విజయ వ్యూహాలు
- లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రచారపర్వం
- చేరికలతో వేడెక్కుతున్న రాజకీయం
- ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు ఎత్తులు
- సామాజికవర్గాల ఆకర్షణకు ‘వ్యూహకర్తలు’
- రసవత్తరంగా సార్వత్రిక ఎన్నికల సమరం
సాక్షి, ఒంగోలు, రాజకీయ దిగ్గజాల పుట్టినిల్లుగా జిల్లాకు పేరుంది. ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని చిత్తుగా ఓడించేందుకు పావులు కదపడంలో జిల్లా నేతలు సిద్ధహస్తులు. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల్లో భిన్న వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ, ఓటరు నాడి మాత్రం ఒకే పార్టీవైపు మొగ్గుచూపడం విశేషంగా చెబుతున్నారు.
అంతటా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే అన్నట్లు ‘ఫ్యాన్’ గాలి వీస్తోందని ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడికావడంతో.. టీడీపీ, కాంగ్రెస్‌లు డీలాపడ్డాయి. ఎటూ ప్రజల్లో ఇప్పటికిప్పుడు విశ్వసనీయతను సంపాదించుకోలేమని భావిస్తోన్న ఆ రెండు పార్టీల అభ్యర్థులు.. కనీసం డిపాజిట్లైనా కాపాడుకునేందుకు రాజకీయ వ్యూహంపై దృష్టిపెట్టారు. నియోజకవర్గాల వారీగా కొందరు నమ్మినబంటులను ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేర అడుగులేస్తున్నారు.
ప్రచారంలో వైఎస్సార్ సీపీపై ఆ రెండు పార్టీల అభ్యర్థులు సంధిస్తోన్న విమర్శనాస్త్రాలు సైతం ఎప్పటికప్పుడు బెడిసికొడుతూనే ఉన్నాయి. దీంతో ఓటర్లకు నచ్చినట్లు వ్యవహరించాలంటే, ఎటువంటి విధానాలు అవలంబించి వారితో మమేకమవ్వాలా.. అంటూ అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు.
భిన్న వాతావరణం..ఎవరికి అనుకూలం..
రాష్ట్ర విభజన అంశం, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అన్నిపార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి.
- నామినేషన్ల ఉపసంహరణ ముగియగా, అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. పార్టీల్లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
- ఒంగోలు, బాపట్ల లోక్‌సభ పరిధిలోని 11 నియోజకవర్గాలు, నెల్లూరుకిందనున్న కందుకూరు అసెంబ్లీతో కలిపి 12 నియోజకవర్గాల్లో మొత్తం 187 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
- ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ఒకచోట, జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్‌సత్తా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- జిల్లాలోని 24 లక్షల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వివిధ పార్టీల అభ్యర్థులు బిజీగా ఉన్నారు.
- ఒంగోలు, బాపట్ల లోక్‌సభకు పోటీచేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ అమృతపాణి తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను వెంటపెట్టుకుని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
- ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం నుంచి రాత్రివరకు అన్ని కాలనీల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
- ముందెన్నడూ లేనివిధంగా ఒంగోలులో అన్ని సామాజికవర్గాల నేతలు వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు క్యూలు కట్టారు.
- ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ సామాజికవర్గ జనంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటుచేసి బాలినేని, వైవీ సుబ్బారెడ్డిని ఆహ్వానించి పార్టీలో చేరుతున్నారు.
- టీడీపీ, కాంగ్రెస్ తరఫున కూడా రాజకీయ దిగ్గజాలు బరిలో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆరెండు పార్టీల అభ్యర్థులు షాక్‌లు తింటూనే ఉన్నారు.
- మొదట్నుంచి ఎన్నికల ప్రచారంలో తమవెంట తిరిగిన చురుకైన, కీలక నేతలు సైతం వైఎస్సార్ సీపీ గూటికి చేరిపోవడంతో.. అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం పక్కనబెట్టి మరీ.. తమ అనుచరులు వలసలు పోకుండా కట్టడిచేసుకునే ప్రయత్నాల్లో టీడీపీ నేతలున్నారు. ఈ నేపథ్యంలో జంప్‌జిలానీలపై ఒక కన్నేసి ఉంచాలని టీడీపీ నిర్ణయించింది.
- కాంగ్రెస్ కేడర్ పూర్తిగా ఖాళీ అయ్యింది.
మారుతోన్న సమీకరణలపై లెక్కలు..
- జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ సమీకరణలను పరిశీలకులు అధ్యయనం చేస్తున్నారు.
- కందుకూరు, కొండపి, అద్దంకి నియోజకవర్గాల్లో ఇటీవల వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘వైఎస్సార్ జనభేరి’కి అనూహ్య స్పందన లభించింది.
- ఆయా నియోజకవర్గాల్లో సామాజికవర్గాలకు అతీతంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
.
- వైఎస్సార్ సీపీ లోక్‌సభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ అమృతపాణి, మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరులో ముత్త్తముల అశోక్‌రెడ్డి, కనిగిరిలో బుర్రా మధుసూధన్‌యాదవ్, కొండపిలో జూపూడి ప్రభాకర్‌రావు, కందుకూరులో పోతుల రామారావు.
చీరాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి యడం బాలాజీ, యర్రగొండపాలెంలో పాలపర్తి డేవిడ్‌రాజ్, సంతనూతలపాడులో ఆదిమూలపు సురేష్, మార్కాపురంలో జంకె వెంకటరెడ్డి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో గొట్టిపాటి భరత్ గెలుపు తథ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.