PTI interview
-
వెన్నుపోటు పొడిచింది
న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో సంజయ్ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.పాలకవర్గం మొదలు పార్లమెంట్‌దాకా‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్‌దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.దౌత్య రక్షణ పీకేస్తామన్నారుతనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్ అఫైర్స్ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్‌కు నేను, డెప్యూటీ హైకమిషనర్ వెళ్లాం. ‘నిజ్జర్ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్‌ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు. -
అభయ ఘటన భయానకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అభయ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీకార్ ఘటన తనని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదు.. చాలు’అని సూచించారు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. సమాజం వాటిని మర్చిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో నర్సులపై అఘాయిత్యాలు, మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాలపై రాష్ట్రపతి ముర్ము పరోక్షంగా స్పందించారు. కోల్‌కతా అభయ కేసులో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు చేస్తున్నప్పటికీ నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. -
Amit Shah: మేం అలాగే చేస్తాం
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శలకు జడిసేదిలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ముస్లింలకు కోటాను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతం అంశాన్ని ముందుకు తెస్తోందని విపక్షాలు విమర్శించినాసరే తాము అలాగే చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం పీటీఐతో ఇంటర్వ్యూలో షా వెల్లడించిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. మేం అప్పుడు ఓడిపోయాం కదా! ‘‘రాజ్యాంగంలో లేనివిధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు విపక్షాలు ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నాం. ఆరి్టకల్ 370ని రద్దుచేశాం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చాం. చేసిన పనులనే చెప్పుకుంటున్నాం. వద్దు అని విపక్షాలు అన్నాసరే మేం అలాగే చేస్తాం. కావాలనే పోలింగ్ శాతాలను ఈసీ ఆలస్యంగా వెల్లడిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈవీఎంలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చేస్తోందని విపక్షాల చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. తెలంగాణ, పశి్చమబెంగాల్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఈసీ ఇలాగే చేసింది. అప్పుడు ఆ రాష్ట్రాల్లో మేం ఓడిపోయాంకదా. ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఈ ఎన్నికలు కూడా అంతే పారదర్శకంగా జరుగుతున్నట్లే లెక్క. ఓడిపోతానని రాహుల్ గాంధీ ఊహించారు. అందుకే ముందే ఏడ్చేసి, ఏవో కారణాలు చెప్పేసి విదేశాలకు వెళ్లిపోతారు. జూన్ 6న విదేశాలకు వెళ్తారేమో. అందుకే ఏదో ఒకటి చెప్తున్నారు’’ ‘400’ అనేది నినాదం కాదు ‘‘ మేం 399 సీట్లు సాధిస్తే ‘ మీకు 400 రాలేదుగా’ అని విపక్షాలు విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. ఈసారి 400 సీట్లు గెలుస్తాం అనేది మా నినాదం కాదు. విజయావకాశాలను లెక్కగట్టి చెప్పిన సంఖ్య అది. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్లే మేం ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. పేద కుటుంబమహిళకు ఏటా రూ.1 లక్ష ఇస్తామని కాంగ్రెస్ అమలుచేయలేని వాగ్దానాలిస్తోంది. 2–3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తోంది. రూ.1 లక్ష సంగతి దేవుడెరుగు గతంలో హామీ ఇచి్చనట్లు(హిమాచల్ ప్రదేశ్‌లో) రూ.1,500 అయినా ఇస్తారేమో చూద్దాం. బెంగాల్, ఒడిశాలోనూ మాదే హవా ‘‘పశ్చిమబెంగాల్లో 24–30 సీట్లు, ఒడిశాలో 16–17 సీట్లు గెలుస్తాం. తమిళనాడులోనూ ఓటు షేర్ పెంచుకుంటాం. ఈసారి కేరళలో ఖాతా తెరుస్తాం. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ఉమ్మడి పౌరస్మతి అమలుచేస్తాం. మండే ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అమలుచేస్తాం. సంబంధిత బిల్లునూ పార్లమెంట్లో ప్రవేశపెడతాం. ఆర్మీలో యువత కోసం అగి్నవీర్ను మించిన అద్భుత పథకం లేదు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత చక్కని ప్రతిభ కనబరిచిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా’’. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
అమేథీలో కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందంటూ బీజేపీ వ్యాఖ్యానించడం ఆ పార్టీ దురహంకారానికి ప్రతీక అని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ వ్యాఖ్యానించారు. గురువారం పీటీఐతో ప్రత్యేక ముఖాముఖి సందర్భంగా ఆయన ప్రస్తావించిన అంశాలు, వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..నేను సైతం సతీశ్ శర్మలా‘‘ 1990 దశకంలో గాంధీల సన్నిహితుడు, కాంగ్రెస్ నేత సతీశ్ శర్మ ఇదే అమేథీలో ఎంపీగా గెలిచారు. గాంధీల విజయపరంపరను కొనసాగించారు. తర్వాత తప్పుకుని సోనియాగాంధీ పోటీకి మార్గం సుగమం చేశారు. నేను భవిష్యత్తులో అలాగే చేస్తా. ఇక్కడ గెలిచి పార్టీ తరఫున ప్రాతినిథ్య బాధ్యతలు స్వీకరిస్తా. భవిష్యత్తులో గాంధీలు ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ఇవే ప్రాతినిథ్య బాధ్యతలను వారికి అప్పగిస్తా. అమేథీ నుంచి పోటీచేయకుండా రాహుల్ పారిపోయారని బీజేపీ వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆ పార్టీకి గాంధీల చరిత్ర తెలియదని అర్థమవుతోంది. బ్రిటిషర్ల కాలం నుంచీ నెహ్రూ–గాంధీల కుటుంబం బ్రిటిషర్లను ఎదిరించిందేగానీ ఎక్కడికీ పారి పోలేదు. ఇప్పుడూ అంతే. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్రచేశారు. బీజేపీని తరి మేయడమే ఆయన ధ్యేయం’’ అని అన్నారు.ఫ్యూన్, క్లర్క్ వ్యాఖ్యలపై..‘‘గాంధీల కుటుంబానికి ఫ్యూన్, ప్రియాంక గాంధీకి క్లర్క్ అంటూ నాపై బీజేపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వింటూనే ఉన్నా. బీజేపీ నాయకులకు వారి కుటుంబం నేర్పిన విలువలే అబ్బుతాయి. మా నాన్న నిరక్షరాస్యుడు. అయినా నాకు చక్కటి విద్యాబుద్దులు, నడవడిక, విలువలు నేర్పించారు. కుటుంబం ఏం నేర్పిస్తే అవే ఆ కుటుంబసభ్యులకు వస్తాయి. నాపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నా స్పందన, సమాధానం పొందే స్థాయి, అర్హత వారికి లేవు’’ అని వ్యాఖ్యానించారు.నమ్మకాన్ని నిలబెడతా..‘ నాపై నమ్మకంతో అమేథీ బాధ్యతలను గాంధీలు నాకు అప్పగించారు. అమేథీపై గాంధీల చెరగని ముద్ర ఉంది. ఆ ముద్ర చెరిగిపోకుండా, శాశ్వతంగా ఉండేందుకు ఇకమీదటా కృషిచేస్తా. 41 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం బాధ్యతల్ని చూసుకుంటున్నా. గెలిచి గాంధీల నమ్మకాన్ని నిలబెడతా’’ అని అన్నారు.కొన్ని పొరపాట్లతో ఓడారు‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ప్రభుత్వాలు అమేథీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి. ప్రభుత్వ అధికారులు, పాలనాయంత్రాంగాన్ని ఈ నియోజకవర్గంలో దుర్వినియోగం చేశాయి. కాంగ్రెస్ సైతం కొన్ని పొరపాట్లు చేసింది. అందుకే గత ఎన్నికల్లో రాహుల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల్లో ప్రజలు రాహుల్‌ను ఓడించలేదు. ఓడించాలనుకుంటే 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించాలి. కానీ రాహుల్‌కు నాలుగు లక్షలకుపైగా ఓట్లు పడ్డాయి. గెలుపునకు కొంత దూరంలో ఆగిపోయారు. ఆయన ఓడిపోయారని అమేథీ ప్రజలపై నేను నిందారోపణలు మోపట్లేను’’ అని అన్నారు.స్మృతి హామీలు తీర్చారా?‘‘ ఐదేళ్ల క్రితం స్మృతి ఇరానీ అమేథీ ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? నిరుద్యోగం, ధరలు, వీధి ఆవుల మాటేంటి? సమస్యలు అలాగే ఉన్నాయి కదా? ఎవరు గెలుస్తారని చెప్పట్లేను. ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నేను గెలిస్తే ఈ విజయం నిస్సందేహంగా గాంధీలదే’’ అని అన్నారు. – అమేథీ -
Lok Sabha Election 2024: ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
రాయ్‌బరేలీ: కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అబద్ధాలు, మోసపూరిత విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల సమస్యలు, రైతన్నలు వెతలు, నిరుద్యోగుల దుర్భర బతుకుల గురించి మాట్లాడకుండా, కేవలం అనవసర విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన పరిణామాలపై వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం సొంత ఊహాలపై ఆధారపడి ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ప్రజలంటే ఆయనకు గౌరవం లేదని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో తన సోదరుడు రాహుల్ గాంధీ విజయం కోసం శ్రమిస్తూ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న ప్రియాంక గాంధీ బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని మోదీకి నిజంగా ధైర్యం ఉంటే దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతాంగం కష్టాలపై మాట్లాడాలని సవాలు విసిరారు. ప్రియాంక ఇంకా ఏం చెప్పారంటే.. బీజేపీ అంచనాలు తల్లకిందులే.. మీడియాలో గానీ, రాజకీయ ప్రచార వేదికలపై గానీ ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. తమ కష్టనష్టాలపై చర్చ జరగాలని, పరిష్కార మార్గాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, ధరలు తగ్గించడానికి, రైతులు, కారి్మకుల సంక్షేమానికి, తమ కష్టాలు కడతేర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవాలని వారు ఆశిస్తున్నారు. దేశంలో ‘మార్పు’ గాలులు బలంగా వీస్తున్నాయి. ఎన్డీయేకు 400 సీట్లు, బీజేపీకి సొంతంగా 370 వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చివరకు వారి అంచనాలన్నీ తల్లకిందులవుతాయి. మోదీ సమాధానం చెప్పగలరా? దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ ఈ సమస్యను పట్టించుకోకుండా, కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే సంస్థలను నిర్మించిందో, ఏయే పథకాలను సొంతంగా ప్రారంభించిందో నరేంద్ర మోదీ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచి్చన పథకాల పేర్లు మార్చడం తప్ప ఆయన చేసిందేముంది? రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.. ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వం. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటాం. మనకు ఓటు హక్కు రాజ్యాంగమే ఇచి్చంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగమే ఇచి్చంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగమే బలోపేతం చేసింది. రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రజల హక్కులు కాలరాస్తామంటే మేము సహించబోము. ప్రధానమంత్రి కాబట్టి నవ్వలేకపోతున్నాంకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లు, బంగారం, భూములు, గేదెలు దోచుకుంటారని ప్రధానమంత్రి అంటున్నారు. నిజంగా ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే బిగ్గరగా నవ్వుకునేవాళ్లం. ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి దురదృష్టవశాత్తూ నవ్వుకోలేకపోతున్నాం. అబద్ధాలను కూడా నిజాలుగా ప్రజలను నమ్మించడంలో నరేంద్ర మోదీ ఆరితేరిపోయారు. -
Shashi Tharoor: 400.. జోక్, 300.. అసాధ్యం, 200.. ఒక సవాలే
న్యూఢిల్లీ: ఈసారి 400 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిథరూర్ జోక్‌గా అభివరి్ణంచారు. పీటీఐతో ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. కేరళలో బీజేపీ బోణీపై.. ‘‘ దేశవ్యాప్తంగా 400 చోట్ల గెలుస్తానని బీజేపీ నిజంగా జోక్ చేస్తోంది. 300 సీట్లు అసాధ్యమనుకోండి. కనీసం 200 నియోజకవర్గాలను గెల్చుకోవడం కూడా ఆ పారీ్టకి పెద్ద సవాలే. దిగువసభలో అధికారపార్టీ మెజారిటీ కోల్పోతుందనేది దాదాపు ఖరారైంది. కేరళలో ఈసారి కూడా బీజేపీ బోణీ కొట్టబోదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుద్ది. 2019నాటితో పోలిస్తే ఈసారి దక్షిణాదిన కమలం కమిలిపోవడం ఖాయం’’ కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమిపై.. ‘‘రెండు దశల్లో పోలింగ్ ముగిసిన 190 స్థానాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమికి అద్భుతమైన స్పందన వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు చూపిన ఎమోషన్స్, ఉత్సాహం ఈ సారి ఎన్నికల్లో కనిపించకపోవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సానుకూల పవనాలను బాగా నమ్ముతున్నారు. ఈసారి ఊహించిన దానికంటే ఎంతో ముందున్నాం’’ విపక్షాల విక్టరీ స్థానాలపై.. ఈసారి విపక్షాల కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు ఆయన సరదాగా ‘‘ క్రికెట్‌కు వీరాభిమానిని అయినాసరే ఎంత స్కోర్ కొడతారనేది ఊహించలేను. కానీ గెలుపును ఊహిస్తా. బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగొచ్చు. ఇంకొన్ని రాష్ట్రాల్లో మా కూటమి సత్తా చాటొచ్చు. హరియాణాలో గతంలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదు. కానీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఈసారి మాకు అక్కడ 5–7 సీట్లు రావచ్చు. కర్ణాటకలో ఒక్కటే గెలిచాం. ఈసారి 10–17 గెలుస్తామంటున్నారు. కొందరైతే 20 మావే అంటున్నారు’’ తెలంగాణలో బీజేపీ గెలుపుపై.. ‘ తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవడం కష్టమే. బీజేపీ, కాంగ్రెస్ వీళ్లలో ఎవరు జనాన్ని ఆకట్టుకున్నారనేది తేలాల్సి ఉంది. ఇంకా 353 స్థానాల్లో పోలింగ్ మిగిలే ఉంది. ఈ లెక్కన ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముందుంది. నాదో ప్రశ్న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఒక యువకుడు 2014లో బీజేపీకి ఓటేశాడు. అదే యువకుడు పదేళ్ల తర్వాత కూడా అదే బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 2014లో బీజేపీ ఆర్థికవ్యవస్థను చక్కబెట్టేందుకు కృషిచేశామని చెప్పింది. అయినా ఎకానమీలో మార్పు తేలేకపోయింది. 2019లో పుల్వామా దాడులు బాలాకోట్ ఘటనతో దేశ జాతీయభద్రత ప్రశ్నార్థకమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం బీజేపీకి చేతకాదు. ప్రజలకు ఉద్యోగాలు దక్కలేదు. అధిక ధరల వల్ల నచ్చినవి కొనలేకపోయారు. చైనాతో సరిహద్దు విషయంలోనూ బీజేపీ విఫలమైంది. సరిహద్దుల వెంట 65 పెట్రోలింగ్(గస్తీ) పాయింట్లలో 26 పాయింట్లను భారత్ కోల్పోయింది. ఛాతి విరిచి చెప్పుకునేంతగా మోదీ ఏం చేశారు?’’ -
Rakesh Tikait: చీలికకు కేంద్రమే కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్ఎస్ఎస్ నేతలే రైతులుగా.. ‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ జిల్లాకు 40 దొంగ సంఘాలు ‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’ ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర ‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు. సిఫార్సులపై మరోమారు నమ్మం స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’ -
విజయపతాక ఎగరేయాలి
బెంగళూరు: వచ్చే ఐదేళ్ల భారతావని దశ, దిశను నిర్ధేశించే ఎన్నికల రణరంగంలో విజయబావుటాను ఎగరేశాకే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది వెల్లడిస్తామని కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ గెలిచాక వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన పథకాలు, పనుల పట్టికలను ముందుగానే సిద్ధంచేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను పిలిపించి పనులు పురమాయిస్తున్నారు. గెలవకముందే ఆయన చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈయన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం మంచిదికాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ధరవరలను కిందకు దించేలా మేం తెచ్చిన పలు పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను జనం మెచ్చారు. మా గ్యారెంటీ స్కీమ్‌లు ఇదే విషయాన్ని నిరూపించాయి కూడా. అందుకే మా గ్యారెంటీ పథకాలపై ఓటర్లు దృష్టిపెట్టారు’’ అని అన్నారు. ఈసారి ఎన్ డీఏ కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని మోదీ ముందే ప్రకటించిన విషయాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించగా.. ‘‘ ఇంకా నయం. ఆయన ఈసారి 600 సీట్లు మావే అనలేదు. ఇంతటి అతి అత్యాశతో చేసే వ్యాఖ్యానాలు వింటుంటే దేశంలో విపక్షమే లేదు.. అంతా నేనే అన్నట్లుగా ఉంది మోదీ వైఖరి’’ అని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు. ఆనాడూ వెలిగిపోతుందన్నారు ‘‘ 2004లోనూ ఇదే సీన్ కనిపించింది. భారత్ వెలిగిపోతోంది(ఇండియా ఈజ్ షైనింగ్) అంటూ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలు, నినాదాలతో నాటి బీజేపీ సర్కార్ మోతెక్కించింది. వాజ్‌పేయీ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడు అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఏమైంది?. మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. మన్మోహన్ మెరుగైన ప్రధానిగా నిరూపించుకున్నారు’’ అని చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీకి టైం ఉంది ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ ఆ స్థానాల్లో పోలింగ్ తర్వాతి ఫేజ్‌లలో ఉందిగా. ఇంకా సమయం ఉంది. ఇప్పుడే చెప్పేస్తే రాజకీయ సర్ప్రైజ్ ఏముంటుంది?. ఫీడ్‌బ్యాక్ తీసుకుని అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది తర్వాత వెల్లడిస్తాం. అందరి సమ్మతితోనే కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఉంటాయి. మోదీలాగా అందరి తరఫున ఇక్కడ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు’’ అని అన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో పారదర్శకత లోపించింది. ఒక్క బీజేపీనే భారీగా లాభపడింది. పారిశ్రామికవేత్తలు, సంస్థలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారు. ‘ చందా ఇచ్చుకో. దందా పుచ్చుకో’ అన్న సూత్రం పాటించారు. చేతులు వెనక్కి మెలిపెట్టి మరీ డబ్బులు తీసుకుని ఇప్పుడు పారదర్శకత ఉంది అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే ‘‘కుల, మత, ప్రాంత, వర్ణ ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ విభజిస్తున్నారు. నిజానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ఒక్క బీజేపీ నేతనైనా చూపించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఒక్కరైనా దేశం కోసం పోరాడారా?’ అని ఖర్గే ఎద్దేవాచేశారు. సమాలోచనలతోనే సారథి ఎంపిక ‘‘ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చాక విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. ఈసారి నేను పోటీ చేయట్లేదు. గుల్బర్గా(కలబురిగి) సీటు వేరే వాళ్లకు ఇచ్చేశారు’ అని తాను ప్రధాని రేసులో లేనని పరోక్షంగా చెప్పారు. గుల్బర్గా(కలబురిగి) నుంచి ఈసారి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు ఖర్గే ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. -
తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల వెలువరించిన ఏకగ్రీవ తీర్పు పట్ల వ్యక్తమవుతున్న విమర్శలపై స్పందించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నిరాకరించారు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే న్యాయమూర్తులు కేసులపై తీర్పులిస్తారని చెప్పారు. ఏదైనా కేసుపై చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సోమవారం పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచలేమంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పుపై మాట్లాడారు. ఏ న్యాయమూర్తి కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వరని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇచ్చిన తీర్పు కూడా జడ్జిల వ్యక్తిగతం కాదని అన్నారు. చాలా రకాల కేసుల విచారణ, తీర్పుల్లో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని గుర్తుచేశారు. ఒక జడ్జిగా ఏ కేసును, తీర్పునూ వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు. అందుకు తనకు ఎలాంటి విచారం గానీ, ఫిర్యాదు గానీ లేదన్నారు. న్యాయమూర్తులు తీర్పు వెలువరించిన తర్వాత అది ప్రజల ఆస్తిగా మారుతుందని స్పష్టం చేశారు. దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రజలకుంటుందని పేర్కొన్నారు. తీర్పుపై విమర్శలను తిప్పికొట్టడం, సమరి్థంచుకోవడం సరికాదన్నారు. తీర్పు ఇచి్చన తర్వాత ఇక ఆ సంగతి పక్కన పెట్టాలన్నది తన ఉద్దేశమని వివరించారు. తీర్పుపై ఏ జడ్జికీ ఆధిక్యముండదు అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు దేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. ఈ తీర్పు రావడానికి కారణాన్ని ధర్మాసనంలోని ఏ ఒక్క సభ్యుడికో అపాదించలేమని పేర్కొన్నారు. ధర్మాసనంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా అయోధ్య తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఏ కేసులో అయినా ఇవ్వాల్సిన తీర్పును సంబంధిత జడ్జిలంతా కలిసి కూర్చొని, చర్చించుకొని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. చివరకు అది కోర్టు తీర్పుగా మారుతుందని స్పష్టం చేశారు. తీర్పును నిర్ణయించే విషయంలో ఆధిక్యం ఏ ఒక్క జడ్జికో కట్టబెట్టలేమని తేలి్చచెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించే కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు అని విమర్శించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొలీజియంలో అంతర్గతంగా జరిగే సంప్రదింపులను కొన్న కారణాలతో ప్రజలకు తెలియపర్చలేమని సీజేఐ స్పష్టం చేశారు. -
2047 నాటికి అభివృద్ధి భారత్
న్యూఢిల్లీ: ప్రపంచ అభివృద్ధి ‘జీడీపీ కేంద్రిత విధానం’ నుంచి ‘మానవ కేంద్రిత విధానం’ వైపు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మోడల్ ప్రపంచ సంక్షేమానికి ఒక మార్గదర్శిగా మారుతోందని స్పష్టం చేశారు. జీడీపీ పరిమాణంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రతి దేశానికీ ప్రాముఖ్యం ఉందని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) ఏర్పడిందని, కోవిడ్–19 తర్వాత మరో ప్రపంచ క్రమాన్ని చూస్తున్నామని చెప్పారు. మానవ కేంద్రిత అభివృద్ధి దిశగా ప్రపంచం పయనిస్తోందని, ఈ విషయంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. జీ20కి సారథ్యం వహిస్తున్న భారత్ ప్రపంచ దేశాల్లో విశ్వాసం అనే విత్తనాలు నాటిందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. పేదరికంపై విజయం తథ్యం ‘‘చాలా ఏళ్ల క్రితం భారత్‌ను 100 కోట్లకుపైగా ఆకలితో అలమటించే ఖాళీ కడుపులున్న దేశంగా భావించేవారు. కానీ, ఇప్పుడు 100 కోట్లకుపైగా ఆకాంక్షలతో కూడిన హృదయాలు, రెండు కోట్లకుపైగా నైపుణ్యం కలిగిన చేతులు, కోట్లాది యువత ఉన్నదేశంగా భారత్‌ను చూస్తున్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ కాలమంతా ఒక మంచి అవకాశమే. గొప్ప అభివృద్ధికి పునాదులు వేసే అవకాశం ఈనాటి భారతీయులకు వచి్చంది. మనం సాధించే ప్రగతి రాబోయే వెయ్యేళ్లు గుర్తుండిపోతుంది. పేదరికంపై జరుగుతున్న యుద్ధంలో పేద ప్రజలు కచి్చతంగా విజయం సాధిస్తారు. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించబోతున్నాం. దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి ఎంతమాత్రం స్థానంలేదు. జీ20 కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించడంలో వింతేమీ లేదే. అది సహజమే. భారత్ చాలా విశాలమైన, వైవిధ్యం కలిగిన దేశం. మన సొంత భూభాగంలో ఎక్కడైనా సదస్సులు నిర్వహించుకునే స్వేచ్ఛ మాకుంది. వాతావరణ మార్పులపై పోరాడే విషయంలో కేవలం ఒకే విధానం సరిపోదు. నిర్మాణాత్మక చర్యలుండాలి. వాతావరణ లక్ష్యాలను సాధించే విషయంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోం. ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. కార్యకలాపాల కోసం డార్క్ నెట్, మెటావెర్స్, క్రిప్టోకరెన్సీ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రపంచ సమస్యలకు భారత్ పరిష్కారం భారత్‌లో అమలవుతున్న మానవ కేంద్రిత అభివృద్ధి మోడల్‌ను ప్రపంచ దేశాలు గుర్తించి, అనుసరిస్తున్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాం. మన దేశాన్ని గతంలో కేవలం ఒక పెద్ద మార్కెట్‌గానే పరిగణించేవారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కార మార్గాలు చూపిస్తోంది. అప్పుల భారం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఉచిత పథకాలు అనేవి సరైన ఆలోచన కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితిలో అన్ని దేశాల గొంతుకలకు ప్రాతినిధ్యం దక్కాలి. జీ20లో ఆఫ్రియన్ యూనియన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం కలి్పంచాలి. అందుకు మేము మద్దతు ఇస్తాం. అన్ని గొంతుకలను గుర్తించకుండా, ప్రాతినిధ్యం కలి్పంచకుండా.. ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ ప్రణాళిక కూడా సఫలం కాదు’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం ► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి ► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది ► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం. ► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు ► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే. -
Bharat Jodo Yatra: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు
తురువుకెరె(కర్ణాటక): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐక్య భారతానికి ప్రతీకగా మారారని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభివర్ణించారు. ఆదివారం దిగ్విజయ్ పీటీఐకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా కొనసాగే భారత్ జోడో యాత్ర సమాప్తమయ్యాక మరింత పటిష్టమైన నాయకత్వ లక్షణాలను సంతరించుకున్న రాహుల్‌ను చూస్తారు. ఆయన కొత్త అవతారం మొదలుకానుంది. యావత్ ప్రజానీకంలో కాంగ్రెస్ పట్ల మరింత సానుకూల వైఖరిని పాదయాత్ర పెంచుతుందనడంలో సందేహమే లేదు. చాన్నాళ్ల తర్వాత దేశంలోని ప్రతి పల్లెలోనూ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. తొలి నుంచీ కడదాకా యాత్రలో రాహుల్ మమేకమైన విధానం చూసి జనం బాగా మెచ్చుకుంటున్నారు. యాత్రతో పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుంది. మన దేశంలో త్యాగధనులందరికీ సరైన మన్నన దక్కుతుంది. ప్రధాని పదవిని సోనియా గాంధీ త్యజించారు. ఇప్పుడు రాహుల్ మండుటెండలో చెమటోడుస్తూ, హోరు వానలో తడుస్తూ, అబద్ధపు వార్తలు, ప్రతిష్ట దిగజార్చే వ్యాఖ్యలను ఎదుర్కొంటూ జనం కోసం ముందుకు సాగుతున్నారు. భారత్ జోడోకు సిసలైన సంకేతంగా నిలిచారు. యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూడటం ఖాయం. అనుకున్న లక్ష్యంగా కోసం రాహుల్ అవిశ్రాంతంగా కృషిచేస్తారు. సానుకూల దృక్పథమే స్ఫూర్తిగా పనిచేస్తారు’ అని దిగ్విజయ్ అన్నారు. ‘‘ క్రియాశీలక కార్యకర్తల సంఖ్య పరంగా చూస్తే బీజేపీ ‘ఆర్గనైజేషన్’ కంటే కాంగ్రెస్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య సమన్వయం తగ్గింది. అయితే, ఇప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా లక్షలాది మంది స్వస్థలాలను వదిలి మరీ పాదయాత్రలో కదం తొక్కుతున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇలాంటి జనోద్యమాల ద్వారానే నాయకులు పుట్టుకొస్తారు’ అని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ ఘన గత చరిత్రతో పోలిస్తే ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలహీనంగా తయారై సమస్యలను ఎదుర్కొంటోంది. యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నాం. గ్రామాలు, పట్టణాలు ఇలా ప్రతిస్థాయిలో యాత్రలో సమన్వయం కోసం ప్రతీ రాష్ట్రంలో, జిల్లాలో సమన్వయకర్తలను నియమించాం. యాత్రలో కార్యకర్తలు మొదలుకొని నేతలంతా భాగస్వాములయ్యేలా చేశాం. ఇది పార్టీ క్షేత్రస్థాయి పటిష్టతకు బాటలుపరుస్తుంది. ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించాలని స్థానిక నేతలకు సూచించాం. యాత్రతో చేకూరిన మేలు ఏంటంటే.. అది మీడియా దృష్టిలో పడటం’ అని అన్నారు. -
వారి పోరాటం రెండో స్థానం కోసమే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీతో సహా విపక్షాలన్నీ రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ తిరిగి బంపర్‌మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. తృణమూల్ వంటి పార్టీల మద్దతు, లఖీంపూర్‌ఖేరీ ఉదంతం వంటివి సమాజ్‌వాదీ పార్టీకి ఏ మాత్రమూ లాభించే పరిస్థితి లేదన్నారు. ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు... ► ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఈసారి ఎన్నికల్లో మాకెవరూ పోటీ లేరు. సమాజ్‌వాదీ పార్టీతో సహా విపక్షాలన్నీ కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 80 శాతం ఓటర్ల మద్దతు బీజేపీకే ఉంది. విపక్షాలన్నీ కలిపి మిగతా 20 శాతం ఓట్ల కోసమే పోరాడుతున్నాయి. ► తమదిప్పుడు సరికొత్త (నయా) సమాజ్‌వాదీ అని ఆ పార్టీ అంటోంది? వాళ్లు అణుమాత్రమైనా మారలేదు. మాఫియాలకు, నేర చరితులకు, ఉగ్రవాదులకు సాయపడే వారికి టికెట్లివ్వడం నుంచి మొదలుకుని ఏ ఒక్క విషయంలోనూ సమాజ్‌వాదీ అస్సలు మారలేదు. యూపీలో తాజా గాలి వీస్తోంది తప్పితే ఆ పార్టీ మాత్రం ఎప్పట్లాగే ఉంది. ► చట్ట వ్యతిరేక శక్తులు తనకు ఓటేయాల్సిన అవసరం లేదని అఖిలేశ్ అంటున్నారు? నిజానికి ఆయన ఉద్దేశం అందుకు పూర్తిగా వ్యతిరేకం. చట్ట వ్యతిరేక శక్తులు, విద్రోహులు ఒక్కతాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ హయాంలో నడిచిన గూండారాజ్‌ను మళ్లీ తేవాలన్నది అఖిలేశ్ అసలు మాటల అంతరార్థం. ► లఖీంపూర్‌ఖేరీలో రైతుల మరణాన్ని జలియన్‌వాలాబాగ్ దురంతంతో అఖిలేశ్ పోలుస్తుండటం బీజేపీకి చేటు చేస్తుందా? ఈ విషయంలో చట్టం చురుగ్గా పని చేస్తోంది. కేసుపై సిట్ నిష్పాక్షికంగా విచారణ జరుపుతోంది. దాన్ని సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న అఖిలేశ్ ఆశలు నెరవేరవు. రాష్ట్ర రైతులంతా వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న బీజేపీకే మద్దతుగా నిలుస్తారు. ► తృణమూల్ తదితర పార్టీలు సమాజ్‌వాదీకి మద్దతు ప్రకటించడం మీకేమీ నష్టం చేయదా? తృణమూల్, ఎన్సీపీ, ఆర్జేడీ వంటి పార్టీలకు యూపీలో ప్రజల మద్దతే లేదు. వాటి మద్దతుతో సమాజ్‌వాదీకి ఒరిగేదేమీ ఉండదు. ► యోగి ప్రధాని అభ్యర్థి అవుతారేమోనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి? నేనో సామాన్య బీజేపీ కార్యకర్తను. పార్టీ నాకిచ్చిన ఏ పనినైనా నెరవేర్చడమే నా బాధ్యత. అంతే తప్ప పదవుల కోసం, కుర్చీల కోసం నేనెన్నడూ పాకులాడలేదు. ► మీరు పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది? అది సంప్రదాయ బీజేపీ స్థానం. పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడి ప్రజలే మరోసారి గెలిపించుకుంటారు. -
ఆర్థిక వ్యవస్థను బాగుచేస్తాం
న్యూఢిల్లీ: నోట్లరద్దు, అస్తవ్యస్తంగా జీఎస్టీని అమలు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు బీజేపీ ప్రభుత్వం కలిగించిన నష్టాన్ని తాము న్యాయ్ (కనీస ఆదాయ భద్రత పథకం) ద్వారా పూడుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న తరుణంలో పీటీఐకి రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము ప్రకటించిన న్యాయ్ పథకానికి రెండు లక్ష్యాలు ఉన్నాయనీ, వాటిలో ఒకటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందివ్వడం కాగా, రెండోది ప్రధాని మోదీ ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను బాగుచేయడమని రాహుల్ చెప్పారు. కనీస ఆదాయ భద్రత పథకానికి తాము న్యాయ్ (న్యూన్‌తమ్ ఆయ్ యోజన) అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందనీ, గత ఐదేళ్లలో మోదీ ప్రజలకు అన్యాయం చేయగా, మేం న్యాయం చేస్తామని చెప్పడానికే ఆ పేరు పెట్టామని తెలిపారు. ప్రజాకర్షక పథకం కాదిది న్యాయ్ పథకం ప్రజలను కాంగ్రెస్ వైపునకు ఆకర్షించేందుకు తీసుకొచ్చింది కాదనీ, పేదరికంపై చివరి అస్త్రమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ అమలు విధానం నిర్ణయాల్లా ఇది అస్తవ్యస్తంగా ఉండదనీ, ఒక పద్ధతి ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, అప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించిన అనంతరం దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. మూడేళ్లదాకా అనుమతులు అక్కర్లేదు కొత్తగా ప్రారంభమైన వ్యాపార సంస్థలు తొలి మూడేళ్ల కాలంలో ఏ రకమైన అనుమతినీ ప్రభుత్వం నుంచి పొందాల్సిన అవసరం లేకుండా చేస్తామని రాహుల్ హామీనిచ్చారు. స్టార్టప్ కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులపై విధిస్తున్న ఏంజెల్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాయనేదాని ఆధారంగా వారికి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఉంటాయని రాహుల్ తెలిపారు. వచ్చే వారంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. -
వ్యాపారానికి మెరుగైన పరిస్థితులే లక్ష్యం
జీఎస్టీ, పన్నుల హేతుబద్ధీకరణ కూడా * కొత్త ఏడాదిలో వీటిపైనే అత్యధికంగా దృష్టిపెడతాం... * ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ మెరుగ్గా నిలిచాం * పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులను కల్పించడం... కొత్త ఏడాది(2016)లో ఇవే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులను వెచ్చిస్తామని హామీనిచ్చారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, సంక్షోభం కారణంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన రీతిలో రాణించిందని.. రానున్న నెలల్లో వృద్ధి రేటు మరింత పుంజుకుంటుందని జైట్లీ పేర్కొన్నారు. ప్రధానంగా వచ్చే ఏడాది నిర్మాణాత్మక సంస్కరణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ‘మూడు అంశాలను ప్రభుత్వం కీలకంగా తీసుకోనుంది. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను వెచ్చించనున్నాం. అదేవిధంగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి(ఇరిగేషన్) రంగంలో కూడా ప్రభుత్వం మరింతగా పెట్టుబడి చేయనుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సంబంధించి నిబంధనలను మరింత సరళీకరించడంతోపాటు ప్రస్తుత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. భారత్ వెలుగురేఖ... ప్రపంచ మందగమనంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వెలుగురేఖగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. ‘7-7.5 శాతం వృద్ధి అవకాశాలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పరుగులు తీస్తోంది. అయితే, మేము నిర్దేశించుకున్న 8 శాతం లక్ష్యం కంటే ఇది తక్కువే. వర్షాలు తగినంతగా కురిసుంటే ఇది సాకారమయ్యేదే. మొత్తంమీద 2015 ఏడాది అత్యంత సంతృప్తికరంగా ముగుస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు అంత్యంత పటిష్టంగా ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎకానమీ ఇంకా పూర్థిస్థాయిలో గాడిలో పడలేదన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. నిజంగా పుంజుకోకుంటే పన్ను వసూళ్లు ఎలా మెరుగవుతాయని ఆయన ప్రశ్నించారు. భారత పారిశ్రామిక వర్గాల్లో కూడా కొంత నిరాశావాదం వ్యక్తమవుతోందన్న ప్రశ్నకు.. కొంతమంది అతిగా చిత్రీకరిస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. మరోపక్క, కొన్ని కీలక బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన కుయుక్తులను కట్టిపెట్టకపోతే.. తగిన ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాల్సి వస్తుందని కూడా జైట్లీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంది... అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుదలవల్ల లభిస్తున్న ప్రయోజనాన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకుంటున్నామని జైట్లీ చెప్పారు. ముఖ్యంగా హైవేలు, గ్రామీణ రోడ్లు, రైల్వేలలో పెట్టుబడులను గణనీయంగా పెంచుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోర్టుల్లో కూడా ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ‘ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలో ఉంది. ఆర్బీఐ వడ్డీరేట్లు(రెపో) ఈ ఏడాది 1.25 దిగొచ్చాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశం. డాలరుతో మారకం విలువ విషయంలో పలు దేశాలతో పోలిస్తే మనం మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాం’ అని జైట్లీ తెలిపారు. బ్యాంకుల్లో మొండిబకాయిలు పెరిగిపోవడంపై మాట్లాడుతూ... ఈ సమస్య చాలా పెద్దదే అయినా.. బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చడం సహా తాము ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. -
వ్యాపారానికి అనువైన దేశంగా భారత్
- మరింత ఆమోదయోగ్యమైన పన్నుల విధానం - మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలు ఇవే... - పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ఆమోదయోగ్యమైన పన్నుల విధానం, వ్యాపారానికి మరింత అనువైన పరిస్థితులను కల్పించడమే రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నిర్ణయాల్లో జాప్యాలను తొలగించడం, సంస్కరణల వేగాన్ని కొనసాగించడంపైన కూడా దృష్టిసారించనున్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము చేపడుతున్న సంస్కరణలు వాస్తవ రూపం దాల్చడం లేదంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు... చేతల్లో కనబడటం లేదంటూ కార్పొరేట్ ఇండియా నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి అడిగిన ప్రశ్నకు జైట్లీ స్పందిస్తూ... అలాంటి ధోరణికి తావులేదని స్పష్టం చేశారు. గతేడాది మేలో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం పన్నులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ‘వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాం. అదేవిధంగా నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం. దీనిలో భాగంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు మినహాయింపులను కొనసాగిస్తూనే, కంపెనీలకు వీటిని తొలగించడంపై దృష్టిపెడుతున్నాం. డిమాండ్‌ను పెంచడానికి, వృద్ధికి చేయూతనిచ్చేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని జైట్లీ వివరించారు. అంతిమంగా స్థిరమైన, సబబైన పన్నుల విధానమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. ప్రైవేటు పెట్టుబడుల పెంపు, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం కోసం అనుమతుల జారీ ప్రక్రియను మెరుగుపరుస్తున్నామని, జీఎస్టీ, భూసేకరణ చట్టం వంటి పెండింగ్ బిల్లుకు ఆమోదం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి కంపెనీలు సులువుగా వైదొలగేందుకు దివాలా(బ్యాంక్రప్సీ) కోడ్‌ను కూడా తీసుకురావడంపై దృష్టిపెట్టామన్నారు. యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు... ‘వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు భారీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. గత యూపీఏ ప్రభుత్వం ప్రధానంగా ప్రజాకర్షక పాలసీలు, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని వ్యవస్థను తప్పుదోవ పట్టించింది. ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియ విశ్వసనీయత కోల్పోయాల చేసింది. సరళీకరణను పక్కనబెట్టి క్రోనీయిజమ్(సన్నిహితులను అనుకూలంగా నిర్ణయా లు తీసుకోవడం)ను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. స్పెక్ట్రం, బొగ్గు వంటి కుంభకోణాలే దీనికి నిదర్శనం’ అని జైట్లీ పేర్కొన్నారు. తమ మోదీ సర్కారు మాత్రం ఇలాంటివాటికి దూరంగా ఆర్థిక సరళీకరణను పరుగులు పెట్టిస్తోందన్నారు. ఏడాది పాలనలో తమ సర్కారుపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వృద్ధి రేటు పుంజుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందన్న పూర్తి విశ్వాసం ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, ఈ ఏడాది రుతుపవనాలపై నెలకొన్న ఆందోళనలు దేశీ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారనున్నాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.