సాక్షి, ఒంగోలు: సార్వత్రిక సంగ్రామంలో కీలక ఘట్టం ముగిసింది. ప్రచారహోరుకు తెరపడింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకల్లా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. పోలింగ్ బుధవారం జరగనుంది. మూడు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు జైసమైక్యాంధ్ర, లోక్‌సత్తా తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. అందరూ ఎన్నికల ఆఖరి ఘట్టమైన పోలింగ్‌పైనే దృష్టి సారించి.. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ధనం, మద్యంతో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే పోల్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతులైన నేతలు, క్రియాశీలక కార్యకర్తలు రంగంలోకి దిగారు. ధనం, మద్యంను భారీ స్థాయిలో బయటకు తీస్తున్నారు.
20 శాతం ఓట్ల డిపాజిట్‌కు..
ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కీలకంగా ప్రభావితం చూపే 20 శాతం ఓట్లపై నేతలు కన్నేశారు.
ఎవరికి వారు తమ సామాజికవర్గ ఓటుబ్యాంకుతో పాటు ఇతరులను ఏ మేరకు తమ వైపునకు తిప్పుకోవాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు.
రహస్య సమావేశాలు పెట్టుకుని సామాజికవర్గాల పెద్దలతో మాట్లాడుతున్నారు.
పేదల కాలనీలకు వెళ్లి ఓటుకింత చొప్పున డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి.
ఓటుకు రూ.500 నుంచి రూ.2వేలకు పైగా ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేయడంలో టీడీపీ ముందంజలో ఉంది.
దర్శి, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా గత మూడ్రోజుల్లో లక్షలాది రూపాయల ఎన్నికల పంపిణీ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాణాలు చేయించుకుంటున్న టీడీపీ...
జిల్లావ్యాప్తంగా గెలుపుపై ధీమా సన్నగిల్లిన టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తెగబడుతున్నారు. గ్రామాలవారీగా డబ్బుసంచులిచ్చి వారితో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దంకి, పర్చూరు, ఒంగోలు, కందుకూరులో టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ.1000 నుంచి రూ.1500లు పంచుతూ తినే అన్నంపై.. చంటిబిడ్డలపై ప్రమాణాలు చేయిస్తున్నారని.. ఒకట్రెండు చోట్ల ఓటర్లు ఎదురు తిరుగుతున్న సందర్భాలున్నాయని స్వయాన పార్టీ వర్గాలే బయటపెడుతున్నాయి.
అద్దంకి పట్టణంలోని బీసీ ఓటర్లను స్థానిక టీడీపీ నేత కరణం బలరాం అనుచరులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు, చీరాలలో నవోదయ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ వర్గం కూడా ఎస్సీ, ఎస్టీలను బెదిరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి.
కనిగిరిలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి అనుచరులు స్థానికంగా ఉన్న యాదవ సామాజికవర్గ ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సోమవారం రాత్రి పలువురు జిల్లాపోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
విజయంపై ధీమాతో వైఎస్సార్ సీపీ..
ఈసారి ఎన్నికల్లో అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడం రాజకీయ దిగ్గజాల్ని విస్మయానికి గురిచేస్తోంది.
ఆ పార్టీ అభ్యర్థులపై వివిధ సామాజికవర్గాల ప్రజలు అపూర్వ ఆదరణ చూపుతున్నారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుభిక్షపాలనను అందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని... ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడం.. రాష్ట్రాన్ని విభజనను ప్రతీఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
రైతుల కోసం పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చి గెలవడం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
నేడు పేదలపక్షాన పోరాడుతోన్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై విశ్వాసంతో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ప్రజల వద్దకు రావడాన్ని జనం స్వాగతిస్తున్నారు.
టీడీపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రజలు చెబుతున్నారు.
ఈ జన లక్ష్యమే రాజకీయాల్లో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రచారం సమాప్తం
Published Tue, May 6 2014 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement