వెన్నుపోటు పొడిచింది | Canada backstabbed India in Khalistani investigation row says says Indian envoy Sanjay Verma | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పొడిచింది

Published Fri, Oct 25 2024 4:32 AM | Last Updated on Fri, Oct 25 2024 4:32 AM

Canada backstabbed India in Khalistani investigation row says says Indian envoy Sanjay Verma

ప్రజాస్వామ్య కెనడా నుంచి మేం ఊహించని అనైతిక వైఖరి ఇది

కెనడా నుంచి తిరిగొచ్చిన భారత హైకమిషనర్‌ సంజయ్‌ వర్మ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యోదంతంలో సంజయ్‌ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్‌ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్‌– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్‌ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.

పాలకవర్గం మొదలు పార్లమెంట్‌దాకా
‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్‌దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్‌ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్‌ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

 తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. 

రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్‌’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.

దౌత్య రక్షణ పీకేస్తామన్నారు
తనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్‌ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్‌ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్‌ అఫైర్స్‌ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్‌కు నేను, డెప్యూటీ హైకమిషనర్‌ వెళ్లాం. ‘నిజ్జర్‌ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉంది. 

రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్‌ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్‌లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్‌హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం  పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement