న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు.
కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు.
మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు.
‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్‌బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్‌బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు.
కానీ ఆర్‌బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్‌బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్‌బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు.
మార్చుకునే చాన్సే ఇవ్వలేదు!
పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్‌కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్‌బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment