సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ పరిస్థితి జిల్లాలో నానాటికీ దిగజారుతోంది. రాజకీయ సమీకరణలు రోజుకోరకంగా మారుతున్నాయి. సామాజికవర్గ మొగ్గులపై దిగ్గజాలు సైతం విస్మయం చెందుతున్నారు.
నిన్నటిదాకా గెలుపు ఓకే..
మెజార్టీ కోసమే పని చేస్తున్నామంటూ చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు.. తాజాగా ప్రత్యక్ష అనుభవాలను చవిచూస్తున్నారు. దీంతో వారి అంచనాలు తారుమారవుతున్నాయి. జిల్లా మొత్తం 12 నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు చోట్ల తమపార్టీ గెలుపు ఖాయమని టీడీపీ ప్రచారం చేసుకుంది. అధినేత చంద్రబాబు జిల్లాకొచ్చినప్పుడు ఇదేవిషయాన్ని నివేదిక రూపంలో పార్టీ పేర్కొంది. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సామాజికవర్గ చీలికలు అనూహ్యంగా తెరమీదకొచ్చాయి. రెండ్రోజుల కిందట చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పార్టీ పరిస్థితి తెలుసుకుని అవాక్కయ్యారు. ఊహించని రీతిగా కొన్ని సామాజికవర్గాలు పార్టీని వీడిపోవడంపై చర్చించినట్లు పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం.
అద్దంకి, పర్చూరు, కనిగిరి, దర్శి, చీరాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఎదురుగాలి వీస్తోండటంతో స్వపక్షీయులే డైలమాలో పడ్డారు. బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పోటీచేయడం అభ్యర్థుల సీట్ల కేటాయింపులో నిర్ణయ లోపాలు అభ్యర్థుల సమన్వయలేమి తదితర కారణాల నేపథ్యంలో పార్టీ పెద్దలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పార్టీలో గుర్తింపు లేదంటున్న బీసీలు..
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి బీసీ వర్గం పార్టీకి వెన్నెముకగా నిలిచింది. అలాంటిది, ప్రస్తుతం చంద్రబాబు వారిని దూరంగా పెడుతూ పార్టీని చేతులారా నాశనం చేస్తున్నారని నేతలు మదనపడుతున్నారు. ఎన్నికల్లో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై దుమారం రేగుతోంది. ప్రధానంగా యాదవ , రజక, పద్మశాలి ఓటింగ్ ఇప్పటికే టీడీపీని వీడి ప్రత్యామ్నాయంగా వైఎస్‌ఆర్ సీపీని ఎంచుకుంది. కనిగిరి, అద్దంకి, దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఆయా వర్గాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ అసంతృప్తిని వెళ్లగక్కి.. పార్టీ మారుతున్నారు. అన్నిచోట్లా ఆత్మీయ సమావేశాలతో వైఎస్సార్ సీపీ నేతలను ఆహ్వానించి వారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
పైగా, ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి బీసీలకు చంద్రబాబు మొండిచేయిచ్చారు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ మాత్రం జిల్లాలో కనిగిరి సీటును బీసీ (యాదవ) అభ్యర్థి బుర్రా మధుసూద న్‌యాదవ్‌కు కేటాయించింది. స్థానిక ఎన్నికల్లో జెడ్పీచైర్మన్ రిజర్వేషన్ కూడా ఓసీ జనరల్ అయినప్పటికీ, వైఎస్సార్ సీపీ మాత్రం బీసీ(యాదవ)కి చెందిన డాక్టర్ నూకసాని బాలాజీని బరిలో నిలిపి ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం కల్పించింది.
=కందుకూరు, చీరాల, కనిగిరి, అద్దంకి, పర్చూరు, గిద్దలూరు, ఒంగోలు తదితర నియోజకవర్గాల్లో అధికంగా వున్న బీసీల తీర్పు ఈఎన్నికల్లో కీలకం కానుంది. వైఎస్సార్ సీపీకి మద్దతిస్తామని. టీడీపీ ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయం వీరి నుంచి వినిపిస్తోంది.
ఓటమిపై లెక్కలేస్తున్న పరిశీలకులు..
సామాజికవర్గ ఓటింగ్ చీలికతో టీడీపీ ఓటమి అన్నిచోట్లా ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనాలేస్తున్నారు. కనిగిరి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుకు ఓటమి తప్పదనే లెక్కలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆయన సామాజికవర్గ ఓటింగ్ తక్కువగా ఉంది. బీజేపీ, టీడీపీ పొత్తుతో ముస్లిం మైనార్టీలు దూరమయ్యారు. వైఎస్సార్ సీపీ యాదవ సామాజికవర్గ నేతకు సీటివ్వడంతో.. అక్కడ సుమారు 35 వేల పైచిలుకు ఉన్న యాదవ ఓటింగ్ మొత్తం టీడీపీని వీడిపోవడం ‘కదిరి’కి మైనస్ అయ్యింది. మరోవైపు స్వపక్షంలో ఇరిగినేని తిరుపతినాయుడు వర్గంతో కొనసాగుతోన్న ఆధిపత్యపోరు కూడా అతని మైనస్ కానుంది.
ఇదే వాతావరణం దర్శి నియోజకవర్గ ంలో కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దర్శి ఓటింగ్ మొత్తం 1.98 లక్షలు కాగా, అందులో బీసీ సామాజికవర్గం 20 వేలు, కాపులు 19 వేల ఓటర్లుండగా.. వారంతా పూర్తిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు టీడీపీ వరుసగా 20 ఏళ్లుగా తగిన ప్రాధాన్యతనివ్వకుండా.. అవమానపరుస్తూనే ఉంది. దీన్ని కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు వ్యవహార శైలిపై ఇప్పటికే నారపుశెట్టి వర్గం అసమ్మతితో కుతకుతలాడుతోంది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన పక్కన తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా.. మెజార్టీ కాపులు బూచేపల్లి వైపే మొగ్గుచూపుతున్నారని ఆ వర్గ పెద్దలు చెబుతున్నారు.
అద్దంకిలో కరణం వెంకటేష్‌కు టీడీపీ సీటివ్వడంతో బీసీ, వైశ్య, కాపు సామాజికవర్గాలన్నీ పార్టీకి దూరమయ్యాయి. అతను కిందటి జనవరిలో అద్దంకి నడిబజారులో ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఇప్పుడు అతనికి చాలా మైనస్ అవుతోందని పార్టీవర్గాలే చెబుతున్నాయి. అక్కడ ఓటింగ్ మొత్తం 2.20 లక్షల పైచిలుకుంటే.. కమ్మ సామాజికవర్గంలో భారీ చీలికతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపు మెజార్టీ పెరుగుతుందనే లెక్కలు వినిపిస్తున్నాయి.
గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీని కాదని.. వైఎస్సార్ సీపీలోకి చేరడం జిల్లాలోని మరిన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోంది.
చీరాలలో పోతుల సునీతను స్థానికేతరురాలిగా భావిస్తున్నందున.. ఆమె కుటుంబ గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని బీసీ, వైశ్య, కాపు సామాజికవర్గాలు అటువైపు మొగ్గుచూపడం లేదని టీడీపీ ద్వితీయశ్రేణి వర్గం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది.
పర్చూరులో సైతం ఏలూరి సాంబశివరావు నిన్నటిదాకా విపరీతంగా డబ్బుఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నప్పటికీ.. తాజాగా సొంత సామాజికవర్గ పెద్దలే ఆయన్ను కాదంటున్నారు. అక్కడ గొట్టిపాటి భరత్ కుటుంబంపై సానుభూతి పనిచేయడం వైఎస్సార్ సీపీకి కలిసొచ్చిన అంశమైంది.
‘దేశం’లో నైరాశ్యం!
Published Fri, May 2 2014 1:47 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement