సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఇక సమరమే మిగిలింది. ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో అసలు పోరుకు తెరలేచింది. ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని ఈసీ స్పష్టం చేయడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే పురపోరులో తలమునకలైన నేతలకు సాధారణ ఎన్నికల నగారా కూడా మోగడం తలనొప్పిగా తయారైంది. మరోవైపు జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల రిజర్వేషన్ల ఖరారులో నిమగ్నమైన అధికార యంత్రాంగానికి పురపాలికలకు తోడు జమిలి ఎన్నికలు తరుముకురావడం అగ్నిపరీక్షగా మారింది. స్థానిక సమరానికి సమాయత్తమవుతూనే.. సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సి రావడం కత్తిమీద సాములా పరిణమించింది.
ఏప్రిల్ 30న పోలింగ్!
తెలంగాణలో అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 30న తొలిదశలోనే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 9 కావడంతో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే టికెట్ రేసులో నిలిచిన ఆశావహులు తమ ప్రయత్నాలను వేగిరం చేశారు. సిట్టింగ్‌లకు సీట్లపై భరోసా ఉన్నప్పటికీ, రాజకీయ సమీకరణల నేపథ్యంలో తమ సీట్లకు ఎసరు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లా రాజకీయ సమీకరణల్లో భారీగా మార్పులు వచ్చాయి. పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. మరికొందరు గోడ దూకడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రకటన వెలువడడంతో వలసలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
‘గులాబీ’లో టికెట్ల లొల్లి
టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో కొత్త ఉత్సాహంతో ఉన్న గులాబీ శిబిరంలో టికెట్ల లొల్లి పెరిగింది. అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నా.. కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనం ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో సీట్ల ఖరారుపై మీమాంస నెలకొంది.
ఇది ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. ‘తెలంగాణ’ రావడంతోనే టీఆర్‌ఎస్ తమ పార్టీలో విలీనమవుతుందని ఆశించిన కాంగ్రెస్‌కు చుక్కెదురు కావడంతో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జనలు పడుతోంది.
కోలుకోని తెలుగుదేశం..
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇంకా కోలుకోలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ‘త్రయం’ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. ఎన్నికల నగారా మోగడంతో గురువారం ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. బీజేపీతో పొత్తు ఉంటుందా? లేదా అనే అంశంపైనా తమ్ముళ్లలో సందిగ్ధత నెలకొంది. చెప్పుకోదగ్గస్థాయిలో ఓటు బ్యాంకు కలిగిఉన్న కమలదళంతో జోడీ కడితే బయటపడవచ్చనే భావన ఆ పార్టీలో ఉంది. టీడీపీతో దోస్తీ కడితే పుట్టి మునగడం ఖాయమని బీజేపీ భయపడుతోంది.
వైఎస్సార్ సీపీకి పెరిగిన ఆదరణ
జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. నగర శివార్లు, గ్రామీణ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశేషాదరణ లభిస్తోంది. దీనికితోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో సెటిలర్లు కూడా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అండగా నిలిచారు. ఈ సమీకరణలు ఆ పార్టీకి లాభం చేకూర్చే అవకాశముంది.
సమరమే
Published Wed, Mar 5 2014 11:58 PM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM
Advertisement