
మోదీ నిర్ణయం గొప్పది: శత్రుఘ్నసిన్హా
పాట్నా: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అసంతృప్త ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా పొగడ్తల వర్షం కురిపించారు. 'ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా. సమయానుకూలంగా గొప్ప తెలివైన నిర్ణయం మోదీ తీసుకున్నారు' అని శ్రత్రుఘ్న సిన్హా శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే మోదీ టీం మాత్రం ఈ విషయంలో సరిగా పనిచేయలేదని ఆయన విమర్శించారు. దీంతో మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు శిక్ష అనుభవిస్తున్నారని సిన్హా వెల్లడించారు.
ఇటీవల ఓ సర్వేలో ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పట్ల 93 శాతం ప్రజలు మద్దతిచ్చారన్న అంశంపై శత్రుఘ్న సిన్హా స్పందిస్తూ.. భ్రమల్లో ఉండొద్దంటూ ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి చురకలంటించిన విషయం తెలిసిందే. తనపై విమర్శలు చేస్తున్నవారు కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారని బీహార్ బీజేపీ నేత మంగళ్ పాండేపై సిన్హా ధ్వజమెత్తారు.