
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దు అమల్లోకి తెచ్చి ఏడాదవుతున్న సందర్భంగా నవంబర్ 8న ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో సోమవారం పలు విపక్ష పార్టీలు పార్లమెంటులో సమావేశమై సంయుక్త కార్యాచరణపై చర్చించాయి.
కాంగ్రెస్, వామపక్ష, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, జేడీయూ (శరద్ యాదవ్) పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘భారీ ర్యాలీ కోసం ఇది తొలి సమావేశం. 18 విపక్ష పార్టీలతో చర్చించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తాం’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా శరద్ యాదవ్‌పై అనర్హత వేటువేస్తే ఏం చేయాలనే దానిపైనా సమావేశంలో చర్చించారు.