సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హఠాత్తుగా పురపాలక సంఘాల పోరుకు తెరలేవడం రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములా మారింది. ఎలక్షన్ కమిషన్ హడావుడి చూస్తుంటే సాధారణ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం పుర సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
చైర్మన్‌గిరీని కైవసం చేసుకుంటే.. త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందనే కోణంలో పార్టీలు పావులు కదుపుతున్నాయి. శనివారం మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నా యి. ఈ క్రమంలో ఆదివారం వార్డులవారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో పార్టీలు పూర్తిస్థాయిలో ఎన్నికల రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి.
సత్తా చాటితేనే..
జిల్లాలో తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలకు అదనంగా నాలుగు మున్సిపాలిటీ/నగర పంచాయతీలు తోడయ్యాయి. దీంతో వీటి సంఖ్య ఆరుకు చేరింది. కొత్త జాబితాలోకి ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్ మున్సిపాలిటీలు చేరాయి. వీటిలో నాలుగు మున్సిపాలిటీలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలు కావడంతో ఎన్నికల ప్రక్రియ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీటిలో వచ్చే ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే భావనలో రాజకీయ పార్టీలున్నాయి. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సైతం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. చైర్మన్ పీఠంతో పాటు వీలైనన్ని ఎక్కువ వార్డుల్లో తమ పార్టీని గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఎవరిని ఎంపిక చేద్దాం?
తాజాగా మున్సిపల్ ఎన్నికల తంతు రాజకీయ పార్టీలకు కొంత ఇబ్బందికరంగా మారింది. శాసనసభా ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలు వర్గపోరు తెచ్చే అవకాశం ఉందనే గుబులు ఆయా పార్టీల నాయకులను కలవరపరుస్తోంది. చైర్మన్ బరిలో ఎవరిని దించాలనే అంశంపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా ఆరు మున్సిపాలిటీల పరిధిలో పోటీ చేసే ఆశావహుల జాబితా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న కొత్త నేతలు సైతం పోటీకి సై అంటున్నారు.
ఈ తరుణంలో వీరందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో విజయం సాధించడం ఆషామాషీగా కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులపైనే ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ సీటుకు అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పురపాలక ఎన్నికల్లో కొనసాగించే ఊపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు అదే స్థాయిలో ఉంచితేనే గెలుపు సాధ్యమవుతుందని అంచనాకు వచ్చిన పార్టీ పెద్దలు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
‘పుర’ పోరుకు సై!
Published Sun, Mar 2 2014 11:33 PM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement