ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం
వచ్చే ఐదేళ్ల పాలనపై మోదీ ఏర్పాట్లు ఆయన అతివిశ్వాసానికి పరాకాష్ట
పీటీఐ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడిన ఖర్గే
బెంగళూరు: వచ్చే ఐదేళ్ల భారతావని దశ, దిశను నిర్ధేశించే ఎన్నికల రణరంగంలో విజయబావుటాను ఎగరేశాకే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది వెల్లడిస్తామని కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ గెలిచాక వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన పథకాలు, పనుల పట్టికలను ముందుగానే సిద్ధంచేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను పిలిపించి పనులు పురమాయిస్తున్నారు.
గెలవకముందే ఆయన చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈయన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం మంచిదికాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ధరవరలను కిందకు దించేలా మేం తెచ్చిన పలు పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను జనం మెచ్చారు. మా గ్యారెంటీ స్కీమ్‌లు ఇదే విషయాన్ని నిరూపించాయి కూడా.
అందుకే మా గ్యారెంటీ పథకాలపై ఓటర్లు దృష్టిపెట్టారు’’ అని అన్నారు. ఈసారి ఎన్ డీఏ కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని మోదీ ముందే ప్రకటించిన విషయాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించగా.. ‘‘ ఇంకా నయం. ఆయన ఈసారి 600 సీట్లు మావే అనలేదు. ఇంతటి అతి అత్యాశతో చేసే వ్యాఖ్యానాలు వింటుంటే దేశంలో విపక్షమే లేదు.. అంతా నేనే అన్నట్లుగా ఉంది మోదీ వైఖరి’’ అని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు.
ఆనాడూ వెలిగిపోతుందన్నారు
‘‘ 2004లోనూ ఇదే సీన్ కనిపించింది. భారత్ వెలిగిపోతోంది(ఇండియా ఈజ్ షైనింగ్) అంటూ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలు, నినాదాలతో నాటి బీజేపీ సర్కార్ మోతెక్కించింది. వాజ్‌పేయీ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడు అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఏమైంది?. మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. మన్మోహన్ మెరుగైన ప్రధానిగా నిరూపించుకున్నారు’’ అని చెప్పారు.
అమేథీ, రాయ్‌బరేలీకి టైం ఉంది
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ ఆ స్థానాల్లో పోలింగ్ తర్వాతి ఫేజ్‌లలో ఉందిగా. ఇంకా సమయం ఉంది. ఇప్పుడే చెప్పేస్తే రాజకీయ సర్‌ప్రైజ్ ఏముంటుంది?. ఫీడ్‌బ్యాక్ తీసుకుని అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది తర్వాత వెల్లడిస్తాం. అందరి సమ్మతితోనే కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఉంటాయి. మోదీలాగా అందరి తరఫున ఇక్కడ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు’’ అని అన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో పారదర్శకత లోపించింది. ఒక్క బీజేపీనే భారీగా లాభపడింది. పారిశ్రామికవేత్తలు, సంస్థలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారు. ‘ చందా ఇచ్చుకో. దందా పుచ్చుకో’ అన్న సూత్రం పాటించారు. చేతులు వెనక్కి మెలిపెట్టి మరీ డబ్బులు తీసుకుని ఇప్పుడు పారదర్శకత ఉంది అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు.
తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే
‘‘కుల, మత, ప్రాంత, వర్ణ ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ విభజిస్తున్నారు. నిజానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ఒక్క బీజేపీ నేతనైనా చూపించండి. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో ఒక్కరైనా దేశం కోసం పోరాడారా?’ అని ఖర్గే ఎద్దేవాచేశారు.
సమాలోచనలతోనే సారథి ఎంపిక
‘‘ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చాక విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. ఈసారి నేను పోటీ చేయట్లేదు. గుల్బర్గా(కలబురిగి) సీటు వేరే వాళ్లకు ఇచ్చేశారు’ అని తాను ప్రధాని రేసులో లేనని పరోక్షంగా చెప్పారు. గుల్బర్గా(కలబురిగి) నుంచి ఈసారి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు ఖర్గే ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment