కాంగ్రెస్‌కు ‘చిరు’ గుడ్‌బై? | Chiranjeevi Ready to leave the Congress Party? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ‘చిరు’ గుడ్‌బై?

Published Sun, Nov 11 2018 3:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Chiranjeevi Ready to leave the Congress Party? - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీతో అనైతిక పొత్తును విభేదిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే కుటుంబ సభ్యులతో చర్చించారని, కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్టు త్వరలోనే చిరంజీవి ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సీనియర్ల బాటలోనే... 
ఇటీవల ఢిల్లీలో సమావేశమైన సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలసి పనిచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కలయికపై ఇప్పటికే రెండు పార్టీల్లోనూ అసమ్మతి జ్వాలలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, పసుపులేటి బాలరాజు, సి.రామచంద్రయ్య తదితరులు బయటకు వచ్చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా అనైతిక పొత్తును నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

చర్చించకుండా పొత్తులపై తీవ్ర అసంతృప్తి
గత ఏప్రిల్‌ 2వతేదీతో రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి పదవీకాలం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో  కొనసాగాలా? లేదా? అనే  సందిగ్ధంలో ఉన్న సమయంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తులు కుదరటంతో పార్టీని వీడేందుకు ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనతో సహా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతల్లో ఏ ఒక్కరితోనూ కాంగ్రెస్‌ అధిష్టానం చర్చించకుండా టీడీపీతో పొత్తులకు సిద్ధపడటంపై చిరంజీవి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

ప్రస్తుతానికి రాజకీయాలకు దూరం...
చిరంజీవి చాలా రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి, రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. 2011లో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కల్పించిన కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవిలో నియమించింది. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరమైన చిరంజీవి సినీ పునరాగనమంపై దృష్టి పెట్టి ఖైదీ నెంబర్‌ 150 చిత్రంలో నటించారు. సినీ పరిశ్రమలో ఆయన స్థానం చెక్కుచెదర లేదని ఆ చిత్రం నిరూపించడంతో రెట్టించిన ఉత్సాహంతో తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి జనసేన పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన సన్నిహితులు తోసిపుచ్చుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు కూడా చిరంజీవి కాంగ్రెస్‌లోనే కొనసాగారని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితుడొకరు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement