
దేశంలో ఇదే అతిపెద్ద స్కాం...
న్యూఢిల్లీ : రూ 500 నోట్ల డిజైన్‌లు రెండు రకాలుగా ఉండటంపై రాజ్యసభలో మంగళవారం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఆర్‌బీఐ రెండు డిజైన్లు, సైజ్‌లతో రూ 500 నోట్లను ముద్రించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొంది. కేంద్రం నోట్ల రద్దు ఎందుకు చేపట్టిందో తమకు ఇప్పుడు అర్ధమైందని, ఆర్‌బీఐ రెండు డిజైన్లలో రూ 500 నోట్లను ముద్రించడం దారుణమని సభలో ఆయా డిజైన్లను ప్రదర్శిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. పార్టీ కోసం ఒకటి, ప్రభుత్వం కోసం మరొకటి అంటూ తాము రెండు రకాల నోట్లను ఎన్నడూ ముద్రించలేదని మరో నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు.
కాంగ్రెస్ లేవనెత్తిన అంశానికి తృణమూల్, జేడీయూ సభ్యులు మద్దతుగా నిలిచారు.కాంగ్రెస్ సభ్యుల వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. కరెన్సీపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భారీస్ధాయిలో నోట్లు ముద్రించే క్రమంలో ఒకటీ అరా నోట్లు డిజైన్, సైజ్‌లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండటం సహజమేనన్నారు.