న్యూఢిల్లీ: అవినీతిపై తమది రాజీలేని పోరాటమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అవినీతి విషయంలో తనకు బంధువులు ఎవరూ లేరన్న ప్రధాని.. అవినీతిపరులైన నాయకులెవరినీ వదలబోమని హెచ్చరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వంటి సంప్రదాయ రాజకీయ విధానాల స్థాయి నుంచి పార్టీ ఎదగాలి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలకు అతీతంగా చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచాలి.
ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచే దిశగా కృషి చేయాలి’ అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాలకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు ఉపముఖ్యమంత్రులు, 60 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అవినీతి, పేదరికం, కులతత్వం, మతతత్వం, ఉగ్రవాదాల అంతమే లక్ష్యంగా పేర్కొంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. మోదీ ప్రసంగ వివరాల్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు.
‘రాజకీయాలు ప్రజల జీవితాల్ని బాగుచేయాలి. పేదల సంక్షేమం కోసం పాటుపడాలి. ఎన్నికలకు అతీతంగా బీజేపీని బలోపేతం చేయాలి. అభివృద్ధిని ఆ పార్టీ విశ్వసిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాద నిరోధం, నల్లధనంపై చర్యలు, డోక్లాం వివాద పరిష్కారంపై ఆయన మాట్లాడారు. ఎలాంటి గందరగోళం లేకుండానే డోక్లాం సమస్య పరిష్కారమైందని, ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ఉగ్రపోరు కొనసాగుతుందని చెప్పారు. ‘అవినీతిపై పోరులో రాజీపడేది లేదు. అవినీతిపరులు ఎవరినీ విడిచిపెట్టం.
అవినీతి విషయంలో నాకెవరూ బంధువులు లేరు’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును తప్పుపడుతూ.. సరైన ఆధారాలు లేకుండా.. పరుషమైన ఆరోపణలు చేస్తున్నారని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అధికారాన్ని అనుభవించడమే లక్ష్యంగా పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వ్యవహరించిందని, ఇప్పుడు ప్రతిపక్షంగా ఎలా ఉండాలో తెలియడం లేదని తప్పుపట్టారు. మూడేళ్లుగా ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉందని, కేవలం గత మూడు నెలలుగా తగ్గుదల కన్పిస్తోందని, ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు.
పనితీరునే బీజేపీ నమ్ముకుంది: అమిత్ షా
అంతకుముందు కార్యవర్గ భేటీని ప్రారంభిస్తూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. రాజకీయాల్లో పనితీరును బీజేపీ నమ్ముకుంటే.. కాంగ్రెస్ మాత్రం బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాలపై ఆధారపడిందని విమర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ సాధారణ కుటుంబం నుంచి వచ్చినా వారి కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు.
ఆరు సూత్రాల ఎజెండాకు ఆమోదం
2022 నాటికి నవభారతాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను నిజం చేసేందుకు పేదరికం, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం, అవినీతిని రూపుమాపడం లక్ష్యంగా పేర్కొంటూ ఒక రాజకీయ తీర్మానాన్ని కార్యవర్గ భేటీ ఆమోదించింది. సమావేశ తీర్మాన వివరాల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడిస్తూ.. స్వచ్ఛ భారత్ కూడా ఆ ఎజెండాలో భాగమని చెప్పారు. ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనల్ని నివృత్తి చేయాలని కోరడంతో పాటు జీఎస్టీ అమలును, నోట్ల రద్దును తీర్మానంలో పార్టీ ప్రశంసించిందని తెలిపారు.
తీర్మానంలోని కొన్ని ముఖ్యాంశాలు..
► రోహింగ్యా సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి మద్దతు. దేశంలోని 125 కోట్ల ప్రజల భద్రత విషయంలో రాజీపడకూడదు.
► ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ప్రయత్నాన్ని అడ్డుకోవడంపై ఆవేదన.. ఈ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధిస్తుందని ఆశాభావం..
► అవినీతి, నల్లధనంపై చేసిన వాగ్దానాల్ని ప్రభుత్వం నిలబెట్టుకుంది. పారదర్శక ఆర్థిక వ్యవస్థకు నోట్ల రద్దు బాటలు వేసింది. జీఎస్టీ అమలు ప్రశంసనీయం.
► డోక్లాం వివాద పరిష్కారంతో పాటు ఉగ్రవాదంపై ప్రపంచ వ్యాప్త ప్రచారం, పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల గుట్టును బహిర్గతం చేయడంలో ప్రధాని మోదీ కృషి అమోఘం.
► మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.
► బీజేపీ కార్యకర్తలపై హింసను తీర్మానంలో ఖండించిన కార్యవర్గ భేటీ.. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలపై దాడుల్ని ప్రస్తావించారు.
అవినీతిపై రాజీలేని పోరు
Published Tue, Sep 26 2017 2:34 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement