
న్యూఢిల్లీ: నోట్లరద్దు, అస్తవ్యస్తంగా జీఎస్టీని అమలు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు బీజేపీ ప్రభుత్వం కలిగించిన నష్టాన్ని తాము న్యాయ్ (కనీస ఆదాయ భద్రత పథకం) ద్వారా పూడుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న తరుణంలో పీటీఐకి రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము ప్రకటించిన న్యాయ్ పథకానికి రెండు లక్ష్యాలు ఉన్నాయనీ, వాటిలో ఒకటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందివ్వడం కాగా, రెండోది ప్రధాని మోదీ ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను బాగుచేయడమని రాహుల్ చెప్పారు. కనీస ఆదాయ భద్రత పథకానికి తాము న్యాయ్ (న్యూన్‌తమ్ ఆయ్ యోజన) అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందనీ, గత ఐదేళ్లలో మోదీ ప్రజలకు అన్యాయం చేయగా, మేం న్యాయం చేస్తామని చెప్పడానికే ఆ పేరు పెట్టామని తెలిపారు.
ప్రజాకర్షక పథకం కాదిది
న్యాయ్ పథకం ప్రజలను కాంగ్రెస్ వైపునకు ఆకర్షించేందుకు తీసుకొచ్చింది కాదనీ, పేదరికంపై చివరి అస్త్రమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ అమలు విధానం నిర్ణయాల్లా ఇది అస్తవ్యస్తంగా ఉండదనీ, ఒక పద్ధతి ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, అప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించిన అనంతరం దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు.
మూడేళ్లదాకా అనుమతులు అక్కర్లేదు
కొత్తగా ప్రారంభమైన వ్యాపార సంస్థలు తొలి మూడేళ్ల కాలంలో ఏ రకమైన అనుమతినీ ప్రభుత్వం నుంచి పొందాల్సిన అవసరం లేకుండా చేస్తామని రాహుల్ హామీనిచ్చారు. స్టార్టప్ కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులపై విధిస్తున్న ఏంజెల్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాయనేదాని ఆధారంగా వారికి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఉంటాయని రాహుల్ తెలిపారు. వచ్చే వారంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది.