Legislative Assembly elections
-
Congress Prty: 7 కీలక హామీలు
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ హామీల చిట్టీని బహిర్గతం చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులకు వరాలు కురిపించింది. మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఏడు కీలకమైన హామీలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ల సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 53 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఏడు గ్యారంటీలు ఇవే → మహిళా సాధికారత: 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.2,00 చొప్పున ఆర్థికసాయం. రూ.500కే గ్యాస్ సిలిండర్ → సామాజిక భద్రత: వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు రూ.6,000 పెన్షన్ → యువతకు: రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ → ఉచితాలు: రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్→ పేదలకు: ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంలో ఇల్లు. ఇందులో రూ.3.5 లక్షల ఖర్చుతో రెండు గదుల ఇళ్లు → రైతులకు: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత → వెనుకబడిన వర్గాలకు: కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవడం. క్రిమిలేయర్ పరిమితిని రూ.10లక్షలకు పెంపు గెలిచాకే సీఎం అభ్యర్థి ఖరారు: ఖర్గే హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచి్చన ఏడు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ‘‘దాదాపు 35 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిలిపివేసింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఒక ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతోంది. మేం మేనిఫెస్టోలో చెప్పిన ఏడు ప్రధాన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిన నష్టాన్ని సరిదిద్దటంతోపాటు రాష్ట్రంలో వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ‘అభివృద్ధి ఎక్స్‌ప్రెస్ ఇంజన్’జత చేస్తాం’’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాకే ముఖ్యమంత్రి అభ్యరి్థని ప్రకటిస్తామని ఖర్గే స్పష్టంచేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా సైతం మాట్లాడారు. ‘‘నాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1966లో మా రాష్ట్రం ఏర్పాటైంది. నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ హరియాణాను నంబర్ వన్ చేస్తాం’అని హూడా అన్నారు. -
AP: తొలిరోజే భారీగా నామినేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు పార్లమెంటుకు నామినేషన్లు దాఖలు చేసిన ముఖ్యుల్లో వైఎస్సార్సీపీ తరఫున రాజంపేట నియోజకవర్గం నుంచి పి.మిథున్‌రెడ్డి, హిందూపురం నుంచి జె.శాంత, తెలుగుదేశం తరఫున నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు (ఎస్సీ) నుంచి డి.ప్రసాదరావు ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీకి నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆళ్ల నాని, అనంత వెంకటరామిరెడ్డి, ఎస్.చక్రపాణిరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, బుట్టా రేణుక, కేతిరెడ్డి పెద్దారెడ్డి, బూచేపల్లి, కొరుముట్ల శ్రీనివాసులరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, తెలుగుదేశం తరఫున పయ్యావుల కేశవ్, లోకేశ్, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, బీజేపీ తరఫున సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి తదితరులున్నారు. -
విజయపతాక ఎగరేయాలి
బెంగళూరు: వచ్చే ఐదేళ్ల భారతావని దశ, దిశను నిర్ధేశించే ఎన్నికల రణరంగంలో విజయబావుటాను ఎగరేశాకే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది వెల్లడిస్తామని కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ గెలిచాక వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన పథకాలు, పనుల పట్టికలను ముందుగానే సిద్ధంచేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను పిలిపించి పనులు పురమాయిస్తున్నారు. గెలవకముందే ఆయన చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈయన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం మంచిదికాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ధరవరలను కిందకు దించేలా మేం తెచ్చిన పలు పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను జనం మెచ్చారు. మా గ్యారెంటీ స్కీమ్‌లు ఇదే విషయాన్ని నిరూపించాయి కూడా. అందుకే మా గ్యారెంటీ పథకాలపై ఓటర్లు దృష్టిపెట్టారు’’ అని అన్నారు. ఈసారి ఎన్ డీఏ కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని మోదీ ముందే ప్రకటించిన విషయాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించగా.. ‘‘ ఇంకా నయం. ఆయన ఈసారి 600 సీట్లు మావే అనలేదు. ఇంతటి అతి అత్యాశతో చేసే వ్యాఖ్యానాలు వింటుంటే దేశంలో విపక్షమే లేదు.. అంతా నేనే అన్నట్లుగా ఉంది మోదీ వైఖరి’’ అని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు. ఆనాడూ వెలిగిపోతుందన్నారు ‘‘ 2004లోనూ ఇదే సీన్ కనిపించింది. భారత్ వెలిగిపోతోంది(ఇండియా ఈజ్ షైనింగ్) అంటూ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలు, నినాదాలతో నాటి బీజేపీ సర్కార్ మోతెక్కించింది. వాజ్‌పేయీ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడు అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఏమైంది?. మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. మన్మోహన్ మెరుగైన ప్రధానిగా నిరూపించుకున్నారు’’ అని చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీకి టైం ఉంది ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ ఆ స్థానాల్లో పోలింగ్ తర్వాతి ఫేజ్‌లలో ఉందిగా. ఇంకా సమయం ఉంది. ఇప్పుడే చెప్పేస్తే రాజకీయ సర్ప్రైజ్ ఏముంటుంది?. ఫీడ్‌బ్యాక్ తీసుకుని అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది తర్వాత వెల్లడిస్తాం. అందరి సమ్మతితోనే కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఉంటాయి. మోదీలాగా అందరి తరఫున ఇక్కడ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు’’ అని అన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో పారదర్శకత లోపించింది. ఒక్క బీజేపీనే భారీగా లాభపడింది. పారిశ్రామికవేత్తలు, సంస్థలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారు. ‘ చందా ఇచ్చుకో. దందా పుచ్చుకో’ అన్న సూత్రం పాటించారు. చేతులు వెనక్కి మెలిపెట్టి మరీ డబ్బులు తీసుకుని ఇప్పుడు పారదర్శకత ఉంది అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే ‘‘కుల, మత, ప్రాంత, వర్ణ ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ విభజిస్తున్నారు. నిజానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ఒక్క బీజేపీ నేతనైనా చూపించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఒక్కరైనా దేశం కోసం పోరాడారా?’ అని ఖర్గే ఎద్దేవాచేశారు. సమాలోచనలతోనే సారథి ఎంపిక ‘‘ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చాక విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. ఈసారి నేను పోటీ చేయట్లేదు. గుల్బర్గా(కలబురిగి) సీటు వేరే వాళ్లకు ఇచ్చేశారు’ అని తాను ప్రధాని రేసులో లేనని పరోక్షంగా చెప్పారు. గుల్బర్గా(కలబురిగి) నుంచి ఈసారి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు ఖర్గే ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. -
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి. ► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌లోనే.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి. ► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి. -
నగరం..ఓటు గగనం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఉద్యోగం, ఆపై వారాంతపు వినోదాలకు ప్రాధాన్యతనిచ్చే మహా నగరంతో పాటు ఇతర నగరాలు ఓటింగ్‌లో పల్టీ కొడుతున్నాయి. ఎన్నిక ఏదైనా..అభ్యర్థులు ఎవరైనా..మాకేంటి అన్నట్టుగా ఎక్కువ శాతం నగర జనం వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుండగా.. సిటీజనులు ఈసారి ఏ మేరకు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఓటర్లలో 80.4 శాతం మంది ఓట్లు వేయగా, హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం తదితర నగరాల్లో ఓటేసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. తెలంగాణలో ఏకంగా 20కి పైగా నగరాలు, పట్టణాల్లో 53 శాతం లోపు ఓట్లే పోలయ్యాయి. హైదరాబాద్‌లో 50% కూడా మించకపోవడం గమనార్హం. పల్లెల్లోనే అత్యధిక పోలింగ్ ఎన్నిక ఏదైనా పల్లెల్లోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతోంది. నగరాలు, పట్టణాల్లో ఉండే వారు సైతం పల్లెలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ఇందుకు ఒక కారణమవుతోంది. అయితే ఈసారి పల్లెలకు దీటుగా నగరాలు, పట్టణాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రచారం నిర్వహించాయి. అయితే పోలింగ్ రోజైన గురువారం సెలవు దినం కాగా, మధ్యలో ఒకరోజు (శుక్రవారం) సెలవు పెడితే, శని, ఆదివారాలు సెలవులు (లాంగ్ వీకెండ్) కావడం పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓటు వేయటం కనీస బాధ్యత ఎన్నికల్లో ఓటు వేయటం పౌరుల కనీస బాధ్యత. తమ పని తాము చేయకుండా ప్రశ్నిస్తామనటం ఏ మాత్రం సరికాదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలింగ్ శాతం ఆందోళనకరంగా ఉంటోంది. అందుకే ఈసారి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఓటింగ్ శాతం పెరుగుతుందన్న నమ్మకం ఉంది. - షీలా పనికర్, లెట్స్ ఓట్ప్రతినిధి ఎక్కడకెళ్లినా ఓటేసేందుకు వస్తా ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి రావటమే నా లక్ష్యం. ఇప్పటివరకు 62 దేశాలు తిరిగా. పోలింగ్ రోజు మాత్రం తప్పకుండాహైదరాబాద్లో ఉండేలా చూసుకుంటా. కొండాపూర్‌లో ఓటేసి వెళ్తా. పోలింగ్ డేట్‌ను చూసుకునే నా టూర్ ప్లాన్ చేసుకుంటా. పాండిచ్చేరిలో ఉన్న నేను ఓటు కోసమే హైదరాబాద్ వచ్చా. - నీలిమారెడ్డి, ట్రావెలర్ -
తెలంగాణలో నేడు ఓట్ల పండుగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చే రోజు వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ మొదలుకానుంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 స్థానాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. మిగతా 106 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. మిగతా ప్రక్రియల పూర్తి అనంతరం డిసెంబర్ 5తో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మూడు కోట్లకుపైగా ఓటర్లు రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు, 1,62,98,418 మంది పురుషులు, 2,676 మంది మూడో జెండర్ ఓటర్లు కలిపి మొత్తంగా 3,26,18,205 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి 2,067 మంది పురుష అభ్యర్థులు, 222 మంది మహిళా అభ్యర్థులు, మూడో జెండర్ అభ్యర్థి ఒకరు కలిపి మొత్తం 2,290 మంది ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఏ పార్టీల నుంచి ఎంత మంది అభ్యర్థులు? రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీచేస్తోంది. కాంగ్రెస్ 118 సీట్లలో, ఆ పార్టీ పొత్తుతో సీపీఐ ఒకచోట బరిలో ఉన్నాయి. మరో కూటమిలో భాగంగా బీజేపీ 111, జనసేన 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 107 చోట్ల, ఎంఐఎం 9 చోట్ల, సీపీఎం 19 చోట్ల, సీపీఐఎల్(న్యూడెమోక్రసీ) ఒకచోట తలపడుతున్నాయి. – ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది, ధర్మసమాజ్ పార్టీ నుంచి 101 మంది, జైమహాభారత్ పార్టీ నుంచి 13 మంది, రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి మరో 659 మంది, స్వతంత్రులు 989 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 48 మంది, గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి, మునుగోడుల నుంచి 39 మంది చొప్పున పోటీపడుతుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున, బాల్కొండలో 8 మంది బరిలో ఉన్నారు. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు రాష్ట్రంలో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయటి పరిసరాలను సైతం వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. పటిష్టంగా బందోబస్తు పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, మరో 3వేల మంది అటవీ/ఆబ్కారీ సిబ్బంది, 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన 23,500 మంది హోంగార్డులు కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రెయిలీ లిపిలో 76,532 ఓటరు స్లిప్పులు, 40 వేల ఓటర్ గైడ్స్, 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి అంధ ఓటర్లకు పంపిణీ చేశారు. శారీరక వికలాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. వారికోసం పోలింగ్ కేంద్రాల వద్ద 21,686 ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ నేతృత్వంలో దాదాపు ఏడాది నుంచీ ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సంసిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం/శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. మొత్తం 2,00,433 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అన్నిజిల్లాల్లో పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సీఈఓ కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. వారంతా రాత్రి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు గురువారం ఉదయం 5.30 గంటలకు పోల్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని మెమరీ డిలీట్ చేసి, వీవీ ప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు. పోలింగ్ శాతం మళ్లీ పెరగాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు గాను 2,05,80,470 (73.2 %) మంది ఓటేశారు. 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లకు గాను 1,03,17,064 (72.54%) మంది, 1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లకు గాను 1,02,63,214(73.88%) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2691 మంది మూడో జెండర్ ఓటర్లలో కేవలం 192 (8.99%) మంది మాత్రమే ఓటేశారు. 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కేవలం 69.5శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని ఎన్నికల యంత్రాంగం పిలుపునిచ్చింది. -
కారు జోరా.. హస్తం హవానా.. హంగా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రకరకాల సర్వేలు భిన్నమైన ఫలితాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధాన పోటీ అన్నది స్పష్టమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆఖరు నిమిషంలో పోరాట పటిమను ప్రదర్శిస్తున్నప్పటికీ ఇప్పటికైతే మూడో స్థానానికే పరిమితమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం వరకు బీఆర్ఎస్కు ఎదురులేదన్న భావన ఉండేది. కానీ క్రమేపీ కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నోటి మాట (మౌత్ టాక్) ప్రకారమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం కాకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. అలా అని బీఆర్ఎస్ అవకాశాలు పూర్తిగా పోయాయని కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నెగటివ్ సమస్యను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కొద్దిరోజుల క్రితం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వెళ్లి అక్కడ నిరుద్యోగులతో భేటీ అయినప్పుడు వచ్చిన ప్రశ్నలు ఆ విషయాన్ని చెబుతాయి. ఆయన సమర్థంగా వారి ప్రశ్నలకు జవాబిచ్చినా, మౌలికంగా నిరుద్యోగుల సమస్య, టీఎస్పీఎస్సీ వైఫల్యం ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్న విషయం అర్థమవుతుంది. అంతేగాక సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై కొంత అసంతృప్తి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరికొంత వ్యతిరేకత ఉంది. పదేళ్లు ఈ పాలన చూశాంగా అన్న భావన కూడా ఉంది. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాత్మక సుడిగాలి ప్రచారం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హైదరాబాద్‌కు సంబంధించి చేసిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీటితోపాటు పోల్ మేనేజ్మెంట్ కానీ, ఆర్థిక వనరుల విషయంలో కానీ బీఆర్ఎస్కు ఇబ్బంది ఉండదని, ఎలాగైనా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ తమకు గతంలో వచ్చిన సీట్లకన్నా నాలుగైదు ఎక్కువే వస్తాయని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అంత సులువుగా లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో లేనంతటి గట్టి పోటీని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ బొటా»ొటీ మెజార్టీతో అధికారంలోకి రావడమో, లేక ఎంఐఎంకు వచ్చే ఆరేడు సీట్లతో గండం నుంచి బయటపడటమో జరగొచ్చన్నది ఒక అంచనా. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటే కష్టం కావొచ్చు. ముస్లింలు గతసారి బీఆర్ఎస్ వైపు పూర్తిగా మొగ్గుచూపారు. ఇప్పుడు వారు ఎలా ఉంటారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. హస్తం పార్టీ ఇలా... కాంగ్రెస్ విషయానికొస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీకి బలంగాను, బలహీనతగాను కనిపిస్తున్నారు. ఆయన చేసే ప్రసంగాలు కేడర్‌లో జోష్ నింపుతున్నాయి. ఆయనైతే కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. తమకు అనుకూలంగా వేవ్ వస్తుందన్నది ఆయన ఆశ. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పర్యటనలు చేస్తున్నారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు అదనపు ఆకర్షణగా ప్రచారం సాగిస్తున్నారు. అదే సమయంలో రేవంత్ టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడం నచ్చకపోవడం, ఆయనపై ఉన్న ఇతర విమర్శలు బలహీనత కావొచ్చు. ప్రస్తుతానికైతే ఆయన బలహీనతలు పెద్దగా చర్చనీయాంశమవడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్‌కు 70–80 స్థానాలు వస్తాయని రేవంత్ చెబుతున్నా.. అది అంత సులభం కాదు. ఎందుకంటే పైకి కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉన్నట్లు కనబడుతున్నా, కొన్ని పరిమితులూ ఉన్నాయని క్షేత్రస్థాయిలో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అయితే కాంగ్రెస్‌ది పై చేయి కావొచ్చన్నది వారి పరిశీలనలో వెల్లడవుతోందట. కానీ కొన్ని పరిణామాలు దానిని దెబ్బతీయొచ్చు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత బలమైన అభ్యర్థులు ఎక్కువ చోట్ల లేకపోవడం ఒక లోటుగా చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాస్త వెనకబడే అవకాశం ఉంది. 30 స్థానాలపై కమలం దృష్టి బీజేపీ సుమారు 30 నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. వాటిలో ఎక్కువ చోట్ల కనుక గణనీయంగా ఓట్లను పొందితే అది కాంగ్రెస్‌కు చేటు చేయొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల ఈ పరిస్థితి రావొచ్చు. సిర్పూరు, పెద్దపల్లి, సూర్యాపేట వంటి కొన్ని చోట్ల బీఎస్పీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. దీనివల్ల కూడా కొంత కాంగ్రెస్‌కు, మరికొంత బీఆర్ఎస్కు నష్టం జరగొచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ పేరుతోకానీ, స్వతంత్ర అభ్యర్ధులుగా గానీ మరో పది, పదిహేను చోట్ల ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తున్నారు. ఉదాహరణకు కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఐకి సీటు కేటాయించింది. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో సహకరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా కాంగ్రెస్‌లోని కొందరు, అలాగే బీఆర్ఎస్కు చెందిన మరికొందరు జలగం వైపు మళ్లితే ఇరుపక్షాలకు నష్టం కలగవచ్చు. లేదా ఆయన చీల్చే ఓట్లను బట్టి గెలుపుఓటములు నిర్ణయమవుతాయి. ఈ రకంగా చూస్తే సుమారు 30–40 చోట్ల కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటినీ అధిగమించి కాంగ్రెస్ పుంజుకుని ప్రభంజనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఎంఐఎం ఆరేడు సీట్లలో గెలిస్తే.. 119 సీట్లలో ఆరేడు సీట్లలో ఎంఐఎం గెలుస్తుంటుంది. మిగిలిన 112 సీట్లలో ఈ రకంగా 30 నుంచి 40 సీట్లలో తేడా వస్తే మిగిలిన సుమారు 70 నుంచి 80 సీట్లలోనే కాంగ్రెస్ తన ప్రభావం చూపగలుగుతుంది. సహజంగానే అన్నిట్లోనూ గెలిచే అవకాశం ఉండదు. ఇదే సమస్య బీఆర్ఎస్కూ ఎదురుకావొచ్చు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం బీఆర్ఎస్కు కలిసి రావొచ్చు. ఈ రెండింట్లో ఏ పార్టీ అయితే వేవ్ సృష్టించుకోగలుగుతుందో దానికి పూర్తి మెజార్టీ రావొచ్చు. కానీ అలా జరుగుతుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. అందువల్ల హంగ్ అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి. కర్ణాటకలో, మునుగోడులో ఓడి.. బీజేపీ గురించి పరిశీలిస్తే, ఒకప్పుడు బీఆర్ఎస్కు ఇదే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందని అనుకున్నారు. కర్ణాటకలో, మునుగోడులో ఓటమి, బండి సంజయ్ తొలగింపు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె పట్ల కొంత ఉదారంగా ఉండటం వంటి కారణాలతో ఆ పార్టీపై విశ్వాసం పోయింది. దానికి తగ్గట్లుగానే బీజేపీలో చేరిన పలువురు ప్రముఖులు మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. అయినా బీజేపీ కొన్నిచోట్ల గట్టి పోటీలోనే ఉంది. కానీ అది తాను విజయం సాధించడం కన్నా, రెండు ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదాని గెలుపు లేదా ఓటమికే ఉపకరించవచ్చన్నది ఒక అంచనా. దానిని దృష్టిలో పెట్టుకుని మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విశ్వరూప ప్రదర్శనకు ప్రధాని హాజరై మాదిగలకు వర్గీకరణకు హామీ ఇవ్వడం, మళ్లీ మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనడానికి రానుండటం, హోం మంత్రి అమిత్ షా తదితరులు గట్టిగా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సాగించడం జరుగుతోంది. తద్వారా తమ పార్టీకి 60 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, అంత సీన్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐదు నుంచి పది సీట్లు వస్తే గొప్ప అన్న భావన ఉంది. అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. ఎవరికైనా వేవ్ వస్తేనే భారీ ఆధిక్యత మరో విశ్లేషణ ఏమిటంటే తెలంగాణలో వేవ్ వస్తే తప్ప ఏ పార్టీకి భారీ ఆధిక్యత రావట్లేదు. 1983 నుంచి పరిశీలిస్తే, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ఎన్నికల్లో తెలంగాణలో 107 స్థానాలకు గాను టీడీపీకి, కాంగ్రెస్‌కు చెరో 43 సీట్లు వచ్చాయి. ఒకరకంగా ఇది హంగ్ వంటి పరిస్థితి. 1985లో టీడీపీకి వేవ్ రావడంతో తెలంగాణలో టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బొటా»ొటిగా ఇక్కడ 58 స్థానాలు వచ్చాయి. 1994లో టీడీపీ వేవ్‌లో మిత్రపక్షాలతో కలిసి 90 సీట్లు సాధించింది. 1999లో టీడీపీ అధికారంలోకి రాగలిగినా, తెలంగాణలో బీజేపీతో కలిపి 58 స్థానాలే సాధించింది. 2004లో కాంగ్రెస్‌కు వేవ్ రావడంతో మిత్రపక్షాలతో కలిపి 84 సీట్లు వచ్చాయి. 2009లో 119 స్థానాలకుగాను కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా ఇక్కడ మాత్రం 50 స్థానాలే లభించాయి. టీడీపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమికి 54 సీట్లు వచ్చాయి. అంటే ఎవరికీ ఆధిక్యత రాలేదన్నమాట. 2014లో బీఆర్ఎస్ కేవలం 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. 2018లో మాత్రం బీఆర్ఎస్కు వేవ్ ఏర్పడి 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి కట్టినా కేవలం 21 స్థానాలే దక్కాయి. దీని ప్రకారం ఏ పార్టీకి ప్రభంజనం లేకపోతే బీఆర్ఎస్కు బొటా»ొటి మెజార్టీ లేదా హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఏమవుతుందో చూద్దాం! -కొమ్మినేని శ్రీనివాసరావు -
ఆర్వోల నిర్ణయమే అంతిమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరి శీలనలో రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తీసుకున్న నిర్ణయాలే అంతిమమని, వాటిపై పునః సమీక్ష జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం లేదని రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి (డిప్యూటీ సీఈఓ) సత్యవాణి స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థుల విషయంలో ఆర్వోల నిర్ణయాలపై వచ్చిన ఫిర్యాదులను తిరిగి వారికే పంపించినట్టు తెలిపారు. ఆర్వోలకు క్వాజీ జ్యుడీషియల్ అధికారాలుంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు శుక్రవారం ఆమె బీఆర్కేఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 18లోగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 20 లోగా ఈవీఎంల బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 299 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కి పెరిగిందని చెప్పారు. ప్రతి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దే ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని తెలిపారు. పోలింగ్‌లో వినియోగించిన ఈవీఎంలను కేటగిరీ–ఏ, పోలింగ్ సందర్భంగా మొరాయించిన ఈవీఎంలను కేటగిరీ–బీ కింద పరిగణించి ఒకే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తామన్నారు. మాక్‌పోల్‌కి వాడిన ఈవీఎంలను కేటగిరీ–సీ, రిజర్వ్ ఈవీఎంలను కేటగిరీ–డీ కింద పరిగణించి వేర్వేరు స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరుస్తామని వివరించారు. 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించే తేదీలను స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని సత్యవాణి తెలిపారు. మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహిస్తారన్నారు. పోలింగ్ నవంబర్ 30న జరగనుండగా, దానికి 3 రోజుల ముందులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పాస్‌లు రావడంలో జాప్యం కావడంతో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను జిల్లాల కలెక్టర్లు తిరస్కరించిన అంశంపై పరిశీలన చేస్తామన్నారు. -
Telangana: వలస ఓటర్ల వేట
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. వారి ప్రసన్నం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికిపైనే ఉంటారు. వీరి ఓటింగ్ అభ్యర్థి గెలుపోటములను ప్రభా వితం చేసే వీలుంది. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఏ ఒక్క ఓటును తేలికగా విడిచిపెట్టకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమిస్తున్నారు. సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువంటే.. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువ నగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే 2 లక్షల మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40 వేలమందికి పైగా వలస ఓటర్లున్నట్టు లెక్కగట్టారు. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారు. ♦ దేవరకొండ నియోజకవర్గంలో 25 వేల మంది వరకూ వలస ఓటర్లున్నట్టు తెలుసుకున్నారు. వీళ్లు హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనగిరి, ఆలేరుల్లో దాదాపు 20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కలేశాయి. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉంటాయని ఓ ప్రధాన పార్టీ లెక్కలేసింది. ముంబై, సోలాపూర్, పుణేలో వివిధ పనులు చేసు కునే వీళ్ల కోసం ఆయా సామాజిక వర్గం నుంచే కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, పోలింగ్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు. అక్కడ ఈ ఓట్లే కీలకంగా భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వారిని రప్పించేందుకు రేషన్ డీలర్ల సాయం కూడా తీసుకుంటున్నారు. ♦నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు 15 వేలకు పైగానే ఉంటారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోనూ 10 వేల ఓట్లరు ఉంటారని అంచనా. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, కోయిల కొండ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్‌పేట మండలాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలకు చెందిన వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరిని రప్పించేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్ వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళకు ఇప్పటికీ ఓట్లు, రేషన్ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి చిరునామా, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ రూపొందించడానికి సాంకేతిక నిపుణులూ ఇందులో ఉంటున్నారు. వివిధ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో బృందం పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటున్నారు. నియోజకవర్గం వారీగా వలస ఓటర్ల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు మరో పది మంది డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో మాట్లాడటం, వారికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఉంటోంది. ఓటరు కచ్చితంగా ఏ పార్టీకి ఓటు వేస్తాడనే అంచనాలను ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా సేకరిస్తున్నారు. ఇక పూణే, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు అభ్యర్థుల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి వలస ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికలకు కనీసం రెండు రోజుల ముందే గ్రామాలకు రప్పించాలని నేతలు భావిస్తున్నారు. -
రెండు చోట్ల ఎందుకు పోటీచేస్తారు?
ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థి రెండు, మూడుచోట్ల అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీచేస్తారు? దానివల్ల లాభనష్టాలేంటి? తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చింది. ఇక్కడ అత్యంత ఆసక్తికర అంశమేమి టంటే ముగ్గురు సీఎం అభ్యర్ధులు రెండేసి చోట్ల పోటీలో ఉండటం, పరస్పరం పోటీ పడుతుండటం. ఇలా గతంలో ఉమ్మడి ఏపీలో ఎన్నడూ జరగలేదు. ఆ మాటకొస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండేసి నియోజకవర్గాలకు పోటీచేసే అంశాన్ని నియంత్రించాల ని ప్రతిపాదించారు. దీనివల్ల ఉప ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడి అనవసర వ్యయ భారం పడుతోంద ని భావించేవారు. ఈ ఖర్చును సంబంధిత అభ్యర్థి నుంచి వసూలు చేయాలని కూడా కొందరు వాదించేవారు. 1996కి ముందు మూడుచోట్ల పోటీ చేయడానికీ అవకా శం ఉండేది. అలా కొంతమంది చేశారు కూడా. ఆ తర్వా త దానిని రెండు నియోజకవర్గాలకు పరిమితం చేశారు. ఇలా రెండేసి చోట్ల పోటీచేసే వారిలో ప్రముఖ నేతలే ఎక్కువ. తమకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి, ఒకచోట పోటీ చేస్తే ఓడిపోతామని అనుమానం వచ్చినా జాగ్రత్తపడటానికి, ఇతరత్రా రాజకీయ కారణాలతోనూ రెండేసి చోట్ల పోటీచేస్తుంటారు. కానీ ఈసారి తెలంగాణలో ఏకంగా ముగ్గురు నేతలు రెండేసి చోట్ల పోటీ చేయడం, పైగా వారు ముగ్గురు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఈసారి ప్రత్యేకత అని చెప్పాలి. కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయడం తొలిసారి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల నుంచి రంగంలో దిగారు. గతంలో కేసీఆర్ రెండుసార్లు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇలా రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకేసారి పోటీచేయలేదు. కేసీఆర్‌పై కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగుతుండ గా, గజ్వేల్‌లో బీజేపీ అగ్రనేత, ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడైన ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. రేవంత్, ఈటల ఇద్దరూ తమ పార్టీల తరపు న ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే పరిగణనలో ఉన్నారు. కొడంగల్ సభలో రేవంత్ ఆ విషయం ప్రజలకు తెలియచెప్పగా, ప్రధాని మోదీ పర్యటన సందర్భంలో బీజేపీ గెలిస్తే ఈటలను ముఖ్యమంత్రిని చేస్తామన్నారని వార్త లు వచ్చాయి. దానిని ధ్రువీకరిస్తూ ఈటల బహిరంగంగానే చెప్పేశారు. సాధారణంగా ఈ స్థాయి నేతలు ఇలా ఒకరిపై ఒకరు తలపడరు. ఎందుకంటే వారి రాజకీయ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ వీరిద్ద రూ తమకు పట్టున్న వేరే నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉన్నందున అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశాన్ని పదిలపరచుకున్నారని భావించవచ్చు. రేవంత్ కొడంగల్ నుంచి, ఈటల హుజూరాబాద్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీచేయడంలో ఉద్దేశం గజ్వేల్‌లో ఓటమి భయంతోనే అని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నా, అంత ఓడిపోయే పరిస్థితి ఉంద ని చెప్పలేం. నిజంగానే అలా జరిగితే బీఆర్ఎస్ అధికా రంలోకి రావడం కష్టమవుతుంది.పైగా గతంలో కేసీఆర్‌కు కాస్త పోటీ ఇచ్చిన ఒంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు కేసీఆర్ పక్షానే ఉన్నారు. రెండో సీటుకు పోటీ చేయడం ద్వారా ఆ పరిసర నియోజకవర్గ ప్రజలపై ప్రభావం చూపే లక్ష్యం కూడా ఉంటుంది. ఉదాహరణకు 1983 శాసనసభ ఎన్నికల్లో కొత్తగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గుడివాడతో పాటు తిరుపతిలో పోటీచేస్తారన్న సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో విపరీత ప్రభా వం చూపి ప్రత్యర్థి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రభావం చూపడానికేనా? మూడు దశాబ్దాల తర్వాత తెలుగు నాయకుడొకరు రెండుచోట్ల పోటీ చేయడం అదే మొదలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బహుశా కేసీఆర్ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కొంత ప్రభావం చూపడానికి కామారెడ్డి నుంచి కూడా రంగంలో దిగి ఉండొచ్చు. కామారెడ్డిలో ఇంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తప్పుకుని కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. సీఎం ఈ సీటును గెలిచాక ఆయనకు అవకాశం ఇస్తారా? లేక తన కుమార్తె కవితకు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఈసారి కామారెడ్డిలో విజయం సాధించే పరిస్థితి ఉందన్న వార్తలు వస్తుండేవి. ఎప్పుడైతే కేసీఆర్ పోటీ చేస్తారని వార్తలొచ్చాయో సహజంగానే ఆయన విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఆయనను నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి పంపి, రేవంత్‌రెడ్డి రిస్కు తీసుకుంటున్నారు. తాను పోటీచేయడం ద్వారా కేసీఆర్‌ను కొంతమేర కామారెడ్డికి పరిమితం చేయొచ్చన్న ఆలోచన ఉండొచ్చు. కానీ కేసీఆర్ దానిని పట్టించుకోకుండా ,ఈ నెలాఖరు వరకు దాదాపు 94 నియోజకవర్గాల్లో ప్రచారానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. రేవంత్ నిజానికి గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ తదుపరి మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పోటీచేసి పుంజుకోగలిగారు. తనను గెలిపిస్తే సీఎం చాన్స్ ఉంటుందని చెప్పడంతోపాటు స్థానికంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుని వివిధ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది. రేవంత్ తలనొప్పి తెచ్చుకోవడమే... రేవంత్ కామారెడ్డి నుంచి పోటీచేయడం వల్ల కేసీఆర్‌కు ఎంత ఇబ్బందో తెలియదు గానీ, ఆయన మాత్రం తలనొప్పి తెచ్చుకోవడమే. ఎందుకంటే కేసీఆర్‌పై గెలిస్తే సంచలనమే అవుతుంది. కానీ ఓటమిపాలై అది కూడా భారీ తేడాతో అయితే ప్రతిష్ట దెబ్బతింటుంది. అదే సమయంలో కొడంగల్‌కు ఎక్కువ టైమ్ కేటాయించలేకపోతే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొడంగల్‌లో తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందని ఆయనే ఆరోపించారు. అలాగే ఈటల హుజూరాబాద్‌లో ఆరుసార్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి, ఒకసారి బీజేపీ పక్షాన గెలిచారు. టీఆర్ఎస్కు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడం ఆయనకు ప్రతిష్ట తెచ్చింది. అదే ఊపుతో గజ్వేల్ నుంచి కూడా ఆయన రంగంలో దిగారు. ఇక్కడ కేసీఆర్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. అయినా ఒక చాన్స్ తీసుకుంటున్నారు. అదే టైమ్‌లో హుజూరాబాద్‌లో తన బేస్‌ను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెంటికి చెడ్డ రేవిడి అయ్యే పరిస్థితి వస్తుంది. ఓడిన ఘట్టాలు రెండుచోట్ల పోటీచేసిన నేతలు గతంలో గెలిచిన సందర్భాలతోపాటు ఓడిన ఘట్టాలూ ఉన్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్‌ది ఒక రికార్డు అని చెప్పాలి. ఆయన 1983లో గుడివాడ, తిరుపతి, 1985లో నల్లగొండ, హిందూపూర్, గుడివాడ నుంచి పోటీచేసి చరిత్ర సృష్టించారు. కానీ 1989లో కల్వకుర్తి, హిందూపూర్ నుంచి పోటీచేసి కల్వకుర్తిలో ఓడిపోయారు. అప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. 1994లో టెక్కలి, హిందూపూర్ నుంచి గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీచేసి తిరుపతిలో మాత్రమే గెలవగలిగారు. ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. తెలంగాణలో పెండ్యాల రాఘవరావు అనే కమ్యూనిస్టు నేత 1952లో హన్మకొండ, వర్దన్నపేట అసెంబ్లీ సీట్లకు, వరంగల్ లోక్‌సభ సీటుకు పోటీచేసి మూడుచోట్లా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ సీట్లు వదులుకుని లోక్‌సభను ఎంపిక చేసుకున్నారు. మరోనేత రాంగోపాల్ రెడ్డి 1962లో బోధన్, మేడారం నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికవడం విశేషం. లోక్‌సభకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఎన్నికలో రెండుచోట్ల పోటీచేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏదేమైనా తెలంగాణలో ఈసారి ముగ్గురు సీఎం అభ్యర్ధులు ఎన్నికల గోదాలో దిగడం సంచలనమే. ఒక్కోసారి పెద్ద నేతలు చిన్న నేతల చేతిలో ఓడిపోతుండటం కూడా జరగవచ్చు. ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో రాజ్ నారాయణ అనే చిన్న నేత చేతిలో పరాజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు టి.అంజయ్య ముషీరాబాద్‌లో కార్మిక నేత నాయిని నరసింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కాలంలో ఆయనకు సీఎం అవకాశం వచ్చినప్పుడు ఏకగ్రీవంగా నెగ్గారు. ఎన్టీఆర్‌ను చిత్తరంజన్ దాస్ అనే కాంగ్రెస్ నేత కల్వకుర్తిలో ఓడించారు. ప్రఖ్యాత నేతలు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి వంటివారు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే. సంజీవరెడ్డి స్వయంగా తన బావమరిది తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పలు చిత్రాలు కూడా జరుగుతుంటాయి. మరి తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుందో చూద్దాం! - కొమ్మినేని శ్రీనివాసరావు -
తెలంగాణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు ►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి ►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి ►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి. ►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి ►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి ►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO ►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO ►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు ►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు 3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి. సర్వం సిద్ధం! రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
ఇక్కడ తీరువేరు వార్ వేరు
రెండు ఎన్నికల్లోనూ .. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, ఇల్లెందు, పాలేరు, మధిర స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పినపాక, వైరా, అశ్వారావుపేట స్థానాలను దక్కించుకోగా,భద్రాచలంలో సీపీఎం గెలుపొందింది. అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించడం విశేషం. ఇక సత్తుపల్లిలో టీడీపీ, కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఉప ఎన్నికలో పాలేరు నుంచి టీఆర్ఎస్ గెలుపొందింది. ఇక 2018 ఎన్నికల్లో మధిర, పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. వైరాలో ఇండిపెండెంట్ అభ్యరి్థ, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలిచింది. అయితే 2018 ఎన్నికల తర్వాత పరిణామాలతో పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో బలం పెంచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నజర్ పెట్టి ఇక్కడ సభలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. జలగం హవా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఎక్కువకాలం జలగం కుటుంబం ఆధిపత్యం చెలాయించింది. 1957లో జలగం కొండల్రావు, 1962, 1967,1972లో వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు విజయ బావుటా ఎగురవేశారు. అనంతరం 1978లో వేంసూరు కాస్తా సత్తుపల్లి నియోజకవర్గంగా ఏర్పడడంతో వెంగళరావు గెలుపొందారు. ఆయన కాసు, పీవీ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం లోక్‌సభ నుంచి ఎన్నికై కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఆయన సోదరుడు కొండల్రావు సైతం ఎంపీగా ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు పెద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకట్రావు 2004లో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నుంచి పోటీచేసి గెలిచారు. 40 ఏళ్ల తర్వాత... గత నలభై ఏళ్లుగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే ప్రతీసారి విపక్షంలోనే ఉంటూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తిరగరాశారు. 1978లో కాంగ్రెస్ తరఫున కీసర అనంతరెడ్డి గెలుపొందగా.. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వర్టీ ది. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ 2018లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్‌కుమార్ విజయం సాధించగా.. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టగా, ఆయనకు మంత్రి పదవి దక్కింది. కమ్యూనిస్టుల కోటకు బీటలు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నా క్రమంగా బీటలు వారుతూ వర్టీ ది. గత రెండు ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం భద్రాచలం సీటును గెలుచుకుంది. గతమెంతో ఘనం అన్నట్లు ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టులు ఇతర పార్టీ లతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సత్తా చాటిన తుమ్మల ఇక సత్తుపల్లి రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఒరవడి సృష్టించారు. 1983లో తెలుగుదేశం తరఫున ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి,2009లో ఖమ్మం నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓటమి పాలయ్యారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆÆŠḥఎస్ తరఫున గెలిచినా, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఓటమి పాలయ్యారు. తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్లో పనిచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్ఎస్ విజయం సాధించి పాలనాపగ్గాలు చేపట్టినా ఇక్కడ మాత్రం ఒకటీ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉండగా.. గతంలో సత్తా చాటిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయారు. -
కొత్త అభివృద్ధి పనులు, వాణిజ్య ప్రకటనలకు నో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ప్రకటించడంతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 5 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఈ కింద పేర్కొన్న చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ♦ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన 24గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ప్రాంగణాల్లోని గోడలపై రాతలు, పోస్టర్లు/పేపర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు,జెండాలను తొలగించాలి. ♦ షెడ్యూల్ వచ్చిన 48 గంటల్లోగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి ప్రభుత్వ ఆస్తుల నుంచి అన్ని రకాల అనధికార రాజకీయ ప్రకటనలను తీసేయాలి. ♦ షెడ్యూల్ ప్రకటన తర్వాత 72 గంటల్లోగా ప్రైవేటు ఆస్తుల వద్ద నుంచి అనధికార రాజకీయ ప్రకటనలన్నింటినీ తొలగించాలి. ♦ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లేదా ఎన్నికలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు,ఎన్నికల కార్యకలాపాలు, ఎన్నికల రవాణా అవసరాలకోసం ప్రభుత్వ వాహనాలను వినియోగించరాదు. ♦అధికార పార్టీ ప్రజాధనంతో వార్తాపత్రికలు, ఇతర మాధ్యమాల్లోవాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు. ♦పక్షపాత ధోరణితో రాజకీయ వార్తలు, ప్రచారంతో ఎన్నికల్లో లబ్దికి ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదు. ♦ ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ విజయాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు. ఒకవేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే వాటిని ఎన్నికల అధికారులు నిలుపుదల చేయించాలి. ♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక వెబ్సైట్ల నుంచి మంత్రులు, రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని తొలగించాలి. ♦ ఇప్పటికే ప్రాంభించిన అభివృద్ధి పనులు, ఇంకా ప్రారంభించని కొత్త పనుల జాబితాలను ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాక 72 గంటల్లోగా అన్ని శాఖల నుంచి ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కొత్త పనులు ప్రారంభిస్తే ఈ జాబితాల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ♦ఎన్నికల ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నంబర్ లేదా వెబ్సైట్ ద్వారా 24 గంటలూ స్వీకరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదుదారులకు తెలపాలి. రూ. 50 వేలకుపైగా నగదు తీసుకెళ్లేవారు ఆధారాలు చూపాలి ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రంగంలోకి దిగిన నిఘా బృందాలు అక్రమ మద్యం, నగదు, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడానికి ముమ్మర తనిఖీలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా వ్యక్తులు తమ అవసరాల కోసం రూ. 50 వేలకు మించి నగదును తీసుకెళ్లాలనుకుంటే అందుకు సంబంధించిన అన్ని రుజువులను దగ్గర పెట్టుకోవాలని ఈసీ సూచించింది. భూ విక్రయాలు/కొనుగోళ్లకు సంబంధించిన డబ్బు తీసుకెళ్తుంటే అందుకు సంబంధించిన దస్తావేజులు ఉండాలని పేర్కొంది. ఒకవేళ ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపుల కోసం రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లే వారు ఆస్పత్రి కేస్ షీట్, రశీదులు, ఎస్టిమేట్స్ వంటివి దగ్గర పెట్టుకోవాలని కోరింది. బంగారు, వెండి ఆభరణాలను ఇతరత్రా పంపిణీకి తీసుకెళ్లే వస్తువులు ఏమైనా అందుకు తగ్గ రశీదులు దగ్గర పెట్టుకోవాలని సూచించింది. -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఓటర్లపై ఉచితాల వల విసురుతున్నాయి. మళ్లీ అధికారం అప్పగిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని, ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇస్తున్నాయి. ప్రజాధనాన్ని దురి్వనియోగం అవుతోందని, ఈ ఉచిత పథకాలను అడ్డుకోవాలని కోరుతూ భట్టూలాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. -
కట్టు తప్పితే కఠిన చర్యలే !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్ట మైన హెచ్చరికలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏమాత్రం నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉండరాదని, మైండ్‌సెట్ మార్చుకోవా లని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో నామమాత్రంగానే డబ్బు, మద్యం జప్తు చేస్తున్నారని, చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ప్రధానమార్గంగా మారిందని, గోవా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్‌కు పెద్దఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎందుకు పట్టుకోవడం లేద ని పోలీస్‌శాఖను ప్రశ్నించింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎలక్ష న్ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం బుధవారం రెండోరోజు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల కలె క్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సమీక్ష నిర్వహించింది. గుజరాత్, మహారాష్ట్రలో టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుపడితే, ఇక్కడ మాత్రం 10, 20 గ్రా ము లే పట్టు బడడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. మాఫియాతో కుమ్మక్కయ్యారా? అని సూటి గా ఓ ఎస్పీని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పై ని ఘా ఉంచి జప్తు చేస్తామని ఆ ఎస్పీ వివరణ ఇచ్చు కున్నారు. ఓటర్లకు బంగారం, వెండి, వస్త్రాలు వంటి కానుకలు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలున్నా, ఎందుకు జప్తు కావడం లేదని ప్రశ్నించింది. సిద్దిపేటలో నగదు దొరకలేదా ? గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి నగదు జప్తు చేయకపోవడం పట్ల ఎన్నికల సంఘం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా గత ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం, ఇతర కానుకలను పరిశీలించి పెదవి విరిచింది. ఇటీవల జరిగిన కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలి్చతే దాదాపు ఐదారు రేట్లు అధికంగా నగదు జప్తు చేశారని, త్వరలో జరి గే శాసనసభ ఎన్నికల్లో సైతం అలాంటి ఫలితాలు ఆశిస్తున్నామని స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ఎందుకు పట్టుకోవడం లేదని ఆబ్కారీ, పోలీస్‌శాఖను ప్రశ్నించింది. ఇకపై డబ్బులు, మద్యం, ఇతర కానుకల జప్తుపై ప్రతివారం నివేదిక సమర్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతంలో జప్తు చేసిన నగదు, మద్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో లోపాలుంటే కలెక్టర్లదే బాధ్యత బుధవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నా, ఓట్లు గల్లంతైనట్టు ఫిర్యాదులొచి్చనా కలెక్టర్లదే బాధ్యత అని, తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. శేరిలింగంపల్లిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నట్టు వచి్చన ఫిర్యాదుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది. -
బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని అన్నివిధాలా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేలా వ్యూహానికి పదును పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ, సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు, జర్నలిస్టు రాజ్‌దీప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం కనుసన్నల్లో రాష్ట్ర బీజేపీ రాజకీయంగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముందని బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ‘పశ్చి మ బెంగాల్ ఎన్నికల తరహా పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ పద్ధతిలో కేవలం ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలతో, సాధారణ కార్యక్రమాలతో అడ్డుకట్ట వేయలేమని పార్టీ భావిస్తోంది. బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిదాడి చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఆతీ్మయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ తలమునకలై ఉంది. తాజాగా ఈ సమావేశాలనే వేదికగా చేసుకుని.. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలకు పాల్పడే అవకాశముందనే అంశంపై శ్రేణులకు విడమరిచి చెప్పాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలను ఆదేశించింది. ‘స్లీపర్ సెల్స్’పై నిఘా బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం, కేంద్ర నాయకత్వం వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వైనంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలిసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం లాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని నిఘా వర్గాలు నివేదించినట్లు సమాచారం. మరోవైపు సుమారు ఏడాది కాలంగా బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన ఇతర రాష్ట్రాల నేతలు, కేడర్.. తెలంగాణలో ‘స్లీపర్ సెల్స్’లా పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2020 చివరలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని ఎంపిక చేసిన డివిజన్లలో ఈ స్లీపర్ సెల్స్ పనిచేశాయని బీఆర్ఎస్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలను సూక్ష్మస్థాయిలో పోస్ట్‌మార్టం చేస్తున్న ఈ స్లీపర్ సెల్స్ వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్లీపర్ సెల్స్ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పేపర్ లీకేజీ వంటి కుట్రల్లో ఆ పార్టీ కేడర్ పాలుపంచుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టాలని, బీజేపీ కుట్రలు, వ్యూహాలు సమర్ధంగా తిప్పికొట్టా లని అధికార పార్టీ నిర్ణయించింది. మంత్రులకే నాయకత్వం బీజేపీ నేతల వ్యూహాలు, కుట్రలను తిప్పికొట్టేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి బాధ్యతను మంత్రులకు అప్పగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీపై విమర్శలు, ఎదురుదాడి విషయంలో కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష కార్యాచరణలో భాగం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరినీ పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రధాన నిందితుడుగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని మంత్రులందరూ ఏకకాలంలో మీడియా ద్వారా ఎదురుదాడి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన బండి దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. -
ముంచే గాలివాటు రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ గత శాసనసభ ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు పవన్ కల్యాణ్. పరువూ పోయింది, ‘పవరూ’ రాలేదు. అయినా తన డంబపు ‘పవనిజం’ స్లోగన్‌ను వదులుకోలేదు. అంతవరకే అయితే సరే అనవచ్చు. కానీ ఆయన ఏ నిశ్చితాభిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజురోజుకూ రుజువవుతోంది. అదే ఆయనతో ‘నేనెవరితోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అనేలా చేస్తోంది. అన్నట్టూ– పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెడుతుందట అన్న సామెత మనకు ఉండనే ఉంది. శతాబ్దాలకు సరిపడా నీతుల్ని శతక వాఙ్మయ కర్తలు ఎందుకు బోధించి పోయారోగానీ, అవి నేటి భ్రష్ట రాజకీయ సంస్కృతికి ప్రత్యక్షర సాక్ష్యాలుగా నిలిచి పోతున్నాయి. ‘గాలి వాటు’ రాజకీయాలకు పేరు మోసిన పవన్ కల్యాణ్ నిశ్చితా భిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజు రోజుకూ రుజువ వుతోంది. ‘వారాహి’ వాహనాన్ని చూపి దాన్నొక బెదిరింపు సాధనంగా చూపెడుతున్నాడు. ‘వ్యామోహాలు’ ఎలాంటివో వేమన నిర్వచించి పోయాడు: ‘‘ఈ దేహమే వ్యామోహాల పుట్ట. కానీ అశాశ్వతమై పగిలి పోయే ఓ కుండ. ఈ శరీరం తొమ్మిది కంతల తిత్తి. ఆ ‘తిత్తి’కి ఒంటి నిండా దిగేసే సొమ్ములు చాలక కులాలు, గోత్రాల పేర్లు కూడా ఆభరణాలుగా తగిలించుకుని ఊరేగుతున్నారు’’. అల్ప బుద్ధివాడు అధికారంలోకి వస్తే మంచివాళ్లందర్నీ తొలగ్గొడతాడనీ, ఇదెలాంటిదంటే ‘పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెట్టిందన్న’ సామెత లాంటిదనీ అన్నాడు. బహుశా అందుకనే పోతనామాత్యుడు కూడా మనిషి బుద్ధుల్ని నాలుగైదు రకాలుగా వర్ణించి పోయాడు. అవి: ‘కుబుద్ధి, మంద బుద్ధి, అల్ప బుద్ధి, దుర్బుద్ధి’ అని! ఈ అవకాశవాద బుద్ధే, ఇప్పుడు ‘నేనెవరి తోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అని పవన్ చేత అనిపిస్తోంది. గత ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, అభాసుపాలై ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు. ఫలితంగా పరువూ పోయింది, ‘పవరూ’ దూరమై పోయింది. ఇన్ని దారుణ అనుభవాల నుంచి కూడా పవన్ తన ‘పవనిజం’ అన్న పాత స్లోగన్‌ను మాత్రం వదులుకో లేకుండా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగ తుల అభ్యున్నతికి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే అవసరాన్ని తొలి సారిగా గుర్తించి దానికి చట్టరూపం ఇవ్వాలన్న తలంపు మొదటి సారిగా 2001లోనే ప్రతిపక్ష నాయక హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చింది. ఆయన ప్రతిపాదించిన దరిమిలానే దళిత వర్గాలకు ‘సబ్ ప్లాన్’ చట్టం వచ్చింది. ఆ చట్టం కాలపరిమితి మొన్నటి జనవరి 23తో ముగియవలసింది. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ముందడుగు వేసి దాన్ని మరొక పదేళ్లకు పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించడం వల్ల దళితుల, ఆదివాసీల అభ్యున్నతికి ఈ చర్య ఎంతో దోహదం చేస్తుంది. సకల దళిత శక్తులు వివిధ దశల్లో సమీకృతమైన ఫలితమే ‘సబ్ ప్లాన్’. ఆ నిధులు దుర్వినియోగమై పక్కదారులు పడుతున్నాయని సబ్ ప్లాన్ లక్ష్యాల గురించిన అవగాహన లేని పవన్ వాపోవడం కేవలం ఆయన ద్వేష భావననే బట్టబయలు చేస్తోందని చెప్పక తప్పదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజా బాహుళ్యానికి మాత్రం గణనీయమైన స్థాయిలో ఒరిగిందేమీలేదంటూ అంబేడ్కర్ తన బాధను చివరి శ్వాస వరకూ వ్యక్తం చేస్తూనే వచ్చారు. ‘‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల బతుకుతెరువులు ఆచరణలో బాగుపడనంత కాలం, ఆ వైపుగా సమూలమైన, సమగ్ర మైన మార్పులు రానంత కాలం భారతదేశ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోదని అంబేడ్కర్ స్పష్టం చేశారని సుప్రసిద్ధ జాతీయ వ్యంగ్య చిత్ర వారపత్రిక ‘శంకర్స్ వీక్లీ’ (1953 ఫిబ్రవరి) నివేదించింది. అంతేగాదు, కళావంతులైన దేవదాసీలకు చెందిన కేసరీబాయి కేర్కర్ (1892–1977) స్వరంతో ‘వందేమాతరం’ గ్రామఫోన్ రికార్డును సిద్ధం చేయాలనీ, ఆ తొలి కాపీని తానే కొంటాననీ ప్రకటించినవారు అంబేడ్కర్! ఎందుకంటే ‘సురశ్రీ’గా పేరొందిన కేర్కర్, జైపూర్‌కు చెందిన అత్రౌలి ఘరానాలో 20వ శతాబ్దపు క్లాసికల్ సింగర్‌గా పేరొందిన హిందూస్తానీ సంగీత విద్వాంసుడు అల్లాదియా ఖాన్ వద్ద శిక్షణ పొందిన విషయాన్ని బహిర్గతం చేశారు అంబేడ్కర్. హైందవంలోని కుల వ్యవస్థను, పరమత విద్వేష భావాలను వ్యతిరేకించిన అంబేడ్కర్ చివరికి బౌద్ధ ధర్మాన్ని ప్రేమించి ఆహ్వానించవలసి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర శాసన వేదికలలో పాల్గొనే సభ్యులపై ఏయే అనర్హతా నిబంధనలను విధించాలో 1951లోనే ప్రత్యేక బిల్లును ఆయన రూపొందించారు. శాసన వేదికల్లోని సభ్యులకు రాజకీయ పదవుల ఆశ జూపడం ద్వారానో, మరే ఇతర ప్రయోజనాలు కల్పి స్తామనో ప్రలోభాలకు గురిచేసే పార్లమెంట్ వేదిక వల్ల ప్రయోజనం లేదు. ఎలాంటి భీతి లేదా ప్రలోభమో ప్రభుత్వం నుంచి లేకుండా పార్లమెంట్ సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే అలాంటి ‘పార్లమెంట్’ వల్ల గానీ, శాసనసభ వల్లగానీ ప్రజలకు ఉపయోగం ఉండదు. అలాంటి స్థితిలోనే పాలకులకు ‘డూడూ బసవన్న’లుగా వ్యవహరిస్తారని అంబేడ్కర్ హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లోనే పార్లమెంట్ (లేదా శాసన వేదిక) కాస్తా స్టాక్ ఎక్స్ఛేంజి వ్యాపార మార్కెట్‌గా ఎలా మారిపోతుందో అంబేడ్కర్ ఉదాహరించారు. అంతేగాదు, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల సంఖ్యకన్నా స్వతంత్ర భారత ప్రభుత్వ కొలువులో ఉన్న వారి సంఖ్య బహు తక్కువనీ, ఆ మాటకు వస్తే తన స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతినే తారుమారు చేయడానికి ముసాయిదా సంఘంలోని కొందరు సభ్యులు సాహసించిన విష యాన్నీ కూడా అంబేడ్కర్ బయట పెట్టాల్సి వచ్చిందని మరచి పోరాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలలో అధికారం కోసం, దళిత వర్గాలపై ఆధిపత్యం కోసం కేవల పదవీ కాంక్షతో కక్షిదారులైన కొందరు అగ్ర – అర్ధ అగ్రవర్ణాలకు చెందిన ‘వినాయకులు’ పని చేస్తున్నారన్నది పచ్చి నగ్న సత్యం. బహు పరాక్, ప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు పియరీ నోరా అన్నట్టు– ‘‘జ్ఞాపక శక్తి ఉన్న చోటునే మరుపు పెద్దమ్మ కూడా వెన్నంటే ఉంటుంది’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కీలకమైన ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వీటిలో ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్ కూడా ఉండడం విశేషం. 2022లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఓటర్ల నాడిని తెలుసుకొనేందుకు ‘ఏబీపీ న్యూస్’ సంస్థ తాజాగా సి వోటర్‌తో కలిసి సర్వే నిర్వహించింది. తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై జనాభిప్రాయాన్ని సేకరించింది. ఫలితాలను రాష్ట్రాల వారీగా చూద్దాం.. ఉత్తరప్రదేశ్: హిందుత్వ రాజకీయాలకు కేంద్ర స్థానమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకే మళ్లీ విజయావకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్ల 40 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పట్ల 27 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. అదృష్టం కలిసొస్తే ప్రధానమంత్రి పదవి దక్కించుకోవాలని ఆశ పడుతున్న బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత, మాజీ సీఎం మాయావతికి ఆదరణ మరింత పడిపోయింది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కేవలం 15 మంది కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం అని భావిస్తున్న ప్రియాంకాగాంధీ వాద్రా తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని3 శాతం మందే ఆశించారు. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత జయంత్ చౌదరి పట్ల 2 శాతం మంది మొగ్గు చూపడం విశేషం. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి తన ఓట్లను 0.4 శాతం పెంచుకోనుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓట్లు 6.6 శాతం పెరుగుతాయి. బీఎస్పీ 6.5 శాతం ఓట్లను, కాంగ్రెస్ 1.2 శాతం ఓట్లను కోల్పోతాయి. గత ఎన్నికల కంటే ఈదఫా బీజేపీ 62 సీట్లను కోల్పోనుంది. సమాజ్‌వాదీ పార్టీ సీట్లు మరో 65 పెరుగుతుండగా, బీఎïస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాలను కోల్పోనున్నట్లు తేలింది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లున్నాయి. 2022 ఎన్నికల్లో బీజేపీ 259 నుంచి 276, సమాజ్‌వాదీ పార్టీ 109 నుంచి 117, బీఎస్పీ 12 నుంచి 16, కాంగ్రెస్ 3 నుంచి 7, ఇతరులు 6 నుంచి 10 సీట్లను దక్కించుకొనే అవకాశం ఉంది. పంజాబ్: పంజాబ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్‌ను 19 శాతం మంది కోరుకున్నారు. సీఎం అమరీందర్ పట్ల 18 శాతం మందే మొగ్గు చూపారు. ఆప్ ఎంపీ భగవంత్ మన్కు 16 శాతం, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు 15 శాతం మంది మద్దతు లభించింది. గోవా: బీజేపీ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పట్ల జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు 33 శాతం మంది చెప్పారు. గోవాలో అధికారం కోసం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిగా పోరాడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి తదుపరి సీఎం కావాలని 14 శాతం మంది ఆశించారు. ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా కాం్రగెస్ నేత హరీష్ రావత్‌ను 31 శాతం మంది ఓటర్లు కోరుకున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత పుష్కర్‌సింగ్ దామీకి 23 శాతం మంది మద్దతు పలికారు. మణిపూర్: మణిపూర్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. బీజేపీకి 40.5 శాతం మంది, కాంగ్రెస్‌కు 34.5 శాతం మంది ఓటర్లు అండగా నిలిచారు. -
‘పుర’ పోరుకు సై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హఠాత్తుగా పురపాలక సంఘాల పోరుకు తెరలేవడం రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములా మారింది. ఎలక్షన్ కమిషన్ హడావుడి చూస్తుంటే సాధారణ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం పుర సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. చైర్మన్‌గిరీని కైవసం చేసుకుంటే.. త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందనే కోణంలో పార్టీలు పావులు కదుపుతున్నాయి. శనివారం మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నా యి. ఈ క్రమంలో ఆదివారం వార్డులవారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో పార్టీలు పూర్తిస్థాయిలో ఎన్నికల రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. సత్తా చాటితేనే.. జిల్లాలో తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలకు అదనంగా నాలుగు మున్సిపాలిటీ/నగర పంచాయతీలు తోడయ్యాయి. దీంతో వీటి సంఖ్య ఆరుకు చేరింది. కొత్త జాబితాలోకి ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్ మున్సిపాలిటీలు చేరాయి. వీటిలో నాలుగు మున్సిపాలిటీలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలు కావడంతో ఎన్నికల ప్రక్రియ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీటిలో వచ్చే ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే భావనలో రాజకీయ పార్టీలున్నాయి. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సైతం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. చైర్మన్ పీఠంతో పాటు వీలైనన్ని ఎక్కువ వార్డుల్లో తమ పార్టీని గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎవరిని ఎంపిక చేద్దాం? తాజాగా మున్సిపల్ ఎన్నికల తంతు రాజకీయ పార్టీలకు కొంత ఇబ్బందికరంగా మారింది. శాసనసభా ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలు వర్గపోరు తెచ్చే అవకాశం ఉందనే గుబులు ఆయా పార్టీల నాయకులను కలవరపరుస్తోంది. చైర్మన్ బరిలో ఎవరిని దించాలనే అంశంపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా ఆరు మున్సిపాలిటీల పరిధిలో పోటీ చేసే ఆశావహుల జాబితా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న కొత్త నేతలు సైతం పోటీకి సై అంటున్నారు. ఈ తరుణంలో వీరందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో విజయం సాధించడం ఆషామాషీగా కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులపైనే ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ సీటుకు అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పురపాలక ఎన్నికల్లో కొనసాగించే ఊపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు అదే స్థాయిలో ఉంచితేనే గెలుపు సాధ్యమవుతుందని అంచనాకు వచ్చిన పార్టీ పెద్దలు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. -
బీజేపీలో నమో స్థైర్యం !
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ అంచనాలకు మించి జయప్రదం కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో జరిగిన భారీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు వ ుూడున్నర లక్షల మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఆరు నెలల కిందట జరిగిన శాసన సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవ డం, ఇటీవల రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలపలేని స్థితి...పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. జేడీఎస్‌కు పరోక్ష మద్దతునిచ్చినా ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. వచ్చే ఏడాది మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు మోడీ ఇప్పటి నుంచే దేశమంతటా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బెంగళూరుకు వచ్చారు. ఆయన ప్రసంగానికి కార్యకర్తల నుంచి ఆద్యంతం చక్కటి స్పందన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికల్లో మోడీనే తమ తురుపు ముక్క అని పార్టీ నాయకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ సభ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో కూడా ఆయనతో మరిన్ని సభలు పెట్టించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. మృదువుగా...సూటిగా దేశ విభజన, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ లాంటి వివాదాస్పద అంశాల జోలికి పోకుండా మోడీ ఈ సభలో జాగ్రత్త పడ్డారు. ఆ విషయాలను ప్రస్తావించవద్దని పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఆయనకు సూచించినట్లు సమాచారం. ఉద్రేకపూరిత ప్రసంగాల్లో దిట్ట అయిన మోడీ ఈ సభలో చాలా సౌమ్యంగా మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం...పదేళ్లలో యూపీఏ సర్కారు వైఫల్యాలపైనే ఆయన దృష్టి సారించారు. పేదలు, మధ్య తరగతి వారిని ఆకర్షించే దిశగా ఆయన ప్రసంగం సాగింది. ‘రూ.15కు మినరల్ వాటర్ కొంటారు. రూ.20 పెట్టి ఐస్‌క్రీం తింటారు. వీరికి చౌక ధరకు బియ్యం ఇవ్వాలా’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను సుతిమెత్తగా విమర్శించారు. పేదలంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని దెప్పి పొడిచారు. దేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించే దిశగా తమ కార్యక్రమాలుంటాయని ప్రకటించారు. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని దెప్పి పొడిచారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యానికే పెద్ద పీట కనుక, వాటి అభివృద్ధి కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శించారు. మొత్తానికి అభివృద్ధి, 8-10 సంవత్సరాల్లో సాధించాల్సిన వృద్ధి లాంటి అభ్యుదయ భావాలతో కూడిన లక్ష్యాలను ప్రకటించడం ద్వారా మోడీ తాను ‘మారిన మనిషి’ అని చాటుకోవడానికి ప్రయత్నించారు.