venkata ramani
-
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
Collegium Controversy: ఇబ్బందికరంగా కేంద్రం తీరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అష్నదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్ కౌల్ కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్ కౌల్ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. -
మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎం షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరింది. -
ఆ ఆవాల వెనుక బలమైన కారణం ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి చేసిన(జీఎం) ఆవాలను (హైబ్రిడ్ డీఎంహెచ్–11) మార్కెట్లో విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపెయిన్’ అనే ఎన్జీవో దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జన్యుమార్పిడి విత్తనాల గురించి మన దేశంలో రైతులకు పెద్దగా అవగాహన లేదని గుర్తుచేసింది. ఇలాంటి విత్తనాలతో నష్టాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. జన్యుమార్పిడి పంటలను సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు సిద్ధాంతపరమైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, శాస్త్రీయ, హేతుబద్ధతతో కూడిన కారణాలతో కాదని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. డీఎంహెచ్–11 ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్∙అభివృద్ధి చేసింది. -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
Demonetisation: తిరగదోడకండి.. నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు. మార్చుకునే చాన్సే ఇవ్వలేదు! పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్‌కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్‌లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే. -
గ్రేటర్ బీజేపీకి కొత్త సారథి ?
► అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు ► మార్చి చివరినాటికి నియామకం ► ఏకగ్రీవానికి నేతల కసరత్తు హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నూతన నియమించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరెడ్డి పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గురువారం అగ్రనాయకులు సమావేశమై డివిజన్కమిటీల ఏర్పాటుపై చర్చించాలని నిర్ణయించారు. డివిజన్ కమిటీల ద్వారా ఎన్నిక నిర్వహించడం కంటే... అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న దిశగా నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ గ్రేటర్ అధ్యక్ష పదవి రేసులో వెంకటరమణి, బవర్రాల్ వర్మ్, శ్యాం సుందర్ గౌడ్ పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. పార్టీకి చాలాకలంగా సేవలందిస్తోన్న ఉమా మహేందర్ కూడా ఈసారి గ్రేటర్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వీరిలో వెంకట రమణికి గతంలో నగర అధ్యక్షుడి గా పనిచేసిన అనుభవం ఉంది. ఒక వ్యక్తి రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేయవచ్చునన్న అవకాశం ఉన్నందున మరోసారి వెంకటరమణికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తుంది. అయితే మిగతావారు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు అధ్యక్ష పదవినిచ్చి సముచిత స్థానం కల్పించాలని నేతలు భావిస్తున్నారు. ఒకే ఒక్కడు.. : ప్రస్తుతం గ్రేటర్‌కు బి.వెంకటరెడ్డి, అర్బన్‌కు మీసాల చంద్రయ్య అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నగరంలోని 150 డివిజన్లను రెండుగా విభజించి రంగారెడ్డి జిలాల పరిధిలోని 48 డివిజన్లను అర్బన్‌గా, మిగతా 108 డివిజన్లను గ్రేటర్ పరిధిలో ఉంచుతూ ఇద్దరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో ఇద్దరు అధ్యక్షుల మధ్య సమన్వయం లేకపోవడంతో నామమాత్రపు ఫలితాలు వచ్చాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దృష్టి సారించిన అగ్రనేతలు ఇకపై గ్రేటర్‌లోని 150 డివిజన్లు, కంటోన్మెంట్ లోని 8 డివిజన్లు మొత్తం 158 డివిజన్లకు కలిపి ఒకరినే బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం.