నేషనల్ డెస్క్
ఎన్డీయే ప్రభుత్వం పాత రూ.500, రూ.1,000 నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించి నవంబరు 8కి ఏడాది పూర్తయ్యింది. దీనివల్ల మంచే జరిగిందని, అవినీతి, నల్లధనంపై పోరులో విజయం సాధించామని ప్రధాని మోదీ గట్టిగా చెబుతున్నారు. మరోవైపు, ఈ అనాలోచిత నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా నాశనమైందనీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో లక్షల మంది నిరుద్యోగులయ్యారని కాంగ్రెస్ సహా విపక్షాలు, పలువురు ఆర్థికవేత్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ రెండు వాదనల్లో నిజమెంత? నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుడికి జరిగింది మంచా? చెడా?.. ప్రఖ్యాత ఆర్థిక వేత్త, 1976లో నోబెల్ అందుకున్న మిల్టన్ ఫ్రీడ్‌మన్ రూపొందించిన ‘క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ’ సూత్రం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయేమో చూద్దాం!
వేరే దేశాలూ పెద్ద నోట్లను రద్దు చేసిన దాఖలాలున్నాయి. 2014లో సింగపూర్, 2011లో కెనడా వెయ్యి డాలర్ల నోట్లను రద్దు చేశాయి. 2013లో స్వీడన్ వెయ్యి క్రోనార్ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించింది. పన్ను ఎగవేతలను అరికట్టడానికి, ఆర్థిక నేరాలను నియంత్రించడానికి ఈ చర్యలు ఆయా దేశాల్లో ఉపయోగపడ్డాయి. అయితే, భారత్‌లో మాత్రం ఈ నిర్ణయం నల్లధనాన్ని అరికట్టడానికి ఎంతమేరకు ఉపయోగపడిందనే విషయంలో భిన్న వాదనలున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా భారత్‌లో నగదు ఆధారిత లావాదేవీలే ఎక్కువ. అందుకే నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపే సామాన్యులపై భారీగానే పడింది.
సత్ఫలితాలొచ్చాయి
నోట్ల రద్దు విజయవంతమైందనడానికి ప్రభుత్వం పలు ఉదాహరణలు చూపుతోంది. ఈ నిర్ణయానికి ఒక కారణం ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 2014–15లో కేవలం 4 శాతం భారతీయులే ఆదాయపు పన్ను చెల్లించారు. అంటే పన్ను ఎగవేతల కారణంగా 6 లక్షల కోట్ల నుంచి రూ. 9 లక్షల కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. నోట్ల రద్దు తరువాత ఈ సంవత్సరం ఆగస్ట్ 5 నాటికి పన్ను రిటర్నుల్లో గత సంవత్సరం కన్నా 24.7% వృద్ధి నమోదైంది. నోట్ల రద్దుకు చెబుతున్న మరో కారణం దొంగనోట్లను అరికట్టడం. కోల్‌కతాలోని భారత గణాంక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం భారత్‌లో రూ.400 కోట్ల దొంగనోట్లు చెలామణీలో ఉండగా అందులో నాలుగింట మూడొంతులు పాత రూ.500, 1,000 నోట్ల రూపంలోనే ఉండేది. నోట్ల రద్దు తరువాత మే 2017లోపు రూ. 17,526 కోట్ల లెక్కచూపని ఆదాయాన్ని గుర్తించామని, వెయ్యి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, ఐటీ రిటర్నులు భారీగా పెరిగాయని, నల్లధనం చెలామణికి, హవాలా లావాదేవీలకు సహకరిస్తున్న 37 వేల నకిలీ కంపెనీలను గుర్తించామని ప్రభుత్వం చెబుతోంది.
విఫలమైంది
నోట్ల రద్దును విమర్శిస్తున్న వారి వాదన మరోలా ఉంది. ఈ నిర్ణయం వల్ల నల్లధనం బయటకు రాకపోగా దాన్ని వైట్‌మనీగా మార్చుకునేందుకు అవకాశం లభించిందని, అసలు నల్లధనంలో సింహభాగం బంగారం, భూములు తదితరాల రూపంలో ఉందేకానీ కరెన్సీ నోట్ల రూపంలో కాదనేది వారి వాదన. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం రద్దు చేసిన నోట్లలో 98.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ఏం చెబుతోంది?
ఈ వాదనలన్నింటిలోనూ ఎంతోకొంత నిజముంది. అయితే, నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసింది? భవిష్యత్తులో ఏ విధమైన ప్రభావం చూపబోతోందనే విషయాన్ని ఫ్రీడ్‌మన్ సిద్ధాంతం ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేద్దాం.
ఫ్రీడ్‌మన్ సిద్ధాంతం ‘క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ’ ప్రకారం.. ఎంవీ = పీవై
ఇందులో ఎం అంటే వ్యవస్థలో ఉన్న నగదు; వీ అంటే నగదు చెలామణీ వేగం; పీ అంటే ధరల స్థాయి; వై అంటే ఉత్పత్తుల నిజవిలువ.
ఈ సిద్ధాంతాన్ని సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రజల దగ్గర నగదు(పీ) తగ్గినప్పుడు, డబ్బు చేతులు మారే వేగం(వీ) కూడా తగ్గుతుంది. పీ, వీ తగ్గినప్పుడు ఆటోమాటిక్‌గా వస్తువుల ధరలు(పీ) కూడా తగ్గుతాయి. అందుకు అనుగుణంగానే నోట్లరద్దు తర్వాత కూరగాయలు, గుడ్లు, ఆహార పదార్థాల ధరలు కొంతవరకు తగ్గాయి. ఫ్రీడ్‌మన్ చెప్పినదాని ప్రకారం ధరలు తగ్గితే ఆదాయం కూడా తగ్గుతుంది. నోట్లరద్దు జరిగినప్పుడు మొదటగా ప్రజల వద్ద నగదు లభ్యత తగ్గింది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం కూడా తగ్గింది. అదే సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. వీటన్నింటి ఫలితంగా జీడీపీ వృద్ధిరేటు తగ్గింది.
ఈ వివరాలన్నింటినీ, నోట్ల రద్దు నేపథ్యంలో, ఫ్రీడ్‌మన్ సిద్ధాంతం ఆధారంగా అధ్యయనం చేస్తే.. నోట్లరద్దు వల్ల ద్రవ్యోల్బణం లేదా ప్రతిద్రవ్యోల్బణం పెరగడం తాత్కాలికమేనని, భవిష్యత్తులో వాటిపై నోట్లరద్దు ప్రభావం ఉండబోదన్న విషయం తేలుతుంది. ఇదే విషయాన్ని నోట్లరద్దు సమర్థకులు ప్రస్తావిస్తున్నారు.
నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగమనంలోనో లేక ప్రతికూల గమనంలోనో సాగినా.. దీర్ఘకాలంలో మాత్రం నోట్ల రద్దు ప్రభావం ఎంతమాత్రం ఆర్థికవ్యవస్థపై, జీడీపీ వృద్ధి రేటుపై ఉండబోదని వారు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్‌లో నగదు లభ్యత, జీడీపీ మధ్య నిష్పత్తి ఎక్కువగా ఉంటుందన్నది గమనించాల్సిన విషయం. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఆగస్టుకు ఏకంగా 5.7 శాతానికి చేరడం తెలిసిందే. నోట్లరద్దు జరగకపోయుంటే వృద్ధి రేటు 8% కంటే ఎక్కువగా ఉండేదని కొందరు ఆర్థిక వేత్తలు అంటున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించేవారు జీడీపీ వృద్ధిరేటులో చోటు చేసుకున్న భారీ తగ్గుదలను ఉదాహరణగా చూపుతుండగా.. రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తున్నవారు ‘నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం లేదా ప్రతిద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలంలో జీడీపీ సాధారణ వృద్ధి స్థాయికి వస్తుంది’ అన్న ఫ్రీడ్‌మన్ సిద్ధాంత ఫలితాలను ఉటంకిస్తూ.. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా వర్తిస్తుందని వాదిస్తున్నారు. అయితే, దీర్ఘకాలంలో ఒనగూడే ప్రయోజనాలను పక్కనపెడితే, తాత్కాలికంగానైనా.. జీడీపీ వృద్ధిరేటుపై నోట్ల రద్దు చూపిన ప్రతికూల ప్రభావాన్ని విస్మరించలేం.
Comments
Please login to add a commentAdd a comment