చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నాడు
మీట్ ది ప్రెస్‌లో మాజీ సీఎం కిరణ్ ఎద్దేవా
అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ.. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి కారణమైన ఆర్టికల్-3 రద్దు చేయాలని లేదా పునఃపరిశీలించాలని తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని మాజీ సీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయని ధ్వజమెత్తారు. తృతీయఫ్రంట్‌తో కలిసి రాష్ట్రాన్ని తిరిగి సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు తానే కారణమన్న కేంద్రమంత్రి చిరంజీవిపై కిరణ్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తిగా ఆయన్ను తాను భావిస్తున్నానని చెప్పారు. రాజకీయాలంటే స్క్రిప్టు రాసుకొచ్చి చదవడం కాదన్నారు. తాను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదన్నారు.
మిగులు జలాలపై హక్కు సీమాంధ్రకే: సీమాంధ్రకు నీళ్లురాకుండా అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదని, మనం ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే తెలంగాణకు కరెంట్ రాకుండా చేయవచ్చని మాజీ సీఎం అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి.. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణ కూడా నికర జలాలను మాత్రమే వాడుకోవాలని, మిగులు జలాలను వాడుకునే హక్కు సీమాంధ్రకే ఉంటుందని గుర్తుచేశారు. తెలంగాణలో నీళ్లు నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు.