వేడెక్కిన సార్వత్రిక సంగ్రామం
తిరుపతి/పుత్తూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల రాజకీయం వేడెక్కింది. గురువారం ప్రధాన పార్టీల అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేయనున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలుకు సిద్ధమయ్యారు.
వీరిలో రాజం పేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు నారాయణ స్వామి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అమరనాథ రెడ్డి ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
నేడు మిథున్ రెడ్డి నామినేషన్
రాజంపేట ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు చిత్తూరు కలెక్టరేట్‌లోఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నగరిలో రోజా
నగరి నుంచి పోటీ చేస్తున్న ఆర్కే.రోజా భారీ జన సందోహం మధ్య నామినేషన్ దాఖలు చేయడానికి ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1-2 గంటల మధ్య రోజా నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జీడీ నెల్లూరులో నారాయణస్వామి
గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పార్టీశ్రేణులు భారీగా జీడీ నెల్లూరుకు తరలి రానున్నారు. భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.
పలమనేరులో అమరనాథరెడ్డి
పలమనేరు శాసనసభా స్థానానికి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా ఎన్. అమరనాథరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలుత పట్టణంలోని ఓంశక్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చంద్రగిరిలో చెవిరెడ్డి
చంద్రగిరి నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం నామినేషన్ వేయనున్నారు. నాగాలమ్మ ఆలయం వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అదే విధంగా నగరి నియోజకవర్గ టీడీ పీ అభ్యర్థిగా గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.