న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత గడచిన ఐదేళ్లలో హౌసింగ్ మార్కెట్‌లో నల్లధనం (లేదా నగదు లావాదేవీలు) ప్రాబల్యం 75 నుంచి 80 శాతం తగ్గిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ– అనరాక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ప్రముఖ ఏడు నగరాల్లోని డెవలపర్‌ల అభిప్రాయాల సేకరణ, బ్యాంకుల గృహ రుణ పంపిణీ గణాంకాలు, రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల సమీక్ష , 1,500కుపైగా సేల్స్ ఏజెంట్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు అనరాక్ పేర్కొంది. గృహ రుణ సగటు పరిమాణం మాత్రం గణనీయంగా పెరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు అనరాక్ చైర్మన్ అనూజ్ పురి పేర్కొన్నారు. కాగా, చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆస్తి లావాదేవీల్లో నల్లధనం ఉందని గుర్తించినట్లు అనరాక్ చైర్మన్ వివరించారు.
కారణాలు ఇవీ...
పెద్ద నగరాల తొలి గృహ కొనుగోళ్లలో నల్లధనం హవా తగ్గడానికి కారణాలను అనూజ్ పురి వివరిస్తూ, బ్రాండెడ్, లిస్టెడ్ సంస్థలు ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయని, పూర్తి పారదర్శకతతో కూడిన అకౌంట్ల ద్వారానే మెజారిటీ గృహ కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్‌టీ అమలు తర్వాత గృహ కొనుగోలుదారుల డిమాండ్ కూడా పారదర్శకతలో కూడిన బ్రాండెడ్ ప్రాజెక్టులకే ఉంటోందని తెలిపారు.
ఇక ప్రధాన డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపైనే కేంద్రీకరించే తమ గత ధోరణిని మార్చుకుని, చౌక, మధ్య తరగతికి అనుగుణమైన హౌసింగ్ విభాగంపై దృష్టి సారించాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తంగా హౌసింగ్ రంగంలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడినట్లు వివరించారు. ‘దేశంలో గృహాల కొనుగోలు, విక్రయం అనే ప్రాథమిక అంశాలు, ధోరణుల్లో పెద్ద నోట్ల రద్దు గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. నేడు గృహ విక్రయాలు అధికభాగం వాస్తవ డిమాండ్ ప్రాతిపదికగానే జరుగుతున్నాయి. నల్లధనాన్ని చెలామణీలోకి తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నంగా ప్రస్తుతం రియల్టీ లేదు’’ అని పురి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment