయంపై సభలో తీర్మానం చేద్దాం’ అంటూ ఉత్తమ్ కొనసాగిస్తుండగానే మైక్ కట్ చేశారు. నిరసన తెలపాలనుకుంటే అది చెప్పాలి కానీ, ఉపోద్ఘాతం ఎందుకంటూ సీఎం చురకలు అంటించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. కాగా, ‘నోట్ల రద్దు’ ప్రభావంపై చర్చించాలంటూ మండలిలో కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించవద్దని చెప్పి చైర్మన్ స్వామిగౌడ్ సభను నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
నోట్ల రద్దుపై అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా వాటి పర్యవసానాలకు సంబంధించి ఎన్ని కథనాలనైనా రాసుకోవచ్చు. కాకపోతే సాకూల కథనాలకన్నా ప్రతికూల కథనాలే ఎక్కువగా ఉంటాయి. కోటానుకోట్ల నల్లడబ్బును దాచుకున్న అపర కుబేరులను దెబ్బతీయడం కోసం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం వారికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో తెలియదుగానీ పేద, మధ్య తరగతి ప్రజల పొట్టలను ప్రత్యక్షంగా కొట్టడమే అందుకు కారణం. ఈ నిర్ణయం కారణంగా దేశ రాజకీయాల్లో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. 2014లో బీజేపీ అఖండ విజయంతో ఎవరికివారే యమునాతేరే చందంగా విడిపోయిన మితవాద, అతివాద, మధ్యేవాద పార్టీలన్నీ పెద్ద నోట్ల రద్దుతో ఏకమయ్యాయి. పెద్ద నోట్ల రద్దయిన నేటి రోజును పాలకపక్షం బ్లాక్‌మనీ డేగా పాటిస్తుండగా, ఏకమైన విపక్షం బ్లాక్‌డేగా పాటిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్నవారితోపాటు ఆదిలో ప్రశంసించి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నవారు, ఆది నుంచి ఇప్పటి వరకు ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. అమర్థ్యసేన్, జీన్ డ్రెజ్, ప్రభాత్ పట్నాయక్ లాంటి వామపక్షవాదులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్‌కు చెందిన అజయ్ షా, ఇలా పట్నాయక్, దేవాంషు దత్తా, అమిత్ వర్మ లాంటి ఆర్థిక నిపుణులు కూడా దీన్ని ప్రైవేటు ప్రాపర్టీ మీద దాడిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన సదానంద్ ధూమే ఆదిలో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. మధ్యలో నిర్లిప్తత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కల్పించిందని వాపోతున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్ష, మితవాద, సెంటర్ పార్టీలు ఏకం కావడమే కాకుండా గురుచరణ్ దాస్, దీపక్ పటేల్ లాంటి వ్యాపారవేత్తలు కూడా ఒక్కటయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మొదట సమర్థించిన వారు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడానికి ప్రభుత్వ నిర్ణయం కారణమైందని విమర్శిస్తున్నారు. లారీ సమ్మర్స్, పాల్ కుర్గ్‌మన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి అంతర్జాతీయ పరిశీలకులు కూడా మోదీ నిర్ణయాన్ని ఇప్పుడు విమర్శిస్తున్నారు. మోదీ ప్రభుత్వంతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్న బివేక్ దెబ్రాయ్, సూర్జిత్ భల్లా, జగదీష్ భగవతీ లాంటి ఆర్థిక వేత్తలు ఇప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మూలిగే నక్కమీద తాటికాయ పండట్టు పెద్ద నోట్ల రద్దుకు జీఎస్టీ తోడవడంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు జీఎస్టీ అనంతరం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారో చూడాలి. -
నేడు బ్లాక్ డే
కామారెడ్డి క్రైం: నోట్ల రద్దు కారణంగా యేడాదికాలం పాటు దేశ ప్రజలకు కలిగిన కష్టాలకు నిరసనగా నోట్ల రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని బ్లాక్ డేగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందన్ అన్నారు. కామారెడ్డిలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బుధవారం నిజామాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటామన్నారు. మహాత్మానికి నివేదిక సమర్పిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, నాయకులు నల్లమడుగు సురేందర్, కారంగుల అశోక్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, గోనె శ్రీనివాస్, తిర్మల్‌రెడ్డి, ఐరేని నర్సయ్య, ఇసాక్‌షేరూ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డీమానిటైజేషన్.. చేదు నిజాలు
తమకు వచ్చిన చాలీచాలని జీతం మొత్తం ఖర్చు చేసి, మళ్లీ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మధ్యతరగతి వారే భారత్‌లో ఎక్కువ. ఈ జీవనశైలికి దాదాపు అలవాటుపడి, సమాజంలో ఓ భాగంగా ఇమిడిపోయింది మధ్య తరగతి బడుగు జీవి జీవితం. ఇక లిక్విడ్ డబ్బు విషయానికొస్తే అకౌంట్లో సొమ్ము పడిన మరుక్షణమే ఎప్పుడు డ్రా చేద్దామా అనుకోవడము కూడా మధ్యతరగతిజీవికి సహజమే. అద్దె, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, పెట్రోల్, డీజిల్, ఇంట్లో సరుకులు, ఆసుపత్రుల ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు, ఇంట్లో అవసరాలకు, ఖాతాలో తీసుకున్న వస్తువులకు నెలనెలా కడుతున్న ఈఎంఐలు..ఇలా చెబుతూ పోతుంటే.. చివరకు జేబులో ఏమీ మిగలకపోయినా అన్ని చోట్ల డబ్బు కట్టాములే అనే ఏదో తెలియని ఆనందంలో చిన్న, మధ్య తరగతివాసులు బతికేస్తున్నారు. ప్రతి రోజు వార్తల్లో రూ. లక్షల దగ్గరి నుంచి మొదలు పెడితే రూ. లక్షల కోట్ల వరకు కుంభకోణాలు జరుగుతున్నాయని వింటున్న సామాన్యునికి ఏదో తెలియని కోపం. తాము ఇంత కష్టపడి బతుకుతుంటే కొందరు మాత్రం అక్రమార్జనతో కోటాను కోట్లు కూడబెడుతున్నారని సమాజం మీద కొంత అసహనం. సరిగ్గా అదేసమయంలో నోట్ల రద్దు వార్త అదికూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చింది. నల్ల డబ్బుపై నవంబర్ 8న పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం అన్ని వర్గాలనూ నివ్వెరపరిచింది. గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చేసిన పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలేమిటో తెల్లారి రోడ్డెక్కేవరకూ చాలామందికి అర్ధం కాలేదు. రద్దయిన పెద్ద నోట్లు ఈ క్షణం నుంచి చిత్తు కాగితాలతో సమానమని స్వయానా దేశ ప్రధానే ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. 'దేశ చరిత్రలో జాతి నిర్మాణానికి సంబందించిన ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్నే వస్తాయి. అందులో పాలు పంచుకునే క్రమంలో చిన్న చిన్న కష్టాలు పట్టించుకోకండి. ఉగ్రవాదం, నల్లధనం, అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలి. ఈ జాడ్యాలు మానని పుండులా మారాయి. జాతిని తొలిచేస్తున్నాయి. వీటిపై పకడ్బందీగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు దేశానికి అతిపెద్ద ముప్పు' అవినీతిని ఊడ్చేద్దాం అంటూ మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇక అక్రమమార్గాల్లో ఇష్టానుసారంగా డబ్బు సంపాదించిన వారి పని అయిపోయింది. రేపో మాపో అందరూ దొరికిపోతారు. సమాజంలో మార్పు తథ్యం అంటూ తొలుత సామాన్యుడు ఆనందంలో మునిగితేలాడు. రోజులు గడుస్తున్నాయి. మార్పు సంగతి దేవుడెరుగు. సామాన్యుడి ఆనందం పూర్తిగా తగ్గడం ప్రారంభమైంది. ఏ చిన్న అవసరానికైనా ఎక్కడికెళ్లినా లిక్విడ్ క్యాష్ కోసం అడిగే వారే. కార్డుతో డబ్బు కడతామంటే ఏదో పర్సంటేజ్ కట్టాలి అని అడిగే వారే. సరెలే డబ్బు డ్రా చేసి ఖర్చులకు వాడుకుందామంటే ఏటీఎంలు ఒక్కటీ పని చేయవు. బ్యాంకుల్లో డ్రా చేద్దామని వెళితే భారీ లైన్లు. పెళ్లి-చావు ఖర్చులకూ సామాన్యుడికి తిప్పలే ఇక ఏదైనా ఫంక్షన్ లాంటివి ఉంటే ఇక వారి సంతి అంతే. పెళ్లిళ్ల దగ్గరి నుంచి చావు కార్యక్రమాల వరకు అన్ని చోట్ల నోట్ల కష్టాలే. చెమటోడ్చి సంపాదించిన చాలీ చాలని జీతాన్ని డ్రా చేయాలంటే కఠోరంగా శ్రమించాల్సిందే. ఒకవేళ డబ్బు దొరికినా ఆ ఆనందం ఎంతోసేపు ఉండేది కాదు. రూ. 2000 నోటు తీసుకొని ఎక్కడికి వెళ్లినా చిల్లర సమస్యే. మధ్య తరగతికి చెందిన వారు సాధారణంగా ఏదైనా కొనాలనుకుంటే వంద రూపాయాల్లోపో మరీ కాదనుకుంటే ఓ ఐదు వందలలోపో కొనుగోలు చేస్తారు. చాలా సార్లు మాత్రం రూ. 2000 నోటుతో ఎక్కడైనా ఏదైనా కొనుగోలు చేయడానికి వెళితే మాత్రం తీసుకునే వారు కరువయ్యారు. బ్యాంకు క్యూలైన్లోనే ఓ వ్యక్తి మృతి. పలానా ఉర్లో డబ్బులేక ఆగిపోయిన ఓ అమ్మాయి పెళ్లి. అంతిమ సంస్కారాలకు కూడా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడ్డ కుటుంబం. డబ్బు లేక ఆసుపత్రిలో వైద్యం అందని రోగులు. డబ్బు డ్రా చేయడానికి వంద కిలో మీటర్లు ప్రయాణించి పలానా వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చదివినా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ వార్తలు అన్ని రాష్ట్రాల్లో సర్వసాధారణమయ్యాయి. అకౌంట్లో డబ్బు ఉండి కూడా డిమోనిటైజేషన్ తర్వాత సామాన్యుడు పడ్డ బాధలే దర్శనమిచ్చాయి. నల్ల కుభేరులు దొరికారా? ముందస్తు సమాచారం లేకుండా అంత పెద్ద నిర్ణయాన్ని వెల్లడించడం తప్పులేదు. కానీ, సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోలేకపోవడం మాత్రం కచ్చితంగా తప్పిదంగా భావించవచ్చు. ఓ వైపు కొంత మంది బ్యాంకు సిబ్బంది సమయానికి మించి శ్రమిస్తుంటే మరికొందరు మాత్రం 'కంచే చేనును మేసింది' అన్న చందంగా డబ్బున్న వాళ్లతో కుమ్మక్కాయరన్న వార్తలు సామాన్యున్ని మరింత బాధపెట్టాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలబడితే కానీ, దొరకని రూ.2000 నోటు కొందరు బడాబాబుల ఇళ్లలో కుప్పలు కుప్పలుగా ఐటీదాడుల్లో బయటపడుతుంటే, మనం పడే నోట్ల కష్టమంతా నల్లధన రహిత భారతదేశం కోసమే కదా అని అనుకునే వారిని కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. బతకనేర్చినోడు ఎలాగైనా బతికేస్తాడు.. అనేలా.. నల్లకుభేరులు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి బంగారాన్ని, విదేశీ కరెన్సీని కొనుగోలు చేశారన్న వార్తలు వచ్చినప్పుడల్లా.. అయ్యో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించ లేకపోయిందా అంటూ ఓ చిన్న నిట్టూర్పు. డీమానిటైజేషన్ ప్రకటన వచ్చి నేటితో సరిగ్గా సంవత్సర కాలం గడిచింది. ఈ ఏడాదిలో కనీసం ఒక్క నల్లకుభేరుడినయినా ప్రభుత్వం పట్టుకుందా అంటే ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. దేశ చరిత్రలో జాతినిర్మాణానికి సంబంధించి ఇలాంటి సందర్భాలు మాత్రం రాకూడదని ప్రతి ఒక్కరు అనుకునేలా సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఉగ్రవాదం, నల్లధనం, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలంటే వ్యవస్థలో మార్పులు రావాలి కానీ, సామాన్యులని రోడ్డెక్కించాలా అంటూ పెద్దస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముందస్తుగా బ్యాంకులను బలోపేతం చేసి కఠిన నిబంధనలు పెట్టి, డీమానిటైజేషన్ లాంటి ఓ నిర్ణయాన్ని తీసుకుంటే సామాన్యుడికి కొంతలో కొంతైనా మేలు జరిగేదేమో. సాక్షి దినపత్రికలో వచ్చిన కొన్ని ఆసక్తికర వార్తలు.. కొన్ని కుటుంబాల్లో విషాదం నింపిన డీమానిటైజేషన్.. ప్రముఖుల కామెంట్లు.. సామాన్యుడి నోట్ల తిప్పలు -
నోట్లరద్దుతో ప్రయోజనాలు బోలెడు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకున్న నోట్ల రద్దు ద్వారా చాలా ప్రయోజనాలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. నల్లధనాన్ని వెలికితీయటం, దొంగనోట్లను చెలామణిలోనుంచి తీసేయటం, నగదు లావాదేవీలను తగ్గించటం వంటి లాభాలు జరిగాయంది. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఆర్థిక మూలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని.. దీంతోపాటుగా పన్ను పరిధి విస్తృతమవటం, అక్రమంగా సంపాదించినదంతా ఆర్థిక వ్యవస్థలోకి మార్చటం, డబ్బుకు జవాబుదారీ పెంచటం జరిగిందని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులకు నోట్లరద్దు నిర్ణయం ఊతమిచ్చిందని.. తద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారేందుకు ముందడుగు పడిందని తెలిపింది. కాగా నోట్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియాను ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా నియమించారు. -
20 వేల పన్ను రిటర్ను పత్రాలపై విచారణ
న్యూఢిల్లీ: నోట్లరద్దుకు ముందు, తర్వాత ఆదాయాల్లో భారీ తేడాలు ఉన్నాయనే అనుమానంతో 20,572 పన్ను రిటర్ను పత్రాలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. అలాగే పన్ను ఎగవేశారనే అనుమానం ఉన్న మరో లక్ష కేసులను కూడా విచారించనున్నట్లు అధికారులు సోమవారం చెప్పారు. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అక్టోబరు చివరి నాటికి రూ.1,883 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించింది. మొత్తం 541 బినామీ ఆస్తులను అధికారులు జప్తు చేయగా, వాటిలో అహ్మదాబాద్ కార్యాలయం పరిధిలో 136, భోపాల్ పరిధిలో 93 ఉండటం గమనార్హం. బినామీ ఆస్తులను కలిగిఉన్న వారిపై ఐటీ కఠిన చర్యలు కొనసాగుతాయని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. -
‘డొల్ల’తనం బట్టబయలు!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తరువాత సుమారు 35 వేల కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, ఆ తరువాత విత్‌డ్రా చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. అక్రమ నగదు ప్రవాహాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత కార్యకలాపాలకు దూరంగా ఉన్న సుమారు 2.24 లక్షల కంపెనీల పేర్లను అధికారిక రికార్డుల నుంచి తొలగించి, 3.09 లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నకిలీ డైరెక్టర్లు కార్పొరేట్ కంపెనీల్లో చేరకుండా నిరోధించేందుకు కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపింది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు గత నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బట్టబయలైన డొల్ల కంపెనీలు, వాటి డైరెక్టర్ల వివరాలు, నగదు జమ, ఉపసంహరణలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్రం ఆదివారం విడుదల చేసింది. ఆర్థిక నేరాలు, అకౌంటింగ్ అవకతవకల కట్టడికి పలు చర్యలను ప్రకటించింది. ముఖ్యాంశాలు.... ► 56 బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం నోట్ల రద్దు తరువాత 35 వేల కంపెనీలు, 58 వేల ఖాతాల ద్వారా రూ.17 వేల కోట్లను డిపాజిట్ చేసి విత్‌డ్రా చేశాయి. ► వాటిలో నవంబర్ 8న నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్న ఓ కంపెనీ ఆ తరువాత రూ. 2,484 కోట్లు డిపాజిట్ చేసి ఉపసంహరించుకుంది. ► ఒక కంపెనీకి ఏకంగా సుమారు 2,134 ఖాతాలున్నాయి. ► ఇలాంటి కంపెనీలకు సంబంధించిన సమాచారం దర్యాప్తు సంస్థలకు అందజేత ► రిజిస్ట్రేషన్ రద్దయిన కంపెనీల ఆస్తులను తిరిగి రిజిస్ట్రేషన్ చేయొద్దని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ ► కనీసం రెండేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం క్రియాశీలకంగా లేని సుమారు 2.24 లక్షల కంపెనీల రద్దు. వాటి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల అమ్మకాలపై ఆంక్షల విధింపు ► వేటు పడిన వారిలో 3 వేలకు మందికి పైగా డైరెక్టర్లు ఒక్కొక్కరు నిబంధనలకు విరుద్ధంగా 20కి పైగా కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ► నకిలీ డైరెక్టర్లను నియంత్రించడానికి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్)ని వారి ఆధార్, పాన్‌తో అనుసంధానించేందుకు యత్నాలు ప్రారంభం ► 2013–14 నుంచి 2015–16 మధ్య కాలంలో వార్షిక రిటర్నులు దాఖలు చేయని కంపెనీల డైరెక్టర్లపై అనర్హత వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం ► చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్ల నియంత్రణ వ్యవస్థలో మార్పులు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ► ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు పరిశీలిస్తూ అకౌంటింగ్ ప్రమాణాలు నిర్ధారించేందుకు, తప్పులకు పాల్పడే నిపుణులపై చర్యలు తీసుకునేందుకు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ(ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటుకు చర్యలు ముమ్మరం ► తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఓ) ఆధ్వర్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. -
నోట్ల రద్దుపై నవంబర్ 8న ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దు అమల్లోకి తెచ్చి ఏడాదవుతున్న సందర్భంగా నవంబర్ 8న ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో సోమవారం పలు విపక్ష పార్టీలు పార్లమెంటులో సమావేశమై సంయుక్త కార్యాచరణపై చర్చించాయి. కాంగ్రెస్, వామపక్ష, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, జేడీయూ (శరద్ యాదవ్) పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘భారీ ర్యాలీ కోసం ఇది తొలి సమావేశం. 18 విపక్ష పార్టీలతో చర్చించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తాం’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా శరద్ యాదవ్‌పై అనర్హత వేటువేస్తే ఏం చేయాలనే దానిపైనా సమావేశంలో చర్చించారు. -
నోట్లరద్దును సమర్థించడం తప్పే... క్షమించండి
తమిళసినిమా: ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థించడం తన తొందరపాటు, తప్పేనంటూ నటుడు కమల్‌హాసన్ ప్రజలను క్షమాపణలు కోరారు. మోదీ కూడా మొండిపట్టు పట్టకుండా తన తప్పును ఒప్పుకోవాలని ఆయన అన్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత నవంబర్ 8 రాత్రి మోదీ ప్రకటన చేయడం తెలిసిందే. ఆనంద వికటన్ అనే తమిళ వారపత్రికలో కమల్ తాజాగా ఓ వ్యాసం రాస్తూ ‘తొందరపాటుతో అప్పట్లో నోట్లరద్దును సమర్థించాను. ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న నా మిత్రులు కూడా అప్పుడే నన్ను తప్పుబట్టారు. తప్పులు ఒప్పుకోవడం, సరిదిద్దుకోవడం గొప్ప నేతల లక్షణాలు. మోదీ తన తప్పును ఒప్పుకుంటారేమో వేచిచూద్దాం’ అని పేర్కొన్నారు. -
నల్ల’ దొంగల కోసమే నోట్లరద్దు!
లింఖేడ (గుజరాత్): నల్లధనం దాచుకున్న దొంగలకు సాయం చేసేందుకే ప్రధాని పెద్దనోట్లను రద్దుచేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అదొక ఏకపక్ష, వెర్రి చర్య అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో రాహుల్ బుధవారం దాహొద్ జిల్లాలోని లింఖేడలో సభలో మాట్లాడారు. ‘నోట్లరద్దుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు పూర్తిగా ధ్వంసం కాలేదని మోదీ తెలుసుకున్నారు. వారి జీవితాలను మరింత నాశనం చేయడానికే జీఎస్టీ తెచ్చారు’ అని రాహుల్ దుయ్యబట్టారు. జీఎస్టీపై జాగ్రత్తగా వ్యవహరించాలనీ, ఎక్కువ సంఖ్యలో శ్లాబులు పెట్టి దానిని ప్రతిబంధకంగా మార్చవద్దని ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచించిందని చెప్పారు. నోట్లరద్దుతో దేశమంతా ఇబ్బందులు పడ్డసమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ కంపెనీల ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపించారు. మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ విద్య, ఆరోగ్య రంగాలపై ఖర్చుచేయాల్సిన నిధులను పారిశ్రామిక వేత్తల కోసం వెచ్చించారన్నారు. ‘అచ్ఛేదిన్’ మోదీ, అమిత్ షాలకు మాత్రమేనన్నారు. -
అవినీతిపై రాజీలేని పోరు
న్యూఢిల్లీ: అవినీతిపై తమది రాజీలేని పోరాటమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అవినీతి విషయంలో తనకు బంధువులు ఎవరూ లేరన్న ప్రధాని.. అవినీతిపరులైన నాయకులెవరినీ వదలబోమని హెచ్చరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వంటి సంప్రదాయ రాజకీయ విధానాల స్థాయి నుంచి పార్టీ ఎదగాలి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలకు అతీతంగా చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచాలి. ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే దిశగా కృషి చేయాలి’ అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాలకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు ఉపముఖ్యమంత్రులు, 60 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అవినీతి, పేదరికం, కులతత్వం, మతతత్వం, ఉగ్రవాదాల అంతమే లక్ష్యంగా పేర్కొంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. మోదీ ప్రసంగ వివరాల్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. ‘రాజకీయాలు ప్రజల జీవితాల్ని బాగుచేయాలి. పేదల సంక్షేమం కోసం పాటుపడాలి. ఎన్నికలకు అతీతంగా బీజేపీని బలోపేతం చేయాలి. అభివృద్ధిని ఆ పార్టీ విశ్వసిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాద నిరోధం, నల్లధనంపై చర్యలు, డోక్లాం వివాద పరిష్కారంపై ఆయన మాట్లాడారు. ఎలాంటి గందరగోళం లేకుండానే డోక్లాం సమస్య పరిష్కారమైందని, ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ఉగ్రపోరు కొనసాగుతుందని చెప్పారు. ‘అవినీతిపై పోరులో రాజీపడేది లేదు. అవినీతిపరులు ఎవరినీ విడిచిపెట్టం. అవినీతి విషయంలో నాకెవరూ బంధువులు లేరు’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును తప్పుపడుతూ.. సరైన ఆధారాలు లేకుండా.. పరుషమైన ఆరోపణలు చేస్తున్నారని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అధికారాన్ని అనుభవించడమే లక్ష్యంగా పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వ్యవహరించిందని, ఇప్పుడు ప్రతిపక్షంగా ఎలా ఉండాలో తెలియడం లేదని తప్పుపట్టారు. మూడేళ్లుగా ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉందని, కేవలం గత మూడు నెలలుగా తగ్గుదల కన్పిస్తోందని, ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. పనితీరునే బీజేపీ నమ్ముకుంది: అమిత్ షా అంతకుముందు కార్యవర్గ భేటీని ప్రారంభిస్తూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. రాజకీయాల్లో పనితీరును బీజేపీ నమ్ముకుంటే.. కాంగ్రెస్ మాత్రం బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాలపై ఆధారపడిందని విమర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ సాధారణ కుటుంబం నుంచి వచ్చినా వారి కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. ఆరు సూత్రాల ఎజెండాకు ఆమోదం 2022 నాటికి నవభారతాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను నిజం చేసేందుకు పేదరికం, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం, అవినీతిని రూపుమాపడం లక్ష్యంగా పేర్కొంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని కార్యవర్గ భేటీ ఆమోదించింది. సమావేశ తీర్మాన వివరాల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడిస్తూ.. స్వచ్ఛ భారత్ కూడా ఆ ఎజెండాలో భాగమని చెప్పారు. ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనల్ని నివృత్తి చేయాలని కోరడంతో పాటు జీఎస్టీ అమలును, నోట్ల రద్దును తీర్మానంలో పార్టీ ప్రశంసించిందని తెలిపారు. తీర్మానంలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► రోహింగ్యా సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి మద్దతు. దేశంలోని 125 కోట్ల ప్రజల భద్రత విషయంలో రాజీపడకూడదు. ► ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ప్రయత్నాన్ని అడ్డుకోవడంపై ఆవేదన.. ఈ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధిస్తుందని ఆశాభావం.. ► అవినీతి, నల్లధనంపై చేసిన వాగ్దానాల్ని ప్రభుత్వం నిలబెట్టుకుంది. పారదర్శక ఆర్థిక వ్యవస్థకు నోట్ల రద్దు బాటలు వేసింది. జీఎస్టీ అమలు ప్రశంసనీయం. ► డోక్లాం వివాద పరిష్కారంతో పాటు ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్త ప్రచారం, పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల గుట్టును బహిర్గతం చేయడంలో ప్రధాని మోదీ కృషి అమోఘం. ► మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ► బీజేపీ కార్యకర్తలపై హింసను తీర్మానంలో ఖండించిన కార్యవర్గ భేటీ.. కేరళ, పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలపై దాడుల్ని ప్రస్తావించారు. -
దేశంలో ఇదే అతిపెద్ద స్కాం...
న్యూఢిల్లీ : రూ 500 నోట్ల డిజైన్లు రెండు రకాలుగా ఉండటంపై రాజ్యసభలో మంగళవారం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఆర్బీఐ రెండు డిజైన్లు, సైజ్‌లతో రూ 500 నోట్లను ముద్రించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొంది. కేంద్రం నోట్ల రద్దు ఎందుకు చేపట్టిందో తమకు ఇప్పుడు అర్ధమైందని, ఆర్బీఐ రెండు డిజైన్లలో రూ 500 నోట్లను ముద్రించడం దారుణమని సభలో ఆయా డిజైన్లను ప్రదర్శిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. పార్టీ కోసం ఒకటి, ప్రభుత్వం కోసం మరొకటి అంటూ తాము రెండు రకాల నోట్లను ఎన్నడూ ముద్రించలేదని మరో నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశానికి తృణమూల్, జేడీయూ సభ్యులు మద్దతుగా నిలిచారు.కాంగ్రెస్ సభ్యుల వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. కరెన్సీపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భారీస్ధాయిలో నోట్లు ముద్రించే క్రమంలో ఒకటీ అరా నోట్లు డిజైన్, సైజ్‌లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండటం సహజమేనన్నారు. -
నోట్ల రద్దుతో తెలంగాణ ప్లాంట్ వాయిదా
ఇంటెక్స్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్ నిధి మార్కండేయ విపణిలోకి ఏసీలు విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ను పెద్ద నోట్ల రద్దు వెనక్కిలాగేసింది. గృహ, ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోళ్లు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతాయని.. అయితే నోట్ల రద్దుతో వ్యాపారం క్షీణించిందని దీంతో తెలంగాణ ప్లాంట్ ఏర్పాటును వాయిదా వేశామని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్ నిధి మార్కండేయ తెలిపారు. బుధవారమిక్కడ ఎయిర్ కండీషనర్లను విడుదల చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తర్వాత ప్లాంట్ ఏర్పాటుపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లోని కస్నా ప్లాంట్‌ను ప్రారంభించనున్నామని.. తొలి దశలో మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు, చార్జర్లు, ఎల్ఈడీ టీవీలు తయారు చేస్తామని చెప్పారు. 20 ఎకరాల్లోని ఈ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 35 మిలియన్లు. గతేడాది సంస్థ టర్నోవర్ రూ.6,400 కోట్లకు చేరుకుందని.. ఇందులో 33 శాతం దక్షిణాది, 8 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు. మొత్తం వ్యాపారంలో మూడేళ్ల నుంచి ఏటా 82 శాతం వృద్ధిని సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదిలో ఏసీల విభాగంలో రూ.800–1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి రష్యా, పలు సార్క్ దేశాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారు. ఏసీల విభాగంలోకి...: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్ తాజాగా ఎయిర్ కండీషనర్లు (ఏసీ)ల విభాగంలోకి అడుగుపెట్టింది. దక్షిణాది సినీ నటి కేథరిన్ ట్రెసా అలెగ్జాండర్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుధవారమిక్కడ విపణిలోకి ఏసీలను విడుదల చేసింది. సూపర్ సేవర్, స్లి్పట్, విండో ఏసీ 3 విభాగాల్లో 18 రకాల మోడల్స్ లభిస్తాయి. ధరల శ్రేణి రూ.21,990 నుంచి రూ.42,990 మధ్య ఉన్నాయి. ఇతర ఏసీలతో పోల్చితే 15 శాతం వేగంగా చల్లబడటంతో పాటూ 30 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయని తెలిపారు. -
‘జైట్లీకి ఆ విషయం తెలుసో లేదో చెప్పలేం’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ముందుగా సంప్రదించారా లేదా అనే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద చెప్పేందుకు ఆర్థికశాఖ నిరాకరించింది. అలాంటి విషయాలు తాము చెప్పలేమని నిరాకరించింది. 2016, నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక ప్రధాని మోదీనే ప్రధానంగా ఉన్నారా, మిగితా పెద్ద నేతలను, వారి శాఖలను సంప్రదించారా అనే విషయంలో ఇప్పటికీ పలు అనుమానాలున్నాయి. గతంలో పీఎంవో, రిజర్వ్‌బ్యాంకును ఇదే అంశంపై ప్రశ్నించినా ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపాయి. తాజాగా అరుణ్ జైట్లీకి ఈ విషయం తెలుసా అని పీటీఐ ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆర్థికశాఖ ఈ విషయాన్ని చెప్పేందుకు నిరాకరించింది. ఆర్థికమంత్రి, ఆర్థికశాఖ ముఖ్య సలహాదారు ద్వారా తెలుసుకోవాలనుకునే ఈ అంశం ఓ సెక్షన్ ప్రకారం ఆర్టీఐ పరిధిలోకి రాదని వివరణ ఇచ్చింది. భారతదేశ సమగ్రత, భద్రత, వ్యూహాత్మక అంశాలు, శాస్త్ర, ఆర్థికపరమైన అంశాలు, విదేశాంగ విధానాల్లో కొన్నింటిని ఆర్టీఐ ద్వారా తెలియజేయలేమని, అలా చేస్తే నేరాలు జరిగే అవకాశం ఉంటుందని బదులిచ్చింది. అయితే, ఏ సెక్షన్ ప్రకారం చెప్పకూడదో అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. -
రూ. 70 వేల కోట్ల బ్లాక్‌మనీ బయటపడింది
కటక్: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలో 70 వేల కోట్ల రూపాయల నల్లధనం బయటకు వచ్చిందని నల్లధనంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిప్యూటీ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్ వెల్లడించారు. ఏప్రిల్ మొదటివారంలో సుప్రీం కోర్టుకు ఆరో మధ్యంతర నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్ట ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చారు. కటక్‌లో ఆర్థిక శాఖకు సంబంధించిన పలు ప్రభుత్వ సంస్థల అధికారులతో జస్టిస్ పసాయత్ సమావేశమయ్యారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి గత రెండేళ్లుగా సిట్ మధ్యంతర నివేదికల ద్వారా పలు ప్రతిపాదనలు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ఈ ప్రతిపాదనలను ఆమోదించిందని, కొన్ని పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. లెక్కల్లో చూపకుండా 15 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. సిట్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, నగల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆధ్యాత్మిక వేత్తలు, మాఫియా డాన్ల ఆర్థిక అవకతవకలపై విచారణ చేయాల్సిందిగా ఒడిశా క్రైం బ్రాంచ్ అధికారులను ఆదేశించారు. -
13 లక్షల ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్లను వెలికి తీసే చర్యల్ని వేగవంతం చేసింది. బ్యాంకుల్లో రద్దయిన నోట్ల భారీ డిపాజిట్లను గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా మరింత చురుగ్గా కదులుతోంది. 18 లక్షల ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్ము రూ.4.7లక్షల కోట్లుగా తేల్చింది. ఈ లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగింది.ఆదాయ లెక్కలతో సరిపోలని ఖాతాదారుల డిపాజిట్లపై వివరణ కోరుతూ 13 లక్షల మందికి ఎస్ఎమ్మెస్లు, ఈ మెయిల్స్ ద్వారా నోటీసులు పంపించినట్టు సీబీడీటీ అధికారి సుశీల్ చంద్ర గురువారం వెల్లడించారు. ఇది ఆపరేషన్ క్లీన్ మనీ లో ఇది మొదటి దశ అని చెప్పారు. ఈ నోటీసులకు 10 రోజుల్లోగా ఆన్ లైన్ లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 8 పెద్దనోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ/స్వచ్ ధన్ అభియాన్ అనే సాఫ్ట్వేర్ ప్రాజెక్టును ఆరంభించింది. రూ.5 లక్షలకు మించిన లావాదేవీలు అన్నింటినీ అనుమానాస్పద లావాదేవీలుగానే పరిగణించిన ఐటీ శాఖ ఇ- వెరిఫికేషన్ తరువాత సంతృప్తి చెందని ఖాతాలకు నోటీసులు పంపనున్నట్టు ప్రకటించింది. ఆ డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని సదరు ఖాతాదారులందరికీ ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎ్‌సలు పంపనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కోటి బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకు మిం చి నగదు జమ అయినట్లు తేల్చిన సంగతి తెలిసిందే. -
కొత్త కరెన్సీ నోట్లపై మరో ఆసక్తికర విషయం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాత నోట్ల రద్దుతో వినియోగంలోకి వచ్చిన కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ ఆమోదం ఎప్పుడు చెందిందో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన నోట్ల రద్దుకు సరిగ్గా ఐదు నెలల ముందు అంటే జూన్ 7వ తేదీన కొత్త రూ.2000, రూ.500 నోట్ల డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆర్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ టీవీ ఛానల్ వేసిన పిటిషన్‌కు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దుతో దేశంలో తీవ్రంగా నగదు కొరత ఏర్పడి, ప్రజలు నానా కష్టాలు పడ్డారు. వాస్తవానికి కొత్త నోట్ల డిజైన్‌కు గత ఏడాది మే 19న ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఆ తర్వాతే ఆ కొత్త నోట్లకు కేంద్రం కూడా తన ఆమోదాన్ని ప్రకటించిందని తెలిపింది. అయితే కొత్త 2వేలు, 500 నోట్లను ముద్రించేందుకు ఎంత కాలం పడుతుందని వేసిన ప్రశ్నకు మాత్రం ఆర్బీఐ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. సమాచారం వెల్లడించడం వల్ల దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని తన రిపోర్ట్‌లో పేర్కొంది. నోట్ల రద్దుపై జర్నలిస్టులు, కార్యకర్తలు వేసిన మరో ఆర్టీఐ ప్రశ్నకు కూడా సెంట్రల్ బ్యాంకు స్పందించింది. పెద్ద నోట్లను రద్దు చేయాలని నవంబర్ 8వ తేదీన కేంద్రానికి సూచన చేశామని, ఆ రోజు రాత్రే ప్రధాని మోదీ టెలివిజన్ స్పీచ్ ద్వారా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని చెప్పింది. -
కమీషన్ కోసం రూ.28 కోట్ల ‘మార్పిడి’
‘ముసద్దీలాల్’తో కలసి నీల్‌సుందర్ దందా డబ్బు డిపాజిట్ చేసి, తన ఖాతాలోకి డైవర్ట్ అరెస్టు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు రూ.100 కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దీలాల్ జ్యుయెలర్స్ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‌కు చెందిన అష్టలక్ష్మి గోల్డ్ బులియన్ నిర్వాహకుడు నీల్‌సుందర్ దందా వెలుగులోకి వచ్చింది. ఇతగాడు ముసద్దీ లాల్ యాజమాన్యంతో కలసి కుట్రపన్ని 30 శాతం కమీషన్‌కు రూ.28 కోట్ల పెద్దనోట్లు మార్పిడి చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో గురువారం నీల్‌సుందర్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాశ్ మహంతి ప్రకటించారు. 30 శాతం కమీషన్‌తో మార్పిడి.. నోట్ల రద్దు ప్రకటన తర్వాత కొందరు నల్లబాబులకు చెందిన రూ.28 కోట్లను బంగారం రూపంలో మార్చడానికి నీల్‌సుందర్ అంగీకరించాడని పోలీసులు చెప్తున్నారు. దీని నిమిత్తం 30 శాతం కమీషన్‌కు ఒప్పందం కుదుర్చుకున్న ఇతగాడు తన దందాకు సహకరిస్తే 10 శాతం చెల్లించేలా ముసద్దీలాల్ యాజమా న్యంతో ఒప్పందం చేసుకున్నాడు. డీమోనిటైజేషన్ ప్రకటన వెలువడిన నవంబర్ 8వ తేది రాత్రి ‘మూడు గంటల్లో వేల మంది కస్టమర్లకు బంగారం విక్రయించే’ప్రణాళికను సిద్ధం చేసుకున్న ముసద్దీలాల్ యాజమాన్యం నీల్‌సుందర్ ప్రతిపాదనలకు అంగీకరించింది. దీంతో ఆ మరుసటి రోజు ముసద్దీలాల్ అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి రూ.28 కోట్లు జమ చేసిన నీల్‌సుందర్ ఆ మేరకు బంగారం ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ మొత్తాన్ని ముసద్దీలాల్ యాజమాన్యం నీల్‌సుందర్ సంస్థకు చెందిన రెండు ఖాతాల్లోకి మళ్లించింది. ఈ విషయం గుర్తించిన సీసీఎస్ పోలీసులు ముసద్దీలాల్ సంస్థలకు అష్టలక్ష్మి సంస్థకు మధ్య బంగారం క్రయ విక్రయాలకు సంబంధించి డెలివరీ, రిసీవ్డ్ రసీదుల కోసం ఆరా తీశారు. అలాంటివి లేవని తేలడంతో ఈ మొత్తం సైతం మార్పిడికి సంబంధించిందని నిర్ధారించి నీల్‌సుందర్‌ను అరెస్టు చేశారు. -
ఉద్యోగనామ సంవత్సరం – 2017
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు నూతన సంవత్సరం కలసిరానుంది! దేశంలో వ్యవస్థీకృత రంగం 8.75 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనుంది. అయితే, సగటున వేతన పెంపు మాత్రం 9 శాతానికే పరిమితం అవుతుందని నిపుణుల అంచనా. డీమోనిటైజేషన్‌తో రియల్టీ, నిర్మాణం, మౌలిక రంగం, హైఎండ్ ఆటోమొబైల్స్ రంగంపై దీర్ఘకాలంలో గణనీయ ప్రభావమే ఉంటుందని... అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు మరిన్ని వ్యవస్థీకృత ఉద్యోగాలను కల్పిస్తుందని మైహైరింగ్‌క్లబ్, జాబ్‌పోర్టల్ వెబ్సైట్లు ‘2017 సంవత్సరంలో ఉద్యోగ అవకాశాల ధోరణులు’ పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 21 మేజర్ పట్టణాల్లోని 6,790 కంపెనీల అభిప్రాయాలను సేకరించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తయారీ, ఇంజనీరింగ్ రంగం ఉద్యోగాల కల్పనలో అన్నిటికంటే ముందుంటుందని మైహైరింగ్ క్లబ్, జాబ్‌పోర్టల్ సంస్థల సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. ఈ సర్వే ప్రకారం ఈ ఏడాదిలో 9 శాతం మేర వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తయారీ, ఇంజనీరింగ్ రంగంలో 9.9 శాతం, ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో సగటున 9.7 శాతం వేతన వృద్ధి ఉండవచ్చనే అంచనాలు వ్యక్తమయ్యాయి. -
ఒక్కసారి ‘చెక్’ చేసుకోండి..!
పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరెన్సీ కష్టాలే! కరెన్సీ కొరతతో విత్‌డ్రా, చేయాలన్నా.. ఎవరికైనా చెల్లింపులు జరపాలన్నా నానాతంటాలు పడాల్సివస్తోంది. దీంతో ప్రత్యామ్నాయాల్లో ఒకటిగా బ్యాంక్ చెక్కులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చెక్కుల వినియోగంలో జాగ్రత్తలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చెక్కువైపు చూస్తే... ఇలా చేయండి... తేదీ, ఎవరికి చెల్లిస్తున్నారన్న విషయం, ఆ మొత్తం అక్షరాలు, అంకెలు సహా అన్నీ సరిగ్గా నింపిన తర్వాతే చెక్కును మీరు ఇవ్వాలనుకున్న వ్యక్తికి ఇవ్వండి. మీ చెక్కు ఏదైనా పోతే, ఆ విషయాన్ని వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. ఆ నంబరుకు సంబంధించి చెక్కుకు డబ్బు చెల్లించవద్దని లిఖితపూర్వకంగా రిజిస్టర్ చేయండి. ఒకటికాకుండా పెద్ద సంఖ్యలో పోతే, ఆ సిరీస్ మొత్తంపై ఎటువంటి డబ్బూ చెల్లించవద్దని మీ బ్యాంక్ బ్రాంచీకి రిక్వస్ట్ పెట్టండి. ఏదైనా చెక్కుపై పొరపాటున ఏదైనా రాస్తే... అది పూర్తిగా చెల్లని విధంగా దానిపై స్పష్టంగా అడ్డంగా ‘క్యాన్సిల్డ్’ అని రాయండి. మీరు చెక్కు ఎవరికైనా ఇచ్చేముందు మీ అకౌంట్లో అందుకు సంబంధించి తగిన డబ్బు ఉండేలా చూసుకోండి. చెక్కును ఎప్పుడూ మీకు మీరుగానే రాయండి. చెక్కు రాసిన తర్వాత ఏదైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే... అదే చెక్కుపై అక్షరాలు దిద్దకండి. కొత్త చెక్కును వినియోగించండి. చెక్కుపై చెల్లింపులకు సంబంధించి అంకెలను రాసిన తర్వాత ‘/–’ గుర్తును తప్పనిసరిగా ఉంచండి. అకౌంట్ హోల్డర్‌గా మీ పేరు ఉన్న పై భాగంలోనే చెక్కుపై సంతకం చేయండి. ఇక వెనకవైపూ సంతకం తప్పనిసరి. చెక్కుపై ఏదైనా పేరు రాస్తాం.. లేక అంకెలు వేస్తాం. అయితే తరువాత అక్కడ ఏదైనా స్పేస్ (ఖాళీ) ఉండిపోతే తప్పనిసరిగా ఒక గీత గీసేయండి. దీనివల్ల ఎవ్వరూ అనధికార చేర్పులకు వీలుండదు. మీ చెక్కు ఎక్కడా దుర్వనియోగం కాకుండా తప్పనిసరిగా చెక్కు ఎడమవైపు పైన మూలగా అడ్డంగా ‘అకౌంట్ పేయీ‘ అని రాయండి. దీనితో మీరు ఏ అకౌంట్‌కు డబ్బు చెల్లించాలనుకుంటారో ఆ అకౌంట్లోకే మీ డబ్బు చేరుతుంది. బ్లూ లేదా బ్లాక్ కలర్ పెన్నులతో మీరు చెక్కుపై రాయాలనుకున్న అక్షరాలను స్పష్టంగా రాయండి. ఇక సంతకాల విషయంలో చాలా జాగ్రత్త. మీ బ్యాంక్ బ్రాంచీ అకౌంట్‌కు సంబంధించి మీ సంతకం ఎలా ఉందో అలానే చెక్కుపై సైతం సంతకం చేయాలి. ఎటువంటి తేడా ఉన్నా... చెక్కు బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రుణం లేదా బీమా ఆఫరింగ్స్‌కు ఉద్దేశించి చెక్కును ఇచ్చేటప్పుడు, థర్డ్ పార్టీ గుర్తింపును స్పష్టంగా నిర్ధారించుకోండి. ఇవి చేయొద్దు... చెక్కులపై ముందుగానే సంతకాలు పెట్టేసుకోవద్దు. చెక్కు దిగువ ఉండే ఎంఐసీఆర్ కోడ్ పాడయిపోయే పొరపాట్లు చేయొద్దు. చెక్కుపై ఏదైనా పేరు లేదా అంకెలు రాసిన తర్వాత, పక్కన మిగిలిన ఖాళీని అలానే వదిలేయకండి. అలాంటి ఏదైనా స్పేస్ (ఖాళీ) ఉండిపోతే తప్పనిసరిగా ఒక గీత కొట్టండి. దీనివల్ల ఎవ్వరూ అనధికార చేర్పులు చేయలేరు. చెక్కుపై దిద్దుళ్లు, కొట్టేసి మళ్లీ రాయడం వంటి తప్పులు చేయకండి. -
ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మోదీ
-
అత్యంత బాధ కలిగించే అంశమే: మోదీ
న్యూఢిల్లీ : తమ డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి ఉండటం అత్యంత బాధ కలిగించే అంశమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం కొంతమంది వద్దే కార్లు, బంగ్లాలు, లక్షలు ఉండటాన్ని ఎవరైనా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో 24 లక్షల మంది రూ.10లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ లెక్కలు ఇవేనని, దీన్ని ఎవరైనా నమ్ముతారా అని అన్నారు. చదవండి... (ఇకనైనా కరెన్సీ కష్టాలు తీరేనా?!) చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిజాయితీపరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ప్రజల హక్కులను రక్షించాలన్నారు. అలాగే నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చట్టాలను ప్రజలు గౌరవించడం, ప్రభుత్వానికి సహకరించడం ఏ దేశానికైనా శుభసూచకమని ప్రధాని పేర్కొన్నారు. అప్పుడే పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చక్కటి కార్యక్రమాలు చేయగలవన్నారు. బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ ప్రశంస బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అయితే నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయన్నారు. నల్ల నోట్ల రద్దును అవకాశంగా తీసుకున్న కొంతమంది అధికారులను క్షమించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇక కొందరు ప్రభుత్వ అధికారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని తాను కూడా అంగీకరిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం బ్యాంకులు చక్కటి పథకాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పేదలు, రైతులు, దళితులు, మహిళల సాధికారితకు కట్టుబడి ఉండాలన్నారు. నూతన సంవత్సర వరాలు దేశ ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చాలామంది పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు లేవన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద రెండు పథకాలు ప్రకటించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తామని, రూ.9 లక్షల వరకూ రుణాలపై 4శాతం వడ్డీ రేటు తగ్గింపు, రూ.12 లక్షల వరకూ ఇంటి రుణంపై 3 శాతం వడ్డీ తగ్గిస్తామని చెప్పారు. పది రోజులాగితే ఖాతాలోకి రూ.15 లక్షలు వస్తాయా? ఈ పథకం 2017 నుంచి అమల్లోకి వస్తుందని ప్రధాని వెల్లడించారు. అలాగే రూ.2లక్షల వరకు ఇంటి రుణంపై 2 శాతం రిబేట్, 3కోట్ల రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులు రుపే కార్డులుగా మార్పు, వచ్చే మూడు నెలల్లోగా కిసాన్ కార్డులుగా మారుస్తామన్నారు. ఎంపిక చేసిన పంట రుణాలపై 60 రోజుల వరకూ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోటి రూపాయల నుంచి రూ.2కోట్లకు పెంచుతున్నట్లు ప్రధాని తెలిపారు. గర్భవతులకు బ్యాంకు అకౌంట్లోనే డబ్బు గర్భవతులకు ఆరువేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రధాని శుభవార్త తెలిపారు. ఆ నగదును గర్భవతుల బ్యాంకు అకౌంటులోనే జమ చేయనున్నట్లు చెప్పారు. 650 జిల్లాల్లో గర్భవతులకు సరైన ఆహారం, టీకాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ల కోసం మరో పథకాన్ని తెస్తున్నామని, సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లు పదేళ్లపాటు ఉంచితే 8శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలంతా భీమ్ యాప్‌ను వినియోగించాలని ప్రధాని కోరారు. అలాగే రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించాలని, పార్టీ నిధుల్లో పారదర్శకత ఉండాలన్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలని, పార్టీలకు వచ్చే నిధుల్లో నల్లధనం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
ప్రధాని మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ: భారతదేశాన్ని నూతన దిశలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో స్వీకరించారని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నోట్ల రద్దు తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారని, అయితే ఆ నిర్ణయంతో నల్లధనం, అవినీతి రూపుమాసిపోతాయని తాను మరోసారి చెబుతున్నానని ప్రధాని అన్నారు. చదవండి... (ఇక వేలిముద్రే మీ గుర్తింపు!) ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా సాగితేనే దేశ భవిష్యత్తు ఉజ్వలం అవుతుందనడంలో సందేహం లేదని తెలిపారు. దేశంలో అమలవుతోన్న ఆర్థిక విధానంలో ఎన్నో లోపాలున్నాయని,. నగదు ఎక్కువగా చెలమణిలో ఉండటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయాన్నారు. అవినీతి, నల్లధనమూ పెరిగిందని అయితే నగదు రహిత విధానంతో ఈ సమస్యలన్నీ రూపుమాసిపోతాయని ప్రధాని పేర్కొన్నారు. భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా? ప్రధాని ప్రసంగంలోని ముఖ్య అంశాలు... కృత నిశ్చయంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం దీపావళి తర్వాత దేశం కీలక నిర్ణయం తీసుకుంది సమాజంలోని నల్లధనం, బ్లాక్ మార్కెటింగ్ నిజాయితీపరుల్నినిరాశపరిచాయి దేశవ్యాప్తంగా ప్రజలు ధైర్యంతో కష్టాలు ఎదుర్కొంటూ చెడుపై విజయం సాధించేందుకు పోరాడుతున్నారు నల్లధనంపై ఉక్కుపాదంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు స్వచ్ఛత దిశగా దేశం అడుగులు వేస్తోంది సమాజంలోని చెడు జీవితంలో భాగమైపోయిందనుకుంటున్నారు అవినీతిపై పోరాటం చేయడానికి దేశ ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు పెద్దనోట్ల రద్దు స్వచ్ఛ కార్యక్రమం నగదు రద్దుతో నిజాయితీపరులు కూడా కాస్త కష్టపడ్డారు సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైనది దేశప్రజలు సత్యాన్ని, నిజాయితీని నిరూపించుకున్నారు నవంబర్ 8 నుంచి ప్రజలు చెడుపై పోరాడుతున్నారు ప్రజల కష్టాలు దేశ భవిష్యత్ కు ప్రతీక నల్లధనంపై పోరాటంలో త్యాగ స్ఫూర్తిని చాటారు అవినీతి దేశానికి చీడలా పట్టింది బంగారు భవిష్యత్ కోసం ప్రజలు కష్టాలను ఓర్చారు సత్యం కోసం ప్రజలు, ప్రభుత్వాలు ఎలా పోరాడాయో తెలుసుకునేందుకు ఇది చారిత్రక ఉదాహరణ గడిచిన యాభై రోజులు ప్రజలు పడ్డ ఇబ్బందులు, బాధలు నాకు తెలుసు ప్రజల ఆశీస్సులతో బ్యాంకుల వద్ద సాధారణ స్థితికి ప్రయత్నిస్తున్నాం కొత్త సంవత్సరంలో మళ్లీ పూర్వస్థితిని తీసుకొస్తాం మీరు చూపిన ప్రేమ నాకు ఆశీర్వాదం లాంటిది బ్యాంకుల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు దృష్టి పెడుతున్నారు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కరెన్సీ కొరత బాధ కలిగించింది కరెన్సీ లేకపోవడంతో సమస్యలు వస్తాయి అలాగే అధికంగా కరెన్సీ ఉండటం కూడా సమస్యలకు దారితీస్తుంది రామ్ మనోహర్ లోహియ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి నేతలు చూపిన ధైర్యాన్ని, సాహసాన్ని, సహనాన్ని ప్రజలు చూపించారు -
రాత్రి 7.30 గంటలకు ప్రధాని ప్రసంగం
-
రాత్రి 7.30 గంటలకు ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 31 శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెద్ద నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ప్రధాని ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారన్న ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. కాగా పెద్దనోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టే చర్యల గురించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నోట్ల రద్దుతో సాధించిన విజయాలతోపాటు నష్టాలను కూడా వివరిస్తారని సమాచారం. నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం 2వేలు, 500 నోట్లను చలామణిలోకి తెచ్చింది. దీంతో పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు, నిరుపేదలు నానా కష్టాలు పడ్డారు. నోట్ల మార్పిడి గడువు కూడా శుక్రవారంతో ముగిసిపోయింది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని మోదీ చెప్తున్న విషయం తెలిసిందే. -
నోట్లరద్దు: మళ్లీ జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం!
న్యూఢిల్లీ: గత నవంబర్ 8న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కొత్త సంవత్సరానికి ముందే డిసెంబర్ 31 (శనివారం) ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నల్లధనం, అవినీతిని నిర్మూలించేందుకు నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దుతో దేశంలో చలామణిలో ఉన్న 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు, నిరుపేదలు నానా కష్టాలు పడ్డారు. బ్యాంకుల, ఏటీఎంలు పొడువైన క్యూలతో పోటెత్తాయి. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని ప్రధాని మోదీ చెప్తున్నారు. -
ఎవరెస్టు.. చిన్నబోయేటట్టు..
ఎవరెస్టు ఎత్తుతో పోలిస్తే దీని ఎత్తు 300 రెట్లు ఎక్కువ.. పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసేశారు. చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో ఇది 86 శాతం.. అంటే 2,203 కోట్ల నోట్లు.. మీకో విషయం తెలుసా? ఈ కరెన్సీ కొండ ముందు ఎవరెస్టు కూడా చిన్నబోవాల్సిందే. ఎందుకంటే.. ఈ నోట్లను ఒకదానిపై ఒకటి పెడితే.. ఎవరెస్టు ఎత్తుకు 300 రెట్లు ఎక్కువుంటుందట. ఒకదాని పక్కన ఒకటి రోడ్డులా పరిస్తే.. చంద్రుడి వద్దకు ఐదుసార్లు వెళ్లిరావచ్చట. అసలు రద్దయిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుంది? విభజించు.. 2001 వరకూ వాటిని తగులబెట్టేవారు. తర్వాత నుంచి పర్యావరణ అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. 2003 నుంచి రద్దయిన, పాడైపోయిన నోట్లను వేగంగా ప్రాసెస్ చేయడానికి కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లను (సీవీపీఎస్) పెట్టారు. అప్పటి గవర్నర్ బిమల్ జలాన్ హయాంలో ఇవి వచ్చాయి. ఒక్కో సీవీపీఎస్ గంటకు 60 వేల నోట్లను ప్రాసెస్ చేస్తుంది. బాగున్న నోట్లను జాగ్రత్తగా కట్ చేసి.. వాటిని కొత్త కరెన్సీ పేపర్ తయారీలో వాడతారు. విక్రయించు.. బాగోలేని, పనికిరాని నోట్లను కంప్రెస్ చేసి.. ఇటుకలుగా, బ్లాకులుగా మారుస్తారు. వీటిని పారిశ్రామిక అవసరాల నిమిత్తం విక్రయిస్తారు. ఇందుకోసం ఆర్బీఐ టెండర్లను పిలుస్తుంది. కిలో రూ.5–6 మధ్య విక్రయిస్తారు. వీటిని కొన్ని కంపెనీలు ఫర్నేస్‌లను మండించడానికి వాడతాయి. మరికొన్ని సాఫ్ట్ బోర్డుల తయారీకి వినియోగిస్తాయి. అంతేకాదు.. క్యాలెండర్లు, ఫైళ్లు, సావనీర్లు, పేపర్ వెయిట్లుగా వీటిని మారుస్తారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ బాపట్ల : పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలగపూడిలో నిర్వహించిన ధర్నాకు శుక్రవారం పనబాక ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముందస్తు కసరత్తు లేకుండా నోట్లు రద్దుచేయడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆన్లైన్లో నగదు నిర్వహణ చేపట్టాలని చెప్పే నాయకులు కొన్నిచోట్ల కమ్యూనికేషన్లు సరిగా లేవనే విషయంపై ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు. నోట్లు రద్దుపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. పనబాక లక్ష్మీతోపాటు బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జీ చేజర్ల నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు లేళ్ళ వెంకటప్పయ్య, మద్దిబోయిన తాతయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కోటా వెంకటేశ్వరెడ్డి, మాసా చంద్రశేఖర్ ఉన్నారు. -
ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!
-
ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!
న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దుపై ఆర్బీఐ మాటైనా మాట్లాడటం లేదని, దాని ప్రభావంపై కనీసం వివరణ ఇచ్చేందుకు కూడా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముందుకు రావడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఉర్జిత్ పటేల్. డిసెంబర్ 22న పాత నోట్ల రద్దు, దాన్ని ప్రభావంపై పూసగుచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫైనాన్స్ ముందు వివరించనున్నారు. పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్‌లో గురువారం ఉదయం 11 గంటలకు ఉర్జిత్ పటేల్ బ్రీఫింగ్ ప్రారంభమవుతుందని పార్లమెంట్ వెబ్సైట్ పేర్కొంది. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో వెసులుబాటులను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. సర్వీసు పన్నుల్లో రాయితీలు, డిజిటల్ పేమెంట్లు సులభతరం చేసేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ నగదుతో జరిగే లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలకు నగదు కొరత తీర్చడానికి సిస్టమ్‌లోకి మళ్లీ కొత్త రూ.2000, రూ.500 నోట్లను, చిన్న డినామినేషన్ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెడుతోంది. కానీ చిల్లర దొరకక ఓ వైపు, నగదు కొంతమంది చేతుల్లోకి వెళ్లి మరోవైపు సాధారణ ప్రజానీకం కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్వల్పకాలంలో కష్టాలు ఎదుర్కొన్నా, పాత నోట్ల రద్దు దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. ఆర్బీఐ వద్ద కూడా సరిపడ నగదు ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సినవసరం లేదని పేర్కొంటోంది. ఈ విషయాలన్నింటిపై ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. -
రూపాయికి పాలసీ రివ్యూ జోష్!
ముంబై: ఆర్బీఐ పాలసీ రివ్యూ అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ బాగా పుంజుకుంది. కీలక వడ్డీరేట్టు తగ్గనున్నాయనే అంచనాలతో 36పైసలు పైకి ఎగబాకింది. డాలర్ మారకపువిలువలో రూపాయి రూ. 68 స్థాయి నుంచి పుంజుకుంది. బుధవారం ఆరంభంలో 12 పైసల లాభంతో రూ. 67.78 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 8 పైసల లాభంతో రూ. 67.82 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం తర్వాత అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ కు బాగా డిమాండ్ పుట్టింది. దీంతో ప్రపంచ కరెన్సీలు పతనమయ్యాయి. దీంతో రూపాయి కూడా రూ.68 దిగువకు పతనమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ తర్వాత మొదటి సారి ఆర్ బీఐ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ రెండురోజులు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) సమీక్ష విధానాన్ని ప్రకటించనున్నారు. 0.25 -0.50 బేసిస్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆరేళ్ల కనిష్టానికి కీలక వడ్డీరేట్లు చేరనున్నాయని భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరోసారి బలహీనపడ్డాయి. ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం ద్వారా ధరలకు బూస్ట్‌నివ్వాలని భావించినప్పటికీ ట్రేడర్లు చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు కొనసాగిస్తుండటంతో చమురు ధరలు క్షీణిస్తున్నాయి. ఏఏ దేశాలు ఎంతమేర ఉత్పత్తిలో కోత పెట్టేదీ స్పష్టతలేదని, ఒప్పందానికి ఎన్ని దేశాలు కట్టుబడేదీ కూడా అనుమానమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు స్వదేశీ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు కూడా బలహీనంగానే కదులుతున్నాయి. -
‘ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు షాక్’
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుతో అందరికీ మేలు జరుగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని అన్నారు. నోట్ల కష్టాలు స్వల్పకాలమే ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు షాక్ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ షాక్ దేశానికి మంచి చేస్తుందని, ఆర్థిక మందగమనం కొంత కాలమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆధార్ కార్డుతో ఎవరైనా జీరో బాలెన్స్ లేదా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవొచ్చని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో 3 నుంచి 6 నెలల్లో డిజిటల్ నగదు లావాదేవీలు పెరుగుతాయని అంచనా వేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులను కొనసాగిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నిలేకని ధన్యవాదాలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను ఆధార్ కు సంధానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
మోదీ నిర్ణయం గొప్పది: శత్రుఘ్నసిన్హా
పాట్నా: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అసంతృప్త ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా పొగడ్తల వర్షం కురిపించారు. 'ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా. సమయానుకూలంగా గొప్ప తెలివైన నిర్ణయం మోదీ తీసుకున్నారు' అని శ్రత్రుఘ్న సిన్హా శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే మోదీ టీం మాత్రం ఈ విషయంలో సరిగా పనిచేయలేదని ఆయన విమర్శించారు. దీంతో మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు శిక్ష అనుభవిస్తున్నారని సిన్హా వెల్లడించారు. ఇటీవల ఓ సర్వేలో ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పట్ల 93 శాతం ప్రజలు మద్దతిచ్చారన్న అంశంపై శత్రుఘ్న సిన్హా స్పందిస్తూ.. భ్రమల్లో ఉండొద్దంటూ ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి చురకలంటించిన విషయం తెలిసిందే. తనపై విమర్శలు చేస్తున్నవారు కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారని బీహార్ బీజేపీ నేత మంగళ్ పాండేపై సిన్హా ధ్వజమెత్తారు. -
కేంద్ర మంత్రికీ తప్పని నోట్ల కష్టాలు
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు కేంద్ర మంత్రి సదానంద గౌడకు స్వయంగా తెలిసొచ్చాయి. ఆయన సోదరుడు డీవీ భాస్కర గౌడ కొద్దిరోజులుగా కామెర్ల వ్యాధితో మంగళూరు కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆస్పత్రి బిల్లులకు పాత నోట్లు ఇవ్వడంతో సిబ్బంది తిరస్కరించారు. పాతనోట్లు తీసుకోవడానికి గడువు ఉన్నా ఎందుకు తిరస్కరిస్తున్నారని సదానంద గౌడ ఆస్పత్రి వర్గాలపై మండిపడ్డారు. చెక్కు తీసుకోవడానికి కూడా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో పాత నోట్లు స్వీకరించడం లేదని లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ సదానంద చెప్పడంతో సిబ్బంది దిగొచ్చి చెక్కు తీసుకున్నారు. నవంబర్ 24 వరకు పాత పెద్ద నోట్లు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆస్పత్రులు పెడచెవిన పెట్టడం సమంజసం కాదని సదానంద గౌడ అన్నారు. -
పోలీసుల అదుపులో ఢిల్లీ డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆయన కేబినెట్ మంత్రి కపిల్ మిశ్రాలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపుగా ర్యాలీతో వెళుతున్న వారిని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. వెనుదిరిగి వెళ్లాలనని చెప్పినా వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతోపాటు పార్లమెంటువైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతవారం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ వీధుల్లో పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తన ఆందోళన ఇప్పటికే తెలియజేస్తున్న విషయం తెలిసిందే. మరో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా తాజాగా తీసిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఉన్నప్పటికీ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.