
ఐటీ రంగంలో ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్(Work Life Balance) విధానానికి ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వర్క్-లైఫ్ సమతుల్యత కోసం కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద 100 మందికి పైగా ఐటీ నిపుణులు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అధిక పని గంటలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పని విధానాలపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇటీవల ర్యాలీ నిర్వహించారు.
ఐటీ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు పరిష్కారంగా పనివేళలను పొడిగించాలని సూచించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సహా కొందరు పరిశ్రమ ప్రముఖులు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ నిరసన నిర్వహించారు. పని వేళలపై కంపెనీ ప్రముఖులు చేసిన ప్రకటనలు విస్తృత విమర్శలకు దారితీశాయి. చాలా మంది ఉద్యోగులు శారీరక, మానసిక ఆరోగ్యంపై అధిక పనివేళలు వంటి పద్ధతుల ప్రతికూల ప్రభావాన్ని ర్యాలీలో ఎత్తిచూపారు.
అధిక పని ఒత్తిడితో సమస్యలు
చాలా కాలంగా పని సంస్కృతితో ఐటీ రంగం విమర్శల పాలవుతోంది. ఇందులో వెంటనే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కేఐటీయూ సభ్యులు నొక్కిచెప్పారు. కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగ మాట్లాడుతూ..‘దేశంలో ఐటీ కంపెనీలు అనుసరిస్తున్న సుదీర్ఘ పని గంటల వల్ల ఉద్యోగులపై హానికరమైన ప్రభావాలు ఉంటున్నాయి. ఈ మేరకు అనేక అధ్యయనాలు, సర్వేలు వెల్లడవుతున్నాయి. ఈ రంగంలో 70 శాతానికి పైగా ఉద్యోగులు అధిక పని ఒత్తిడి కారణంగా మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రస్తుతం పని విధానంలో సంస్కరణలు తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు.
రైట్ టు డిస్కనెక్ట్ విధానం..
రోజువారీ పని గంటల పరిమితులను అమలు చేయడం, కార్మిక చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవలంబిస్తున్నట్లు ‘రైట్ టు డిస్కనెక్ట్’(అధికారిక పని వేళలు పూర్తయితే ఈమెయిల్స్, కాల్స్ లేదా సందేశాలు వంటి కమ్యూనికేషన్లకు స్పందిచకూడదనే నిబంధన) విధానాన్ని అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది. పనిగంటలను క్రమబద్ధీకరించడంలో, కార్మిక చట్టాలను పాటించేలా చూడటంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఉద్యోగులు విమర్శించారు. ఓవర్ టైమ్ అలవెన్స్‌లు, చట్టబద్ధమైన పనిగంటల పరిమితులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గత ఏడాది కార్మిక మంత్రికి వినతిపత్రం సమర్పించినప్పటికీ ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదని యూనియన్ పేర్కొంది.
ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారం
డిమాండ్లు తెలిపేందుకే ర్యాలీ
ఉద్యోగులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి, పాలసీ విధానకర్తలకు తమ డిమాండ్లు తెలియజేయడానికి ఈ ర్యాలీ ఒక వేదికగా నిలిచిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ ర్యాలీలోని ఒక ఐటీ ఉద్యోగి స్పందిస్తూ..‘మేము మా ఉద్యోగాలను ప్రేమిస్తాం. పరిశ్రమకు సహకారం కొనసాగించాలనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మా ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టం’ అని అన్నారు. ప్రస్తుత పని విధానాలకు వ్యతిరేకంగా ఐటీ నిపుణుల్లో పెరుగుతున్న అవగాహన, వ్యతిరేకతను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. దేశంలోని అత్యంత ప్రముఖ పరిశ్రమల్లో ఐటీ ఒకటి. ఈ విభాగంలో ఉద్యోగుల్లో స్నేహపూర్వక పని వాతావరణాన్ని సృష్టించడానికి సమష్టి కృషి అవసరం.
Comments
Please login to add a commentAdd a comment