జీఎస్‌టీతో కొత్త చరిత్ర..నల్లధనంపై యుద్ధమే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని ఎర్రకోటపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటలో మువ్వన్నెల జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించిన అనంతరం జాతినుద్దేశించిన ప్రసంగిస్తూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు ప్రధాని నివాళులర్పించారు. నోట్ల రద్దుద్వారా తమ అవినీతిని,నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించిందన్నారు. జీఎస్‌టీ ద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తామని, నల్లధనంపై తమ పోరు కొనసాగుతుందని ప్రధాని తెలిపారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారనీ, 2022 నాటికి నవభారత నిర్మాణానికి అందరం కృషి చేయాలని ప్రధాన మోదీ జాతికి పిలుపునిచ్చారు.
నోట్ల రద్దుతో దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద అడుగు వేశామని ప్రధాని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిందని మోదీ తెలిపారు. రెండు లక్షల కోట్ల నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని తెలిపారు. జీఎస్‌టీ కొత్త చరిత్ర సృష్టించామన్నారు. నల్లధనం అవినీతిని అంతం చేస్తామని దేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. షెల్ కంపెనీల విషయానికి వస్తే 3 లక్షల కంపెనీలను కనుగొన్నామనీ, 1.75 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని ప్రధాని ప్రకటించారు. 2019 నాటికి 19 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే గోరఖ్‌పూర్ విషాదం చాలా బాధాకరమని స్పందించిన మోదీ చనిపోయిన చిన్నారులకు నివాళులర్పించారు.
ప్రసంగం అనంతరం అక్కడున్న పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో ఉత్సాహంగా కలిసిపోయారు. వారితో చేతులు కలిపారు. ముచ్చటగా తయారైన బాలబాలికలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.