Jai samai kyandhra party
-
ప్రచారం సమాప్తం
సాక్షి, ఒంగోలు: సార్వత్రిక సంగ్రామంలో కీలక ఘట్టం ముగిసింది. ప్రచారహోరుకు తెరపడింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకల్లా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. పోలింగ్ బుధవారం జరగనుంది. మూడు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు జైసమైక్యాంధ్ర, లోక్‌సత్తా తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. అందరూ ఎన్నికల ఆఖరి ఘట్టమైన పోలింగ్‌పైనే దృష్టి సారించి.. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ధనం, మద్యంతో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే పోల్ మేనేజ్మెంట్లో నిష్ణాతులైన నేతలు, క్రియాశీలక కార్యకర్తలు రంగంలోకి దిగారు. ధనం, మద్యంను భారీ స్థాయిలో బయటకు తీస్తున్నారు. 20 శాతం ఓట్ల డిపాజిట్‌కు.. ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కీలకంగా ప్రభావితం చూపే 20 శాతం ఓట్లపై నేతలు కన్నేశారు. ఎవరికి వారు తమ సామాజికవర్గ ఓటుబ్యాంకుతో పాటు ఇతరులను ఏ మేరకు తమ వైపునకు తిప్పుకోవాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. రహస్య సమావేశాలు పెట్టుకుని సామాజికవర్గాల పెద్దలతో మాట్లాడుతున్నారు. పేదల కాలనీలకు వెళ్లి ఓటుకింత చొప్పున డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. ఓటుకు రూ.500 నుంచి రూ.2వేలకు పైగా ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేయడంలో టీడీపీ ముందంజలో ఉంది. దర్శి, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా గత మూడ్రోజుల్లో లక్షలాది రూపాయల ఎన్నికల పంపిణీ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాణాలు చేయించుకుంటున్న టీడీపీ... జిల్లావ్యాప్తంగా గెలుపుపై ధీమా సన్నగిల్లిన టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తెగబడుతున్నారు. గ్రామాలవారీగా డబ్బుసంచులిచ్చి వారితో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దంకి, పర్చూరు, ఒంగోలు, కందుకూరులో టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ.1000 నుంచి రూ.1500లు పంచుతూ తినే అన్నంపై.. చంటిబిడ్డలపై ప్రమాణాలు చేయిస్తున్నారని.. ఒకట్రెండు చోట్ల ఓటర్లు ఎదురు తిరుగుతున్న సందర్భాలున్నాయని స్వయాన పార్టీ వర్గాలే బయటపెడుతున్నాయి. అద్దంకి పట్టణంలోని బీసీ ఓటర్లను స్థానిక టీడీపీ నేత కరణం బలరాం అనుచరులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు, చీరాలలో నవోదయ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ వర్గం కూడా ఎస్సీ, ఎస్టీలను బెదిరిస్తున్నట్లు ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. కనిగిరిలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి అనుచరులు స్థానికంగా ఉన్న యాదవ సామాజికవర్గ ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సోమవారం రాత్రి పలువురు జిల్లాపోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయంపై ధీమాతో వైఎస్సార్ సీపీ.. ఈసారి ఎన్నికల్లో అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడం రాజకీయ దిగ్గజాల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులపై వివిధ సామాజికవర్గాల ప్రజలు అపూర్వ ఆదరణ చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుభిక్షపాలనను అందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని... ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడం.. రాష్ట్రాన్ని విభజనను ప్రతీఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రైతుల కోసం పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చి గెలవడం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నేడు పేదలపక్షాన పోరాడుతోన్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై విశ్వాసంతో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ప్రజల వద్దకు రావడాన్ని జనం స్వాగతిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రజలు చెబుతున్నారు. ఈ జన లక్ష్యమే రాజకీయాల్లో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
చంద్రబాబును నమ్మొద్దు: కిరణ్
చిత్తూరు, తెలంగాణ విషయమై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న టీడీపీ నేత చంద్రబాబును నమ్మొద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరులో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. గోద్రా అల్లర్లకు నరేంద్రమోడీనే కారణమన్న చంద్రబాబు ఎన్నికల్లో ఆయనతో జట్టు కట్టేందుకు తహతహలాడారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై మే 5వ తేదీన సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు విచారణకు వస్తుందని, విభజన తప్పని తీర్పు వస్తుందని నమ్మకం ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత బిల్లు అసెంబ్లీకి వస్తుందన్నారు. తీర్పు వచ్చేనాటికి జేఎస్పీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే బిల్లును వ్యతిరేకించి రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచుతారన్నారు. -
సీమాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టను
అందుకే పోటీ చేయడంలేదు: కిరణ్ బొబ్బిలి, 175 మంది ఎమ్మెల్యేలుండే అసెంబ్లీలో తాను అడుగుపెట్టబోనని, అందుకే తాను పోటీ చేయడం లేదని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రేపు అవసరమనుకుంటే ఎవరినో ఒకరిని రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. పదవి కోసం ఏగడ్డి అయినా తినే వ్యక్తిని తాను కాదన్నారు. విభజనపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసుకు సంబంధించిన వాదనలు మే 5న ఉన్నాయని చెప్పారు. -
ఆహ్వానం లేకున్నా వచ్చి చేరండి: జేఎస్పీ
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు టీడీపీ, బీజేపీల్లో చేరడం ఆత్మహత్యాసదృశమని జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) వ్యాఖ్యానించింది. తాము ఆహ్వానించకపోయినా సమైక్యవాదాన్ని వినిపించే తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చింది. సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ప్రెసిడెన్షియల్ బ్యూరో సమావేశం జరిగింది. మేనిఫెస్టో రూపకల్పన, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, వివిధ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి తెలిపారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ పార్టీ పోటీచేస్తుందని, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగుతోందని తెలిపారు. సీమాంధ్ర పర్యటన అనంతరం పార్టీ అధ్యక్షుడు కిరణ్ తెలంగాణలోనూ పర్యటిస్తారని చెప్పారు. -
చంద్రబాబు పిరికివాడు: కిరణ్
ఏలూరు: తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రసంగించిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. తన లేఖవల్లే రాష్ట్ర విభజన జరిగిందని తెలంగాణకు వెళ్లినప్పుడు, ఎలా విభజిస్తారంటూ ఆంధ్రాకు వచ్చినప్పుడు రెండు నాల్కల ధోరణి అవలంబించిన చంద్రబాబు అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరిగితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడైనా చెప్పారా? రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తిని మీరు నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. అది కేసీఆర్ ఆఫీస్‌లో కొళాయి కాదు కైకలూరు, న్యూస్‌లైన్: నదీ జలాల విడుదల అంశం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కొళాయి లాంటిది కాదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్, చంద్రబాబులపై ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్రకు నీటి విడుదలను ఆపే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు. -
చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నాడు
మీట్ ది ప్రెస్‌లో మాజీ సీఎం కిరణ్ ఎద్దేవా అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ.. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి కారణమైన ఆర్టికల్-3 రద్దు చేయాలని లేదా పునఃపరిశీలించాలని తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని మాజీ సీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయని ధ్వజమెత్తారు. తృతీయఫ్రంట్తో కలిసి రాష్ట్రాన్ని తిరిగి సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు తానే కారణమన్న కేంద్రమంత్రి చిరంజీవిపై కిరణ్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తిగా ఆయన్ను తాను భావిస్తున్నానని చెప్పారు. రాజకీయాలంటే స్క్రిప్టు రాసుకొచ్చి చదవడం కాదన్నారు. తాను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదన్నారు. మిగులు జలాలపై హక్కు సీమాంధ్రకే: సీమాంధ్రకు నీళ్లురాకుండా అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదని, మనం ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే తెలంగాణకు కరెంట్ రాకుండా చేయవచ్చని మాజీ సీఎం అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి.. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణ కూడా నికర జలాలను మాత్రమే వాడుకోవాలని, మిగులు జలాలను వాడుకునే హక్కు సీమాంధ్రకే ఉంటుందని గుర్తుచేశారు. తెలంగాణలో నీళ్లు నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు. -
కిరణ్‌కు ‘పితాని’ షాక్
సాక్షి, ఏలూరు,/పోడూరు, న్యూస్‌లైన్ : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి అనేక నిదర్శనాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఊహకందని మలుపులు, క్షణానికోలా మారుతున్న సమీకరణలు పార్టీల అధ్యక్షులకు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ర్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. కిరణ్ జిల్లాలో రోడ్‌షో నిర్వహించటానికి ఆదివారం వస్తుండగా, నిన్నటి వరకూ ఆయనకు నీడలా ఉన్న పితాని పంధా మార్చుకుంటున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన నుంచి రాజమండ్రి సభ వరకు పితాని కిరణ్ వెంటే ఉన్నారు. ఆ పార్టీ విధివిధానాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వినిపించింది. ఇంతలోనే ఆయన టర్న్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పెనుగొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పితాని వైఎస్ ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో మొదటి సారి అసెంబ్లీ మెట్టు ఎక్కారు. 2009లో ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాయితీగా కిరణ్‌తోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. జై సమైక్యాంధ్ర పార్టీలో భాగమయ్యారు. ఆ పార్టీని జిల్లా ప్రజలు కనీసం పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదని గ్రహించిన ఆయన, ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి జారుకోవటానికి మార్గం వేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేత యర్రా నారాయణస్వామిని పితాని అనుచరులు కలిసి, ఆ పార్టీలోకి పితాని రాకను వ్యతిరేకించే వారికి సర్దిచెప్పాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ గుబ్బల తమ్మయ్య, పితాని స్వయానా బావా బావమరుదులు. పితాని కావాలనే ముందు జాగ్రత్త చర్యగా తమ్మయ్యను ఆచంట పంపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆచంట అసెంబ్లీ లేదా నరసాపురం లోక్‌సభ స్థానాల్లో ఏదో ఓ చోట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పితాని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలకు బలం చేకూర్చే దిశగా శనివారం కొమ్ము చిక్కాలలో పితాని ఇంటి ముందు ఆయన అనుచరులు బైఠాయించి పార్టీ మారాలంటూ ఒత్తిడి చేశారు. జై సమైక్యాంధ్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన కార్యకర్తల ఎదుట పార్టీ మారనని చెప్పలేకపోయారు. రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటన్నిటికీ రెండ్రోజుల్లో ఆయన తెరదించే అవకాశం ఉంది. పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బయటకు వెళ్లిపోతే పార్టీ వ్యవస్థాపకుడైన కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద షాకే.