ఢిల్లీ అమ్మాయిగా సవాల్‌ చేస్తున్నా | Delhi girl Priyanka Gandhi challenges PM Modi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అమ్మాయిగా సవాల్‌ చేస్తున్నా

Published Thu, May 9 2019 5:09 AM | Last Updated on Thu, May 9 2019 5:09 AM

Delhi girl Priyanka Gandhi challenges PM Modi - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పేరు చెప్పుకుని చివరి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లు అడగాలంటూ ప్రధాని మోదీ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజీవ్‌ కూతురు ప్రియాంక ప్రతిసవాల్‌ విసిరారు. ‘ఢిల్లీ అమ్మాయిగా సవాల్‌ చేస్తున్నా. జీఎస్టీ, నోట్లరద్దు, మహిళా భద్రత, యువతకిచ్చిన హామీలపై ప్రచారం చేస్తూ ఓట్లు అడగండి’ అని అన్నారు. ఢిల్లీలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు షీలా దీక్షిత్, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

తాను చిన్నప్పటి నుంచి ఢిల్లీలో పుట్టిపెరిగిన దాన్ననీ, ఇక్కడి ప్రతి వీధీ తనకు తెలుసని, మోదీ కేవలం గత ఐదేళ్లుగా మాత్రమే ఢిల్లీలో ఉంటున్నారని ప్రియాంక అన్నారు. ‘నేను ఇదే నగరంలో పుట్టిపెరిగాను. మోదీ తన అధికారిక నివాసం దాటి ఢిల్లీలో ఇంకెక్కడా తిరగరు. నేను ప్రజలను అగౌరవించలేను. మేం బీజేపీలా పొగరుబోతులం కాదు. ఈ ప్రజల వల్లే మేం ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాం’ అని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ నంబర్‌ 1 అవినీతిపరుడిగా మిగిలిపోయారనీ, ఆయన ప్రధానిగా ఉండగానే పలు కుంభకోణాలు జరిగాయంటూ మోదీ ఇటీవల ప్రచారంలో ప్రస్తావించడం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, అవినీతిపరుడిని అలా అంటే తప్పేంటనీ, దమ్ముంటే ఆయన పేరు చెప్పుకుని కాంగ్రెస్‌ ఓట్లు అడగాలని మోదీ సవాల్‌ విసరడం తెలిసిందే.

మతంతో వ్యవస్థల నాశనం..
ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ మోదీ అన్ని ప్రభుత్వ వ్యవస్థలను, సంస్థలను నాశనం చేస్తున్నారనీ, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  మోదీ హోంవర్క్‌ చేయడంలో విఫలమైన విద్యార్థి లాంటివారని చురకలంటించారు. పైగా పండిట్‌ నెహ్రూ జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరాగాంధీ కాగితపు పడవ చేశారు లాంటి సాకులు చెబుతారని అన్నారు. ‘జాతీయవాదం గురించి బీజేపీ, మోదీ మాట్లాడతారు. ఈ దేశ యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వడం జాతీయవాదం కాదా?’ అని ప్రశ్నించారు.
ప్రచారం సందర్భంగా మాట్లాడుతున్న ప్రియాంక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement