‘డొల్ల’తనం బట్టబయలు! | Rs 17000 crore deposited in, withdrawn from 58000 bank accounts after demonetisation | Sakshi
Sakshi News home page

‘డొల్ల’తనం బట్టబయలు!

Published Mon, Nov 6 2017 3:08 AM | Last Updated on Mon, Nov 6 2017 3:08 AM

Rs 17000 crore deposited in, withdrawn from 58000 bank accounts after demonetisation - Sakshi

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తరువాత సుమారు 35 వేల కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి, ఆ తరువాత విత్‌డ్రా చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. అక్రమ నగదు ప్రవాహాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత కార్యకలాపాలకు దూరంగా ఉన్న సుమారు 2.24 లక్షల కంపెనీల పేర్లను అధికారిక రికార్డుల నుంచి తొలగించి, 3.09 లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నకిలీ డైరెక్టర్లు కార్పొరేట్‌ కంపెనీల్లో చేరకుండా నిరోధించేందుకు కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపింది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు గత నవంబర్‌ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బట్టబయలైన డొల్ల కంపెనీలు, వాటి డైరెక్టర్ల వివరాలు, నగదు జమ, ఉపసంహరణలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్రం ఆదివారం విడుదల చేసింది. ఆర్థిక నేరాలు, అకౌంటింగ్‌ అవకతవకల కట్టడికి పలు చర్యలను ప్రకటించింది.

ముఖ్యాంశాలు....
► 56 బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం నోట్ల రద్దు తరువాత 35 వేల కంపెనీలు, 58 వేల ఖాతాల ద్వారా రూ.17 వేల కోట్లను డిపాజిట్‌ చేసి విత్‌డ్రా చేశాయి.

► వాటిలో నవంబర్‌ 8న నెగిటివ్‌ బ్యాలెన్స్‌ ఉన్న ఓ కంపెనీ ఆ తరువాత రూ. 2,484 కోట్లు డిపాజిట్‌ చేసి ఉపసంహరించుకుంది.

► ఒక కంపెనీకి ఏకంగా సుమారు 2,134 ఖాతాలున్నాయి.

► ఇలాంటి కంపెనీలకు సంబంధించిన సమాచారం దర్యాప్తు సంస్థలకు అందజేత

► రిజిస్ట్రేషన్‌ రద్దయిన కంపెనీల ఆస్తులను తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయొద్దని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ

► కనీసం రెండేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం క్రియాశీలకంగా లేని సుమారు 2.24 లక్షల కంపెనీల రద్దు. వాటి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల అమ్మకాలపై ఆంక్షల విధింపు

► వేటు పడిన వారిలో 3 వేలకు మందికి పైగా డైరెక్టర్లు ఒక్కొక్కరు నిబంధనలకు విరుద్ధంగా 20కి పైగా కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

► నకిలీ డైరెక్టర్లను నియంత్రించడానికి డైరెక్టర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌(డిన్‌)ని వారి ఆధార్, పాన్‌తో అనుసంధానించేందుకు యత్నాలు ప్రారంభం

 

► 2013–14 నుంచి 2015–16 మధ్య కాలంలో వార్షిక రిటర్నులు దాఖలు చేయని కంపెనీల డైరెక్టర్లపై అనర్హత వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
 

► చార్టెర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్ల నియంత్రణ వ్యవస్థలో మార్పులు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

► ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లు పరిశీలిస్తూ అకౌంటింగ్‌ ప్రమాణాలు నిర్ధారించేందుకు, తప్పులకు పాల్పడే నిపుణులపై చర్యలు తీసుకునేందుకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ(ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు చర్యలు ముమ్మరం

► తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్‌ఎఫ్‌ఐఓ) ఆధ్వర్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement