సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ప్రకటించడంతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 5 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఈ కింద పేర్కొన్న చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
♦ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన 24గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ప్రాంగణాల్లోని గోడలపై రాతలు, పోస్టర్లు/పేపర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు,జెండాలను తొలగించాలి.
♦ షెడ్యూల్ వచ్చిన 48 గంటల్లోగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి ప్రభుత్వ ఆస్తుల నుంచి అన్ని రకాల అనధికార రాజకీయ ప్రకటనలను తీసేయాలి.
♦ షెడ్యూల్ ప్రకటన తర్వాత 72 గంటల్లోగా ప్రైవేటు ఆస్తుల వద్ద నుంచి అనధికార రాజకీయ ప్రకటనలన్నింటినీ తొలగించాలి.
♦ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లేదా ఎన్నికలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు,ఎన్నికల కార్యకలాపాలు, ఎన్నికల రవాణా అవసరాలకోసం ప్రభుత్వ వాహనాలను వినియోగించరాదు.
♦అధికార పార్టీ ప్రజాధనంతో వార్తాపత్రికలు, ఇతర మాధ్యమాల్లోవాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు.
♦పక్షపాత ధోరణితో రాజకీయ వార్తలు, ప్రచారంతో ఎన్నికల్లో లబ్దికి ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదు.
♦ ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ విజయాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు. ఒకవేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే వాటిని ఎన్నికల అధికారులు నిలుపుదల చేయించాలి.
♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక వెబ్‌సైట్ల నుంచి మంత్రులు,
రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని తొలగించాలి.
♦ ఇప్పటికే ప్రాంభించిన అభివృద్ధి పనులు, ఇంకా ప్రారంభించని కొత్త పనుల జాబితాలను ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాక 72 గంటల్లోగా అన్ని శాఖల నుంచి ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కొత్త పనులు ప్రారంభిస్తే ఈ జాబితాల ఆధారంగా చర్యలు తీసుకోవాలి.
♦ఎన్నికల ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా 24 గంటలూ స్వీకరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదుదారులకు తెలపాలి.
రూ. 50 వేలకుపైగా నగదు తీసుకెళ్లేవారు ఆధారాలు చూపాలి
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రంగంలోకి దిగిన నిఘా బృందాలు అక్రమ మద్యం, నగదు, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడానికి ముమ్మర తనిఖీలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా వ్యక్తులు తమ అవసరాల కోసం రూ. 50 వేలకు మించి నగదును తీసుకెళ్లాలనుకుంటే అందుకు సంబంధించిన అన్ని రుజువులను దగ్గర పెట్టుకోవాలని ఈసీ సూచించింది.
భూ విక్రయాలు/కొనుగోళ్లకు సంబంధించిన డబ్బు తీసుకెళ్తుంటే అందుకు సంబంధించిన దస్తావేజులు ఉండాలని పేర్కొంది. ఒకవేళ ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపుల కోసం రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లే వారు ఆస్పత్రి కేస్ షీట్, రశీదులు, ఎస్టిమేట్స్ వంటివి దగ్గర పెట్టుకోవాలని కోరింది. బంగారు, వెండి ఆభరణాలను ఇతరత్రా పంపిణీకి తీసుకెళ్లే వస్తువులు ఏమైనా అందుకు తగ్గ రశీదులు దగ్గర పెట్టుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment