* 1.96 శాతం ఓట్ల తేడాతో టీడీపీ కూటమికి దక్కిన అధికారం
* వైఎస్సార్ సీపీ కన్నా వారికి అదనంగా వచ్చినవి 5.6 లక్షల ఓట్లు
* ఆ స్వల్ప తేడా కారణంగా 67 సీట్లకే పరిమితమైన ైవైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో హోరాహోరీ సాగిన సాధారణ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ-బీజేపీ కూటమికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం... కేవలం 1.96 శాతమే! దేశవ్యాప్తంగా వీచిన మోడీ గాలులు ఈ ఎన్నికల్లో టీడీపీకి బాగా కలసొచ్చాయి. దాంతోపాటు గతంలో తానే ఆచరణసాధ్యం కావని చెప్పిన వ్యవసాయ రుణాల మాఫీ వంటి పలు హామీలను గుప్పించిన చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడంతో ఈసారి తీర్పు ఒకింత టీడీపీ వైపు మొగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సీట్లపరంగా కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకున్నా, ఓట్లపరంగా మాత్రం వైఎస్సార్‌సీపీకి, దానికి మధ్య వ్యత్యాసం అత్యల్పమేనని వివరిస్తున్నాయి. టీడీపీకి దీటుగా పోటీ ఇచ్చి అత్యల్ప ఓట్ల వ్యత్యాసంతోనే ఓడిందని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 3,67,62,975 ఓట్లకు గాను 2,87,94,902 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ-టీడీపీ కూటమి మొత్తం 175 స్థానాల్లో సాధించిన ఓట్లు 1,34,95,305. కాగా వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసి 1,29,31,730 ఓట్లు సాధించింది. కూటమి ఓట్ల శాతం 46.86 శాతమైతే వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం 44.9 శాతం!
సర్వశక్తులూ ఒడ్డి...
ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీపరమైన అనుభవాన్ని బట్టి చూస్తే 30 ఏళ్ల పై చిలుకు చరిత్ర టీడీపీదైతే, మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పైగా ఏకంగా 17 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో కొనసాగింది. అందులోనూ తొమ్మిదేళ్లకు పైగా చంద్రబాబే ముఖ్యమంత్రిగా అధికారాన్ని చలాయించారు. మిగతాది పేరుకు ఎన్టీఆర్ హయామైనా తెరవెనుక తతంగాలన్నీ నడిచింది పూర్తిగా బాబు కనుసన్నల్లోనే. అలా చూస్తే ఆ 17 ఏళ్లూ టీడీపీలో బాబే రాజ్యమేలారని చెప్పవచ్చు. ఇక అధికారంలో లేని గత పదేళ్లలో కూడా బాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సహజంగానే టీడీపీకి క్షేత్రస్థాయిలో పటిష్ట యంత్రాంగముంది.
రాష్ట్రవ్యాప్తంగా హేమాహేమీలనదగ్గ నేతలూ ఉన్నారు. ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లతో కూడిన యంత్రాంగముండి కూడా టీడీపీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగే సాహసం చేయలేకపోయింది. ఎందుకంటే గత కొన్నేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చేతిలో కనీసం డిపాజిట్లు కూడా దక్కనంతటి ఘోర పరాభవాన్ని టీడీపీ చవిచూసింది. అటు అధికార కాంగ్రెస్‌తో, ఇటు అనుకూల మీడియాతో కలిసి ముప్పేట దాడి చేసినా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గాలి ముందు టీడీపీ నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలో దిగితే సాధారణ ఎన్నికల్లోనూ టీడీపీకి తీవ్ర నష్టం తప్పదని బాబు పసిగట్టారు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలకు సుతరామూ ఇష్టం లేకపోయినా జాతీయ స్థాయిలో కమలనాథులపై తెగ ఒత్తిడి తెచ్చి మరీ పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో తనపై నెలకొన్న తీవ్ర ప్రతికూలతను అధిగమించడానికి దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతున్న మోడీ గాలి ఉపయోగపడుతుందనే భావనతో ఈ ఎత్తుగడవేశారు. సినీనటుడు పవన్ కల్యాణ్ మద్దతును కూడా తీవ్రంగా ప్రయత్నించి సాధించారు.
గతానుభవాల దృష్ట్యా... పవన్ జనసేన పార్టీ బరిలో దిగితే తన ఓట్లనే చీల్చుకుంటుందనే ఉద్దేశంతో, అది పోటీ చేయకుండా తెరవెనక సర్వ ప్రయత్నాలూ చేసి సఫలీకృతుడయ్యారు. బీజేపీతో పాటు టీడీపీకి కూడా మద్దతిచ్చేలా చేసుకున్నారు. గతంలో తాను ఏవైతే ఆచరణ సాధ్యం కావని చెప్పారో ఆ హామీలన్నీ ఇవ్వడమే గాక అదనంగా మరిన్ని చొప్పించారు. రైతులకు రుణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరంతరాయంగా 9 గంటల కరెంటు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పెన్షన్లను అత్యధికంగా పెంచేస్తాననడం... ఇలా దేన్నీ వదల్లేదు. వీటికి ప్రజల్లో కొంత శాతమైనా ఆకర్షితులు కాక మానరన్నది అంచనా వేశారు.
నిత్యం వేధింపులే...
మూడేళ్ల క్రితం పుట్టి ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న వైఎస్సార్‌సీపీకి ఇంతవరకు గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో యంత్రాంగ నిర్మాణం పూర్తిగా జరగలేదు. పైగా పార్టీ పుట్టిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి, సీబీఐ విచారణ పేరుతో వేధించి, 16 నెలల పాటు జైలుపాలు చేసింది. అధికార పార్టీతో కుమ్మక్కవడం ద్వారా టీడీపీ కూడా తనవంతు పాత్ర పోషించింది. రెండు పార్టీలూ జగన్‌నే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావించి టార్గెట్ చేశాయి. సాధారణ ఎన్నికల నాటికి ఆయన్ను పూర్తిగా అణగదొక్కేయాలన్న వ్యూహంతో సాగాయి. అయినా ఇన్ని ప్రతిబంధకాల మధ్య కూడా వైఎస్సార్‌సీపీ ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రజల పక్షాన నిలిచి నిత్యం పోరాటాలు చేసింది. వారి సమస్యలపై పాలకులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ వచ్చింది. పాలక కాంగ్రెస్‌తో అంటకాగి గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ విస్మరించిన ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను తాను పూర్తిస్థాయిలో నిర్వర్తించింది. పార్టీకి సంస్థాగతంగా పూర్తిస్థాయి నిర్మాణం లేకున్నా... ప్రజలే అన్నివిధాలా అండదండగా నిలిచారు. ఉద్యమాల్లో కదలివచ్చారు.
ఆధిక్యం కొన్ని జిల్లాల్లోనే
ఎన్నికల గణాంకాలను లోతుగా పరిశీలిస్తే... వైఎస్సార్‌సీపీపై టీడీపీ కొన్ని జిల్లాల్లో మాత్రమే స్థానాలపరంగా ఆధిక్యం సాధించినట్లు తేటతెల్లమవుతుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో 52,25,240 ఓట్లు పోలైతే, వాటిలో వైఎస్సార్‌సీపీకి 21,86,012 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 24,92,946 ఓట్లు పడ్డాయి. కోస్తా జిల్లాల్లో పోలైన 1,48,83,315 ఓట్లలో 66,47,276 వైఎస్సార్‌సీపీకి (44.66 శాతం), 70,73,038 ఓట్లు టీడీపీకి (47.52 శాతం) వచ్చాయి. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2.86! పైగా అందులోనూ పశ్చిమగోదావరి జిల్లాలోనే టీడీపీ అత్యధిక ఓట్లను సాధించింది. రాయలసీమ జిల్లాల్లో మొత్తం 52 స్థానాలకు గాను 86,86,347 ఓట్లు పోలైతే వైఎస్సార్ కాంగ్రెస్ 47.18 శాతంతో 40,98,442 ఓట్లు సాధించింది. టీడీపీ 45.23 శాతంతో 39,29,324 ఓట్లు సాధించింది. మొత్తమ్మీద ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 25, వైఎస్సార్‌సీపీకి 9; ఆరు కోస్తా జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి 57, బీజేపీకి 3, వైఎస్సార్‌సీపీకి 27, స్వతంత్రులకు 2; నాలుగు సీమ జిల్లాల్లోని 52 స్థానాలకు టీడీపీకి 22, వైఎస్సార్‌సీపీకి 30 స్థానాలు దక్కాయి.
వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమి మధ్య ఓట్ల తేడా నిండా రెండు లేదు
Published Sun, May 18 2014 2:15 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM
Advertisement