
మూడేళ్లుగా 30–40 శాతం పెరిగిన జాబ్ పోస్టింగ్స్
బీమా, ఉక్కు తదితర రంగాల్లో అవకాశాలు
2030 నాటికి మరింతగా హైరింగ్
కోల్‌కతా: సామాజిక బాధ్యత, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దేశీ కంపెనీలు దివ్యాంగులకు (పీడబ్ల్యూడీ) ఉద్యోగావకాశాలు కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దీంతో ఉక్కు, మైనింగ్ రంగాల నుంచి బీమా రంగం వరకు వివిధ సెగ్మెంట్లలో ఈ విషయంలో సానుకూల ధోరణులు నెలకొన్నాయని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఈ తరహా ఉద్యోగాలకు చెందిన పోస్టింగ్స్ 30–40 శాతం పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.
తమ మొత్తం ఉద్యోగుల్లో కనీసం ఒక్క శాతం స్థాయిలోనైనా పీడబ్ల్యూడీలను నియమించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించినట్లు ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ రావు తెలిపారు. పాలసీని ఏదో నామమాత్రంగా కాకుండా అర్థవంతంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాలనేది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. గత ఏడాది కాలంగా కంపెనీ పీడబ్ల్యూడీ సిబ్బంది సంఖ్య 16 ప్రాంతీయ శాఖల్లో 16 నుంచి 41కి పెరిగింది.
ఇందులో 22 శాతం మంది మహిళలు ఉన్నట్లు రావు చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 కంపెనీల్లో కేవలం ఏడు సంస్థల్లో మాత్రమే ఒక్క శాతం మేర పీడబ్ల్యూడీ ఉద్యోగులున్నారని గణాంకాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు కంపెనీలలోనూ నాలుగు సంస్థలు ప్రభుత్వ రంగానికే చెందినవై ఉండటాన్ని చూస్తే సమ్మిళితత్వ లక్ష్య సాధనలో కార్పొరేట్లు మరింతగా పాలు పంచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని రావు చెప్పారు.
మరోవైపు, తమ సంస్థలో 50 మంది పైగా పీడబ్ల్యూడీ సిబ్బంది ఫ్రంట్ ఎండ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వేదాంత చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మధు శ్రీవాస్తవ చెప్పారు. పలువురు దివ్యాంగ ఇంటర్న్‌లకు కూడా అవకాశాలు క ల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే, దివ్యాంగులకు అనువైన పరిస్థితులను కూడా క ల్పిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. ఇందులో భాగంగా వారి కోసం ర్యాంప్‌లు, ప్రత్యేకంగా దారులు, బ్రెయిలీ ఆధారిత ఎలివేటర్లు, టెక్ట్స్–టు–స్పీచ్ సాఫ్ట్‌వేర్ మొదలైనవి అందుబాటులో ఉంచుతున్నామని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ప్రధానంగా మైనింగ్, స్పెల్లింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించే తమ సంస్థలో పీడబ్ల్యూడీలను టెక్నికల్ విధుల్లోకి తీసుకోవడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారికి కూడా వీలైన విభాగాల్లో చోటు క ల్పించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఇక, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌లో 100 మంది పైగా దివ్యాంగ ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత 2–3 సంవత్సరాలుగా వీరి సంఖ్య క్రమంగా పెరిగిందని వివరించారు.
మరింత సమ్మిళిత వాతావరణాన్ని సృష్టించే దిశగా తమ హైరింగ్ విధానాల్లో గణనీయంగా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలకు పెద్ద పీట వేస్తూ వ్యాపారాలను పటిష్టం చేసుకునేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు దోహదపడగలవని ప్రతినిధి వివరించారు.
జూనియర్, మధ్య స్థాయికే పరిమితం..
దివ్యాంగుల నియామకాలు పెరుగుతున్నప్పటికీ వారి హైరింగ్ ప్రధానంగా జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగాల్లోనే ఉంటోందని మానవ వనరుల సర్వీసుల సంస్థ ర్యాండ్‌స్టాడ్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. సీనియర్, మేనేజ్‌మెంట్ బాధ్యతల్లో వారికి ప్రాతినిధ్యం తక్కువగానే లభిస్తోందని వివరించింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో పీడబ్ల్యూడీల వాటా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా కంపెనీల ప్రాధాన్యతలు మారే కొద్దీ భవిష్యత్తులో దివ్యాంగులకు అవకాశాలు మరింతగా లభించగలవని సంస్థ ఎండీ పి.ఎస్. విశ్వనాథ్ తెలిపారు. డీఈఐ విధానాల అమలు పెరుగుతుండటంతో ప్రతిభావంతులైన పీడబ్ల్యూడీలను నియమించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు.
డీఈఐ విధానాల దన్ను ..
పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్‌జీ) అంశాల ఆధారిత హైరింగ్ పెరుగుతుండటం, పీడబ్ల్యూడీ ఉద్యోగాలు క ల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి పన్నుపరమైన ప్రయోజనాల్లాంటి ప్రోత్సాహకాలు లభిస్తుండటం తదితర పరిణామాలతో 2030 నాటికి ఉద్యోగుల్లో దివ్యాంగుల వాటా మరింతగా పెరగనుందని మానవ వనరుల సంస్థ ఫస్ట్ మెరీడియన్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో మన్‌మీత్ సింగ్ తెలిపారు. బడా కార్పొరేషన్లు మొదలుకుని స్టార్టప్‌ల వరకు అన్ని సంస్థలూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వివరించారు.
ఐటీ, రిటైల్, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల్లో రిమోట్, హైబ్రీడ్ వర్క్ విధానాలకు ఆస్కారం ఉండటంతో ఆయా సెగ్మెంట్లలో పీడబ్ల్యూడీలకు మరిన్ని అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. దేశీయంగా 7 కోట్ల మంది పైగా దివ్యాంగులు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నప్పటికీ వారి ఉద్యోగిత రేటు కేవలం 0.4 శాతంగానే ఉంటోందని సింగ్ చెప్పారు.
నియంత్రణ సంస్థల నిబంధనలతో పాటు వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (డీఈఐ) విధానాలను కార్పొరేట్లు అమలు చేస్తుండటంతో పీడబ్ల్యూడీల నియామకాలు పెరుగుతాయని వివరించారు. కంపెనీలు పాటించే సంస్కృతే .. భాగస్వాములు, కస్టమర్లు, ఉద్యోగులు, మొత్తం వ్యాపార వర్గాల్లో వాటికి గుర్తింపుగా ఉంటోందని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment